“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, జూన్ 2014, మంగళవారం

స్వామీ నిత్యానంద-తిరుమల దర్శనం

నిన్న ఇద్దరు కొలీగ్స్ ఏదో మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఖర్మకాలి నేనూ అక్కడకు వెళ్లడం తటస్థించింది.

వారిద్దరూ తమిళులే.కాకుంటే ఒకాయన వీరవైష్ణవుడు.ఇంకొకాయన మామూలు మనిషి.సామాన్యంగా సాంప్రదాయ తమిళ వైష్ణవులకు చాలా చాదస్తమూ,నసా,ఇంకా అనేక ఇతర అతిలక్షణాలూ కలగలిసి ఉంటాయి. ఈయనకూడా వాటికి అతీతుడేమీ కాదు. 

నేను వెళ్లేసరికి వీరవైష్ణవుడు భక్తి గురించి రెండో ఆయనకు వీర లెక్చరిస్తున్నాడు.ఏమి చెబుతున్నాడా అని కాసేపు ఆలకించాను.

కాసేపు వినేసరికి ఆయనకు ఆచరణ లేని విషయాలను ఎకాడెమిక్ గా రెండో వ్యక్తికి వివరిస్తున్నాడని నాకు అర్ధమైపోయింది.

తాము ఆచరించని విషయాలను ఎవరైనా ఇతరులకు చెబుతుంటే అలాంటివారిని ఆటపట్టించడం నాకు భలే సరదాగా ఉంటుంది.

తిరుమల గురించీ అక్కడ ఉన్న పవిత్రత గురించీ,స్వామి యొక్క మహిమల గురించీ లేని తన్మయత్వం నటిస్తూ ఏమేమో చెబుతున్నాడు.

కొద్దిసేపు విని 'ఈమధ్య స్వామి నిత్యానందా రంజితా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు.మీకు తెలుసా?' అన్నాను.

'అవునా?'అని ఆశ్చర్యపోయాడు.

'అవును.వారికి వీఐపీ దర్శనం లభించింది.ఆలయమర్యాదలు కూడా దక్కాయి.'అన్నాను.

ఆయనకు భలే కోపం వచ్చేసింది.

'అలాంటివాళ్ళను అసలు ఆలయం లోనికి రానివ్వకూడదు.' అని అరిచాడు.

ఉడుక్కునే వాళ్ళను మరీ ఉడికించడం మనకు బాగా సరదా కాబట్టి కాసేపు ఈయనతో ఆడుకుందాం అనుకున్నా.

'ఏం తప్పేముంది?' అన్నాను.

'తప్పా?స్వామీజీ అయి ఉండి అలా ఒక స్త్రీతో దర్శనానికి రావడమా?' అని అరిచాడు.

'స్వామీజీనా?ఆయన స్వామీజీ అని ఎవరన్నారు?' అడిగాను.

'అదేంటి కాదా?' అన్నాడు.

'ఏమో నాకేం తెలుసు?మీరేగా స్వామీజీ అన్నారు.ఏ సాంప్రదాయపు స్వామీజీనో మీకే తెలియాలి.పైగా ఆడవాళ్ళతో దర్శనానికి వస్తే తప్పేముంది?చాలామంది అలా వస్తూనే ఉంటారుకదా?' అన్నాను.

'కానీ ఇలాంటివి నేను ఒప్పుకోలేను.'అన్నాడు కోపంగా.

'ఎందుకొప్పుకోలేరు?మీ స్వామికే ఇద్దరు భార్యలున్నారు.ఆయన కృష్ణావతారంలో ఉన్నపుడు ఏకంగా పదహారువేలమంది భార్యలున్నారు. ఆయన పూజారులలో కూడా చాలామందికి ఇద్దరేసి ఉన్నారని జనం అనుకుంటున్నారు.మరి దేవుడికీ పూజారికీ ఇద్దరేసి చొప్పున ఉన్నప్పుడు భక్తుడికి ఎందుకు ఉండకూడదు?ఏం మీ అన్నమయ్యకు ఇద్దరు భార్యలు లేరా?అలాగే ఈ స్వామీజీకీ ఉంటారు.తప్పేముంది?' అన్నాను నవ్వుతూ.

'అయినా పబ్లిగ్గా ఏమిటండి?అసహ్యంగా?' అన్నాడు.

'ఓహో.అదా సంగతి?ప్రైవేట్ గా చేస్తే పర్లేదా?' అడిగాను.

'అదికాదండి.ఆలయమర్యాదలు పాటించాలి కదా?' అన్నాడు.

'ఆలయమర్యాదలు ఆయనేం ఉల్లంఘించలేదే?అందరిలాగే వచ్చాడు. అందరిలాగే తనుకూడా దర్శనం చేసుకున్నాడు.వెళ్ళిపోయాడు. తప్పేముంది?అయినా భక్తుడికీ దేవుడికి లేని బాధ మీకెందుకు?పైగా ఆలయమర్యాదలు ఆయనకు దక్కాయి కదా.ఇంకేమి?' అన్నాను.

'ఇలా చెయ్యబట్టే పవిత్రక్షేత్రాలు భ్రష్టు పడుతున్నాయి.'అన్నాడు.

'అదా మీబాధ?ఇప్పుడు కొత్తగా భ్రష్టు పట్టేదేముంది?తిరుమలలో ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరుగుతున్నదో మీకు తెలియనిదా?పోనీ నేను చెప్పమంటారా?అయినా ఒక్క నిత్యానంద వచ్చి దర్శనం చేసుకుంటే అక్కడ అపవిత్రం అయిపోతుందా?అక్కడకు వచ్చి హుండీలో లక్షలువేసే మిగతా జనాలందరూ పరమ పవిత్రులూనూ నిత్యానంద ఒక్కడే అపవిత్రుడా?దేవుడి దగ్గరకు రావడానికి పవిత్రత అనేది ఒక కొలతా?దానిని ఎలా కొలుస్తారు?పూర్తిగా పవిత్రులూ పతివ్రతలూ మాత్రమె అక్కడకు రావాలి అంటే ఆ వచ్చే భక్తులలో అసలెందరు మిగులుతారో?నిత్యానంద దొరికాడు కాబట్టి దొంగ అంటున్నారు.దొరకని వారంతా దొరలేనా?' అడిగాను అనుమానంగా.

నాతో అనవసరం అనుకున్నాడో ఏమో,'సరే సార్.మనకెందుకు లెండి ఆగోల. వదిలెయ్యండి.'అని టాపిక్ మార్చాడు.

రెండో ఆయనవైపు తిరిగి,'చక్రధ్యానం అని చాలా మంచిది.నెట్లో డౌన్లోడ్ చేశాను.వినండి' అంటూ ఏదో మ్యూజిక్ సెల్లులో వినిపిస్తున్నాడు.నేనూ కాసేపు అది విన్నాను.

'చక్రాస్ అంటే ఏమిటి?'అని రెండో ఆయన అడిగాడు.

ఇక మనవాడు విజ్రుంభించాడు.ఉన్నవీ లేనివీ కల్పించి తెగ చెబుతున్నాడు.

చాలాసేపు మౌనంగా వింటున్నాను.నవ్వాగడం లేదు.

నేను నవ్వడం చూచి 'నవ్వడం కాదు సార్.ఈ ధ్యానం కొన్నాళ్ళు చేస్తే మీకు తెలుస్తుంది.'అన్నాడు.

'కొన్నాళ్ళకే అంతా తెలిసిపోతుందా?ఆ ధ్యానం ఎలా చెయ్యాలి?' అడిగాను.

'అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కవిధంగా తెలుస్తుంది.నెట్లో ఉన్నది.మీరూ డౌన్లోడ్ చేసుకుని కళ్ళుమూసుకుని ఈ మ్యూజిక్ వింటూ ఉండండి.అదే ధ్యానం' అన్నాడు.

'అదేంటి ధ్యానం అంటే ఇంత సింపులా?అయినా నాదొక సందేహం.ఈ చక్రాలూ ఇదంతా శైవతంత్రం కదా.మీరేమో వైష్ణవులు.వైష్ణవంలో దీనిని ఒప్పుకోరేమో?' అడిగాను.

'ఏమో అదంతా నాకు తెలియదు.నాకు బాగుంది.నేను చేస్తున్నాను.' అన్నాడు మొండిగా.

'మరి మనం అడిగితే,స్వామి నిత్యానంద కూడా ఇదేమాట అంటాడేమో?'అడిగాను.

కాసేపు ఆలోచించాడు.

'అలాకాదు.స్వామీజీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి.' అన్నాడు.

'అవును.మన ఇష్టం వచ్చినపనులు మనం చెయ్యవచ్చు.కాని స్వామీజీ కాబట్టి ఆయన అలాంటి పనులు చెయ్యకూడదు.చేస్తే మనకు కోపం వస్తుంది.అంతేనా? పైగా ఆయన సమాజానికి ఆదర్శంగానే ఉన్నాడుకదా. జనానికీ అదే కావాలి.ఆయనా అదే చేస్తున్నాడు.సరిపోయింది.అంతా బానే ఉందికదా?ఇక మనకెందుకు కోపం?' అన్నాను.

'ఏమో నాకర్ధం కావడం లేదు.కాని ఆయన చేసినది తప్పే.' అన్నాడు.

'తప్పో ఒప్పో నాకు తెలీదు.కాని ఒక్క విషయం నాకు బాగా అర్ధమౌతున్నది.'అన్నాను.

'ఏంటది' అడిగాడు.

'మీకు దక్కని సుఖాలు ఆయనకేవో దక్కుతున్నాయన్న అసూయ మీలో బాగా కనిపిస్తున్నది' అన్నాను నవ్వుతూ.

'ఛీ ఛీ నాకెందుకు అసూయ?' అన్నాడు కోపంగా ముఖం పెట్టి.

నాకు ఒకపక్కన చచ్చే నవ్వు వస్తున్నది.

'అసూయ లేకపోతే మధ్యలో మీకెందుకు కోపం?ఆయన బాధలేవో ఆయన పడుతున్నాడు.ఆయన్ను అనుసరించేవారు అనుసరిస్తున్నారు.ఆయనకీ వాళ్ళకీ లేనిబాధ మధ్యలో మీకెందుకు?' అడిగాను.

'ధర్మం నాశనమౌతున్నది.'అన్నాడు ఆవేశంగా.

'ఓహో అదా.ధర్మం నాశనం అవుతున్నదనా మీబాధ?నాశనమయ్యేది ధర్మం ఎలా అవుతుంది?ఎప్పటికీ నశించనిదే కదా ధర్మం?ఆయన తిరుమలకు రాకముందు అక్కడ ధర్మం నాలుగుపాదాలతో నడుస్తున్నదా?మీరు సర్టిఫై చెయ్యగలరా?' ప్రశ్నించాను.

'లేవని కాదు.ఉంటాయి.జరుగుతాయి.కానీ అన్నీ స్వామి చూచుకుంటారు.' చెప్పాడు.

'మరయితే దీనిని మాత్రం స్వామి చూచుకోడా? ఈ ఒక్క విషయం మీద మన తీర్పు ఎందుకు? దేవుడే అన్నీ చూచుకుంటాడు అనుకున్నపుడు ఇంక మనం కామెంట్ చెయ్యకూడదు.అన్నీ దేవుడికే వదిలెయ్యాలి.కొన్ని మాత్రం ఆయనకు వదిలి మరికొన్నింటిని మాత్రం మనం వ్యాఖ్యానం చెయ్యబోవడం ఎందుకు?అన్నిటినీ చూచుకునే దేవుడు నిత్యానందను వదిలేస్తాడా?ఆయనే నిత్యానందను తనవద్దకు రప్పించుకున్నాడేమో?మనకేం తెలుసు?' అడిగాను.

'అయితే మీరు నిత్యానందను సమర్ధిస్తున్నారా?' అడిగాడు.

'ఆయన్ని నేను సమర్ధించడం లేదు.విమర్శించడమూ లేదు.ఆయన నాకు చుట్టమూ కాడు.శత్రువూ కాడు.ఆయనతో నాకు పనిలేదు.మీ ఆధారరహిత అభిప్రాయాలను మాత్రమె నేను ప్రశ్నిస్తున్నాను' చెప్పాను.

'ఏంటో అంతా గందరగోళంగా ఉన్నది.మీతో మాట్లాడకముందు అంతా క్లియర్ గా ఉంది.ఇప్పుడు అంతా అయోమయం అయిపొయింది'-అన్నాడు.

'కరెక్ట్.అయోమయం ఈజ్ డైరెక్ట్ లీ ప్రోపోర్షనల్ టు ట్రూ నాలెడ్జ్.ఎంతగా అయోమయం అయిపోతే అంతగా మీకు సత్యం అర్ధమౌతుంది.పూర్తిగా అయోమయం అయితే అప్పుడు మీకు సత్యం పూర్తిగా ఎక్కుతుంది. ప్రస్తుతానికి మీరింకా ఆ స్థితికి రాలేదు గనుక ఇప్పుడు తత్త్వం పూర్తిగా అర్ధం కాదు.ఇంకా బాగా అయోమయంగా మారడానికి ప్రయత్నించండి.ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం.'అన్నాను.

అతను అలాగే అయోమయంగా చూస్తున్నాడు.

'మళ్ళీ కలుద్దాం.మీ చక్రధ్యానం కొనసాగించండి.' అంటూ నాదారిన నేను వచ్చేశాను.