“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, మే 2017, మంగళవారం

రెండవ అమెరికా యాత్ర - 21 (గాంగెస్ రిట్రీట్)


ప్రయాణానికి ముందు కారు క్లీన్ చేసుకుంటూ




మూడు రోజుల గాంగేస్ రిట్రీట్ అనుకున్నట్లుగా చాలా బాగా జరిగింది.

27-4-2017 న సాయంత్రానికే, టెక్సాస్, చికాగో, సియాటెల్, షాంపేన్, షార్లెట్ మొదలైన చోట్ల నుంచి చాలామంది సభ్యులు అక్కడకు చేరుకోవడం మొదలైంది. వీరిలో కొందరు సరాసరి కార్లలో అక్కడకు వస్తే, ఇంకొందరు ఒకటి రెండు ఫ్లైట్స్ మారి మరీ అక్కడకు రావలసి వచ్చింది. ముందుగా అలా చేరుకున్న వాళ్ళంతా ఫోన్లు చేసి మేము ఇప్పటికే చేరుకున్నాం అని చెప్పడం ప్రారంభించారు.

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం డెట్రాయిట్ లో ఉంటున్న మేమందరమూ మూడు కార్లలో అక్కడకు వెళ్లాలని ప్లాన్ చేశాం. డెట్రాయిట్ నుంచి గాంగెస్ మూడు గంటల కారు ప్రయాణం. మూడు బ్యాచ్ లు గా మేమందరమూ బయలుదేరాలి. కానీ మాధవ్ కు అదే రోజున ఆఫీసులో ఒక ఇంటర్వ్యూ ఉండటంతో మాకు ఆలస్యమైంది. అందుకే సాయంత్రం 8.30 కు మంచి సమయం చూచుకుని బయలుదేరాం. దారిలో ఇంకొకరిని ఎక్కించుకుని బయలుదేరేసరికి తొమ్మిది అయింది. ఇక్కడ ప్రస్తుతం రాత్రి 8.30 ప్రాంతంలో చీకటి పడుతున్నది.

గాంగేస్ లో బాగా చలిగా ఉన్నదని మాకు ఫోన్లు వచ్చాయి.అసలే అది కంట్రీ సైడ్. దానికి తోడుగా మేము తీసుకున్న రిట్రీట్ హోమ్ ఒక లేక్ పక్కనే ఉన్నది. ఇది చాలనట్లుగా అక్కడ బాగా వర్షం పడుతున్నది. దాదాపు 4 లేదా 5 డిగ్రీల చలి అక్కడ ఉన్నదని ఫోన్లు వచ్చాయి. మేము కూడా దానికి తగినట్లుగా వింటర్ జాకెట్లు వేసుకుని బయలుదేరాము.

రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో గాంగేస్ దగ్గరలోని ఫెర్న్ విల్లి చేరుక్కున్నాము. అదంతా అడవీ ప్రాంతం మైళ్ళకు మైళ్ళపాటు జన సంచారమే కనిపించదు.రోడ్ల మీద లైట్లు ఉండవు. కానీ తారు రోడ్లు మాత్రం ఉన్నాయి. కారు హెడ్ లైట్లే ప్రయాణానికి ఆధారం. మేమలా ప్రయాణిస్తుంటే ఎక్కడికో అడివిలోకి వానలోకి తెలియని దార్లు పట్టుకుని పోతున్నట్లు అనిపించింది. GPS ఒక్కటే ఆధారం. మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగి ఏవేవో తిని, పాలు మొదలైన కొన్ని వస్తువులు కొనుక్కుని అక్కడకు చేరేసరికి రాత్రి 12.30 అయింది.

ఫెర్న్ విల్లి అనే ఊరిలో మహా ఉంటె ఒక 25 లేదా 30 ఇళ్ళు ఉంటాయేమో? అవికూడా అడవిలో విసిరేసినట్లు దూరదూరంగా ఉన్నాయి.

అప్పటిదాకా నిద్ర మేలుకున్న అందరూ ఆ వానలో ఎదురొచ్చి మరీ మాకు స్వాగతం చెప్పారు. ఈ విధంగా చలికి వానకు చీకట్లో గజగజా వణుకుతున్న "ఫెర్న్ విల్లి" అనే ఊరు చేరుకొని ఎవరి రూముల్లో వారు సర్దుకుని నిద్రకు ఉపక్రమించాం.