“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, మే 2017, శుక్రవారం

రెండవ అమెరికా యాత్ర - 25 (గాంగెస్ రిట్రీట్ - మాతాజీతో సంభాషణ)

దాదాపు ఒంటిగంట ప్రాంతంలో మేమంతా వెనక్కు బయలుదేరి కాసేపట్లో ఫెన్ విల్లి లోని రిట్రీట్ హోమ్ కు చేరుకున్నాం.లంచ్ కానిచ్చి ఒక గంట సేపు మాట్లాడుకుంటూ హాల్లోనే కూచున్నాం.

ఈలోపు బాబా దగ్గరనుంచి మెసేజ్ వచ్చింది. సాయంత్రం వచ్చేటప్పుడు ఇద్దరు మాత్రమే రావాలని, మాతాజీ అంతకంటే ఎక్కువమందిని చూడటానికి ఇష్టపడటం లేదనీ దాని సారాంశం. దానికి ఈ విధంగా రిప్లై ఇవ్వమని ఆనంద్ తో చెప్పాను.

'మేము ఆరుగురం వద్దామని అనుకుంటున్నాం. మీరు సరేనంటే వస్తాం.'

ఈ మెసేజికి చాలాసేపు రిప్లై రాలేదు. నాలుగు లోపు రిప్లై వస్తే సరేసరి, లేకుంటే ఇక గాంగెస్ ఆశ్రమానికి వెళ్ళనవసరం లేదని,వీళ్ళ ప్రవర్తనలు ఇలా ఉంటె మనం అసలిక్కడకు రావలసిన అవసరమే లేదని నేనన్నాను.

సరిగ్గా 3.55 కి 'మేం మీకోసం వేచి ఉన్నాం' అంటూ బాబా నుంచి ఫోనొచ్చింది. వెంటనే నేను, ఆనంద్, మణిబాబు, సుమతి, రజిత ఒక కారులో ఆశ్రమానికి బయల్దేరాము.

ఆశ్రమంలో అడుగు పెట్టేసరికి మాకోసం ఎదురుచూస్తున్న బాబా కనిపించారు.మాతాజీనేమో దేవాలయంలో అగరుబత్తి వెలిగిస్తున్నారు.నేను మామూలుగానే ఆమెకు ఎదురు వెళ్లి పాదాలకు నమస్కారం చెయ్యబోయాను. ఆమె సున్నితంగా తిరస్కరించారు. నేనూ ఇక ముందుకు వెళ్ళలేదు.

దేవాలయంలోనే ఒక పక్కగా అందరం కూచున్నాము. ఆమె పక్కనే ఒక అరుగుమీద కూచోమని ఆమె గట్టిగా బ్రతిమాలినా నేను వినకుండా నేలమీదే కూచున్నాను. నాతోబాటు మిగతా అందరూ నేలమీదే కూచున్నారు.ఇది మా పద్ధతనీ ఇలా కూచుంటేనే మాకు సుఖంగా ఉంటుందనీ నేను ఆమెకు చెప్పాను.

ఆమె మళ్ళీ చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చారు.దాని సారాంశం ఒక్కటే.

"మేము యూనివర్సల్. ఇక్కడున్న శారదామాత యూనివర్సల్ మదర్. ఇండియాలోని శారదామాత అలా కాదు. ఆమె హిందూమతం వరకే పరిమితం. ఇక్కడ మేము అందరు మతాల వాళ్ళనూ రానిస్తాం . అన్ని రకాల గ్రూపులూ ఇక్కడకొచ్చి రిట్రీట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది Universal Consciousness. ఇక్కడ మదర్ ను మేము యూనివర్సల్ గానే ఉంచాలని అనుకుంటున్నాం."

ఈ సోదంతా చెప్పి చివరగా ఆమె ఇలా అడిగారు.

'మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? అమెరికాలో ఎన్నాళ్ళు ఉండబోతున్నారు?"

"ప్రస్తుతం ఇంకా రెండు నెలలు ఉంటాను. ఆ తర్వాత అతి త్వరలో జాబ్ రిజైన్ చేసేసి ఇండియాలో ఆర్నేల్లూ ఇక్కడ ఆర్నేల్లూ ఉంటాను. పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఊర్లు తిరుగుతూ నా మార్గాన్ని అందరికీ బోధించబోతున్నాను. అదీ నా ప్లాన్."

ఆమె ముఖం సంతోషంతో వెలిగింది.

'అలా అయితే ఇక్కడ రెలిక్స్ నూ, బిందువునూ మీరిక్కడే ఉండి చూచుకోవాలి. మీరు అందుకు సిద్ధమేనా?'

ఇక ఈ ముసుగులో గుద్దులాటకు స్వస్తి చెప్పాలని నాకనిపించింది.

'చూసుకోవడం అంటే అసలు మీ ఉద్దేశ్యం ఏమిటో నేను స్పష్టంగా తెలుసుకోవచ్చా? అసలు నేనేం చెయ్యాలి ఇక్కడుండి?' అడిగాను.

నా సూటి ప్రశ్నకు ఆమె స్టన్ అయింది.

' అది ఎలా చేస్తారో మీరు చెప్పాలి' అందామె డొంక తిరుగుడుగా.

అలా అంటూ ఆమె బాబా వైపు తిరిగి - 'మన ప్రేయర్స్ పుస్తకాన్ని తెచ్చి వీరికి చూపించు' అని చెప్పింది.

ఆయన ఒక ప్రింటెడ్ మెటీరియల్ తెచ్చి నాకు ఇచ్చాడు.

దానిని పైపైన తిప్పి చూచిన నాకు అదేమిటో చిటికెలో అర్ధమైపోయింది. అందులో సాంప్రదాయ పూజావిధాన మంత్రాలూ, శ్రీ రామకృష్ణ శారదా స్తోత్రాలూ, ఇంకా ఇతర మతాల ప్రేయర్సూ అన్నీ కలిసి కలగూర గంపలా ఉందది.

'దీనిని కలకత్తా ఆశ్రమం వారు మాకు పంపించారు. కానీ వీటిలో మాకు ట్రెయినింగ్ లేదు. అందుకని మేము వీటిని చెయ్యలేక పోతున్నాము' అన్నదామె.

'నా విధానం ఇదికాదు మాతాజీ. నేను రిచువల్స్ చెయ్యలేను. వాటికి నేను వ్యతిరేకం కాదుగాని ఇవన్నీ నేను చిన్నప్పుడే చేశాను. అవన్నీ నాకు బాగా తెలిసినవే. కానీ ప్రస్తుతం నా మార్గం అది కాదు. మీకు స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడి రెలిక్స్ ను మనం చూచుకోనక్కర్లేదు. నిజానికి అవే మనల్ని చూచుకోవాలి. Universal Consciousness ను మనమెలా చూచుకోగలం? అదే మనల్ని చూచుకోవాలి.' అని నేనన్నాను.

'నోనో. అది కరెక్ట్ కాదు. మనమూ దానిని చూచుకోవాలి. ఒక ఇంట్లో తల్లి ఉంటుంది. ఆమె అందరికీ చేసి పెడుతూ ఉంటుంది. కాని ఆమెను కూడా మనం చూచుకోవాలి కదా?' అందామె లాజికల్ గా మాట్లాడుతూ.

అంత పెద్దామె అలా మాట్లాడుతుంటే నాకు జాలేసింది.

'అమ్మ మామూలు మనిషి. కనుక ఆమెను కుటుంబ సభ్యులు చూసుకోవాలి. కానీ ఈమె యూనివర్సల్ మదర్. ఈమెను చూచుకోవడానికి మన శక్తి చాలదు.మనం ఆ పనిని చెయ్యలేము కూడా. కనుక మీ పోలిక అసంబద్ధం.' అందామని నోటిదాకా వచ్చింది. పాపం పెద్దామె నొచ్చుకుంటుందేమో అనిపించి ఆ మాటలు గొంతులోనే మింగేశాను.

ఈలోపల అదే ఆశ్రమంలో ఉండే ఇంకొక సన్యాసిని "శక్తి మా" వచ్చి మాతో కూచుంది. ఆమెకు మాకు పరిచయం చేసింది మాతాజీ. మేము లేవకుండానే చేతులు జోడించి ఆమెకు ప్రణామం చేశాము.

కాసేపు నావైపు చూస్తూ ఉండిపోయిన మాతాజీ  సడన్ గా 'మీ సాధనా విధానం ఏమిటి?' అంటూ అడిగింది.

'నాది ధ్యాన మార్గం. I just meditate. ' అన్నాను.

'మీరు ధ్యానం ఎలా చేస్తారు?' అడిగిందామె.

ఒక్క గురువు తప్ప ఈ ప్రశ్నను ఎవరూ ఇతరులను అడక్కూడదు. మనం కూడా మన గురువుకు తప్ప మన సాధన ఏమిటనేది ఎవరికీ చెప్పకూడదు.ఇది సాంప్రదాయ నియమం. అడక్కూడని ప్రశ్నను ఈమె ఎలా అడుగుతున్నదో నాకర్ధం కాలేదు.

అందుకని చెప్పీ చెప్పనట్లుగా 'I just focus my mind' అని జవాబు చెప్పాను.

'Where is the mind?' అని ఆమె అడిగింది.

నాకు నవ్వొచ్చింది.

'You are right. There is no mind. I know the no-mind state. I just told you in an indirect way. To tell you the truth, I just go above my mind and merge in God' అని మళ్ళీ చెప్పాను.

'Is it all?' అని ఆమె అడిగింది.

'కాదు. ఆ విషయం నాకు తెలుసు.అది పరిపూర్ణ స్థితి కాదు.' అని నేనన్నాను.

'వివేకానంద స్వామి లాగా మీరు కూడా పూర్తిగా సమాధిస్థితి లోనే ఉండిపోవాలని ఆశిస్తున్నారా? ప్రపంచంలో మీకు బాధ్యత ఉందని భావించడం లేదా?' అడిగిందామె.

'లేదు నేనలా అనుకోవడం లేదు. నా బాధ్యత నాకు తెలుసు. ఎల్లప్పుడూ సమాధిలో ఉండాలన్నది నా గమ్యం కాదు. అందుకనే లోకుల అజ్ఞానాన్ని నా బోధల ద్వారా పోగొట్టాలని ప్రయత్నిస్తున్నాను. నేను నడుస్తున్న మార్గంలోకి ఎంతోమందిని నడిపిస్తున్నాను. అలా చెయ్యడం ద్వారా లోకంపట్ల నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను' అని నేనన్నాను.

'అవును. లోకాన్ని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదు.' అంటూ ఆమె తన స్పీచ్ మొదలు పెట్టింది.

'నేను మొదటసారిగా బేలూర్ మఠ్ నుంచి సన్యాసాన్ని స్వీకరించాను. వాళ్ళు నాకు ' యోగమాయ' అని పేరు పెట్టారు. యోగమాయ అంటే ప్రపంచంలో ఉంటూ దానిని నడిపిస్తున్న జగన్మాతని అర్ధం. కానీ ఇక్కడకొచ్చాక వాళ్ళిచ్చిన కాషాయవస్త్రాలను డస్ట్ బిన్ లో పడేశాను.' అందామె.

నాకు ఆశ్చర్యమూ బాధా ఒకేసారి కలిగాయి. ఈమె దృష్టిలో వాటి విలువ అదా? అలా అయితే అసలీమె వారి దగ్గర సన్యాస దీక్ష ఎందుకు తీసుకున్నట్లు?

నేనేమీ మాట్లాడలేదు. మౌనంగా వింటున్నాను.నాతోబాటు మిగిలిన అందరూ కూడా వింటున్నారు. ఆమె కొనసాగించింది.

'మళ్ళీ శారదేశ్వరీ ఆశ్రమం నుంచి సన్యాసదీక్ష స్వీకరించాను. వాళ్ళు ఇలా చెప్పారు. "యోగమాయను నిర్లక్ష్యం చెయ్యడం వల్లనే మనం ఈ దుస్థితికి చేరుకున్నాం. ఈ సమాజంలో స్త్రీ రూపంలో యోగమాయ ఉన్నది. స్త్రీని నిర్లక్ష్యం చెయ్యడం వల్లనే భారతసమాజం పతనం అయిందని వివేకానంద స్వామి చాలా సార్లు అనేవారు.కనుక మనం స్త్రీల పరిస్థితిని బాగు చెయ్యాలి." ఈ మాటలు నాకు బాగా నచ్చాయి. అందుకనే అమెరికా వచ్చాక 'Child prostitution, Missing girls' మొదలైన ఇష్యూస్ మీద పోరాడుతున్నాను. కనుక మనం సంఘాన్ని నిర్లక్ష్యం చెయ్యరాదు.'

'ఈ విషయంలో మీ మాటే నా మాట' అన్నాను నేను.

'కానీ సన్యాసమార్గం స్వార్ధంతో కూడినది. ప్రపంచం ఏమై పోయినా సరే నా సుఖం నాది నా మోక్షం నాది అనుకోవడమే సన్యాసమార్గం. సన్యాసి ప్రపంచాన్ని దానిఖర్మకు వదిలేస్తాడు. తన సుఖం చూసుకుంటాడు. అది మంచి మార్గం కాదు. నిజం చెప్పాలంటే నలభై ఏళ్ళ సన్యాస జీవితం తర్వాత - ' ఈ సన్యాసం ఎందుకు తీసుకున్నానా?' అని నేను ఇప్పుడు బాధపడుతున్నాను' అన్నదామె.

'Late realization' అందామని నోట్లోకి వచ్చిన మాటను సభ్యత కోసం మళ్ళీ మింగేశాను.

ఆమెను చూస్తె జాలి ఇంకా పెరిగిపోయింది.

'చూడండి మాతాజీ. నాకు సన్యాసం మీద నమ్మకం లేదు. 19 ఏళ్ళ వయస్సులో సన్యాసినయ్యే అవకాశం నాకొచ్చింది. కానీ నేను ఆ మార్గాన్ని వదులుకున్నాను. దానికి కారణం ఒక్కటే. ఒక పారసైట్ లాగా ఇతరుల మీద ఆధారపడి బ్రతికే బ్రతుకు నాకక్కర్లేదు. సమాజంలో ప్రతి సన్యాసీ చేస్తున్న పని అదే. చిన్నదో పెద్దదో నా ఉద్యోగం నేను చేసుకుంటూ నా సంపాదన నేను తింటూ, ఉన్నంతలో ఇతరులకు సాయం చెయ్యాలన్నదే నా ఊహ. అందుకే నేను సన్యాసం వైపు పోలేదు. రామకృష్ణ మఠంలో చేరమని 1982 లోనే పరమపూజ్య నందానందస్వామి నన్ను అడిగారు. ఆయన దగ్గరే బ్రహ్మచారిగా ఉండమని ఆయనే నన్ను కోరారు. కానీ ఈ ఒక్క పాయింట్ మీద నేను దానిని తిరస్కరించాను. కానీ నా సాధన ఆపలేదు. దారిలో నడిచాను. గమ్యాలు చేరాను. ఇప్పుడు నాకు ఏ విధమైన రిగ్రెట్స్ లేవు. నేను అనుభవంలో తెలుసుకున్న వాటిని నా శిష్యులకు ఇప్పుడు నేర్పిస్తున్నాను. సాధనా మార్గంలో వారిని నడిపిస్తున్నాను.

In my view, renunciation of ego is the only renunciation. I dont consider renouncing family life and wearing orange cloths as true renunciation' అన్నాను.

ఆమె బిత్తరపోయింది.

'You mean renunciation of lower ego?' అడిగిందామె.

'అవును. లోయర్ ఈగో అన్నా లోయర్ మైండ్ అన్నా ఒకటే. దానినే మనం త్యాగం చెయ్యాలి. అదే అసలైన త్యాగం. అంతేగాని ఫామిలీని వదిలేసి ఎక్కడో తిరగడం కాదు.' అని మళ్ళీ నేనన్నాను.

'ఇదంతా మీకు ఎలా అర్ధమైంది? ఇంత పరిపక్వత మీకు ఎలా వచ్చింది? దీనిని మీకు ఎవరు బోధించారు?' అడిగిందామె.

'ఎవరూ బోధించలేదు. It is a matter of involution and evolution. నా సాధనా మార్గంలో ఇదంతా కాలక్రమేణా నాకే అర్ధం అయింది.' అన్నాను నేను.

కాసేపు ఆమె ఏమీ మాట్లాడకుండా నా ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది.

'శక్తిమా ! చూచావా? ఇలాంటి మనిషిని మనం ఇప్పటిదాకా చూడలేదు. మనం ఎంతమంది సన్యాసులను స్వామీజీలనూ చూచామో నువ్వే చెప్పు?' అడిగిందామె.

' కొన్ని వందల మందిని చూచి ఉంటాం' చెప్పింది శక్తి మా.

'కానీ గురూజీకీ వాళ్ళకూ పోలికే లేదు. గురూజీ వాళ్ళను మించి ఉన్నాడు." అంటూ ఆమె ఇలా అన్నది.

'గురూజీ ! టోటల్ సన్యాసమూ మంచిది కాదు. పూర్తిగా సంసారపు ఊబిలో దిగిపోవడమూ మంచిది కాదు. సంసారంలో ఉంటూ సన్యాసిగా ఉండటమనేది బెస్ట్ పాత్. ఇది మధ్యేమార్గం. అత్యుత్తమమైన మార్గం ఇదే. అయితే ఈ విషయం నాకు చాలా లేట్ గా అర్ధమైంది. అందుకు నేను బాధ పడుతున్నాను'

'అవును మాతాజీ ! నా మార్గం సరిగ్గా అదే. నేను అదే దారిలో నడుస్తున్నాను. దానినే నా శిష్యులకు బోధిస్తున్నాను. అంతెందుకు? బుద్ధుడు బోధించిన మధ్యేమార్గం కూడా ఇదేనని నా పరమ విశ్వాసం. యోగమాయను ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా సేవించాలి. మీ దారిలో మీరు చేస్తున్నారు. నా దారిలో నేను చేస్తున్నాను. మన దారులు వేరు కావచ్చు. కానీ మనం చేస్తున్నది ఒకటే. ఆమెను నిర్లక్ష్యం చెయ్యడం ఎవరికీ మంచిది కాదు' అని నేనన్నాను.

మళ్ళీ నావైపు తదేకంగా చూచిన ఆమె బాధగా ఇలా అన్నది.

'గురూజీ ! నాకు 30 ఏళ్ళ వయస్సులో మీరు పరిచయం అయ్యి ఉంటే నా జీవితం మరోలా ఉండేదని ఇప్పుడు నాకనిపిస్తున్నది.'

అది నిజమే గనుక నేనేమీ జవాబివ్వలేదు.

'భవిష్యత్తులో నీవు స్వామీజీలకు కూడా బోధించే స్థితికి చేరుకుంటావు' అని 30 ఏళ్ళ క్రితం పరమపూజ్య స్వామి నందానందగారు ఆదోనిలో నాతో అన్నమాట నాకు హటాత్తుగా గుర్తొచ్చింది.

ఇంతలో మాతాజీ ఇలా అన్నారు.

'గురూజీ! నాదొక రిక్వెస్ట్. నా గురువు భాష్యానంద గారు. కానీ మిమ్మల్ని నేను ఉపగురువుగా స్వీకరించాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకోవాలి'

నలభై ఏళ్ళ నుంచీ సన్యాస జీవితం గడుపుతున్న ఆమె అలా అంటుంటే ఏమనాలో నాకు తోచలేదు.

'లేదు మాతాజీ. మీ రిక్వెస్ట్ ను నేను అంగీకరించలేను. నలభై ఏళ్ళుగా అమెరికాలో వేదాంత ప్రచారం చేసి ఇక్కడే కన్నుమూసిన స్వామి భాష్యానందగారు మీ గురువు. మీకు ఇంకేం కావాలి? నేను మీకు ఉపగురువును కాలేను' అని ఖండితంగా ఆమెకు చెప్పేశాను.

'పోనీ నాకు ఏవైనా మూడు మంచి విషయాలు చెప్పండి' అన్నదామె.

'లేదు మాతాజీ. మీకు నేను చెప్పేదేముంది?' అన్నాను.

'కాదు మీరు చెప్పాల్సిందే' అని పట్టు బట్టిందామె.

ప్రతిదీ అలా తిరస్కరించడం ఎందుకనిపించి ఒక్క క్షణం ఆలోచించాను.

'మీకు విషయం అంతా అర్ధమైంది మాతాజీ. ఇకమీద మీకు ఎవరూ ఏమీ చెప్పనక్కరలేదు.' అన్నాను.

'సరే. ఇంకో రెండు విషయాలు చెప్పండి.' అందామె.

'హృదయస్థాయిలో సరిగ్గా ట్యూన్ అవగలిగితే మాటలు అక్కర్లేదు.' అన్నాను.

'మూడో మాట చెప్పండి' అందామె.

'మీకు గురువులు అవసరం లేదు. మీరే ఒక గురువు స్థాయిలో ఉన్నారు. ఇక్కడ రిచువల్స్ కూడా అవసరం లేదు. మంత్రాలు చాలా తక్కువ స్థాయికి చెందిన సాధనలు.ఈ ఆశ్రమంలో అవి అవసరం లేదు.' అన్నాను.

ఆమె తృప్తిగా తల పంకించింది.

'మరి ఇప్పుడు మీరేం చెయ్యాలనుకుంటున్నారు?' ఆమె సూటిగా అడిగింది.

'చెప్పాను కదా మాతాజీ ! నాది రిచువలిస్టిక్ మార్గం కాదు. ఏం చెయ్యాలో నాకు ఆదేశం వచ్చేదాకా వేచి చూస్తాను. విశ్వచైతన్యం అని మీరంటున్న universal mind నుంచి ఆదేశం వస్తే దానిని ఆచరిస్తాను. అంతవరకూ వేచి చూడటం తప్ప ఇంకేమీ చెయ్యలేను. ' అని ఆమెతో అన్నాను.

'దానికి ఎంత సమయం పట్టవచ్చు?' అడిగిందామె.

'చెప్పలేను. నెలలు పట్టవచ్చు. లేదా సంవత్సరాలు పట్టవచ్చు. ఆ శక్తికి మనం కండిషన్స్ పెట్టలేము.వేచి చూడటమే మన పని. ఎప్పుడు రెస్పాండ్ అవాలి అనేది దానిష్టం' అన్నాను నేను.

ఆమెకు ప్రణామం చేసి లేచి అందరం బయటకు వచ్చాం. మాతో బాటు ఆమె కూడా నడుస్తూ వాకిలి దాకా వచ్చింది.

'గురూజీ! మిమ్మల్ని నేను వదలలేక పోతున్నాను. ఎప్పటికీ మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను. మీరు నాకు ఎంతో ఆలస్యంగా పరిచయం అయ్యారు. ముందే మీ పరిచయం అయ్యి ఉంటె ఎంత బాగుండేది' అని మాటిమాటికీ అంటున్న ఆమె సడన్ గా ఇలా అన్నది.

'గురూజీ! మదర్స్ ట్రస్ట్ ఆశ్రమాన్ని మీకు లీగల్ గా రాసేస్తాను. ప్రస్తుతం దీని విలువ 2.5 మిలియన్ డాలర్స్ ఉంటుంది. మీ పంచవటిలో దీనిని విలీనం చేసేస్తాను. దీనిని మీరు నడపండి. మీరొక్కరే దీనికి సరియైన వారసులు. పంచవటి పేరే అద్భుతంగా ఉన్నది. మీరు మా ఆశ్రమాన్ని టేకోవర్ చెయ్యండి. నా తర్వాత మీరే దీనిని నడపండి. కావాలంటే ఇప్పుడే నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను.'

ఈ మాటకు మేమంతా ఆశ్చర్య పోయాం. ఆమె వైపే చూస్తున్న మాకు ' Oh ! No ! ' అన్న మాట వినిపించింది.

అటువైపు తల త్రిప్పి చూచిన మాకు ' Oh No ! యూ కాంట్ డూ దట్' అని అరుస్తున్న "శక్తి మా" కనిపించింది.

మాతాజీ ఆ మాటలను ఏమీ పట్టించుకోలేదు.

ఇంతలో మా బృందంలోని రజిత, మాతాజీని ఇలా అడిగింది.

'మాతాజీ ! ఇక్కడ రెలిక్స్ ఉన్నాయని మీరు చాలా సార్లు అన్నారు. అవి ఎక్కడున్నాయో కరెక్ట్ గా చూపించగలరా?' 

వెంటనే ఆమె వాళ్ళను దేవాలయం లోకి తీసుకెళ్ళి ఒక గ్లాస్ పలక గుండా భూమిలో నిక్షిప్తం చెయ్యబడిన రెలిక్స్ ను చూపించసాగింది.

ఈ లోపల బాబా, శక్తిమా లిద్దరూ ఒక వైపుకు వెళ్ళిపోయి చిన్న గొంతుతో ఏదో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. 

అటువైపు చూచిన నాకు -  మాతాజీ మాటలు వారికి ఏమాత్రం నచ్చలేదనీ, ఆశ్రమాన్ని మాకు వ్రాసేస్తానని ఆమె అనడం సుతరామూ వారికి మింగుడు పడలేదనీ, ఆ విషయమే వారు మాట్లాడుకుంటూ ఉన్నారనీ చిటికెలో అర్ధమై పోయింది. 

'ఓహో! ఇక్కడ కూడా గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయన్న మాట.' అనుకున్నాను నేను.

మేమంతా అక్కడే వేచి ఉండగా కాసేపటికి మాతాజీ రజితా సుమతీ అందరూ బయటకు వచ్చారు.

మేము కొనబోతున్న సైట్ కు అప్రోచ్ దారి ఉందో లేదో ఖచ్చితంగా చెబితే మాత్రమె ఆ తర్వాత మేము దానిని కొనాలా లేదా అనేది ఆలోచిస్తామని ఆనంద్, సుమతీ, రజితా ఒకేసారి బాబాకు శక్తిమాకూ గట్టిగా చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ అవీ పరిశీలించి మాకు ఏ విషయమూ చెబుతానని బాబా అన్నారు.

వారి దగ్గర సెలవు తీసుకుని అందరం ఫెన్ విల్లి రిట్రీట్ హోమ్ కు బయల్దేరాం.