“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, జూన్ 2018, ఆదివారం

శ్రీవిద్య - వేదంలో ఎట్లా సూక్ష్మంగా చెప్పబడింది?

చిక్కని ఆధ్యాత్మికత కోరేవారికోసం మరో పోస్టు.

మన సాంప్రదాయంలో శ్రీవిద్య అనేది తంత్రవిభాగానికి చెందినది. కానీ దీనికి వేదప్రామాణికత కూడా ఉన్నదని ప్రాచీనులైన మాధవవిద్యారణ్యుల నుంచి. భాస్కరరాయల నుంచి, కంచి పరమాచార్యులు, కల్యాణానంద భారతీస్వాములు, ఈశ్వర సత్యనారాయణ శర్మగారు, తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు, మొదలైన మన సమకాలికుల వరకూ ఎందఱో మహానుభావులు శ్రీవిద్యోపాసకులు చెప్పియున్నారు.

మనకు దేనికైనా వేదప్రామాణికత ముఖ్యం. 'వేదోహి శాస్త్రోఖిల ధర్మమూలం' అని మన విశ్వాసం. కనుక, వేదకాలం తర్వాత ఎన్నో శతాబ్దాలకు మధ్యయుగాలలో విలసిల్లిన శ్రీవిద్యాతంత్రానికి కూడా వేద ప్రామాణికతను నిరూపించే ప్రయత్నాన్ని ఈ మహనీయులు యధాశక్తిగా చేశారు.

ఈ దిశలో ప్రసిద్ధముగా వివరింపబడే మంత్రం ఋగ్వేదం 5:47:4 లోనిది. అది ఇలా ఉంటుంది.

మం|| చత్వార ఈం భిభ్రతి క్షేమయంతో దశగర్భం చరసే ధాపయన్తే
త్రిధాతవ: పరమా అస్య గావో దీవశ్చరంతి పరిసద్యో అంతాన్ ||

ఈ మంత్రమునకు ఋషి ప్రతిరధ ఆత్రేయుడు. త్రిష్టుప్ ఛందస్సు. విశ్వేదేవతలు దేవతలు. ఈ మన్త్రానికి గల స్థూలార్ధం ఇలా వస్తుంది.

'నాలుగు అతడిని నిలబెడుతున్నాయి. అతనికి క్షేమాన్నిఇస్తున్నాయి. పదిగర్భాలలో చరించడానికి స్థాపిస్తున్నాయి. మూడు ధాతువులతో కూడిన అతని వెలుగులు చివరల వరకూ వ్యాపిస్తున్నవి'

వేదమంత్రములకు ఒకటి గాకుండా అనేక అర్ధాలుంటాయని ఇంతకు ముందు అనేకసార్లు వ్రాశాను. అంతేగాక నా పుస్తకం 'శ్రీవిద్యా రహస్యం' లో కూడా ఈ మాటను చాలాచోట్ల చెప్పాను. ఆ అర్ధములను తపస్సంపన్నులైనవారు మాత్రమే గ్రహించగలరు గాని ఇంద్రియభోగనిరతులైన సామాన్యబుద్ధులు గ్రహించలేరు. మామూలు సంస్కృతం తెలుసుకుని వేదములకు అనువాదం చెయ్యాలని ప్రయత్నించిన అనేకులు ఇట్లానే భంగపడ్డారు.

తమ పశువులను, తమ సంపదను, తమవారిని రక్షించమనీ, శత్రువులను, రాక్షసులను శిక్షించమనీ వారిని చంపమనీ ప్రార్ధనలు తప్ప వేదాలలో ఇంకేమీ లేదన్న గొప్ప విషయం అంబేద్కర్ వంటివారికి కనిపించింది. దాశరధి రంగాచార్య గారు కూడా దాదాపుగా ఇలాంటి స్థూలమైన అర్ధాలనే తమ భాష్యంలో వ్రాశారు. వీరిద్దరూ కూడా వేదం యొక్క సూక్ష్మార్ధాలను విస్మరించారు. విస్మరించారు అనడం కంటే, వారికవి తట్టలేదు అని చెప్పడం సబబుగా ఉంటుంది.

అంబేద్కర్ కు తపశ్శక్తి లేకపోవడంలో వింత ఏమీ లేదు, ఎందుకంటే ఆయన ప్రాధమికంగా ఒక ఆధ్యాత్మిక సాధకుడూ కాదు, తపస్వీ కాదు. తన జీవిత చరమాంకంలో ఆయన బౌద్ధాన్ని స్వీకరించి ఉండవచ్చు గాక. కానీ మొదటనుంచీ ఆయన లౌకికవిద్యలోనూ రాజకీయాలలోనూ పరిశ్రమ చేసిన వ్యక్తేగాని, ఆధ్యాత్మవిద్యలో తపించిన వ్యక్తి కాదు. పైగా ఆయనకు హిందూమతం అంటే ఉన్న వ్యతిరేకభావం వల్ల కూడా ఆయనకు వేదాలలో ఉత్త స్థూలార్ధాలే అగుపించి ఉండవచ్చు. కానీ, పండితవంశానికి చెందిన దాశరధిగారికి కూడా ఇవి తట్టలేదంటే వింతగా అనిపిస్తోంది. ఏదైనా మనం చూచే కోణాన్ని బట్టే మనకు అక్కడ ఉన్న విషయం అర్ధమౌతుంది అనడానికి వీరిద్దరూ ఉదాహరణలు.

వేదాలకు వ్యాకరణపరమైన అర్ధాలను మాత్రమే స్వీకరిస్తే, అవి లౌకికమైనవిగానే మనకు కనిపిస్తాయి. కానీ ఆ మంత్రాలకు పారమార్ధికమైన అర్ధాలను స్వీకరిస్తే అప్పుడు మాత్రమే వాటిల్లోని అసలైన మహత్యం మనకు గోచరిస్తుంది. పారమార్ధిక అర్ధాలను ఎందుకు స్వీకరించాలి? అంటే, వేదములు అనేవి కధల పుస్తకములు కావు. అవి మంత్ర సమాహారములు. వేదములో ప్రతి మంత్రమునకు, ఒక ఋషి, ఒక ఛందస్సు, ఒక దేవత ఉంటారు. అవి మంత్రములు. ఉత్త సంస్కృత వాక్యములు కావు. కనుక వేదమంత్రములకు పారమార్ధికార్ధాలనే తప్పనిసరిగా గ్రహించవలసి ఉంటుంది.

ఇప్పుడు, పై వేద మంత్రానికి గల అసలైన పారమార్ధిక అర్ధాన్ని గమనిద్దాం.

'చత్వార "ఈం" బిభ్రతి' అన్న పదాలలో - 'నాలుగు శక్తులు అతడిని నిలబెడుతున్నాయి' అని చెప్పబడుతోంది. మంత్రశాస్త్రంలో మనకు 'ఈం' కారము శుద్ధశక్తి స్వరూపంగా దర్శనమిస్తోంది. ఈ విషయాన్ని నా పుస్తకం 'శీవిద్యా రహస్యంలో' వివరించాను. నాలుగు 'ఈం' కారములతో ఈ మహామంత్రం పరిపుష్టం అవుతోంది అని ఈ పదాలు సూచిస్తున్నాయి. శ్రీవిద్యాసాధనలో జపింపబడే షోడశీ మహామంత్రమున మూడు మాయా బీజములలోనూ, తిరిగి నాల్గవది యైన లక్ష్మీబీజములోను 'ఈం' కారము అంతర్గతమై ఉంటుంది. కనుక 'చత్వార ఈం బిభ్రతి' అనే పదాలలో, నాలుగు 'ఈం' కార బీజమంత్రములను కలిగియున్నట్టి షోడశీ మంత్రరాజమే సూచింపబడింది అన్న విషయం వేదము యొక్క రహస్యార్ధమును గ్రహించిన వారికే గోచరమౌతుంది గాని సామాన్య వ్యాకరణార్ధాన్ని చూచేవారికి గోచరించదు.

'దశగర్భం చరసే ధాపయంతే' అన్న పదంలో ఉన్న సూక్ష్మార్ధాలను తెలుసుకుందాం.

శ్రీచక్రము నవావరణ సహితం. సాధకుని దేహముకూడను నవావరణ యుతమే. ఈ తొమ్మిది ఆవరణలను దాటినదే దశమావరణం. ఈ తొమ్మిది ఆవరణలను దాటి దశమస్థానంలో నున్నట్టి అవాన్మానసగోచరమైన పరతత్వమునందు మనస్సును లయింపజేయడమే ఉపాసకుని పరమోద్దేశ్యమని 'సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళమ్' మొదలుగా గల వేదమంత్రములలో సూక్ష్మముగా చెప్పబడింది. అదే భావమే ఈ 'దశగర్భం చరసే ధాపయంతే' అనిన పాదంలో ఉపాసకుని చేతస్సు సహస్రార చక్రమున స్థితమైనప్పుడు అక్కడనుంచి జాలువారుతున్న వెలుగుధార ఉపాసకుని దేహమంతా వ్యాపించుతూ- 'దశ దిక్కులలోనూ ఆ వెలుగు నిండుతుంది' అని సూక్ష్మంగా చెప్పబడింది.

'త్రిధాతవ: పరమా అస్య గావో' అన్న పాదంలోని రహస్యార్ధాన్ని గమనిద్దాం.

ఈ పాదంలో చెప్పబడిన మూడు ధాతువులు ఏమిటి? అవి మానవుని త్రిదేహములైన స్థూల సూక్ష్మ కారణ శరీరములు. తాంత్రికపరమైన అర్ధమున చూచినట్లైతే, రక్తమాంసములు చర్మముతో కూడినది స్థూలశరీరమని, నాడీవ్యవస్థ సూక్ష్మశరీరమని, ఎముకలు కారణశరీరమని పరిగణింపబడతాయి. ఇంతకు భిన్నములైనట్టి అర్ధములు, వివరణలు ఈ పదములకున్నప్పటికీ, ఇది ఒక విధమైన తాంత్రిక వివరణము.

ఈ త్రిదేహములకు పరమమైన తురీయావస్థలోని పరతత్త్వము అనగా నడినెత్తికి పదియంగుళముల (అత్యతిష్ట దశాంగుళమ్) పైన శూన్యాకాశము (పరాకాశము) న వెలుగులు విరజిమ్ముచున్న సహస్రదళపద్మము నుండి వెలువడుచున్న వెలుగులు ఈ మూడు దేహములయొక్క  'దీవశ్చరంతి పరిసద్యో అంతాన్' మూలమూలల వరకూ విరజిమ్మబడుచున్నవి, నిండుచున్నవి, ప్రాకుచున్నవి - అన్నది ఈ మంత్రము యొక్క రహస్యార్ధము.

అనగా - 'నాలుగు 'ఈం' కార బీజాక్షరములచేత పరిపుష్టం కాబడి ఉన్నట్టి శ్రీషోడశాక్షరీ మంత్రమును చక్కగా అనుష్టానము చేయుట ద్వారా మేల్కొనిన కుండలినీశక్తి శిరస్సుకు పది యంగుళముల పైనున్నట్టి సహస్రదళ పద్మమునకు చేరగా అచ్చటగల ప్రకాశవంతమైన వెలుగులు ఉపాసకుని మూడు దేహములైన స్థూల సూక్ష్మ కారణ శరీరములలో మూలమూలలకు అతని నాడీవ్యవస్థ ద్వారా ప్రాకి అతడిని దైవచైతన్యముతో పరిపుష్టము గావించుచున్నవి' - అన్నది ఈ మంత్రము యొక్క రహస్యార్ధము.

ఈ యర్ధము అచ్చమైన శ్రీవిద్యోపాసననే ఉల్లేఖించుచున్నదన్న విషయమూ, ఇందులో చెప్పబడినది షోడశీమంత్రరాజమన్న విషయమూ తదుపాసకులకు సులభగ్రాహ్యమే కదా !

వేదమంత్రములను గ్రహించవలెనంటే ఇటువంటి సూక్ష్మదృష్టి అవసరము. ఇంకను, వీనిని బుద్ధిపరముగా కాక, అనుభవపూర్వకముగా గ్రహించవలెనంటే తపశ్శక్తి అత్యంత అవసరము. తపస్సు వల్లనే వేదరహస్యములు అవగతమౌతాయి గాని ఉత్త పాండిత్యము దానికి ఏమాత్రమును సరిపోదు. ఇక, కనీసము సంస్కృతము కూడా రాకుండా, ఎవరో విదేశీయులు వేదాలకు చేసిన ఇంగ్లీషు అనువాదములు చదివి, వేదంలో ఏమీ లేదంటే, అది హాస్యాస్పదమే గాని ఇంకొకటి కాబోదు కదా !

మనకు అనుభవం లేని విషయాల గురించి కూడా మహాపండితులవలె, మహాసాధకుల వలె వ్యాఖ్యానం చెయ్యబోతే ఎలా?