“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, జూన్ 2018, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 17 (వసుంధరక్కయ్యతో సంభాషణ)

నేను జిల్లెళ్ళమూడి వచ్చి దాదాపు రెండేళ్ళు అయింది. ఈ రెండేళ్లలో ఆశ్రమం చాలా మారింది. కొత్త కట్టడాలతో, చెట్లతో చాలా సుందరంగా తయారైంది. కారును సరాసరి లోనికి తీసికెళ్ళి వసుంధరక్కయ్య వాళ్ళింటి ముందు ఆపాం. ముందుగా అక్కయ్యతో మాట్లాడి తర్వాత అమ్మ ఆలయానికి వెళదామని అక్కయ్యా వాళ్ళింటి తలుపు తట్టాం.

ఇంతలో పక్కింట్లో నించి మల్లన్నయ్యగారి భార్య బయటకు వచ్చింది. మమ్మల్ని చూచి నవ్వుతూ పలకరించింది.

'ఇంతకు ముందు మీతో వచ్చినావిడ రాలేదా?' అడిగింది ఆమెకోసం వెదుకుతూ.

'ఎవరూ? పద్మజ గారా? రాలేదు. అమెరికాలో ఉన్నారు' అని చెప్పాను.

'ఎప్పుడొస్తారు?' అందామె.

'ఏమో తెలీదు. వచ్చినప్పుడు ఇక్కడకు వస్తారులెండి' అన్నా నేను.

కొంతమందిని ఒకటి రెండుసార్లు చూచినా అలా గుర్తుండి పోతారు. ఈమెకు ఆమె అలా గుర్తుండిపోయింది. ఆ కారణాలేమిటో వారిద్దరికే తెలియాలి.

ఈలోపల వసుంధరక్కయ్య తలుపు తీసింది.

అక్కయ్యకు మమ్మల్ని చూస్తూనే ఆనందంతో ముఖం వెలిగిపోయింది. మాకూ ఆమెను చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. అమ్మకు తన చేతులతో దాదాపు ముప్ఫై ఏళ్ళు సేవ చేసిన ధన్యాత్మురాలు. ఎంత పుణ్యబలం ఉండాలి అంత అదృష్టం పట్టాలి అంటే?

నేను అక్కయ్య వైపు తదేకంగా చూచాను. ఆమెను చూస్తుంటే ఒక దేవతలాగా తన చుట్టూ ఒక పవిత్రమైన ఆరాతో వెలిగిపోతూ కనిపించింది నాకు. నేనెప్పుడు చూచినా ఒక మనిషిలాగా ఆవిడ కనిపించదు. ఒక దేవతలాగే నాకు కనిపిస్తుంది. కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. మనస్సులోనే మౌనంగా నమస్కారం చేశాను. 

అందరం కూచుని సేదతీరాక మాటలు మొదలయ్యాయి.

'మీరు వచ్చి చాలా రోజులైంది' అంది అక్కయ్య.

'అవునక్కయ్యా. దాదాపు రెండేళ్లైంది' అన్నా నేను.

అందరినీ ఆప్యాయంగా పలకరించింది తను. మాటల సందర్భంలో నా యాక్సిడెంట్ గురించి చెప్పాను. ఇప్పుడు బానే ఉందనీ త్వరగానే తగ్గిందనీ చెప్పాను.

'మీకు షుగర్ లేదేమో అందుకే త్వరగా తగ్గింది' అంది అక్కయ్య.

'అయ్యుండచ్చు' అన్నా నేను.

నేను నేలమీద కూచోడం చూచి, "కాలు బాగానే మడత పడుతోందే?" అని అడిగింది.

'అది పడకపోయినా నేను ఊరుకోను కదక్కయ్యా. ఏదో రకంగా దాన్ని వంచి మడత పెడతా కదా' అన్నా నేను నవ్వుతూ.

'నేనూ క్రింద పడ్డాను. ఇక్కడే, శ్రీమన్నారాయణగారి అపార్ట్ మెంట్స్ శంకుస్థాపన సమయంలో తూలి క్రింద పడ్డాను. తుంటి ఎముక విరిగింది. హైదరాబాద్ లో మూన్నెల్లు ఉన్నాను. కదలకూడదని అన్నారు. ఇప్పుడు కాస్త పరవాలేదు. నడుముకు బెల్టు ఉంది. నెమ్మదిగా నడుస్తున్నాను.' అంది అక్కయ్య.

శ్రీరామ్మూర్తినీ, నాగమణిని పరిచయం చేశా నేను. వాళ్ళెక్కడుంటారో ఏం చేస్తుంటారో అడిగి తెలుసుకుంది అక్కయ్య.

ఇంతకు ముందు నాతో అక్కడకు వచ్చిన పద్మజ, రామన్న మొదలైన వాళ్ళ గురించి అడిగింది ఆమె. ఇప్పుడు వాళ్ళు మా గ్రూపులో లేరనీ నాతో మాట్లాడటం లేదనీ, ఏవో చిన్న చిన్న మనస్పర్దలనీ ఆమెకు చెప్పాను.

'ఇంతకు ముందు ఒకమ్మాయి రెండుసార్లు వచ్చింది ఇక్కడకు. తనుకూడా అమెరికాలోనే ఉంటుంది. మీరు తెలుసనీ నాకు చెప్పింది. చాలా త్వరగా అమ్మతత్వాన్ని పట్టుకుంది. మొదటిసారి వాళ్ళ అమ్మావాళ్ళతో వచ్చింది. తనకు తృప్తిగా లేదేమో రెండోసారి ఒక్కతే వచ్చింది.' అందక్కయ్య.

అక్కయ్య మాటలు వింటుంటే నాకు నవ్వొచ్చింది. 'పిచ్చక్కయ్య, ఆ అమ్మాయి కాస్త నవ్వుతూ మాట్లాడేసరికి, అమ్మతత్వం అర్ధమైపోయిందని, చాలామంచిదని అనుకుంటోంది. జీవితమంతా ఇక్కడున్న వాళ్ళకే అమ్మతత్వం అర్ధం కాలేదు. ఏదో రెండు పుస్తకాలు చదివితే అర్ధమైపోతుందా? మనుషుల్ని పైపైన కాదు, మనసుల లోతులు చూడక్కయ్యా. అప్పుడర్ధమౌతాయి మంచితనాలు' అనుకున్నా.

కానీ అదంతా చెప్పకుండా, 'అవును. ఇప్పుడు నాతో మాట్లాడదు. సోదాపమన్నానని కోపంవచ్చి మానేసింది' అన్నాను.

'ప్రస్తుతం తను ఇండియాలోనే ఉంది. ఈరోజో రేపో తనూ వస్తుందని ఆమె ఫ్రెండ్ ఎవరో చెప్పారు.' అందక్కయ్య.

'అలాగా' అన్నాను విసుగ్గా

'ఒక ఏడాది నుంచీ నాతోనూ మాట్లాడటం లేదు. అంతకు ముందు అప్పుడప్పుడు ఫోన్ చేసేది. క్రమంగా మానేసింది' అంది అక్కయ్య.

'అంతే అక్కయ్యా. అవసరం గొప్పదని అమ్మ అనలేదూ? వాళ్ళకు పనుంటే వస్తారు, అయ్యాక పోతారు. ఏముంది అందులో అనుకోడానికి? చవకబారు మనుషులంతే' అన్నా నేను.

'అవును నాయనా. నేనూ గమనించాను. నా జీవితంలో ఎన్ని చూచానో ఇలాంటివి? అంతా కాలప్రభావం. కాలప్రవాహంలో ఎందఱో పరిచయం అవుతారు. కొన్నాళ్ళు కలసి ఉంటారు. తర్వాత కనుమరుగై పోతారు. అంతే.' అని అక్కయ్య కాసేపు ఆలోచనలో ఉండిపోయింది.

'కాలప్రభావం కాదక్కయ్యా.  అవసరం, స్వార్ధం అంతే' అన్నా.

ఆమేమీ మాట్లాడలేదు, కాసేపటి తర్వాత సాలోచనగా ఇలా అంది.

'జీవితంలో ఏదైనా క్షణికమే నాయనా. ఆ క్షణానికి అది ఉంటుంది. అంతే. అప్పటికది సత్యం. మరుక్షణానికి అది గతం. అంతే.'

'అవునక్కయ్యా. ఏదైనా అంతే అని నాకూ ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఆ క్షణానికి ఉండి మరుక్షణం జారిపోయేవాటిని మనం వదల్లేక తాపత్రయపడటమే గాని, మన మనస్సును వెనక్కు తీసుకున్నామంటే అక్కడ ఏమీ ఉండదు. ఏదైనా క్షణికమే. ఇదే అంతిమ సత్యం అని నాకూ అనిపిస్తుంది. చివరి వరకూ మనతో ఎవరుంటారు? వారివారి అవసరాలు తీరగానే మాయమౌతారు' అన్నాను.

'అంతే నాయనా' అంది తను.

ఆ తర్వాత చాలా సంగతులు చెప్పింది అక్కయ్య. అమ్మ బ్రతికి ఉన్న రోజులలో ఇదే కుడికాలికి ఏదో జబ్బుచేసి అస్సలు కదలలేక పోవడమూ, మదనపల్లి ట్రిప్ లో ఉన్నపుడు అమ్మ అనుగ్రహంతో ఏ మందులూ లేకపోయినా అదే కాలితో నడవగల్గడమూ అలాంటి సంగతులు ఎన్నో చెప్పింది.

'ఎందరికో ఎన్నింటినో తగ్గించింది అమ్మ. అసాధ్యాలు, ఇక కుదరవు అనుకున్నవాటిని తగ్గించింది. కానీ ఏనాడూ కర్తృత్వం తనమీద వేసుకోలేదు. తాను చేశాను అని అనలేదు. 'మీ సమయం వచ్చింది మీకు తగ్గింది' అనేది కాని నేనే చేశాను అని ఏనాడూ అనలేదు అమ్మ.

కానీ కొన్ని సందర్భాలలో బయట పడేది. 'ఇప్పటి వరకూ, ఈ సృష్టి నాది అన్నవాళ్లు ఎవరున్నారు నాయనా? అమ్మ అనడం మేం విన్నాం. 'ఈ సృష్టి నాది, అనాది' అన్నది అమ్మ.' ఆశ్చర్యపోయేవాళ్ళం ఆమాటలు విని !

'ఎప్పటినించో రావాలని అనుకుంటున్నాం అమ్మా. ఇవాల్టికి గురువుగారితో రాగలిగాం' అన్నది నాగమణి.

'మీరు అనుకుంటే రాలేరమ్మా ఇక్కడకు. నేను రమ్మంటే తప్ప ఎవరూ ఇక్కడకు రాలేరని అమ్మ ఎన్నో సార్లు అన్నది.' అందక్కయ్య.

ఇలా అంటూ -'ఎవరో అమ్మమీద వ్రాసిన పద్యాల పుస్తకం ఉంది చదువుతావా?' అని నాగమణిని అడిగింది అక్కయ్య.

నాగమణి నవ్వుతూ - 'మా గురువుగారు వ్రాసిన పద్యాలే నేను చదువుతాను. మిగతావీ...??' అని అర్ధోక్తిలో ఆగిపోయింది.

అక్కయ్యకు ఆమాట వినిపించిందో లేదో తెలీదు. ఏదో పుస్తకం తీసి నాగమణికి ఇచ్చింది ఆమె.

ఏప్రియల్ లో భాస్కరన్నయ్య పోయిన సంగతి కాసేపు మాట్లాడుకున్నాం. అమ్మ దేహత్యాగ సమయంలో ఆయనకు విమాన శబ్దం వినిపించిన సంగతీ, అమ్మ చరిత్రను ఆయన వ్రాసిన సంగతీ, అప్పటి సంఘటనల గురించి కాసేపు మాట్లాడుకున్నాం.

'లలితా సహస్ర నామ రహస్యార్ధ ప్రదీపిక' పుస్తకం అక్కయ్య చేతిలో పెట్టి ' ఈ పుస్తకం ఈ మధ్యనే వ్రాశానక్కయ్య' అని చెప్పాను. అంతేగాని, "మీరు చదవండి" అని మాత్రం చెప్పలేదు. అన్నేళ్ళు అమ్మకు సేవ చేసిన మనిషికి ఇప్పుడు పుస్తకాలు చదవవలసిన పనేముంటుంది గనుక?

ఆలయానికి వెళ్లి వద్దామని నేను లేచాను. అందరూ నాతో బయలుదేరారు. ఆలయంలో కాసేపు కూచుని, భోజనం చేసి, గదిలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాం.

ఈలోపు కర్లపాలెం నుంచి వచ్చిన రామకృష్ణ సమితి భక్తులు కొందరు కనిపించారు. వారితో ఒక బ్రహ్మచారిగారున్నారు. ఆయన వేషాన్ని బట్టి ఆయన రామకృష్ణా మిషన్ బ్రహ్మచారి అని గ్రహించి నేనే వారిని కదిపి మాట్లాడాను. తను హైదరాబాద్ మఠం నుంచి వచ్చానని, కర్లపాలెం రామకృష్ణా సమితిలో ఉంటున్నాననీ ఆయన అన్నారు.

1984 ప్రాంతంలో నేను హైదరాబాద్ మఠానికి వచ్చేవాడిననీ స్వామి పరమార్ధానందగారు, స్వామి రంగనాధానందగారు అప్పట్లో అక్కడ ఉండేవారని వారు నాకు బాగా పరిచయమనీ, శ్రీమత్ స్వామి గంభీరానందస్వామివారు నా గురువుగారనీ బ్రహ్మచారి స్వామితో చెప్పాను. వాళ్ళంతా చాలా సంతోషించారు.

స్వామి వినిశ్చలానందగారు ప్రస్తుతం ఎక్కడున్నారని ఆయన్ను అడిగాను. ఆయన ప్రస్తుతం రాజమండ్రి రామకృష్ణ మఠం అధ్యక్షులని ఆయన చెప్పారు. వినిశ్చలానందస్వామి గుంటూరు వారే, ఆయన పూర్వనామధేయం శాస్త్రిగారు. ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పటినుంచి నాకు తెలుసనీ, మేమిద్దరం మంచి స్నేహితుమనీ ఆయనతో చెప్పాను.

స్వామి యదునాధానంద గారు ఎక్కడున్నారని అడిగాను. ఆయన ప్రస్తుతం తమిళ్ నాడులో ఉన్నారని ఆయనన్నారు. యదునాధానందగారి పూర్వనామధేయం త్యాగరాజన్ అనీ, గుంతకల్ లో ఉండేటప్పుడు ఆయన నా దగ్గర కొన్నాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారనీ, ఆరకంగా ఆయన నా శిష్యుడే అనీ, శ్రీరామకృష్ణులు శారదామాతల ఫోటోలను ఆయన చూచింది మా ఇంట్లోనేననీ నవ్వుతూ బ్రహ్మచారి గారితో చెప్పాను.

ఆ తర్వాత పరమపూజ్య నందానంద స్వామివారి ప్రస్తావన వచ్చింది. ఆంధ్రాలో మారుమూల గ్రామాలలో సైతం శ్రీరామకృష్ణుల పేరు వినిపిస్తోందంటే దానికి కారణం నందానంద స్వామివారేననీ, జీవితమంతా శ్రీరామకృష్ణుల సేవలో గడపిన మహనీయుడు ఆయననీ, ఆయనకు నేనంటే ఎంతో వాత్సల్యమనీ, తన సొంత మనుమడిలా నన్ను చూచేవారనీ వారికి చెప్పాను.

వారికి నా పుస్తకాన్ని ఇచ్చాను. కర్లపాలెం రమ్మని రామకృష్ణ సమితిని సందర్శించమనీ వారు నన్ను ఆహ్వానించారు. వీలుచూచుకుని వస్తానని వారికి చెప్పాను.

మళ్ళీ సాయంత్రం అక్కయ్య దగ్గర కాసేపు కూచుని ఆమె ఇచ్చిన కాఫీ త్రాగి, ఆ మాటా ఈ మాటా మాట్లాడి, మేడమీద అమ్మ గదికి వెళ్లి, అక్కడ కాసేపు కూచుని, అమ్మ వాడిన వస్తువులూ ఆ గదులూ అన్నీ చూచి, మళ్ళీ అక్కయ్య దగ్గరకు వచ్చాం. మాకందరికీ బట్టలు పెట్టి ఆశీర్వదించింది అక్కయ్య.

ఆప్పటికి సాయంత్రం ఆరు అయింది. మెల్లిగా లేచి అప్పారావన్నయ్య ఇంటికి బయల్దేరాం.