“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, జూన్ 2018, శనివారం

నాకు తంత్రం జ్యోతిషం నేర్పిస్తారా?

చాలామందికి ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. అతీత లోకపు రహస్యాలను నేర్చుకోవాలని ఉంటుంది. కానీ ఎవ్వరూ కూడా దానికి కావలసిన రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళ పరిధిలో వాళ్ళుంటూ ఆ పరిధికి అతీతమైనది వారి దగ్గరకు రావాలని  ఆశిస్తారుగాని, అలా నేర్చుకోవాలంటే, వాళ్ళ పరిధులను దాటి వాళ్ళే బయటకు రావాలన్న విషయం వారికి అర్ధం కాదు. అర్ధమైనా, ఎవరూ అలా రాలేరు. దానికి కావలసిన త్యాగాలను అందరూ చెయ్యలేరు. కనుకనే నిజమైన ఆధ్యాత్మికత అందరికీ దక్కేది కాదు. అది అతి తక్కువమంది కోసమేగాని అందరికోసం ఉన్న వస్తువు కాదు. ఈ విషయాన్ని నిరూపించే సంఘటన మొన్నీ మధ్యనే ఒకటి జరిగింది.

మొన్న హైదరాబాద్ నుంచి ఒకాయన ఫోన్ చేశాడు.

'నా పేరు ఫలానా. నేను ఎస్ట్రాలజీలో ఎంఏ చేశాను' అన్నాడు.

'అలాగా. మంచిదే. నాతో పనేంటి?' అన్నాను.

'డిగ్రీ వచ్చిందిగాని, సబ్జెక్ట్ ఏమీ రాలేదు. మీలాంటి వారి దగ్గర నేర్చుకుందామని నా ఆశ' అన్నాడు.

ఈ మాట నిజమే గాబట్టి నాకు నచ్చింది. ఎం. ఏ (జ్యోతిషం) చేసినంత మాత్రాన ఏమీ రాదు. ఎందుకంటే పుస్తకాలలో ఉండేది ఎకాడెమిక్ సబ్జెక్ట్ అంతే. అది పరీక్ష పాసవడానికి ఉపయోగిస్తుంది గాని అంతకంటే ఎందుకూ పనికిరాదు. అసలైన రహస్యాలు టెక్స్ట్ బుక్స్ లో దొరకవు. అవి అనేక సంవత్సరాల పరిశీలనలోనూ అనుభవంలోనూ మాత్రమే అర్ధమౌతాయి.

'సరే. అలాగే. మీకు నిజంగా తపన ఉంటే నేర్పిస్తాను' అన్నాను.

'ఉండబట్టే గదా అడుగుతున్నాను. మీ ప్రొఫైల్ చూశాను. అందులో మీకు తంత్రం కూడా తెలుసనీ వ్రాశారు. నిజంగా మీకు తంత్రం తెలుసా?' అన్నాడు.

'తెలీదు. ఊరకే సరదాకి అలా వ్రాశాను. ఇంటర్ నెట్లో అంతా మోసమే కదా. అలాగే నాదీనూ.' అన్నా సీరియస్ గా.

'నిజం చెప్పండి సార్. మీ పోస్టులు అన్నీ నేను చదివాను. అవి బోగస్ కావు.' అన్నాడతను.

'మరి అర్ధమైనప్పుడు మళ్ళీ 'నిజమేనా?' అని ఎందుకు అడుగుతున్నారు?' అన్నాను.

'అంటే, నిజమైన తంత్రం తెలిసినవాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. మేము చాలాచోట్ల మోసపోయాము' అన్నాడు.

'లేరని మీరెలా సర్టిఫికేట్ ఇవ్వగలరు? మీకు అలాంటివారు దొరకలేదేమో?' అన్నాను.

'అదీ నిజమే లెండి. ఏదో మీ దగ్గర జ్యోతిష్య విద్యలో కిటుకులూ, తంత్రమూ నేర్చుకుంటే మా జ్యోతిష్యాలయం బాగా నడుస్తుందని నా ఆశ' అన్నాడు.

నేను దిమ్మెరపోయాను.

'అదేంటి? మీకు జ్యోతిష్యాలయం ఉందా?' అన్నాను.

'ఉంది. మరి డిగ్రీ చేసింది ఊరకే కూచోడానికి కాదు కదా?' అన్నాడు.

ఓహో ఇదా సంగతి? అని విషయం మొత్తం అర్ధమైంది.

'సరే. ఎప్పుడు రమ్మంటారు మరి?' అన్నాడు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తూ.

'ఎప్పుడైనా పర్లేదు' అన్నాను.

'మీ ఫీజు ఎంతో చెబితే బ్యాంక్ ఎకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను' అన్నాడు.

'నేను ఫీజేమీ తీసుకోను' అన్నాను.

'అవునా? అసలు మీలాంటివారు ఈరోజుల్లో ఎవరూ లేరు సార్. మీరు దొరకడం నా అదృష్టం' అని ఉబ్బిపోతున్నాడు.

'ఆగండి. మొత్తం వినండి. నేను ఫీజు తీసుకొను గాని, నా దగ్గర నేర్చుకోవాలంటే మీరు చాలా నియమ నిష్టలు పాటించాలి' అన్నాను.

'అలాగే సార్. నియమాలంటే నాకు చాలా ఇష్టం. గత పది ఏళ్ళనుంచీ ప్రతి ఏడాదీ శబరిమల పోతున్నాను. నియమాలు పాటించడం నాకు కొత్త కాదు' అన్నాడు.

ఆ మాట వింటూనే నాకు కంపరం పుట్టింది. ప్రపంచంలో నాకు నచ్చని మనుషులలో అయ్యప్పదీక్షలు తీసుకునేవారు ప్రధమస్థానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో 'క్లాస్' అనేది నాకిప్పటిదాకా కనపడలేదు. వాళ్ళందరూ మానసిక రోగులని, పెద్ద 'మసోచిస్ట్' లని నా నిశ్చితాభిప్రాయం.

నాకు నచ్చని మనుషులలో పురోహితులు, పూజారులు రెండో స్థానంలో ఉంటారు. వీళ్ళు కూడా ప్రవర్తనలలో చాలా చవకబారుగా, నేలబారుగా, అహంకారంగా ఉంటారు. అందుకే వీళ్ళంటే కూడా నాకు అసహ్యమే.

'అవునా. కానీ నా నియమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి మరి' అన్నాను.

'ఏం పర్లేదు. చెప్పండి. చేస్తాను.' అన్నాడు.

'సరే. వినండి. నా దగ్గరకు రాబోయే ముందుగా, 72 గంటలపాటు మీరు ఈ నియమాలు పాటించి ఆ తర్వాత నా దగ్గరకు రావాలి.' అన్నాను.

'చెప్పండి. వింటున్నాను' అన్నాడు.

'ముందుగా మీరు మొబైల్ ఫోన్ పక్కన పెట్టాలి. మూడ్రోజుల పాటు దాని ముఖం కూడా మీరు చూడకూడదు.' అన్నాను.

అవతల నుంచి వాయిస్ సైలెన్స్ అయిపోయింది.

'హలో. వింటున్నారా?' అడిగాను.

'ఆ. వింటున్నాను' అని ఒక గొంతు పీలగా వినిపించింది.

'తర్వాత, ఇంటర్ నెట్ జోలికీ, టీవీ జోలికీ, న్యూస్ పేపర్ జోలికీ ఈ మూడ్రోజులూ మీరు పోకూడదు' అన్నాను.

మళ్ళీ నిశ్శబ్దం.

'ఆ తర్వాత 72 గంటలపాటు మీరు పూర్తిగా మౌనం పాటించాలి, ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. కనీసం సైగలు కూడా చెయ్యకూడదు.అలా ఉండి ఆ తర్వాత నా దగ్గరకు రండి. అప్పుడు నేర్పిస్తాను' అన్నాను.

'ఒక విషయం అడుగుతాను ఏమనుకోకండి. ఇలా ఎందుకుండాలి? ఇలా ఉంటేనే ఈ విద్యలు వస్తాయని ఎక్కడా లేదే?' అన్నాడు కాసేపటి తర్వాత మెల్లిగా.

'ఎందుకు లేదు. చక్కగా ఉంది. ఏ ప్రామాణిక గ్రంధంలో చూచినా ఉంది. కానీ వేరే భాషలో ఉంది. నేను చెప్పినట్లు లేదు. కానీ భావం ఒకటే. ఆ రోజులకు తగినట్లు వారు వ్రాశారు. ఈ రోజులకు తగినట్లు నేను చెబుతున్నాను.' అన్నాను.

అతని గొంతులో ముందటి తెచ్చిపెట్టుకున్న గౌరవం తగ్గిపోయి, దాని స్థానంలో ఒక విధమైన వాదన పెట్టుకునే ధోరణి మొదలైంది.

'ఇంతేనా నియమాలు ఇంకా ఉన్నాయా?' అన్నాడు కొంచం ఎగతాళిగా.

'ఓహో. నీ సంగతి ఇలా ఉందా?' అనుకుని ఇలా చెప్పాను.

'అసలైన నియమం ఇప్పుడు చెబుతాను జాగ్రత్తగా వినండి. మీరు నా దగ్గరకు రాబోయే ముందుగా మీ జ్యోతిష్యాలయం బోర్డును ముక్కలు ముక్కలు చేసి ఆ తర్వాత నా దగ్గరకు బయల్దేరాలి.'

'అదేంటి?' ఆశ్చర్యంగా అడిగాడు.

'అవును. నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాక మీరు ఎవరికీ జ్యోతిష్యం చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా డబ్బులు తీసుకోకూడదు. ఈ నియమానికి మీరు కట్టుబడితే నా దగ్గర నేర్చుకోవచ్చు' అన్నాను.

'డబ్బులు తీసుకోకుండా ఉండే పనైతే, అసలు జ్యోతిష్యం నేర్చుకోవడం ఎందుకు?' అన్నాడు.

'మీ ఉద్దేశ్యం అదా? సరే వినండి. జ్యోతిష్యం అసలు ఉద్దేశ్యం జనాలకు జోస్యాలు చెప్పి డబ్బులు తీసుకోవడం కాదు. నిన్నూ నీ జీవితాన్నీ నీ చుట్టుపక్కల లోకాన్నీ నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోవడమూ, నీ బ్రతుకు నువ్వు సక్రమంగా బ్రతకడమే జ్యోతిష్య శాస్త్రం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. అంతేగాని అందరికీ లేనిపోని మాయ రెమెడీలు చెప్పడం కాదు.' అన్నాను.

'మీ మాటలు నేనిప్పటిదాకా విన్నవాటికి చాలా తేడాగా ఉన్నాయి' అన్నాడు.

'నా మాటలు ఇలాగే ఉంటాయి. వీటిని ఊరకే వినడం కాదు. నా దగ్గర విని నేర్చుకున్న వాటిని మీ జీవితంలో ఆచరించే ధైర్యం ఉంటేనే నా దగ్గరకు రండి. లేదంటే వద్దు. మీకూ నాకూ కూడా టైం వేస్ట్.' అన్నాను.

'ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేస్తానండి' అంది స్వరం.

'మీరు మళ్ళీ ఫోన్ చెయ్యరు. నా దగ్గరకు మీలాంటివారు రారు. రాలేరు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. నా మాటలు మీకు నచ్చలేదు. ఉన్నదున్నట్లు చెప్పండి. నాన్పుడు ధోరణి ఎందుకు?' అన్నాను.

'అదీ...అంటే... అంతేననుకోండి. మరీ అంత దూకుడుగా ఉంటే ఎలా సార్. లోకంలో మనం బ్రతకాలిగా?' అన్నాడు.

'ఊరకే బ్రతకడానికి నా దగ్గరకు రావద్దు. బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి. వచ్చీరాని జ్యోతిష్యం చెప్పి డబ్బులు సంపాదించనవసరం లేదు. క్వాలిటీగా బ్రతకడమూ, సార్ధకంగా బ్రతకడమూ ఎలాగో నేర్చుకోవాలంటే నా దగ్గరకు రండి. జ్యోతిశ్శాస్త్రం అనేది ఆధ్యాత్మికతలో ఒక భాగం. అంతేగాని అదొక బ్రతికే మార్గం కాదు. ' అన్నాను.

'సరే ఉంటామండి' అంది స్వరం.

'ఓకె' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.