“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, జూన్ 2018, సోమవారం

శ్రీవిద్య - వేదంలో ఎట్లా సూక్ష్మంగా చెప్పబడింది? - 3

ఋగ్వేదమున, యజుర్వేదమున సూక్ష్మముగా గూడార్ధములతో చెప్పబడిన శ్రీవిద్యోపాసన అధర్వణవేదమున బాహాటముగానే వివరింపబడినది. ఆ విధముగా అధర్వణమున శ్రీవిద్యను వివరించిన ఉపనిషత్తులలో త్రిపుర తాపినీ ఉపనిషత్తు ఒకటి.

దీనియందు, గాయత్రీ మహా మంత్రమునకు, పంచదశీ మహా మంత్రమునకు గల సామ్యము వివరింపబడినది. ద్విజులుపాసించునట్టి గాయత్రీ మహామంత్రము త్రిపాదములు గలది. "చతుర్విగుంశత్యక్షరా త్రిపదా షత్కుక్షి: పంచశీర్షోపనయనే వినియోగ:" యను మంత్రము గాయత్రీ ఉపాసనము నందు ప్రసిద్ధమైనదే గదా !

కానీ, యతులుపాసించు గాయత్రి 'పరో రజసే సావదోమ్' అనిన పాదముతో గలిపి నాల్గుపాదములు గలదియని, ముప్పది రెండక్షరములు గలదియని ప్రసిద్ధము. అటులనే, షోడశీమహామంత్రమున్ను నాలుగు ఖండములతో కూడి చతుష్పాద గాయత్రీమంత్రమునకు సాటి వచ్చునదై విరాజిల్లుచున్నది. పంచదశీ మంత్రము వాగ్భవ, కామరాజ, శక్తి కూటములతో నిండి త్రిఖండాత్మకమై విలసిల్లుటయు, గాయత్రీ మంత్రమున్ను బ్రహ్మ విష్ణు శివాత్మకమై త్రిపాదాత్మకమై యుండుటను ఉపాసకులకు విదితములే.

పదునారవది యగు రహస్య బీజము యొక్క చేరికతో, పంచదశి షోడశిగా రూపాంతరము చెందుచున్నది. ఈ రహస్యబీజము ఒక్కొక్క సంప్రదాయమున ఒక్కొక్క రీతిగా ఉండుట వేత్తలకు గ్రాహ్యమే. అటులనే చతుర్ధ పాదము యొక్క చేరికతో త్రిపదయైన గాయత్రి చతుష్పదగా మారుచున్నది.

పంచదశీ మంత్రమునను, గాయత్రీ మంత్రమునను గల ఈ మూడు పాదములు, యుగ్యజుస్సామాది మూడు వేదములకు, షోడశియందలి రహస్య బీజము మరియు 'పరో రజసి సావదో' మన్న గాయత్రి యొక్క నాల్గవ పాదము నాల్గవ వేదమైన అధర్వణవేదమునకు సూచికలని పండితుల యభిప్రాయము.

ఇది ఇట్లుండగా, అధర్వణ వేదాంతర్గతమైన 'త్రిపుర తాపిన్యుపనిషత్తు' మాత్రము, పంచదశీ మంత్రమునందలి ప్రతి ఖండమునకు గాయత్రీ మంత్రముతో సామ్యమును నిరూపించినది. సంస్కృతమున ప్రతి యక్షరమునకు ఎన్నియో యర్ధములుండునను విషయము అందరకు తెలిసినదే కదా !

పంచదశీ మంత్రమున గల ఆయా మంత్రాక్షరములకు లెక్కలేనన్ని యర్ధములను గల్పించుట ద్వారా, గాయత్రీ మంత్రముతో సామ్యమును నిరూపించు ప్రయత్నమీ యుపనిషత్తున మనకు గానవచ్చును. ఈ యుపనిషత్తు ప్రకారము, పంచదశీ మంత్రరాజమును సక్రమముగా ఒక్కసారి జపించినచో, గాయత్రీ మహా మంత్రమును మూడుసార్లు జపించినంత ఫలితమొనగూడును. అటులనే షోడశీ మహామంత్రమును ఒక్కసారి జపించినచో చతుష్పాద గాయత్రిని నాలుగుసార్లు జపించిన ఫలితము కలుగును. షోడశీ మంత్రముతో గాయత్రిని సంపుటీకరణము చేసి జపించినచో కోట్ల రెట్లు గాయత్రిని జపించిన ఫలితము సిద్ధించునని ఈ యుపనిషత్తు చెప్పుచున్నది.

ఇందువల్లనే, గాయత్రి యను మంత్రము - ప్రకట గాయత్రి యని, రహస్య గాయత్రి యని రెండు విధములుగా యున్నదని శాస్త్ర వచనమై యున్నది. ఇందు ప్రకట గాయత్రి యనునది వేదమంత్రమై యొప్పుచుండగా, రహస్య గాయత్రి యనునది తాంత్రిక మంత్రమై భాసిల్లుచున్నది.

ఈ యుపనిషత్తున గల కొన్ని మంత్రములను పరికింతము గాక !

'పరో రజసే సావదోమితి తదవసానే పరం జ్యోతిరమలం హృది దైవతం చైతన్యం చిల్లింగం హృదయాగారవాసినీ హృల్లేఖేత్యాదినా స్పష్టం వాగ్భవకూటం పంచాక్షరం పంచభూత జనకం పంచాకలామయం వ్యాపట్పత ఇతి | య ఏవం వేద||' --- (త్రిపురతాపినీ ఉపనిషత్తు - 1:15)

"అతీతమై పరమై శుభ్రమై జ్యోతిస్స్వరూపమై యున్న దేవత చైతన్యస్వరూపిణిగా చిద్విలాసినిగా హృల్లేఖా బీజమంత్రమై ఉపాసకుని హృదయకోశమున వసించుచున్నది. ఈ విధముగా పంచాక్షరములతో కూడిన వాగ్భవ కూటము, పంచభూతములకు, పంచకళలకు నెలవై యలరారుచున్నది. దీనినే వేదముగా తెలిసికొమ్ము !" - అని ఈ మంత్రార్ధము.

ఇదే పాదమును కామరాజ కూటమునకు అనుసంధానము గావిస్తూ ఈ యుపనిషత్తు ఇట్లా వివరించినది.

||పరో రజసే సావదోమిత్యేయం కూటం కామకలాలయం షడధ్వ పరివర్తకో వైష్ణవం పరమం ధామైతి భగవాంశ్చైతస్సమాధ్య ఏవం వేద ||   

"ఈ ఖండము కామకలాయుతమైన కామరాజకూటమై యున్నది. ఆరు అధ్వముల ద్వారా దీనిని గ్రహించినవాడు విష్ణువుయొక్క పరమధామమును చేరుచున్నాడు. దీనిని మించినది లేదనుట నిశ్చయం. ఇదే వేదమన్నది గ్రహించు !" - అని ఈ పాదం అంటుంది.

ఇక తృతీయమగు శక్తికూటమును సమన్వయపరచే అంతిమములగు మంత్రములు ఏమంటున్నవో కొలదిగా పరికింతము !

"అధై తస్మాదపారం తృతీయం శక్తికూటం పరిపాద్యతే| ద్వాత్రింశదక్షర్యా గాయత్ర్యా తత్సవితుర్వరేణ్యం తస్మాదాత్మన ఆకాశ ఆకాశాద్వాయు: స్ఫురతి తదధీనం వరేణ్యం సముదీయమానం సవితుర్వా యోగ్యో జీవాత్మపరమాత్మ సముధ్భవస్తం ప్రకాశ శక్తిరూపం జీవాక్షరం స్పష్టమాపద్యతే| భర్గోదేవస్య ధీత్యనేనాధారరూపశివాత్మాక్షరం గణ్యతే | మహీత్యాదినాశేషం కామ్యం రమణీయం దృశ్యం శక్తికూటం స్పష్టీకృతమితి |

"ఇప్పుడు ముప్పది రెండక్షరముల గాయత్రీ మహామంత్రముతో శ్రీవిద్య యందలి తృతీయకూటమగు శక్తికూటము వివరింపబడుచున్నది. ఆత్మనుండి ఆకాశముద్భవించినది. దానినుండి వాయువు జనించినది. వీనినుంచి శ్రేష్టత్వము కలిగినది. జీవాత్మ పరమాత్మల సంయోగము సంభవించినదనుటవల్ల జీవాక్షరము ప్రకాశవంతమగుచున్నది. దీనివల్ల ఆధారరూపమైన శివాత్మాక్షరం గణింపబడుచున్నది. తదుపరి కోరదగినది, రమణీయమునగు శక్తికూటము స్పష్టమగుచున్నది."

ఇదంతయు మార్మికభాష. సరిగా వివరింపబడనిదే ఈ పదముల రహస్యార్ధములు తెల్లముగావుగాని శ్రీవిద్య యందలి త్రికూటములను గాయత్రీ మంత్రముతో అనుసంధానము చేయుచున్న ప్రయత్నము చూచాయగా ఇందు మనకు గోచరిస్తుంది. 

ఇప్పుడు, ఈ పంచదశీ మహా మంత్రజపము యొక్క మాహాత్మ్యమీ క్రింది మన్త్రములలో వివరింపబడినది.

"ఏవం పంచదశాక్షరం త్రైపురం యో ధీతే స సర్వాన్కామానవాప్నోతి | స సర్వాన్లోకాన్జయతి | స సర్వావాచో విజృంభయతి | స రుద్రత్వం ప్రాప్నోతి |  స వైష్ణవం ధామం భిత్వా పరంబ్రహ్మ ప్రాప్నోతి | య ఏవమ్ వేద|"

"ఈ పంచదశాక్షర సంయుతమైన త్రిపురావిద్యను ఎవడైతే తనలో ధరిస్తాడో అతని అన్ని కోరకలూ ఫలిస్తాయి. అతడు సర్వలోకాలనూ జయిస్తాడు.అతని వాక్కు విజృంభిస్తుంది. అతడు రుద్రస్వరూపుడే అవుతాడు. విష్ణుధామమును భేదించినవాడై అతడు పరబ్రహ్మను చేరుకుంటాడు. ఇదే వేదమని గ్రహించు." - యన్నది దీని యర్ధమై యున్నది.

ఈ విధముగా అధర్వణ వేదాంతర్గతమైన త్రిపురతాపినీ ఉపనిషత్తు శ్రీవిద్యను సూక్ష్మములైన పదములలో నిరూపించినది.

(మరిన్ని వివరములకు, నా తదుపరి రచనగా వచ్చుచున్న 'త్రిపురతాపినీ యుపనిషత్తు - గాయత్రీ శ్రీవిద్యా సమన్వయము' ను చదవండి)