“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జూన్ 2018, శుక్రవారం

యోగా చేస్తే అహంకారం పెరుగుతుందా?

జర్మనీలో ఒక యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలలో యోగా చేసేవారిలో అహంకారం పెరుగుతున్నట్లు గమనించారని పేపర్లలో వార్తలొచ్చాయి. ఈ వార్తలు కూడా నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనగా మొన్న వచ్చాయి. అంటే ఏమిటి? అందరూ యోగా చేస్తున్నారన్న భయంతో ఇలాంటి దుష్ప్రచారం చేసి యోగాను అడ్డుకోవాలన్న క్రైస్తవ లాబీ (వాటికన్) కుట్రా ఇది? కావచ్చు. ఎందుకంటే, భారతీయతను పెంపొందించే ఏదైనా ఈ లాబీలకు నచ్చదు. మన ధర్మం, మన సంస్కృతి ఎప్పటికీ అట్టడుగున ఉండాలన్నదే వారి ఊహ. వారి ప్రయత్నాలు కూడా ఆ దిశగానే సాగుతూ ఉంటాయి.

అహంకారం పెరగాలంటే దానికి యోగానే చెయ్యనక్కరలేదు. ఏం చేసినా అది పెరుగుతూనే ఉంటుంది. చాలాసార్లు ఏమీ చెయ్యకపోయినా అది పెరుగుతూనే ఉంటుంది. అహంకారం అనేది డబ్బున్నవాడికే కాదు, అడుక్కునేవాడికి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అడుక్కునేవాడికే అది ఎక్కువగా ఉంటుంది.

మనలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు అది అహంకారంగా మారే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. జిమ్ చేసేవారిలో వారికి మంచి కండలున్నాయన్న అహం పెరుగుతుంది. ఆ కండలు కొద్దిగా లూజైతే అదే అహం భయంగా మారుతుంది. ఇక ఆ ఫిట్నెస్ ను అలాగే ఉంచుకోవాలని నానా ప్రయత్నాలూ చేస్తూ భయం భయంగా బ్రతుకుతూ ఉంటారు. ఎక్కువగా సినిమా తారల్లో ఈ భయం కనిపిస్తూ ఉంటుంది.

అధ్లేట్స్ పరిస్తితీ అంతే. వాళ్ళకీ అహంకారం ఉంటుంది. బాక్సర్లకీ ఉంటుంది. బాడీ బిల్డర్లకూ ఉంటుంది. అందగత్తెలకూ ఉంటుంది. ప్రతివారికీ అహంకారం ఉంటుంది. మిగతావారికంటే నేను డిఫరెంట్ అనే ఫీల్ ఉన్నప్పుడు అహంకారం తప్పకుండా ఉంటుంది. ఈ కాలపు చదువులూ ఉద్యోగాలూ వ్యవహారాలూ అన్నీ అహంకారాన్ని ఇంకా ఇంకా పెంచే దిశగానే పోతున్నాయి గాని దానిని తగ్గించే దిశగా పోవడం లేదు.

అసలు అహం ఎందుకు తగ్గాలీ అంటే, అహం ఎక్కువైతే నువ్వు దైవానికి దూరం అవుతావు. అహం ఎంత తగ్గితే దైవానికి అంత దగ్గరౌతావు. అహం అసలు లేకుంటే నువ్వు దైవంలోనే ఉంటావు. కనుక, మనలో ఎన్ని ప్రత్యేకతలున్నప్పటికీ అహంకారం లేకుండా ఒక మామూలు మనిషిగా ఉండటమే అసలైన ప్రత్యేకత !

యోగాను ఒక శరీరవ్యాయామంగా మాత్రమే చేస్తే అది తప్పకుండా అహాన్ని పెంచుతుంది. కానీ అదే యోగాకు, నిజమైన యోగా తోడైతే అప్పుడు మాత్రమే అహం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. నిజమైన యోగా అంటే ఏమిటి?

ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ధ్యానం మొదలైన అంతరిక ప్రక్రియల లోతులు అనుభవంలో తెలిస్తే అప్పుడు మాత్రమే 'అహం' అనేది పోతుంది. అంతేగాని ఊరకే కొన్ని ఆసనాలు నేర్చుకుని దానినే 'యోగా' అనుకుంటే అది పొరపాటు. ఆసనాల వల్ల ఆరోగ్యం వస్తుంది, చాలాసార్లు అహమూ పెరుగుతుంది.

యోగా మీద అధికారిక గ్రంధం అయిన హఠయోగ ప్రదీపికలో స్వాత్మారామ యోగీంద్రులు ఇలా అంటారు.

||ప్రణమ్య శ్రీగురుం నాథం స్వాత్మారామేణ యోగినా
కేవలం రాజయోగాయ హఠ విద్యోపదిష్యతే ||

నా గురువుకు ప్రణామం గావిస్తూ స్వాత్మారామ యోగినైన నేను, కేవలం రాజయోగాన్ని సాధించే నిమిత్తమై, హఠవిద్యను ఉపదేశిస్తున్నాను.

||పీఠాని కుంభకాశ్చిత్రా దివ్యాని కరణాని చ
సర్వాణ్యపి హఠాభ్యాసే రాజయోగ ఫలావధి: ||

ఆసనములు, ప్రాణాయామము, క్రియలు మొదలైన అన్ని హఠయోగ అభ్యాసములకూ రాజయోగమే పరమగమ్యం.

కనుక శరీరంతో చేసే యోగమైన హఠయోగం యొక్క ఉద్దేశ్యం మనస్సుతో చేసే రాజయోగాన్ని అందుకోవడమే అని ప్రాచీన గ్రంధాలు స్పష్టంగా చెబుతున్నాయి. అలా కానప్పుడు ఈ ఆసనాలూ గట్రా ఉత్త ఫిజికల్ ఎక్సర్ సైజులు మాత్రమే అవుతాయి.

రాజయోగ మహిమ ఘేరండ సంహితలోని ఈ శ్లోకంలో ఇలా చెప్పబడింది.

|| రాజయోగ మజానంత కేవల హఠకర్మణ:
ఏతానభ్యాసినో మన్యే అభ్యాస ఫల వర్జితాన్ ||

"రాజయోగాన్ని తెలియకుండా కేవలం హఠయోగం మాత్రమే అభ్యాసం చేసేవారు, ఒకపని కోసం ఎంతో కష్టపడి పనిచేసి, చివరకు దాని ఫలితాన్ని మాత్రం అందుకోలేని మనుషుల వంటి వారు" - అంటుంది ఈ శ్లోకం.

కనుక ఆసన, ప్రాణాయామాది సాధనల పరమగమ్యం ఇంద్రియనిగ్రహం, ధ్యానం, సమాధులతో కూడిన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవడమేగాని, నేడు చాలామంది చెబుతున్నట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కాదు. అయితే, ఆసనాల బై ప్రాడక్ట్ గా ఆరోగ్యం వస్తుంది. అంతటితోనే మాకు చాలు అంటే, యోగంలోని ఉన్నత స్థాయులు మనకు ఎప్పటికీ అందవు. అవి మాకు అవసరం లేదు. మాకు ఆరోగ్యం చాలు అని మీరనుకుంటే అది మీ ఖర్మ !

'అహం' నాశనమే సమాధి. సమాధే యోగగమ్యం. మరి యోగా వల్ల అహం పెరుగుతూ ఉంటే, ఆ సాధన సరియైన దిశలో సాగుతున్నట్లా, లేనట్లా? యోగా చేస్తూ అహంకారంతో నిండి ఉండటం కంటే, యోగా చెయ్యకపోయినా అహం లేకుండా ఉండటం శ్రేయస్కరం.

ఇంద్రియాల పరిధిని నువ్వు దాటాలి అని యోగం చెబుతుంటే, అదే యోగం చెయ్యడం ద్వారా ఇంద్రియభోగాలను ఇంకా ఎక్కువగా అనుభవించేలా మేం తయారౌతాం, అందుకోసమే మేం యోగా చేస్తున్నాం, ఈ ఫిజికల్ ఫిట్నెస్ ను మేం అందుకే వాడతాం అని యోగాభ్యాసపరులు అనుకుంటే, అసలు వాళ్ళు ఏం చేస్తున్నట్లు, ఎక్కడికి పోతున్నట్లు?

ప్రతిదాన్నీ, చివరకు ఆధ్యాత్మికతను కూడా మాకు అవసరమైనంత వరకే మేం వాడుకుంటాం, నిజానికి అది ఏం చెబుతోందో మాకు అవసరం లేదని అన్నప్పుడు అలాంటి ఆధ్యాత్మికత మనకెందుకు? అలాంటి యోగాను అసలు చేస్తేనేం? చెయ్యకపోతేనేం?