“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, జూన్ 2018, ఆదివారం

శ్రీవిద్య - వేదంలో ఎట్లా సూక్ష్మంగా చెప్పబడింది? - 2

అధర్వణ వేదమునకు చెందిన 'దేవీ అధర్వ శీర్షమ్' అనే సూక్తంలో శ్రీవిద్యోపాసనను సూచించే మంత్రములున్నవి. దీనిని 'దేవ్యధర్వశీర్షమ్' అని కూడా పిలుచుట పరిపాటి.

ఈ సూక్తం లోని పద్నాలుగవ మంత్రం ఏమంటున్నదో గమనిద్దాం.

మం||కామో యోని: కమలా వజ్రపాణిర్గుహా హసా మాతరిశ్వాభ్రమిన్ద్ర:
పునర్గుహా సకలా మాయయాచ పురుచ్చైషా విశ్వమాతాదితి విద్యోమ్ ||

'మన్మధుడు, యోని, కమల, ఇంద్రుడు, గుహుడు, హ, స యను అక్షరములు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, మరల గుహుడు, స, క, ల యను అక్షరములు, పిదప మాయాబీజములతో కూడిన విద్యయే పురాతనియై, విశ్వమాతయని, దేవతలకు తల్లియని చెప్పబడే మహత్తరమైనట్టి విద్యయై యున్నది.'

ఇదియే శ్రీవిద్యోపాసనలో అత్యంత కీలకమైన పంచదశీ మంత్రము. ఈ మంత్రము నిగూఢమైన అక్షరాలలో అతిస్పష్టంగా అధర్వణవేదంలో చెప్పబడింది. కొందరు అధర్వణ వేదమును మూడువేదములతో బాటుగా ప్రాచీనమైనదిగా అంగీకరించరు. అయినప్పటికీ అధర్వణ వేదము కూడా వేదమే. పైగా ఈ వేదమున ఋగ్వేద మంత్రములు యధాతధములుగా అనేకచోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. అటులనే, ఈ సూక్తము కూడా ఋగ్వేదమునుండి అనేక మంత్రములను సంగ్రహించి తనలో కలుపుకొన్నది. కనుక శ్రీవిద్యకు వేదప్రామాణికత కలదన్నది స్పష్టమౌతున్నది.

ఈ మంత్రమునకు ఆరు విధములైన వ్యాఖ్యానములు చెయ్యవచ్చు. అవి 1 . భావార్ధము. 2. వాచ్యార్ధము. 3 . సంప్రదాయార్ధము 4. కౌలికార్ధము 5 . రహస్యార్ధము 6. తత్వార్ధము.

మంత్రమున సిద్ధి పొందిన మహనీయులు ఇంకను అనేక విధములైన వ్యాఖ్యానములు చేయగలరు. శ్రీవిద్యయందు ఉద్దండులైన మహనీయులు ప్రాచీనులు ఆ విధముగా చేసినవారు ఎందఱో ఉన్నారు.

ఈ సూక్తమున గల తదుపరి మంత్రములు దీనిని గురించి ఏమంటున్నవో గమనిద్దాం.

మం|| ఏషాత్మశక్తి: ఏషా విశ్వమోహినీ
పాశాంకుశ ధనుర్బాణధరా
ఏషా శ్రీమహావిద్యా
య ఏవమ్ వేద స శోకం తరతి ||

"ఈ విద్యయే ఆత్మశక్తి. ఇదియే విశ్వమోహిని. ఈ దేవత పాశము, అంకుశము, ధనుస్సు మరియు బాణములను ధరించి ఉంటుంది. (అనగా లలితా పరమేశ్వరి యని అర్ధము). దీనినే శ్రీమహావిద్య (లేక శ్రీవిద్య) యని పిలుస్తారు. దీనిని తెలిసికొన్నవాడు శోకము నుండి తరిస్తాడు" అంటుంది ఈ మంత్రం.

ఈ మంత్రమునకు సమాంతరముగా ఆదిశంకరుల వారు తన "సౌందర్య లహరి" లో --

శ్లో|| శివశ్శక్తి కామ క్షితి రధ రవి శ్శీతకిరణ:
స్మరో హంసశ్శక్ర తదనుచ పరామార హరయ:
అమీ హృల్లేఖాభిస్త్రిసృభిరావసానేషు ఘటితా
భజన్తే వర్ణాస్తే తవ జనని నామావయవతాం

'శివుడు, శక్తి, మన్మధుడు, సూర్యుడు, చంద్రుడు, మన్మధుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు, మన్మధుడు, ఇంద్రుడు మొదలగు శక్తులకు చివర్లలో మూడు హృల్లేఖా బీజములను చేర్చగా మహిమాన్వితమైన నీ మంత్రరాజము ఉద్భవించుచున్నది.'

అన్న శ్లోకములో పంచదశీ మంత్రమును నిక్షేపించి యున్నారు.

అయితే ఈ మంత్రములన్నింటినీ పుస్తకములు చూచి జపము చేయరాదు. నేడు అన్ని రకముల మంత్రములు అంతర్జాలమున విరివిగా లభిస్తున్నవి. చాలామంది వీటిని జపము చేసేవారు కూడా కనిపిస్తున్నారు. ఇది పెద్ద పొరపాటన్న విషయమును వారు గ్రహించాలి. గురుముఖతా గ్రహించని ఇలాంటి జపముల వల్ల శుభము కంటే అశుభమే సంభవిస్తుంది.

మంత్రమన్నది ఉపదేశ పూర్వకముగా గ్రహింపబడవలెను గానీ పుస్తకమును నుండి సంగ్రహించినది కాకూడదు. ఈ విషయమై 'కులార్ణవ తంత్రము' నందలి పంచమ దశోల్లాసం ఏమంటున్నదో గమనిద్దాం.

శ్లో|| యదృచ్చయా శ్రుతం మంత్రం దృష్టేనాపి ఛలేనచ
పత్రే స్థితం వా చాధ్యప్య తజ్జపస్యాత్ అనర్ధకమ్        (20)

'యధాలాపముగా విన్నది, లేదా ఎక్కడో చూచినది, లేదా మోసముతో సంగ్రహించినది, పత్రముల మీద వ్రాయబడినది మొదలైన మంత్రములను ఉపదేశము లేకుండా జపించినచో అవి అనర్ధములకే దారి తీయును.'

శ్లో|| పుస్తకేన లిఖితాన్ మంత్రాన్ విలోక్య ప్రజపంతి యే
బ్రహ్మహత్యా సమం తేషాం పాతకం స్యాది దు:ఖదం      (21)

'పుస్తకములలో వ్రాయబడి యున్న మంత్రములను చూచి వాటిని జపించుట వల్ల మంచి జరుగకపోగా బ్రహ్మహత్యాసమమైన పాపం చుట్టుకుని అనేక దుఖాలను కలిగిస్తుంది.'

కనుక పుస్తకములలోనో అంతర్జాలములోనో మంత్రములను గ్రహించి వాటిని జపించుట నిరర్ధకమని అట్లా చేసేవారు గ్రహించాలి. దీనివల్ల మంచి జరుగకపోగా చెడు జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఎందుకనగా మంత్రముయొక్క షడంగముల వివరం తెలియకుండా చేసే మంత్రజపం సిద్ధిని కలిగించదన్నది మంత్రశాస్త్ర వేత్తలకు విదితమే.

ప్రతి మంత్రమునకు ఈ ఆరు అంగములు విభిన్నములుగా ఉంటాయి. ఈ ఆరు అంగములు ఏమిటన్నది గురుముఖతా మాత్రమే నేర్చుకోబడాలి. ఎందుకనగా, ఆయన గురువు నుంచి ఆయన వాటిని నేర్చుకుని ఉంటాడు గనుక ఆ మంత్రము అనుస్యూతముగా ఎప్పటినుండో వస్తూ ఉంటుంది గనుక ఆ పరంపరాగతమైన శక్తి దానిలో గర్భితమై ఉంటుంది. అప్పుడు దానికి జీవం ఉంటుంది గనుక మంత్రం పని చేస్తుంది. కనుక మంత్రమన్నది ఉపదేశము ద్వారా గ్రహించవలసినదే. ఆ ఉపదేశమునిచ్చే గురువుకు ఆ మంత్రం సిద్ధించి యుండాలి. అప్పుడే అది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మంత్రసిద్ధిని పొందిన గురువులో దాని శక్తి నిండి యుంటుంది గనుక ఆయన నుండి ఉపదేశపూర్వకముగా సాంగోపాంగముగా గ్రహించిన మంత్రమే శిష్యునకు సిద్ధిని కలిగిస్తుందన్నది పిండితార్ధము.