“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, ఫిబ్రవరి 2020, గురువారం

Chart of Sri Aurobindo - Astro analysis - 4 (తండ్రి కృష్ణధన్ ఘోష్ జాతకం)

ఒకవంశంలో మహనీయులు జన్మించాలంటే వారి తాతముత్తాతలలో కొంతమందిలో కాకపోతే కొంతమందిలోనైనా ఆ పోకడలుండాలి. లేకుంటే ఆ వంశంలో ఈ అద్భుతం సాధ్యం కాదు. ఇది తండ్రివైపు కంటే, తల్లివైపు ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది ఎక్కువగా తల్లివైపు నుంచే మనిషికి వస్తుంది. ఈ పోకడ ఎలా వచ్చిందో గత పోస్టులలో వివరించాను. ఇప్పుడు అరవిందుల తండ్రిగారి జాతకం పరిశీలిద్దాం.

అరవిందుల నాన్నగారైన కృష్ణధన్ ఘోష్ ది కాయస్థ కుటుంబం. అంటే క్షత్రియులన్నమాట. అయితే, వారి పూర్వీకులు పశువులు మేపుకునే కులంవారని రుజువులున్నాయి. అంటే గొల్లరాజులన్నమాట. కృష్ణుని తండ్రిగారి పేరుకూడా నందఘోష్ అంటారు. అశ్వఘోషుడు, నందఘోషుడు, విమలఘోషుడు మొదలైన పేర్లన్నీ ఈ ఘోష్ అనే వంశానికి చెందినవే.

కృష్ణధన్ ఘోష్ 21-11-1844 న బీహార్ లోని పాట్నాలో పుట్టాడు. జననసమయం తెలీనందున లగ్నాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. 'మా నాన్నగారు పెద్ద నాస్తికుడు' అని అరవిందులు అనేవారు. ఇంగ్లీషు చదువుల వల్ల ఆయన అలా తయారైనాడు గాని, సహజంగా ఆయనా భక్తిపరుడే. జగన్మాత కాళిని కీర్తిస్తూ ఆయన వ్రాసుకున్న కొన్ని పద్యాలు ఆయన పోయాక కొన్ని పాతకాగితాలలో దొరికాయని అరవిందుల తమ్ముడైన బరీన్ వ్రాస్తారు. కనుక ఆయన పూర్తిగా నాస్తికుడని మనం నమ్మలేం. మనస్సును సూచించే చంద్రుడు స్వస్థానంలో ఉన్న గురువుతో కలసిన జాతకుడు నాస్తికుడెలా అవుతాడు? అందులోనూ రేవతీ నక్షత్ర జాతకుడు?

ఈయన వంశంలో చాలామంది శ్రీరామకృష్ణుల భక్తులు, ఆ సంప్రదాయంలో సన్యాసులు ఉన్నారు. తన సాధనకు పునాదులు వేసినది కూడా శ్రీ రామకృష్ణులు, వివేకానందులే అని అరవిందులు చాలాసార్లు అనేవారు. ఆ వివరాలు ఇంకొక పోస్టులో వ్రాస్తాను.

అరవిందుల తండ్రిగారిది రేవతీ నక్షత్రం. ఈ జాతకంలో ముఖ్యమైన యోగాలు - మీనంలో గజకేసరియోగం, మకరంలో శని, కన్యలో కుజ నీచశుక్రులు, రాహుకేతువులు నీచలో ఉండటం, వారితో రవిబుదులు కలసి ఉండటం.

ఏ మనిషి జాతకంలో నైనా, ఒకరి రెండు యోగాలే ఆ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషీ తన జాతకం ఏదో గొప్ప జాతకం అనుకుంటూ ఉంటాడు. అదేమీ ఉండదు. గొప్ప జాతకాలు అక్కడక్కడా మాత్రమే ఉంటాయి. మామూలు మనుషుల జాతకాలు సాదాసీదాగా ఉంటాయి. లేదా దురదృష్టయోగాలు ఉంటాయి. కాకపోతే మనుషులు అహంకారంతో, తమవి చాలా గొప్ప జాతకాలని అనుకుంటూ ఉంటారు. అంతే !

గజకేసరి యోగం అనేది జీవితంలో సక్సెస్ ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరునిస్తుంది. రేవతీనక్షత్రం మంచి మనసునిస్తుంది. నీచశుక్ర కుజుల కలయిక అతికామయోగం. రాహుకేతువుల నీచత్వం అనేది ఒక శాపం. పైగా, వాళ్ళు నవాంశలో కూడా నీచలోనే ఉన్నారు. ఇది మామూలు శాపం కాదు, బలమైన శాపం. అలాంటివారికి కాలం సులభంగా కలసిరాదు. ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించిన తర్వాతనే అది ఆ జాతకుని మీద తన పట్టును వదులుతుంది. వీరికి అనుభవించే ఖర్మ చాలా గట్టిగా ఉందని అర్ధం.

కృష్ణధన్ ఘోష్ జీవితం అలాగే గడిచింది. జీవితంలో ఆయన చూడని సక్సెస్ లేదు. అలాగే, చూడని విషాదమూ లేదు. పేదరికం నుంచి వచ్చిన తను, స్కాలర్ షిప్ తో చదువుకుని, కలకత్తా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో M.D చేశాడు. కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. తన పిల్లలను కూడా అలాగే ఉన్నతస్థానాలలో చూడాలని కలలు కన్నాడు.కానీ, పై చదువులు చదువుకుని పైకొస్తారని భావించిన పిల్లలు అలా ఎక్కిరాలేదు. అందాన్ని చూచి మోజుపడి చేసుకున్న భార్య రోగిష్టిదై కూచుంది. ఇంగ్లాండులో ఉంచి చదివిస్తే, ముగ్గురు పిల్లలలో ఒక్కరూ పైకి రాలేదు. జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ మిగలలేదు. భార్య ఒకచోట, తనొక చోట, పిల్లలు ఒకచోట ఇలా దిక్కుకొకరు అయిపోయారు. తను ఆశించినవి ఏవీ జరగలేదు. ఈ మానసిక వేదనతో ఆయన త్రాగుడుకు అలవాటుపడ్డాడు. ఇది నీచశుక్రుని ప్రభావం. చివరకు అరవిందులు ఇండియాకు వస్తున్న ఓడ మునిగిపోయిందని వార్త వచ్చింది. ఈ షాక్ ను ఆయన తట్టుకోలేక పోయాడు. హార్ట్ ఎటాక్ తో కుప్పకూలి చనిపోయాడు. క్లుప్తంగా ఇదీ ఆయన జీవితం ! పైన ఉదాహరించిన గ్రహయోగాలు ఆయన జీవితాన్ని అలా నడిపించాయి.

తల్లిదండ్రుల జాతకాలలో ఉన్న గ్రహస్థితులు యోగాలు పిల్లల జాతకాలలో ప్రతిఫలిస్తాయి. అవి మంచి యోగాలైనా, చెడు యోగాలైనా ఖచ్చితంగా పిల్లలకు సంక్రమిస్తాయి. వంశపారంపర్యంగా వస్తున్న శాపాలైతే మాత్రం ఖచ్చితంగా పిల్లల జాతకాలలోకి సరఫరా అవుతాయి. దీనినే జెనెటిక్ ఆస్ట్రాలజీ అంటారు. జ్యోతిశ్శాస్త్రంలో నా రీసెర్చి సబ్జెక్ట్ ఇదే ! ఎందుకంటే, ఇది మాత్రమే, ఆ వంశంలో వస్తున్న కర్మమ్యాప్ ను ఖచ్చితంగా చూపగలుగుతుంది. వంశంలో ఏయే శాపాలున్నాయో చూపిస్తుంది. అవెక్కడ మొదలయ్యాయో చూపిస్తుంది. ఎందుకు అవి పట్టుకున్నాయో చూపిస్తుంది. ఆ చెడుకర్మను ఎలా ప్రక్షాళన చేసుకోవాలో చూపిస్తుంది. ఆధ్యాత్మికసాధనకు దారి చూపించే జ్యోతిష్యకోణం ఇదే ! అందుకే జ్యోతిష్యశాస్త్రంలోని ఈ కోణం అంటే నాకు చాలా ఇష్టం !

దారాకారకుడైన గురువు మంచి యోగంలో ఉన్నప్పటికీ రెండు డిగ్రీలలో ఉండటం వల్ల బాల్యావస్థలో బలహీనుడుగా ఉన్నాడు. కనుక గజకేసరి యోగం అంత బలంగా లేదు. కానీ నవాంశలో గురువు బలంగా ఉన్నాడు. సంతాన కారకుడు బలంగా ఉన్నందువల్ల, తన సంతానం అందరూ గొప్పవాళ్ళు కాలేకపోయినా, అరవిందుల వంటి ఆణిముత్యం తనకు బిడ్డగా పుట్టాడు. అరవిందుల జాతకంలో కూడా గురువు ఉచ్చస్థితిలో ఉండటం చూడవచ్చు. ఈ యోగం ఈయనకు తండ్రిగారి నుంచి సంక్రమించింది.

అరవిందుల భార్య మృణాళినిది కూడా విషాదజీవితమే. అర్ధాంతరంగానే ఆమె జీవితమూ ముగిసింది. భార్య విషయంలో దురదృష్టం అనేది తండ్రి జాతకం నుంచే అరవిందులకు సరఫరా అయింది. ఈ విధంగా కొన్ని కొన్ని ట్రెండ్స్ ఆయా కుటుంబాలలో తరతరాలుగా నడుస్తూ ఉంటాయి. అర్ధం చేసుకుంటే 'వంశపారంపర్య కర్మ' అనేది అక్కడే కనిపిస్తుంది.

అలాగే, కుజుడు నీచశుక్రునితో కలసి ఉండటం కృష్ణధన్ గారి జాతకంలో మనం చూడవచ్చు. ఈ యోగం - అరవిందుల జాతకంలో కొచ్చేసరికి - నీచకుజునిగా మారిపోయింది. ఇది కూడా తండ్రి జాతక ప్రభావమే. ఇవే, వంశపారంపర్యంగా సంక్రమించే ధోరణులు. వీటినే వంశసంస్కారాలంటారు.

కృష్ణధన్ గారి జాతకంలో ఇంకొక దోషం నవాంశలో శనీశ్వరుని నీచస్థితి. ఇది కూడా శాపమే. దీనివల్ల ఎంత గొప్ప వృత్తిలో ఉన్నప్పటికీ ఆ జాతకునికి మానసికంగా శాంతి అనేది ఉండదు. ఆ జాతకంలో శని ఏ భావాన్ని సూచిస్తున్నాడో ఆ భావపరంగా ఘోరమైన అశాంతి, వైఫల్యాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది జరిగినట్లు మనం గమనించవచ్చు.

150 ఏళ్ళ క్రితం ఇంగ్లాండ్ లో M.D చేసి వచ్చి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసిన కృష్ణ ధన్ ఘోష్ మానసిక వేదనతో త్రాగుడుకు బానిసై, నిరాశకు లోనై, చివరకు హార్ట్ ఎటాక్ తొ చనిపోవడం, జాతకంలోని ఖర్మ కాకపోతే మరేమిటి? ఏమంటారు దీన్ని?

నీచరాహువుతో రవి కలసి ఉండటం వల్ల, ఈ పోకడ వీళ్ళ వంశంలో ఇంకా పైనుంచి వస్తున్నదన్న సత్యం మనకు స్పురిస్తున్నది. ఇదే నీడ అరవిందులను కూడా సోకింది. ఆయన ఎంత మహాయోగిగా రూపుదిద్దుకున్నప్పటికీ ఈ నీడ ఆయన్ను వెంటాడకుండా పోలేదు.

తన పిల్లలను ఉన్నతస్థానాలలో చూడలేక పోయానని బాధపడుతూ కృష్ణధన్ ఘోష్ కన్నుమూశాడు. ప్రపంచపు అజ్ఞానంలోకి, నిమ్నత్వంలోకి తను అనుకున్న సూపర్ మైండ్ ను దించి తీసుకురాలేకపోయానన్న దిగులుతో అరవిందులు కన్నుమూశారు. రెండూ నిరాశలే ! ఒకటి లౌకికం అయితే, రెండోది అత్యున్నతమైన ఆధ్యాత్మికం అయింది. కానీ ఇద్దరూ హతాశులే. ఇద్దరూ తమతమ ఆశలు భంగమైనవారే.

తన కుటుంబం కోసం కృష్ణధన్ ఘోష్ కన్నుమూస్తే, ప్రపంచం మొత్తాన్నీ ఉద్ధరించాలని ప్రయత్నిస్తూ అరవిందులు కన్నుమూశారు. కానీ ఇద్దరూ తమతమ ప్రయత్నాలలో విఫలులయ్యారు. ఇవే జాతకయోగాలంటే ! వీటిని తప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

ఇదంతా చదువుతుంటే, 'ఏ రాయైతేనేం తల పగలడానికి?' అని మోటు సామెత ఒకటుంది. అది గుర్తుకు రావడం లేదూ ! అందుకే నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, గ్రహప్రభావాన్ని ఎవరూ దాటలేరు. నువ్వు విషం త్రాగక తప్పదు, అది ఏ గిన్నెలో త్రాగుతావో నీ ఇష్టం. అది బంగారుగిన్నె కావచ్చు, వెండిగిన్నె కావచ్చు, ఇత్తడిగిన్నె కావచ్చు, సత్తుగిన్నె కావచ్చు, ఇనుపగిన్నె కావచ్చు, లేదా మట్టిమూకుడు కావచ్చు. నీవు చేసుకున్న కర్మ అనే విషాన్ని మాత్రం నీవు త్రాగక తప్పదు. లేదా అత్యున్నతమైన యోగసాధనను నీవు చేయగలిగితే అది ప్రక్షాళన అవుతుంది. నీ కర్మను అప్పుడు మాత్రమే దాటగలుగుతావు.

ఆ తర్వాత కూడా, లోకం కర్మను నీ నెత్తిని వేసుకుని మొయ్యాలనీ, లోకాన్ని ఉద్ధరించాలనీ చూస్తే మాత్రం, మళ్ళీ అదే విషం నీ ఎదురుగా ఇంతా పెద్ద మోతాదులో ఇంకా పెద్ద గిన్నెలో సిద్ధంగా ఉంటుంది. దాన్ని నువ్వు త్రాగకా తప్పదు. ఆ రకంగా నీ ఖర్మను నువ్వు తిరిగి అనుభవించకా తప్పదు. ఇంకా చెప్పాలంటే, అప్పుడు నీ ఖర్మనే కాదు, లోకుల ఖర్మను కూడా నువ్వే అనుభవించవలసి వస్తుంది. లోకంతో పెట్టుకునే మహనీయులకు పట్టే గతే ఇది !

అరవిందుల విషయంలో సరిగ్గా అదే జరిగింది !
(ఇంకా ఉంది)