నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

15, మే 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర - 35 (లలితా సహస్ర నామాలపై పరాశక్తి ఆలయంలో ఇచ్చిన ఉపన్యాసం)
















ఉపన్యాసం ముగిసిన తర్వాత సభికుల నుంచి ప్రశ్నలను ఆహ్వానించాను. శ్రద్ధగా ఈ ఉపన్యాసాన్ని విన్న సభికులు కొందరు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

1. ఇంట్లో ఆడవారి నెలసరి సమయంలో నిత్యానుష్టానం ఎలా చెయ్యాలి? ఆపాలా? కొనసాగించాలా?

జవాబు:--

నిత్యకర్మానుష్టానం ఎలాంటి పరిస్థితిలోనూ ఆపరాదు. అందుకనే దానిని నిత్యానుష్టానం (నిత్యమూ చెయ్యవలసినది) అన్నారు. చాలామందికి ఈ విషయం తెలియదు. పాతకాలంలో అయితే ఆడవారికోసం విడిగా అవుట్ హౌస్ లాంటిది ఉండేది. ఆ అయిదురోజులూ వారు అందులో ఉంటూ రెస్ట్ లో ఉండేవారు. కనుక ఇంటిలోని వారికి నిత్యానుష్టానానికి ఆటంకం ఉండేది కాదు. ఇప్పుడు అర్బన్ లివింగ్ లో, అపార్ట్ మెంట్ కల్చర్ లో అలా పాటించడం సాధ్యం కాదు. ఇంకా, పాతకాలంలో అయితే బస్సులలో రైళ్ళల్లో ప్రయాణం చేసేవారు కారు. ఊళ్ళకి ఊళ్లు కాలి నడకనే నడిచి పోతూ ఉండేవారు. లేదా బండి కట్టుకుని పోయేవారు. కనుక నిత్యానుష్టానానికి ఆటంకం ఉండేది కాదు. ఇప్పుడు మనం రోడ్డు మీదకు వస్తే,బస్సుల్లో ప్రయాణిస్తే, లేదా షాపింగ్ కు వెళితే ఎవరిని తాకుతున్నామో తెలియదు. వారికి ఎలాంటి మైల ఉందో మనకు తెలియదు. హోటల్లో టిఫిన్ చేస్తాం భోజనం చేస్తాం. ఆ వండిన వాడు వడ్డించిన వాడు ఎలాంటి స్థితిలో ఉండి ఆ పనులు చేశారో మనకు తెలియదు. కనుక పాతకాలపు ఆచారాలు ఇప్పుడు పాటించడం సాధ్యం కాదు. కానీ ఆచారాలను పూర్తిగా వదిలిపెట్టడమూ మంచి పని కాదు. దీనికొక ఉపాయం ఉన్నది.

ఇంట్లో మైల ఉన్నపుడు, బాహ్య పూజను చెయ్యకుండా, మానసికంగా అంతా చేసుకోవచ్చు. సంధ్యావందనమూ గాయత్రీ జపమూ నిత్యానుష్టానమూ అన్నీ మానసికంగా చేసుకోవచ్చు. అలాగే చెయ్యాలి కూడా. నేనిదే చేస్తాను. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాసరే, ఎక్కడున్నా సరే, ఆ సమయానికి మానసికంగా లోలోపల అన్నీ అయిపోతూ ఉంటాయి. మనస్సుకు మైల లేదు. మీరు కూడా ఇదే అనుసరించండి.

మీరడిగిన దానికి అనుబంధంగా ఇంకోటి చెబుతాను వినండి.

పితృ కర్మ దినాలలో చాలామంది సంధ్యా వందనం గాయత్రీ జపం చెయ్యవచ్చా అని అడుగుతూ ఉంటారు. వాటిని ఎట్టి పరిస్థితి లోనూ మానరాదు. శ్రాద్దకర్మ చెడుది కాదు. అది మన విహిత కర్మ. మన నిత్య కర్మ అయిన తర్వాతనే దానికి పూనుకోవాలి. బ్రాహ్మణుడైనవాడు చనిపోయేవరకూ నిత్యకర్మను చెయ్యవలసిందే. ఎట్టి పరిస్థితిలోనూ ఆపడానికి వీలు లేదు. బాహ్యంగా చెయ్యలేని పరిస్థితిలో మానసికంగా చేసుకోవాలి. అదే అసలైన పద్ధతి.

ఉదాహరణకు మనం రైల్లోనో విమానం లోనో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ సమయానికి సీట్లో కూచోనే మానసికంగా అంతా చేసుకోవాలి. అది దోషం కాదు. స్నానమూ శౌచమూ మొదలైనవి అనుషంగికములు మాత్రమే గాని ప్రధానములు గావు. ఉపాసనమే ముఖ్యం.

2. సభికులలో ఉన్న ప్రముఖ బ్లాగర్ 'కొత్తపాళీ' గారు ఈ ప్రశ్నను అడిగారు.

లలితా సహస్ర నామములలో ' భవానీ భావనాగమ్యా' అన్న నామం ఉన్నది కదా. అందులో భావనాగమ్యా అన్న పదానికి అర్ధం ఏమిటి? సర్వ సామాన్యంగా మన భావన ఎప్పుడూ ఆశుద్ధంగానే ఉంటుంది. మరి అలాంటి అశుద్ధ భావన (impure imagination) తో అమ్మవారిని ఎలా చేరుకోగలం?

జవాబు:--

భావన అనేది ఉత్త imagination కాదు. ఊహకు తోడు, ఫీలింగ్ కలిస్తే అది భావన అవుతుంది. దాని మరొక పేరే ధ్యానం. భావన రెండు రకాలు - ఒకటి అశుద్ధ భావన. రెండవది శుద్ధ భావన. శుద్ధమైన భావనతో కూడిన ధ్యానానికి గమ్యానివి నువ్వు అని ఈ నామం అమ్మను కీర్తిస్తున్నది. సాధనా బలంతో ఆశుద్ధమైన మనసే శుద్ధంగా మారుతుంది. ఆ శుద్ధమైన మనస్సు జగజ్జననిని సరిగ్గా ధ్యానించగలుగుతుంది. అప్పుడు అమ్మ దర్శనాన్ని అది పొందగలుగుతుంది.

'భ' అనే సంస్కృత అక్షరానికి 'వెలుగు' అని అర్ధం. ఉదాహరణకు 'భారత' అన్న మన దేశం పేరుకు అర్ధం భా = వెలుగులో, రత = ఆనందించునది, కోరుకొనునది, వెరసి "భారత్" అంటే వెలుగులో, జ్ఞానంలో నిలిచి ఉండునది, వెలుగును ఇష్టపడునది, వెలుగులో ఆనందించునది - అని అర్ధాలు.

అలాగే 'భావన' అంటే కూడా వెలుగుతో కూడిన ధ్యానం అని అర్ధం. కనుక అది మనల్ని చీకటికి దూరంగా తీసుకు పోతుంది గాని చీకట్లోకి దారి తియ్యదు. కనుక భావన అనే పదానికి మంచి భావన, వెలుగుతో కూడిన ధ్యానం అనే అసలైన అర్ధాలు. అలాంటి ధ్యానానికి గమ్యమైన దానవు నీవు అని ఈ నామానికి అర్ధం.

3. పరాశక్తి ఆలయంలో 16 ఏళ్ళుగా అమ్మవారి సేవ చేస్తున్న దినేష్ గారు ఇలా అడిగారు.

ప్రశ్న:--

కొన్ని కొన్ని గ్రంధాలలో, లలితా సహస్ర నామాలను హయగ్రీవస్వామి సరస్వతీ దేవికి ఉపదేశించినట్లుగా ఉన్నది. మీరేమో వశిన్యాది వాగ్దేవతలు చెప్పారని అంటున్నారు. ఈ రెంటిలో ఏది నిజం?

జవాబు:--

లలితా సహస్ర నామాలను ప్రప్రధమంగా చెప్పినది వశిన్యాది వాగ్దేవతలే అన్నది స్పష్టం. ఈ విషయం ఆ నామాల పూర్వ ఉత్తర పీఠికలలో చాలా తేటతెల్లంగా ఉన్నది. ఇకపోతే - ఇది దేవలోకంలో జరిగిన కధ. మానవులలో అగస్త్య మహర్షికి మొదటిసారిగా ఈ నామాలను హయగ్రీవ స్వామి ఉపదేశం గావించారు. ఆయన నుంచి ఆయన భార్య లోపాముద్రాదేవికి చేరాయి. ఈ రుషి దంపతులిద్దరూ అమ్మవారి మహా భక్తులు. శ్రీవిద్యా సాధనా క్రమంలో కాదివిద్యను అగస్త్య మహర్షి అనుసరిస్తే, హాదివిద్యను ఆయన పత్ని అయిన లోపాముద్రాదేవి అనుష్టించింది. అందుకనే - 'లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండమండలా' అన్న నామం మనకు సహస్ర నామాలలో కనిపిస్తుంది.

అదే హయగ్రీవస్వామి ఇంకొక సందర్భంలో ఈ నామాలను సరస్వతీదేవికి కూడా చెప్పి ఉండవచ్చు. దానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ వీటి ప్రధమ ఉపదేశకులు అమ్మవారి అంతరంగ పరిచారికలైన వశిన్యాది వాగ్దేవతలే. ఇందులో అనుమానం లేదు.

4. సభికులలో ఉన్న ఒక అమెరికన్ ఈ విధంగా ప్రశ్నించారు.

ప్రశ్న:-- మీరు ఇందాక శ్రీవిద్యోపాసన గురించి మాట్లాడుతూ, బాలామహామంత్రాన్ని గురించి చెప్పారు. నేను దానిని ఆచరిస్తున్నాను. దానిని గురించి మీరు కొంచం వివరిస్తారా?

జవాబు:-- ఇలాంటి వాటి గురించి సభాముఖంగా స్వల్పంగా మాత్రమే వివరించగలం. ఉపాసనా రహస్యాలు ముఖాముఖీ మాటల్లో వ్యక్తిగతంగా మాత్రమే తెలుసుకోవలసినవి. అందరిలో మాట్లాడేవి కావు.కానీ మీరడిగారు కనుక కొంచం వివరిస్తాను.

శ్రీవిద్యోపాసనలో మెట్లు మెట్లుగా ఎన్నో మంత్రాలున్నాయి.కానీ వాటిల్లో మూడే ముఖ్యమైనట్టివి. అవి - బాలా మహామంత్రం, పంచదశీ మహామంత్రం, షోడశీ మహామంత్రం. బాల అంటే చిన్నపిల్ల అని అర్ధం. ఆమెకు మూడేళ్ళ వయస్సున్న రూపం ఉంటుంది. బాలా మంత్రోపాసకులకు అమ్మవారు మూడేళ్ళ చిన్నపిల్లగా దర్శనమిస్తుంది. ఇది చాలా శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చే ఉపాసన. ఈ మధ్యకాలంలోని బాలామంత్రోపాసకులలో బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారు (చందోలు శాస్త్రిగారు) ప్రముఖులు. ఆయనకు అమ్మవారు బాలారూపంలో ప్రత్యక్షమైంది. బాలామహామంత్రంలో ఎన్నో రకాలున్నాయి. అన్నీ మంచివే. సాధన సరిగ్గా చేస్తే వాటిని ప్రత్యక్షంగా అనుభవంలో తెలుసుకోవచ్చు. శ్రీవిద్యలో బాల ప్రాధమిక సాధన. తర్వాత క్రమేణా పంచదశీ షోడశీ మంత్రాల ఉపదేశం జరుగుతుంది. ఈ విషయాన్నీ సభాముఖంగా ఇంతకంటే వివరించలేను. మీరు ఒక అమెరికన్ అయి ఉండి బాలా మంత్రోపాసన చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

5. సభ్యులలోనుంచి ఒక మహిళ ఇలా అడిగారు.

ప్రశ్న:-- గురువు శిష్యుణ్ణి ఎంచుకుంటాడా? లేక శిష్యుడు గురువును ఎంచుకుంటాడా?

జవాబు:-- రెండూ జరుగుతాయి. ఎవరికి తపన ఎక్కువైతే వారు రెండోవారికోసం వెదుక్కుంటారు. ఇద్దరికీ తపన లేకపోతే ఎవరి ప్లేస్ లో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు.

చరిత్రను మనం పరికిస్తే - రెండూ జరిగినట్లు చూడగలం. ఎంతోమంది నిజమైన తపన ఉన్న సాధకులు గురువును వెదుక్కుంటూ తిరిగారు. నిజమైన మహనీయ గురువులు కూడా శిష్యులకోసం తపించారు. ఏడ్చారు. ఉదాహరణకు శ్రీరామకృష్ణుల విషయం చూడండి. సాయంత్రం అవుతూనే కాలికాలయం మేడమీడకు ఎక్కి ఈయన శూన్యంలోకి చూస్తూ ఏడిచేవాడు. " నాయనలారా ! మీరంతా ఎక్కడున్నారు? త్వరగా రండి. నా దగ్గర అమూల్యమైన నిధులు ఎన్నో ఉన్నాయి. అవి మీవి. వచ్చి త్వరగా వాటిని తీసుకోండి' అంటూ కన్నీరు కారుస్తూ పిలిచేవాడు. ఆ తర్వాత నరేంద్రుడు, రాఖాల్, తారక్ మొదలైన యువక శిష్యులు ఆయన దగ్గరకు రావడం మొదలైంది. కనుక రెండూ సాధ్యమే. అంతా, మన తపనను బట్టి ఉంటుంది. అది ఉంటే ఆధ్యాత్మిక లోకంలో అన్నీ ఉన్నట్లే, అది లేకుంటే ఏదీ దక్కదు. అంతే.

6. ఉపన్యాసం అయిపోయి అందరం కలసి ప్రసాదాలు తీసుకుంటున్న సమయంలో ఆలయ పూజారి ఒకాయన, తెలుగాయన, వచ్చి పరిచయం చేసుకున్నాడు. ఆయన ఇలా అడిగాడు.

ప్రశ్న:--

నేను కూడా శ్రీవిద్యోపాసన చేస్తూ ఉంటాను. ఉపదేశం పొందాను. అమ్మవారి అనుగ్రహం వల్ల ఎందఱో ఇంటర్వ్యూ ఇచ్చినా సరే, నేను మాత్రమే ఇక్కడకు రావడానికి సెలెక్ట్ అయ్యాను. అది అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను. మీరిందాక మీ ఉపన్యాసంలో చందోలు శాస్త్రిగారి గురించి చెప్పారు. ఆయన చాలా మహానుభావుడు. ఆయన చితి మంటలలో అమ్మవారి ఆకారం కనిపించింది. ఆ ఫోటో మీరు చూచారా?

జవాబు:--

ఆ ఫోటో పత్రికలలో రాకముందు చూచిన అతి కొద్ది మందిలో నేనూ ఒకడిని. ఎందుకంటే ఆ ఫోటోను తీసినది ఎవరో కాదు. శాస్త్రిగారి దహన సమయంలో అక్కడున్న మా తమ్ముడు రఘు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ ఫోటోను నాకు చూపించాడు. నిజం చెప్పాలంటే ఇలాంటి పనులను నేను అస్సలు ఇష్టపడను. చితిని ఫోటో తియ్యడం మన ధర్మం ప్రకారం నిషిద్ధం. అలా చెయ్యకూడదు. ఆ ఫోటో తీసినందుకు నేను నా నిరసనను రఘుకు వ్యక్తం చేశాను కూడా. కానీ ఆ తర్వాత చాలా పత్రికలలో అదొక అద్భుతంగా చిత్రీకరింపబడింది. కానీ నా దృష్టిలో ఆ సంఘటనకు ఏ విలువా లేదు. ఒక మహాపురుషుని విలువ ఇలాంటి చీప్ జిమ్మిక్స్ లోనూ ఫోటో ఎవిడెన్స్ లలోనూ లేదు.ఉండదు. ఆయన సాధనాబలానికీ, జీవితాంతం ఆయన చేసిన ఉపాసనకూ, తత్ఫలితంగా ఆయనకు కలిగిన సిద్దికీ ఆ ఫోటో ఎంతమాత్రమూ కొలబద్ద కాదు. లోకం ఇలాగే ఉంటుంది మహనీయులను ఎలా అర్ధం చేసుకోవాలో దానికి ఎప్పుడూ తెలియదు. అందుకని తనకు తెలిసిన చీప్ కొలబద్దలలో మాత్రమె వారిని కొలుస్తూ ఉంటుంది. ఈ విషయం గురించి నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను. దయచేసి ఈ సంభాషణను ఇంక విరమిద్దాం.

-----------------------------------------

ఆ విధంగా ఆరోజు పరాశక్తి ఆలయంలో నా ఉపన్యాసం ముగిసింది. నేనిక్కడున్నన్ని నాళ్ళూ ప్రతి శుక్రవారమూ వచ్చి ఉపన్యాసం చెప్పమని ఆలయం వారు అడిగారు.ఆ పని చెయ్యడానికి నేను పురాణ పండితుణ్ణి కాదు గనుక వారి అభ్యర్ధనను నేను సున్నితంగా తిరస్కరించాను.  

ఉపన్యాసం తర్వాత వేద మంత్రాలతో ఆలయ మర్యాదలతో నాకు సత్కారమూ, బట్టలు పెట్టడమూ జరిగాయి. సాక్షాత్తూ పరాశక్తి అనుగ్రహంగానే దీనిని నేను స్వీకరిస్తున్నాను. లేకుంటే అల్పుడనైన నేను అమ్మవారి గురించి ఆమె సమక్షంలో మాట్లాడటం  ఏమిటి? దానికి నాకు సాంప్రదాయ పూర్వక వేదమంత్రాలతో సత్కారం ఏమిటి?

"మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం
యత్క్రుపా తమహం వందే పరమానంద మాధవమ్"

(నీ అనుగ్రహం ఉంటే మూగవాడు అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలడు, కుంటివాడు కొండను ఎక్కగలడు') - అంటే ఇదేనేమో?

(అయిపోయింది)