“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, జూన్ 2018, బుధవారం

మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాం !

మనుషులలో స్వార్ధం పెరిగిపోతోంది - అనే మాటను చాలా ఏళ్ళ నుంచీ వింటున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ మాటను నా చిన్నప్పటినుంచీ వింటున్నా. కానీ గత పదేళ్ళలో గమనిస్తుంటే, ఇది చాలా వాస్తవం అని అర్ధమౌతోంది. ప్రస్తుతం మాత్రం మనుషుల్లో స్వార్ధం అనేది తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. ఎవర్ని చూచినా స్వార్ధం, అహం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అయితే ఈ రెంటికీ షుగర్ కోటింగ్ గా అనేక నాటకాలు మనుషులలో కనిపిస్తున్నాయి. అవసరం ఉంటే ఎంతో ఆప్యాయంగా నటిస్తున్నారు. అవసరం తీరాక 'నువ్వెవరు?' అన్నట్లు మాట్లాడుతున్నారు. అందుకే మనుషుల్ని చూస్తుంటే నాకీమధ్య చాలా అసహ్యంగా ఉంటోంది.

ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం నా జీవితంలో నడుస్తున్న ఒకే ఒక ఘట్టం - 'స్వచ్చమైన మనుషులకోసం వెదుకులాట'. అంతే !

నా చిన్నప్పుడు మనుషులు ఇంత దారుణంగా ఉండేవారు కారు. అప్పట్లో కూడా మనుషులలో స్వార్ధం ఉన్నప్పటికీ కొంచమైనా మంచితనం, జాలీ, కరుణా, దయా, నెమ్మదితనం, ముక్కుసూటితనం లాంటివి చాలామందిలో ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ ఎక్కడా కనిపించడం లేదు. చాలామంది మనుషులు చాలా అసహ్యకరంగా, పచ్చిస్వార్ధపరులుగా, తెలివిగా మాట్లాడే గుంటనక్కలుగా తయారౌతున్నారు. ఇది వాస్తవం. దీనిని నిరూపించే సంఘటన ఒకటి ఈ మధ్యనే జరిగింది.

మొన్నీ మధ్యన ఒక ఫోనొచ్చింది.

'గురువుగారూ బాగున్నారా !' అంది ఒక మగగొంతు.

ఇంతకు ముందు మనుషుల్ని చూసి వాళ్ళతో మాట్లాడితే నాకు వాళ్ళ మనస్తత్వాలు అర్ధమౌతూ ఉండేవి. ఈమధ్య కాలంలో వాళ్ళ గొంతు వింటే చాలు, అర్ధమైపోతున్నాయి. ఆ స్వరమూ, దాన్ని పలికే తీరూ, వాళ్ళు సహజంగా మాట్లాడుతున్నారా, లేక కృతకంగా తెచ్చి పెట్టుకుని నటిస్తున్నారా, వాళ్ళ మనసులో అసలేముంది వగైరాలన్నీ అర్ధమౌతున్నాయి.

'ఎవరబ్బా ఈయన నన్ను ఇంత చనువుగా 'గురువుగారు' అంటున్నాడు?' - అనుకుంటూ 'ఎవరండి?' అన్నాను.

'నేను మీకు పరిచయం లేను. హైదరాబాద్ లో ఉంటాం. కానీ మిమ్మల్ని మా కుటుంబం అంతా గురువుగా భావిస్తూ ఉంటాం' అన్నాడు.

ఇలాంటి బిస్కెట్స్ చాలా చూచాను ఈ పదేళ్ళలో. ఈ బిస్కెట్లు తినీ తినీ విసుగెత్తింది.

'అవునా? ఎందుకలా?' అనడిగాను.

'మీరు మాకు చాలా చేశారు గతంలో' అన్నాడాయన.

ఈ పదేళ్ళలో ఎన్నో వందలమందికి ఎన్నో రెమేడీలు చెప్పాను గాని అవేమిటో వారంతా ఎవరో నాకేమీ గుర్తు లేవు.

'అలాగా?' అన్నాను నిరాసక్తంగా.

'అవును. మా అబ్బాయికి జాబ్ రాకపోతుంటే మీరు వాడి జాతకం చూచి రెమెడీ చెప్పారు. దానిని చేసిన రెండు నెలల్లో జాబొచ్చింది. తర్వాత మేరేజ్ మాచెస్ కుదరకపోతుంటే మళ్ళీ రెమెడీ చెప్పారు. మంచి సంబంధం కుదిరింది. చార్ట్ మేచింగ్ కూడా మీరే చేశారు.' అన్నాడాయన.

'ఓకే. సరే' అన్నాను.

'ఇది జరిగి దాదాపు ఏడేళ్ళు అయింది. మీకు గుర్తుందో లేదో?' అన్నాడు.

'లేదండి. నాకు గుర్తు లేదు. వందల జాతకాలలో అలా గుర్తు పెట్టుకోవడం సాధ్యం కాదు.' అన్నాను.

'మళ్ళీ ఇప్పుడు మీతో పని పడింది.' అన్నాడు.

అంతేకదా ! పని పడితే గాని మనం ఎవరికీ గుర్తురాము కదా మరి ! - అనుకుని 'ఏంటో చెప్పండి?' అన్నాను.

'మా వాడికి ఇద్దరు పిల్లలిప్పుడు. కానీ అబ్బాయికీ కోడలికీ పడటం లేదు. చాలా గొడవలౌతూ ఉన్నాయి. కలిసి ఉండేలా లేరు. విడాకులకు వెళుతున్నారు. దీన్ని మీరు ఆపాలి. మీ మీద మాకు చాలా గురుభావం' అన్నాడు మళ్ళీ.

మాటమాటకీ 'గురుభావం' అంటుంటే అసహ్యం అనిపించింది. ఆ పదానికి అర్ధం కూడా తెలీకుండా అలా తేలికగా ఎలా వాడేస్తూ ఉంటారో జనం ?

'ఎవరైనా ఫేమిలీ కౌన్సెలింగ్ వాళ్లకు చూపించండి. లేదా హోమాలు చేతబడులు చేసే స్వామీజీలుంటారు. వాళ్ళను కలవండి మీకు వదిలించుకునే యోగం ఉంటే ' అన్నాను.

'మీరేం అనుకోనంటే ఒక మాట. అవన్నీ అయ్యాయి సార్. మీ గుంటూరాయనే ఒక స్వామీజీ ఏదో ఉగ్రదేవతా హోమం చేసి విభూది ఇచ్చాడు. అదికూడా పని చెయ్యలేదు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాం' అన్నాడు అదేదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు.

'ఓహో అన్నీ అయ్యాక చివర్లో నేను గుర్తొచ్చానా?' అని మనసులో అనుకుని ' మీకు నేనంటే అంత గురుభావం ఉందా?' అన్నాను.

'అయ్యో. చాలా ఉండండి. రోజూ మిమ్మల్ని అనుకుంటూ ఉంటాం నేనూ మా ఆవిడా. ఏడేళ్ళ క్రితం మాకెంత సాయం చేశారో ఎలా మర్చిపోగలం?' అన్నాడాయన టీవీ సీరియల్ డైలాగులు వాడుతూ.

'అవునా? నాకు యాక్సిడెంట్ అయిన సంగతి మీకు తెలుసా?' అడిగాను.

'తెలుసండి. మీ బ్లాగులోనే చదివాను.' అన్నాడాయన.

'మరి తెలిస్తే, మీకంత గురుభావం ఉంటే నన్నెందుకు చూడటానికి రాలేదు? కనీసం ఈ మూడు నెలల్లో ఫోన్ ఎందుకు చెయ్యలేదు?' అడిగాను డైరెక్ట్ గా.

అవతలివైపు నుంచి నిశ్శబ్దం.

కాసేపయ్యాక ' అదీ... అదీ... ఎండలు కదండీ తిరగలేకపోతున్నాం. అదీగాక పెద్దవాళ్ళం అయ్యాం కదా' అన్నాడు.

ఈ నాటకాలంటేనే నాకు చిర్రెత్తుకొచ్చేది. ఫోన్ చెయ్యడానికీ ఎండలకూ పెద్దవయసుకూ సంబంధం ఏమిటో నాకైతే అర్ధం కాలేదు.

'సరే నీ పని ఇలా ఉందా?' అనుకుని ఇలా అడిగాను.

'మీ నక్షత్రం ఏంటో చెప్పండి'

ఆయనకు సంతోషం వేసింది. సబ్జెక్ట్ లోకి వస్తున్నా అని.

'కృత్తిక ఒకటో పాదం' అన్నాడు ఉత్సాహంగా.

'నాలుగు గంటల దూరంలో ఉన్న గుంటూరుకు రావడానికి మీకు కుదరలేదు. కానీ యాత్రలు చెయ్యడానికి కుదిరిందా?' అడిగాను సున్నితంగా.

మళ్ళీ అటువైపు నుంచి నిశ్శబ్దం.

'అంటే... మా గ్రూప్ అంతా బలవంతపెడుతుంటే మొన్న 'మే' లో నార్త్ ఇండియా, హిమాలయయాత్ర అంతా చేసొచ్చాం. కొన్నికొన్ని తప్పవు కదా. అయినా అద్భుతం సార్! ఒక్క నక్షత్రంతోనే మేము యాత్రలు చేసిన విషయం ఎలా చెప్పగలిగారు మీరు? మీకింత నాలెడ్జ్ ఉంది గనుకనే మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం' అన్నాడాయన మళ్ళీ తెలివిగా ఇంకో రెండు బిస్కెట్లు వేస్తూ.

నవ్వొచ్చింది.

మేషరాశి నుంచి ద్విస్వభావ రాశి అయి దూరదేశాలను సూచించే ధనుస్సులో నవమస్థానంలో కర్మకారకుడైన శనీశ్వరుడు వక్రించి ఉన్న విషయమూ, నవమాధిపతి గురువు దూరదేశాలను సూచించే సప్తమంలో చరరాశిలో ఉన్న విషయమూ తెలిస్తే ఈయన దూరప్రాంతాలకు యాత్రలు చేశాడన్న విషయం జ్యోతిష్యంలో ఓనమాలు నేర్చుకునే వాళ్లకు కూడా అర్ధమౌతుంది. దీనికేదో పెద్ద నాలెడ్జి అవసరం లేదు. ఈ విషయం ఈయనకు వివరించి చెప్పడం ఎందుకనిపించి ఇలా అన్నాను.

'ఒకపని చెయ్యండి. మీ అబ్బాయికి విడాకులు త్వరగా ఇప్పించెయ్యండి. మీకూ వాళ్ళకూ కూడా పీడా వదుల్తుంది.'

ఆయన బిత్తరపోయాడు.

'అదేంటి సార్ ! వాళ్లకు ఇద్దరు పిల్లలున్నారు'

'వాళ్ళను మీరు పెంచుకోండి. చిన్నప్పుడు మీ అబ్బాయిని కాన్వెంట్ చదువులతో సరిగ్గా చూసుకోలేక పోయుంటారు. ఇప్పుడు వీళ్ళను మంచిగా పెంచుకోండి. ఆ భ్రమ తీరుతుంది.' అన్నాను.

ఆయనకు కోపం వచ్చింది.

'ఏంటి సార్ ! మేం అడిగేదేంటి? మీరు చెప్పేదేంటి? ఇష్టమైతే చెప్పండి. లేదంటే ఊరుకోండి. అంతేగాని ఇలాంటి సలహాలు ఇస్తారని కాదు మీకు ఫోన్ చేసింది' అన్నాడు కోపంగా.

ఆయన గురుభక్తి అంతా ఒక్క నిముషంలో ఏమై పోయిందో నాకర్ధం కాలేదు.

'సలహాలు ఇవ్వడం నాకిష్టమే. కానీ మీకు నచ్చిన సలహాలు నేనివ్వలేను. అసలు మీ అబ్బాయికీ మీ కోడలికీ కలిసి ఉండాలని లేదు. వాళ్ళు విడిపోవాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు విడిపోవడం మీకిష్టం లేదు. వాళ్ళ మనసులు కలిసినా కలవకపోయినా మీ పరువుకోసం వాళ్ళు జీవితాంతం శత్రువులలగా ఒకే కప్పుక్రింద ఇష్టంలేని సంసారం చెయ్యాలి. మీకోసం ! అంతేనా మీ ఉద్దేశ్యం?' అన్నాను.

జవాబు లేదు.

'అదలా ఉంచండి.సమ్మర్లో నార్త్ ఇండియా అంతా తిరిగి రావడానికి మీకు టైం ఉందిగాని, గుంటూరు వచ్చి మీ సోకాల్డ్ 'గురువు'ను పలకరించడానికి మీకు తీరిక లేదు. కనీసం ఫోన్ చెయ్యడానికి మీకు మనసు రాలేదు. ఇప్పుడు మీకు అవసరం వచ్చింది గనుక, మీ సమస్య ఎక్కడా తీరడంలేదు గనుక నేను గుర్తొచ్చాను. అందుకని ఇప్పుడు నన్ను అప్రోచ్ అవుతున్నారు. గతంలో మీ దగ్గర ఏమీ ఆశించకుండా మీకు పెద్ద పెద్ద సమస్యలు తీర్చానని మీరే చెబుతున్నారు. తీరని సమస్య మీ నెత్తిన కూచుంటే ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చానన్నమాట. 'మీరంటే మాకు గురుభావం' ఇలాంటి సోది మాటలు మీరు చెప్పకుండా డైరెక్ట్ గా మీ సమస్యను అడిగి ఉంటే, అప్పుడు చేసేవాడినేమో చెప్పలేను. ఇప్పుడు మాత్రం నేను మీకేమీ సాయం చెయ్యను. మీలాంటి స్వార్ధపరులతో ఇంతసేపు మాట్లాడటమే నాకు టైం వేస్ట్. సారీ !' అన్నాను.

'మీకు కోపం ఎక్కువని అందరూ అనేమాట నిజమే అన్నమాట !' అన్నాడు ఎగతాళిగా.

మళ్ళీ నవ్వొచ్చింది.

"అందితే జుట్టు అందకపోతే కాళ్ళు' అంటే ఇదేగా" - అనుకున్నా మనసులో.   

'అవును. నాకు కోపం ఒక్కటే కాదు. అన్నీ ఎక్కువే. నేను పూర్వజన్మలో దూర్వాసమహర్షిని. ఈ జన్మలో ఇలా పుట్టాను. ఇంకెప్పుడూ నాకు ఫోన్ చెయ్యకండి. ఈసారి నా నోట్లోంచి ఏం మాటలొస్తాయో నాకే తెలీదు. మరొక్క విషయం! మీరు ఎన్ని రెమెడీలు చేసినా మీ అబ్బాయి విడాకులను ఆపలేరు. వాళ్ళు విడిపోయిన తర్వాత మీరేం చెయ్యాలో ఆలోచించుకుని దానికి ప్రిపేర్ అవ్వండి.' అని ఫోన్ కట్ చేశాను.

అదెలా తెలిసిందా? అని డౌటొస్తోంది కదూ? ఆ అబ్బాయి వాళ్ళ నాన్న నక్షత్రం 'కృత్తిక' అన్నీ చెప్పింది. ఎలా చెప్పిందో ఊహించండి చూద్దాం !