“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

4, మే 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర - 24 (గాంగెస్ రిట్రీట్ - మొదటి రోజు)







































అందరం కలసి నాలుగు కార్లలో బయలుదేరి పదిహేను నిముషాలలో గాంగెస్ ఆశ్రమం చేరుకున్నాం. దారంతా నిర్మానుష్యంగా ఉన్నది. ఒక్క మనిషి కూడా కనిపించలేదు. చెట్లూ అడవీ, పచ్చిక బయళ్ళూ, విసిరేసినట్లుగా ఉన్న ఇళ్ళూ, మబ్బులు పట్టిన ఆకాశం - రోడ్డు మీద ఒక్కడంటే ఒక్కడు కూడా మనిషి కనిపించలేదు సరిగదా కనీసం కార్లు కూడా లేవు. అమెరికన్ కంట్రీ సైడ్ ఎలా ఉంటుందో అర్ధమైంది.

ఆశ్రమం కూడా నిర్మానుష్యంగా ఉన్నది. ముందుగా అందరం ఆలయం వెనుక ఉన్న పంచతప గుడిసె దగ్గరకు వెళ్లి ప్రణామం చేసుకుని ఆ తర్వాత సరాసరి దేవాలయంలోకి వెళ్లి శ్రీ రామకృష్ణులకు శారదామాతకు నమస్కరించి ధ్యానంలో కూచున్నాం. అక్కడ భూమిలోనే శ్రీరామకృష్ణులు, శారదామాత, గౌరీమాల చితాభస్మాలు నిక్షిప్తం చెయ్యబడి ఉన్నాయి. క్షణాలలో మనస్సు ఏకాగ్రం అయిపోయింది. చాలామందికి కన్నుల వెంట నీళ్ళు ధారలుగా కారిపోతున్నాయి. ఆ స్థితిలో ఒక గంట సేపు ఎలా గడిచిపోయిందో తెలియకుండా అయిపొయింది.

గంట తర్వాత అందరం లేచి హాల్లోకి వచ్చి కూచున్నాం. బాబా (స్వామి ఆత్మలోకానంద) ను రమ్మని చెబుతూ ఫోన్ చెయ్యమని ఆనంద్ కు చెప్పాను. బహుశా ఆయన తన క్వార్టర్స్ లో ఉన్నారేమోననిపించింది.

కొద్ది సేపు వెయిటింగ్ తర్వాత ఆయన వచ్చారు. వెంటనే నేను లేచి ఎదురు వెళ్లి ఆయన పాదాలకు ప్రణామం చేశాను. ఆధ్యాత్మికంగా ఎదుటివ్యక్తి మనకంటే ఎక్కువైనా తక్కువైనా సరే, కాషాయ వస్త్రాలకు గౌరవం ఇవ్వడం మన ధర్మం. ఆ ధర్మాన్ని పాటిస్తూ నేనలా చేశాను. నాతోబాటు అందరూ అదే పని చేశారు. కాసేపు కూచుని మాట్లాడుకున్న తర్వాత, లోపల డైనింగ్ హాల్లో కాఫీ టీలు త్రాగుతూ మాట్లాడుకుందాం రమ్మని ఆయన అన్నారు. సరేనని అందరం అక్కడకు దారి తీశాం.

సంభాషణ పెద్ద గొప్పగా ఏమీ సాగలేదు. అటు తిరిగి ఇటు తిరిగి మేము అక్కడ కొనబోతున్న ల్యాండ్ గురించి ఆయన అడిగారు. టైటిల్ సరిగ్గా ఉంటే దానిని కొనడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదని నేనన్నాను. శ్రీ రామకృష్ణుల రేలిక్స్ అక్కడ ఉన్నాయి అన్న ఒక్క కారణంతోనే మేము అక్కడకు వచ్చామనీ, ఇతర ఏ దేవాలయమూ మేమందుకే సందర్శించలేదనీ, ఈ రెలిక్స్ వల్లనే దీనిని గొప్ప పుణ్యక్షేత్రంగా భావిస్తున్నామనీ, మాకు కూడా ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటె బాగుంటుందన్నది మా ఉద్దేశ్యమనీ నేనన్నాను.

పోయినసారి ఎంతో ప్రేమగా మాట్లాడిన ఆయన ఈసారి ముక్తసరిగా అంటీ ముట్టనట్లుగా మాట్లాడారు.బహుశా వాళ్ళు చూపించిన ల్యాండ్ మేము మారు మాట్లాడకుండా కొనలేదని ఆయనకు కోపం వచ్చినట్లుంది. ఆ ల్యాండ్ ను మేము కొంటే, మేము చెల్లించే 35,000 డాలర్స్ ఆశ్రమానికి వస్తాయని ఆయన చాలాసార్లు అన్నారు. కానీ టైటిల్ డీడ్స్ సరిగా ఉన్నాయో లేవో చూడకుండా మేము ఎలా ముందుకు దూకగలం?పైగా, ఆ ల్యాండ్ కు దారి లేదని మాకు సమాచారం వచ్చింది. దారి లేని సైట్ కొనుక్కుని మళ్ళీ దానికోసం చుట్టుపక్కల సైట్ ఓనర్స్ తో మేం ఎలా ఫైట్ చెయ్యగలం? వాళ్ళంతా అమెరికన్స్. ఇదంతా పెద్ద తలనొప్పి వ్యవహారంలా అనిపించింది. చెల్లని రూపాయి లాంటి ఆ సైట్ ను  అంత డబ్బు పోసి కొనమని అసలు బాబా ఎందుకు మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారో మాకర్ధం కాలేదు.

మేమక్కడున్న కాసేపట్లో మాతాజీ మమ్మల్ని కలవడానికి రాలేదు. ఫోన్ కాల్స్ లో బిజీగా ఉండటం వల్ల ఆమె రాలేకపోతున్నారని బాబా అన్నారు. అది నాకు ఏమాత్రమూ నచ్చలేదు. అది అబద్దమని మాకు స్పష్టంగా తెలిసిపోతూనే ఉన్నది. 8000 మైళ్ళ దూరం నుంచి మేము వెతుక్కుంటూ వస్తే ఆమె ఆ మాట అనడం నాకస్సలు రుచించలేదు. అది నిజమైన ఆధ్యాత్మిక లక్షణం కాదు. అంత బిజీ ఏమీ అక్కడ లేదని నా ఇంట్యూషన్ చెబుతున్నది. ఎదుటి మనుషుల మానసిక సిన్సియారిటీని గుర్తించలేకపోవడం అబద్దాలు చెప్పడం మొదలైన వేషాలు బిజినెస్ టాక్టిక్స్ కావచ్చేమో గాని ఆధ్యాత్మిక ఔన్నత్యం ఎలా అవుతుంది?

మేము అక్కడ మూడ్రోజుల రిట్రీట్ కు వస్తున్నామని మూడు నెలల ముందు వారికి చెప్పాము. అప్పుడు సరేనని చెప్పి చివరకు రిట్రీట్ హోమ్ ఖాళీ లేదని చావు కబురు చల్లగా చెప్పారు. అందుకని మేము పక్క ఊరైన ఫెన్ విల్లిలో వేరే రెండు రిట్రీట్ హొమ్స్ బుక్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చి చూస్తె, గాంగెస్ రిట్రీట్ హోమ్ ఖాళీగానే ఉన్నది. అందులో ఎవరూ లేరు. ఈ విచిత్రం ఏంటో అర్ధం కాలేదు.

చికాగోలో మాతాజీ కూతురు జెస్సికా అనే ఆమె లా అటార్నీగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె చికాగోలో ఉండే ఇల్లు ఏదో కారణాలవల్ల ఇన్ఫెక్ట్ అయిందిట. అంటే గ్యాస్ లీకో లేక హీటింగ్ సిస్టం పాడై పోవడమో ఇంకేదో అయింది. అందుకని సొంత ఇల్లు రిపేరు అయ్యేవరకూ ఆమె కుటుంబం వచ్చి ఇక్కడ రిట్రీట్ హోంలో కొన్నాళ్ళు ఉన్నది. సొంతిల్లు ఎప్పుడు బాగౌతుందో తెలీదు.అందుకని ముందుగా మాకిస్తానన్న రిట్రీట్ హోమ్ ఖాళీగా లేదని వీళ్ళు తిరస్కరించారు. ఇదీ నాకు నచ్చలేదు. ముందుగా మాటిచ్చిన తర్వాత మనమైతే అలా ఎప్పటికీ వెనక్కు పోము. అవసరమైతే మనం సర్దుకుని ఇబ్బంది పడినాసరే, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. కానీ వీళ్ళు అలా చెయ్యలేదు. తమ సౌకర్యం కోసం ఎక్కడో వేల మైళ్ళ దూరం నుంచి ఎంతో శ్రద్ధతో వచ్చిన వారికి అసౌకర్యం కలిగించారు. పైగా మాతాజీ ఉండే ఇల్లు చాలా పెద్దది. అది ఒక పెద్ద బంగాళాలాగా ఉంది. అందులో ఆమె ఒక్కతే రెండు కుక్కలతో ఉంటూ ఉంటుంది. అంత పెద్ద ఇంటిలో తన కూతురుని చక్కగా ఉంచుకోవచ్చు. అలా ఉంచుకుని రిట్రీట్ హోమ్ ను ముందుగా మాటిచ్చినట్లుగా మాకివ్వాలి. మేము ఫ్రీగా ఇవ్వమని అనడం లేదు. వాళ్ళు చెప్పిన డబ్బు కట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ వాళ్లు అలా చెయ్యలేదు. మాట తప్పారు. పర్సనల్ విషయాలకు ప్రాధాన్యత నిచ్చి ఎంతో దూరం నుంచి భక్తితో వచ్చిన మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు.ఇది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది?  మొత్తం మీద ఈ వ్యవహారం అంతా మాకు ఏదోలా అనిపించింది. వీళ్ళు చెప్పే మాటలకూ చేసే చేష్టలకూ పొంతన ఏమాత్రం కనిపించలేదు.

పైగా, మాటల సందర్భంలో బాబా అన్నమాట ఒకటి మాకస్సలు నచ్చలేదు.

కలకత్తాలో శారదేశ్వరీ ఆశ్రమంలో వారు పూజిస్తున్న శారదామాత వేరు, ఇక్కడ పూజింప బడుతున్న శారదామాత వేరు అని ఆయనన్నారు.ఇండియాలో ఉన్న శారదామాత ఇండియాకే పరిమితం అనీ, ఇక్కడ ఉన్న శారదామాత యూనివర్సల్ మదర్ అనీ ఆయన అన్నారు. పోయినసారి కూడా ఆయన ఇదే మాటను అన్నారు. అప్పుడూ మాకా మాట నచ్చలేదు. పోనీలే ఏదో అంటున్నారని ఊరుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట ఆయనంటుంటే మాకు మింగుడు పడలేదు.

శారదామాత ఎక్కడున్నా ఆమె యూనివర్సల్ మదరే. అది ఇండియా అయినా అమెరికా అయినా సరే. ఆ మాటకొస్తే అసలీ భూమీ ఈ లోకమే కాదు, ఇంకా ఎన్నెన్ని లోకాలున్నాయో అన్నింటికీ ఆమె జనని. అది అసలైన సత్యం. అలాంటప్పుడు వాళ్ళు ఇంత చిన్న విషయాన్ని ఎలా అర్ధం చేసుకోకుండా ఉన్నారో నాకర్ధం కాలేదు. పోనీ వాళ్లకు అర్ధం కాకపోతే తప్పులేదు, మేము సత్యాన్ని చెప్పబోతున్నా కూడా వినడానికీ ఒప్పుకోడానికీ వాళ్ళు సిద్ధంగా లేరు. అదీ అసలైన విచిత్రం.

ఆ మాటకొస్తే - శ్రీ రామకృష్ణులలోనూ శారదామాత లోనూ సంకుచిత స్వభావం అనేది మచ్చుకు కూడా లేదు. వాళ్ళు విశ్వ హృదయులు. ప్రేమ స్వరూపులు. ఊరకే మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో వారు దానిని చూపించారు. అలాంటి వారిని, వారి భక్తులే సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎంత విచిత్రం?

మాటల సందర్భంలో బాబా ఇంకా ఇలా అన్నారు.

ఎవడో ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఈ మధ్యనే న్యూయార్క్ టైమ్స్ లో ఒక కాలం వ్రాశాడట. అందులో శ్రీ రామకృష్ణులను ఒక వైట్ అమెరికన్ దృష్టికోణంలో అతను ప్రెజంట్ చేశాడట. అదేంటంటే, శ్రీరామకృష్ణులు భూమ్మీద నివసించిన సమయంలో కాళికా ఆలయానికి ఎందఱో క్రైస్తవులూ ముస్లిములూ ఇంకా ఎన్నో మతాల వాళ్ళు వచ్చి ఆయన దర్శనం చేసుకుని పోతూ ఉండేవారు. అందుకని ఆయన ఎంతో యూనివర్సల్ అని ఈ అమెరికన్ ఏదో కొత్త థియరీని కనుక్కున్నట్లుగా ఒక వ్యాస పరంపరను న్యూయార్ టైమ్స్ లో వ్రాశాడట. ఆ విషయాన్ని బాబా ఎంతో గొప్పగా మాతో చెప్పాడు.

అందులో ఏం కొత్త విషయం ఉందొ నాకైతే అర్ధం కాలేదు. ఇవన్నీ చిన్నప్పుడే మాకు తెలిసిన విషయాలే. వీటిని ఇంత ఆశ్చర్యపోతూ ఇప్పుడు వినడం ఏమిటో, మాటమాటకీ మేము యూనివర్సల్ అనీ మీరు ట్రెడిషనల్ సంకుచిత స్వభావులనీ ఇండైరెక్ట్ గా అనడం ఏమిటో నాకైతే ఏమీ అర్ధం కాలేదు.

చూడబోతే - వీళ్ళకు జాతి దురహంకారం ఎక్కువగా ఉన్నట్లు నాకనిపించింది. రేసిజం అనేక రూపాలలో ఉంటూ ఉంటుంది. ఇదొక రకమైన ఆధ్యాత్మిక రేసిజం అనిపించింది. వీళ్ళకు ఇండియా అన్నా ఇండియన్స్ అన్నా ఒక రకమైన చులకన భావం లోలోపల ఉన్నట్లుగా నాకు తోచింది. అయినా సరే ఆ భావాన్ని పక్కన ఉంచి ఆయన చెబుతున్న సోదిని ఓపికగా విన్నాను. ఆయన మాటలు నచ్చకపోయినా నాతోబాటు  మావాళ్ళు కూడా అంతే ఓపికగా విన్నారు.

సాయంత్రం నాలుగుకు మళ్ళీ రమ్మని బాబా అన్నారు. అప్పుడైతే మాతాజీ ఫ్రీగా ఉంటారని ఆయన అన్నారు. సరేనని చెప్పి మేము వెనక్కు వచ్చేశాము.మొత్తం మీద వాళ్ళ వ్యవహారం మాకు ఏమాత్రం నచ్చలేదు. మాటల్లో గొప్ప ఆధ్యాత్మికతా, ఆచరణకు వచ్చే సరికి నేలబారు చవకబారు ప్రవర్తనలూనా? ఇది ఎలాంటి దైవత్వం అవుతుంది?

ఆచరణలో లేని ఆధ్యాత్మికత మీదే మొదట్నించీ నా యుద్ధం అంతా కూడా. ఈ పాయింట్ మీదే నేను పెద్ద పెద్ద స్వామీజీలనూ గురువులనూ అడ్డంగా తిరస్కరించాను.ఈ ఒక్క పాయింట్ మీదే నా గురువులకు కూడా నేను దూరమయ్యాను. చెప్పే మాటలు ఆచరణలో కనిపించకపోతే ఎలాంటి వారినైనా సరే నేను అడ్డంగా విసిరేస్తాను. అమెరికా వచ్చినా ఇక్కడ కూడా అదే తంతేనా? మాయలో పడి అఘోరించని మనిషే ప్రపంచంలో లేడేమో అనిపిస్తోంది చూడగా చూడగా. అది స్వామీజీలు కావచ్చు మాతాజీలు కావచ్చు ఏళ్ళకేళ్ళుగా సాధనలు చేస్తున్నామని గప్పాలు కొట్టుకునే వారు కావచ్చు. ఎవరూ మాయకు అతీతులు కారనేది పచ్చి నిజం.

ఈ విషయం గాంగెస్ లో మళ్ళీ ఇంకోసారి క్లియర్ గా అర్ధమైంది. మాయా ప్రభావం ఎంతలా ఉంటుందో చక్కగా అర్ధమయ్యేలా చేసినందుకు శ్రీరామకృష్ణులకు మనస్సులో ప్రణామాలు అర్పించాను.