“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, జూన్ 2014, గురువారం

గురువుగారి కర్కాటకరాశి ప్రవేశం -- ఫలితములు

కొద్దిగా పరిశీలనాశక్తి ఉన్నవారికి ఈరోజునించి కొన్ని మార్పులు వారివారి జీవితాలలో ఖచ్చితంగా కనిపిస్తాయి.దానికి కారణం ఈరోజునుంచి ఖగోళంలో జరుగుతున్న గురుగ్రహ ఉచ్చస్తితి.

ఆ మార్పులు భౌతికంగా కొందరికి వెంటనే కనిపించవచ్చు.కొందరికి కనిపించకపోవచ్చు.కానీ మానసికంగా మాత్రం మార్పులు ఉంటాయి. జీవనవిధానంలో మార్పులు ఉంటాయి.మానసిక స్థాయిలో మార్పులు గోచరిస్తాయి.Confidence levels పెరుగుతాయి.దీనిని స్పష్టంగా ఈరోజునుంచే గమనించవచ్చు.

ఈరోజున గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించి ఉచ్చస్థితిలోకి వచ్చింది. ఒక ఏడాదిపాటు ఈ రాశిలో సంచరిస్తుంది.ఈరోజునుంచే యమునానదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా పన్నెండులగ్నాలు/రాశులవారికి ఈ రోజునుంచి ఏడాది కాలంపాటు ఎలా ఉండబోతున్నదో చూద్దాం.

మేషరాశి
గృహసౌఖ్యం వృద్ధి అవుతుంది.ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. దోషాలు ఖర్చులు తగ్గుతాయి.దీర్ఘరోగాలు శాంతిస్తాయి.విద్యార్ధులకు తల్లిదండ్రుల ఆసరా ఉంటుంది.కోర్టుకేసులలో గెలుస్తారు.చికాకులు శాంతిస్తాయి.వాహనసౌఖ్యం కలుగుతుంది.

వృషభరాశి
ధైర్యం పెరుగుతుంది.సంఘంతో సంబంధాలు మెరుగౌతాయి.భార్యాభర్తల మధ్యన అనుకూలత పెరగుతుంది.ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. ధనలాభం ఉంటుంది.కనిష్ట సోదరులు మంచి పనులకు బాగా ఖర్చు చేస్తారు.

మిథునరాశి
మాటకు విలువ వస్తుంది.గృహసౌఖ్యం బాగుంటుంది.శత్రువులు అదుపులో ఉంటారు.దీర్ఘరోగబాధలు శాంతిస్తాయి.అప్పులు తీరుతాయి.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.దోషశాంతి కలుగుతుంది.పరీక్షలు పాసవుతారు. విద్యలో విజయాలు సొంతమౌతాయి.డబ్బు చేతిలో బాగా ఆడుతుంది. భార్యకు/భర్తకు అనారోగ్య సూచన ఉన్నది.కుటుంబంలో కొన్ని చికాకులు తలెత్తవచ్చు.

కర్కాటకరాశి
అధికార యోగం కలుగుతుంది.ధైర్యం పెరుగుతుంది.పలుకుబడి పెరుగుతుంది.సంతానానికి అదృష్టం కలసి వస్తుంది.వారికి ఉన్నత చదువులూ ఉద్యోగాలూ వస్తాయి.భార్యాభర్తల మధ్యన సయోధ్య బాగుంటుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.దేవాలయాలూ క్షేత్రాలూ సందర్శిస్తారు.

సింహరాశి
మంచి పనులకు ఖర్చులు పెరుగుతాయి.భారీ వ్యయం చేస్తారు.గృహంలో సంతోషం పెరుగుతుంది.శత్రువులు అదుపులోకి వస్తారు.రోగాలు శాంతిస్తాయి.దీర్ఘకాలం నుంచి బాధపెడుతున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.గుండె,జీర్ణకోశ వ్యాధులవల్ల ఆస్పత్రిలో చేరవలసి వస్తుంది.కానీ ప్రాణం రక్షించబడుతుంది.

కన్యారాశి
ఉన్నట్టుండి జీవితంలో వెలుగు కనిపించడం మొదలౌతుంది. అన్నివిధాలుగా లాభం కలుగుతుంది.ధనలాభం ఉంటుంది.మాటధైర్యం పెరుగుతుంది.పలుకుబడి పెరుగుతుంది.సంతానానికి మంచిరోజులు వస్తాయి.మంత్ర సాధన,స్తోత్రపారాయణాదులు చేస్తారు.భార్యాభర్తల మధ్యన అవగాహన పెరుగుతుంది.స్నేహితుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.జ్యేష్ట సోదరులకు లాభిస్తుంది.కాని వారు దూరదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. కళత్రం వల్ల సోదరులతో గొడవలు ఉంటాయి.

తులారాశి
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తిలో ఎదురు ఉన్నప్పటికీ ఎదుగుదల ఉంటుంది.గృహసౌఖ్యం బాగుంటుంది.సంఘంలో మాటకు విలువ పెరుగుతుంది.శత్రు,రోగ,ఋణ బాధలు శాంతిస్తాయి.

వృశ్చికరాశి
మొండితనం తగ్గుతుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.పుణ్యక్షేత్ర సందర్శనం,దేవతా దర్శనం,స్తోత్రపారాయణాదులు కలుగుతాయి.మంచి ఆలోచనలు కలుగుతాయి.దైవకృప వర్షిస్తుంది.ధైర్యం పెరుగుతుంది. మంత్రసాధన చేస్తారు.సంతానానికి కనిష్ట సోదరులకు మంచికాలం మొదలౌతుంది.

ధనూరాశి
మొదట్లో నష్టాలు దర్శనమిస్తాయి.అంతా అయోమయంగా అనిపిస్తుంది.కాని క్రమేణా పరిస్తితి బాగవుతుంది.దీర్ఘకాలిక రోగాలు శాంతిస్తాయి.పితృధనం అందుతుంది.కోర్టుకేసులు ఒక కొలిక్కి వస్తాయి.లోతైన ఆధ్యాత్మిక చింతన మొదలౌతుంది.ఆస్పత్రి పరంగా ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. గృహసౌఖ్యం బాగుంటుంది.వాహనయోగం కలుగుతుంది.తల్లిగాని మాతృ సమానురాలైన వారుగాని దీర్ఘవ్యాధి పాలబడటమో గతించడమో జరుగుతుంది.

మకరరాశి
వివాహం జరుగుతుంది.భార్యాభర్తల మధ్యన సయోధ్య కలుగుతుంది. దూరదేశగమనం ఉంటుంది.ప్రయాణాలు ఎక్కువౌతాయి.కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది.పార్ట్నర్ షిప్ వ్యవహారాలు లాభిస్తాయి.లాభం కలుగుతుంది.సంఘంలో మాట చెలామణీ అవుతుంది.ధైర్యం పెరుగుతుంది.భార్యకు/భర్తకు అనారోగ్య సూచన ఉన్నది.కనిష్ట సోదరులకు దూరదేశ గమనం.పరదేశలాభం.

కుంభరాశి
శత్రువులు అదుపులోకి వస్తారు.ధనం వదిలినా రోగబాధ శాంతిస్తుంది. అప్పులు తీరుతాయి.ధనలాభం కలుగుతుంది.మంచిపనులకు బాగా ఖర్చు చేస్తారు.తీర్ధయాత్రలు దూరప్రయాణాలు చేస్తారు.జ్యేష్ట సోదరులకు స్నేహితులకు రోగభయం ఉన్నది.కుటుంబంలో కలతలు విరోధాలు ఉంటాయి.ENT రోగాలు వేధిస్తాయి.

మీనరాశి
మంత్రసాధన ఆధ్యాత్మికచింతన ఎక్కువౌతాయి.సంతానానికి మంచి రోజులు మొదలౌతాయి.ఉన్నత విద్య కలుగుతుంది.మహనీయుల కటాక్షం దేవతానుగ్రహం కలుగుతుంది.ధనలాభం ఉంటుంది.జ్యేష్ట సోదరులకు మంచి జరుగుతుంది.వృత్తిలో నూతనఆలోచనలు కలుగుతాయి.పలుకుబడి పెరుగుతుంది.

---------------------------------

గురు అనుగ్రహాన్ని పొందే విధంగా ఈ ఏడాదిపాటూ జీవనవిధానం మార్చుకునేవారికీ తదనుగుణంగా జీవించేవారికీ గురుకృప మెండుగా వర్షిస్తుంది.వినకుండా మొండిగా తమదారిలో తాము పోయేవారికి అది దక్కదు.ఈ ఏడాది కాలమూ ఉండే గురుకృపను పూర్తిస్థాయిలో వాడుకోవడమా ఒదులుకోవడమా అనేది మన ఇష్టంమీదా కర్మమీదా అదృష్టంమీదా ఆధారపడి ఉంటుంది.

ఎందుకంటే ఈ గ్రహస్థితి మళ్ళీ పన్నెండేళ్ళకు గాని రాదు.అప్పటికి ఈ పోస్ట్ చదువుతున్న కొంతమంది అసలు బ్రతికే ఉండరు.ఇలాంటి అవకాశం వదులుకునే వారిది ఖచ్చితంగా దురదృష్టమే అని చెప్పాలి.

చల్లని నీరు ఎదురుగా ఉన్నది.త్రాగినవారికి దప్పిక తీరుతుంది.త్రాగను అని భీష్మించుకు కూర్చుంటే గొంతు ఎండుతుంది.ఈ అవకాశం మళ్ళీ పన్నెండేళ్ళ వరకూ రాదు.

-----------------------------------------

గురు అనుగ్రహం ఎలా కలుగుతుంది?అని కొందరు అడుగుతున్నారు.దానికి ఈ క్రింది వివరణ ఇస్తున్నాను.

నిత్యజీవితంలో మార్పురాని పూజలూ వ్రతాలూ ఉపవాసాలూ పారాయణాల వల్ల ఏమీ ఉపయోగం ఉండదన్న సంగతిని ముందుగా స్పష్టంగా గ్రహించాలి.

జీవితం శుద్ధంగా లేకుండా గుడులూ గోపురాలూ ప్రదక్షిణాలూ మొక్కులూ ఆచరించినా వాటివల్ల ఏమీ ఫలితం ఉండదు.

1.త్రాగుడు,జూదం,వ్యభిచారం,ధూమపానం మొదలైన రాక్షసవ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
2.అబద్దాలు చెప్పడం,మోసం చెయ్యడం, వ్యసనపరత్వం, గర్వం, అహంకారం, కపటం,ఇతరులకు హాని చెయ్యడం,గురువులను మహనీయులను దూషించడం,అనవసరంగా హేళన చెయ్యడం,నోరుపారేసుకోవడం మొదలైన సైతాన్ లక్షణాలను పూర్తిగా విడిచిపెట్టాలి.
3.సదాచారాన్ని పాటిస్తూ,మితంగా మాట్లాడుతూ,నియమయుతమైన జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవాలి.మన చేతనైనంత వరకూ కష్టాలలో ఉన్నవారికి సహాయపడాలి.
4.ఈ నియమాలు పాటిస్తూ జీవిస్తే గురుఅనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. కర్మ బరువు తగ్గుతుంది.
5.పాటించకపోతే ఎవరి ఖర్మ వారు ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది.

 ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడమా లేదా అన్నది ఇక మన ఇష్టం.