“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, ఫిబ్రవరి 2020, శనివారం

ఏంటి బావగారు ఇది??

మా కొలీగ్ ఒకాయన దోమలగూడలో ఒక ఆస్పత్రిలో గత వారంనుంచి అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన్ను చూద్దామని నిన్న సాయంత్రం వెళ్లి పలకరించి వచ్చాను. పక్కనే రామకృష్ణమఠం ఉంటె, అక్కడకు వెళ్లి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసుకుని కాసేపు కూచుని వెనక్కు వస్తుండగా, దారిలో ముషీరాబాద్ చౌరస్తాలో అరబిందో భవన్ కనిపించింది. ఒకసారి లోపలకు వెళ్ళివద్దామని వెళ్ళాము.

లోపలకు వెళ్ళాక తెలిసింది ఫిబ్రవరి 21 మదర్ జన్మదినం అని. "సరే మంచిరోజున వచ్చాంలే" అనుకున్నా. కాసేపట్లోనే ఉత్సాహం చల్లారిపోయి తీవ్ర ఆశాభంగం కలిగింది. ఎందుకంటే, అక్కడ ఉన్న భక్తులవల్ల. పట్టుమని పదిమంది కూడా లేరు అక్కడ. వాళ్ళు కొద్దిమందే ఉండటం కాదు నా ఆశాభంగానికి కారణం !

సమాధి బాగా అలంకరించి ఉన్నది. ధ్యానహాలు కూడా అలంకరణ బాగుంది. అంతా బాగానే ఉంది. కానీ అక్కడున్న భక్తులే నిరాశ పరిచారు. వారిలో ఒక్కరిలోకూడా అరవిందులు మదర్ ఆశించిన స్థాయి నాకు కనిపించలేదు.

ఎంట్రన్స్ లోనే నాకు తీవ్ర ఆశాభంగం కలిగింది. చెప్పుల స్టాండ్ ఒక మూలగా ఉంది. కానీ దానిలో ఎవ్వరూ చెప్పులు విడవడం లేదు. వాకిట్లోనే చెదురుమదురుగా విడుస్తున్నారు. అక్కడే నాకు కాలింది. "వీళ్ళా అరవిందుల పూర్ణయోగాన్ని సాధించాలని ప్రయత్నించే భక్తులు?" అనిపించింది. ఇక్కడే కాదు. మొన్న పాండిచేరి వెళ్ళినపుడు చూచాను. అక్కడా ఇదే తీరు. అక్కడున్న ఫారినర్స్ మాత్రం చక్కగా క్యూలో నిలబడి మరీ చెప్పులస్టాండ్ లోనే విడుస్తున్నారు చెప్పులను. మనవాళ్ళేమో ఎక్కడబడితే అక్కడ ఆదరాబాదరాగా వదిలేసి పరిగెత్తుతున్నారు ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు ! ఇలాంటి చిన్నచిన్న విషయాలలోనే మనిషి వ్యక్తిత్వమూ, ఆధ్యాత్మికస్థాయీ బయటపడుతూ ఉంటాయి !

ధ్యానహాలులో Keep Silence అని బోర్డుంది. కానీ అక్కడే ఒక అయిదారుగురు కూచుని ఏవేవో లౌకిక విషయాలు మాట్లాడుకుంటూ కనిపించారు. కనీసం మనం ఎక్కడున్నాం? ఎలా ఉండాలి? అన్న స్పృహ కూడా వారిలో కనిపించలేదు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ధ్యానం చెయ్యడం లేదు.

కళ్ళు తెరిచే ధ్యానం చెయ్యడం మదర్ కు ఇష్టమని నాకు తెలుసు. నాకు రెండూ వచ్చు. కళ్ళు తెరిచీ నేను ధ్యానం చెయ్యగలను, మూసీ చెయ్యగలను. మాట్లాడుతున్నపుడు కూడా అదేస్థితిలో ఉండగలను. కానీ అక్కడున్నవాళ్ళు ఎవరూ 'ధ్యానస్థితి' లో లేరు. కనీసం అక్కడ ఉన్న కాసేపైనా మౌనంగా ఉండాలని కూడా వారికి తోచడం లేదు. లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అదీ నేను చెబుతున్నది !

పక్కనే ఉన్న లైబ్రరీ కం బుక్ స్టాల్ కు దారి తీశాను. అక్కడా అలాంటి బోర్డే ఉంది. కానీ అక్కడ కూడా కొంతమంది నిలబడి ఏదేదో మాట్లాడుతూ కనిపించారు. మా చెడ్డ చిరాకేసింది.

'ఏంటి బావగారు ఇది?' అనుకుంటూ స్టేజిమీద ఉన్న అరవిందులు, మదర్ల ఫోటోల కేసి చూశాను. అరవిందులను నేను "బావగారు" అని సంబోధిస్తాను. ఎందుకంటే ఆయన భార్య మృణాలినిదేవి, శ్రీ శారదామాత శిష్యురాలు. ఆమెను తన కన్నబిడ్డలా ప్రేమించేవారు శారదామాత. కనుక శ్రీ రామకృష్ణులకు అరవిందులు అల్లుడౌతారు. కనుక నాకు బావగారౌతారు. అందుకనే నేనాయన్ని చనువుగా 'బావగారు' అంటూ సంబోధిస్తాను.

మనదేశంలో ఎక్కడ చూచినా 'క్యూలో నిలబడండి' అని ప్రతిచోటా బోర్డులుంటాయి. కానీ ఎవరూ క్యూలో నిలబడరు. 'నో పార్కింగ్' అని బోర్డు ఉంటుంది. కానీ అక్కడే పార్కింగ్ చేస్తుంటారు. 'ఇక్కడ చెత్త వేయరాదు' అని బోర్డు ఉంటుంది. కానీ దానిపక్కనే చెత్త వేస్తూ ఉంటారు. అది పెద్దగుట్ట అయి ఉంటుంది. 'ఇక్కడ ఉచ్చ పోయరాదు' అని బోర్డు ఉంటుంది. కానీ అక్కడే పోస్తుంటారు. ఈ దృశ్యాలు సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మామూలు మనుషులు అలా చండాలంగా ప్రవర్తిస్తే అర్ధం చేసుకోవచ్చు, వాళ్ళు సంస్కారహీనులులే అని. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, అందులోనూ అరవిందులు, మదర్ల Integral Yoga అనుసరించేవారు అలా కనీసపు Civic Sense లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటె, చాలా బాధనిపించింది. అసలు ఎక్కడున్నారు వీరంతా? అని.

"నేనడిగినదానికి జవాబు చెప్పలేదేంటి బావగారు? మీ అనుచరులు కూడా ఇలా ఉన్నారేంటి?" అనుకుంటూ మళ్ళీ ఫోటోల కేసి చూచాను,

'ఏం చేస్తాం మా ఖర్మ. ఇలాంటి మనుషులను ఉద్ధరించి ఏదో Supramental descent ను భూమిపైకి తెద్దామని మేము అనవసరంగా ప్రయత్నించాం. పొరపాటు చేశాం. ఈ లోకం ఇంతే, ఈ మనుషులూ ఇంతే. మా ఖర్మా ఇంతే. ఇక్కడున్న అందరూ నా మార్గంలో పండిపోయామని అనుకుంటున్నారు. వీళ్ళకు శ్రోతలు కావాలి. వినేవాళ్ళకోసం ఎదురుచూస్తున్నారు. నీ పనిచూసుకుని ఇంటికి పో. మేము చేసిన పొరపాటును నువ్వూ చెయ్యకు. లోకుల్ని ఉద్దరించాలని ప్రయత్నించకు.' అని అరవిందులు, మదర్ ఇద్దరూ అన్నట్లు నాకు తోచింది.

నా observation ప్రతిచోటా మళ్ళీ మళ్ళీ రుజువౌతూ వస్తోంది. మహనీయుల భక్తులే ఆ మహనీయులు చెప్పినది పాటించడం లేదు. మళ్ళీ ' మేము పలానా వాళ్ళ భక్తులం, ఆయన మార్గంలో నడుస్తున్నాం' అని డప్పు మాత్రం మానరు ! లోకంలో ఎక్కడ చూచినా ఇదే గోల !

"వీళ్ళు ఆశించిన Supramental descent అనేది ఈ భూమ్మీదికి రావాలంటే ఇంకో వెయ్యేళ్ళు పట్టేలా ఉందిరా దేవుడా !" అనుకుంటూ మౌనంగా బయటకొచ్చి బైక్ తీసుకుని ఇంటికి బయల్దేరాము.