“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

9, జూన్ 2014, సోమవారం

చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్త విశ్లేషణ-2

ఇంకా దిగ్భ్రమ కలిగించే ఇంకొక్క రహస్యాన్ని ఇప్పుడు వెల్లడి చేస్తున్నాను.పోయినసారి చంద్రబాబు అధికారం కోల్పోయిన రోజు 13-5-2004.ఇంతకుముందు ఆరోజువరకూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆంధ్రాజాతకంలో ఏ దశ జరుగుతున్నదో ఇప్పుడు చెబుతాను.

ఊపిరి బిగబట్టి చదవండి.

అప్పుడు జరిగినది--

శని/బుధ/రాహు/శనిదశ.

అంటే మళ్ళీ శపితయోగమే ప్రత్యక్షమైంది.ఆంధ్రా జాతకానికి శనిమహాదశ 7-9-1999 నుంచి మొదలైంది.2018 వరకూ నడుస్తుంది.ఈ శనిమహాదశలోనే రాష్ట్రం రెండుముక్కలై పోయింది.విదశా సూక్ష్మదశలలో రాహు/శనుల విభాగం రావడంతోనే చంద్రబాబుకు అధికారం పోయింది.ఈ పదేళ్లలో రాష్ట్రం ఎంత వెనుకపడి పోయిందో ఎన్నెన్ని ఘోరమైన కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలిసినదే.చూచారా శపితయోగవిచిత్రం!!!

కర్మ సంబంధాలు ఈ రకంగా ఎంతో విచిత్రంగా ఉంటాయి.

రాహువిదశా/శనిసూక్ష్మదశలో మొదలైన శపితయోగం ఈ రకంగా రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పట్టి పీడించింది.పోతూపోతూ రాష్ట్రాన్ని రెండుముక్కలు చేసి శని/రాహుదశలోనే చంద్రబాబుకు మళ్ళీ పట్టం గట్టింది.

అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యవలసిన ఖర్మ చంద్రబాబు జాతకంలో ఉన్నదని స్పష్టంగా తెలుస్తున్నది.అంటే తెలుగునేలతో బలీయమైన పూర్వకర్మ చంద్రబాబుకు ఉన్నది.ఈకర్మ ఈనాటిది కాదు.రాష్ట్రంతో బలీయమైన కర్మ ముడిపడి ఉన్న ప్రాచీనజీవులు దానిని తీర్చుకోడానికి మళ్ళీ ఇక్కడే జన్మ ఎత్తడమూ తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా చిన్ననాడే ఆ రంగంలోకి ఈడ్వబడటమూ అత్యంత సహజంగా జరుగుతుంది.చంద్రబాబు అందుకే కాలేజీ రోజులనుంచే రాజకీయాలలో ఉన్నాడు.అంతకు ముందునుంచే సేవాకార్యక్రమాలలో ఉన్నాడు.ఇంకో రంగంలోకి ఆయన అడుగుపెట్టాలన్నా పెట్టలేడు.పూర్వకర్మ సంబంధాలు అలా పెట్టనివ్వవు. అందుకనే చిన్నతనం నుంచీ నలుగురికీ ఏదో చెయ్యాలన్న తపన ఆయనలో ఉండేది.ఈ తపనకు కారణం పూర్వకర్మమే.

అతను పూర్వజన్మలలో ఎవరో ఇదంతా ఎందుకు జరుగుతున్నదో వ్రాస్తే,అది దైవరహస్యాన్ని ధిక్కరించడమే అవుతుంది.పైగా అటువంటి విషయాలను తేరగా చెబితే ఎగతాళి చెయ్యడం తప్ప ఈకాలపు మనుషులు ఎవరూ నమ్మరు కూడా.ఎందుకంటే ప్రతిదానినీ వెకిలిగా ఎగతాళి చెయ్యడం తప్ప వారికి ఇంకేమీ తెలియదు.ఇలాచేసే కదా పూర్వకాలంలో ఈ శాపాన్ని మూటకట్టుకున్నారు.కనుక ఇంతటితో ఈ టాపిక్ ఆపేస్తున్నాను.

ముందుముందు చంద్రబాబు జాతకాన్ని విశ్లేషించినపుడు ఆయన జాతకంలో కొన్ని రహస్యాలను పైపైన (కొన్నిమాత్రమే) వివరిస్తాను.అర్హులైన అతికొద్దిమంది సన్నిహితులతో మాత్రమే ఆ రహస్యాలు చర్చించడం జరుగుతుంది.

ఇకపోతే,ఆంధ్రరాష్ట్రకుండలిలో రాబోయే 5 ఏళ్ళలో ఏ దశలు జరుగుతాయో ఒకసారి పరికిద్దాం.

ఇప్పటినుంచీ ఫిబ్రవరి 2016 వరకూ శని/రాహుదశ జరుతున్నది.ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ 2018 వరకూ శని/గురుదశ జరుగుతుంది. ఇక్కడితో శనిమహాదశ అయిపోతుంది.అప్పుడు బుధ మహాదశ మొదలౌతుంది. అక్కడనుంచి 2035 వరకూ బుధమహాదశ జరుగుతుంది.అందులో మొదటగా జనవరి 2021 వరకూ బుధ/బుధదశ జరుగుతుంది.

ఫిబ్రవరి 2016 వరకూ జరిగే శని/రాహుదశలో కష్టనష్టాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు పోవడం జరుగుతుంది.కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలి గనుక ఏకదీక్ష అవసరం అవుతుంది.ఆ మార్గంలో చంద్రబాబు చిత్తశుద్ధితో పోరాడతాడని విశ్వసిస్తున్నాను.అంతటితో రాష్ట్రానికి పట్టిన శపితయోగ ప్రభావం ప్రస్తుతానికి శాంతిస్తుంది.

అక్కడనుంచి సెప్టెంబర్ 2018 వరకూ నడిచే శని/గురుదశ  చాలా కీలకమైనది.కష్టపడినదానికి ఫలితాలు కనిపించడం ఈ దశలోనే ప్రారంభం అవుతుంది.విజయాలనూ అపజయాలనూ బేరీజు వేసుకుంటూ అభివృద్ధి పధంలో ముందుకు పోవడం జరుగుతుంది.

మొత్తం మీద శని మహాదశలో జరిగే ఈ చివరి రెండుదశలూ చాలా కష్టకాలం అనే చెప్పాలి.పాతభవనం కూలిపోయి కొత్తది కట్టుకునే మధ్యన ఉండే సంధికాలం లాంటిది ఇది.

ఇప్పుడు ఆంద్రరాష్ట్ర కుండలిని కాసేపు పక్కనపెట్టి మళ్ళీ వెనక్కు వద్దాం. చంద్రబాబు ప్రమాణస్వీకార కుండలిని ఒక్కసారి తిలకిద్దాం.

ఆ క్రమంలో కొంత గణితభాగంలోకి తొంగిచూద్దాం.120 సంవత్సరాలుండే వింశోత్తరీ దశను ప్రభుత్వం సాధారణంగా ఉండే పదవీకాలమైన 5 ఏళ్ళతో సమానం చేసి చూడాలి.

120 years=5 years=60 months
1 year=5/120=1/24 years=1/2 months.

ప్రమాణ స్వీకార సమయానికి కుజమహాదశ 75 నెలలకాలం మిగిలి ఉన్నది.

అంటే 75/24=దాదాపు మూడు నెలల కాలం కుదించిన వింశోత్తరీ దశ మిగిలి ఉన్నది.

కనుక:
మిగిలిఉన్న కుజదశ     3.0 months 
రాహుదశ  18/2=9.0 months
గురుదశ    16/2=8.0 months
శనిదశ      19/2=9.5 months
బుధ దశ   17/2=8.5 months
కేతు దశ   7/2=3.5 months
శుక్రదశ   20/2=10.0 months
రవిదశ      6/2=3.0 months
చంద్రదశ    10/2=5.0 months
మొత్తం   59.5 నెలల కుదించిన వింశోత్తరీ దశాకాలం మిగిలి ఉన్నది.
  
ఇప్పుడు దశా ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం.

కుజదశ
ఇప్పటినుంచి రాబోయే మూడునెలల కాలం ఈ దశ జరుగుతుంది.ఇందులో పరిపాలనా సంబంధమైన వ్యవహారాలు ముఖ్యపాత్ర వహిస్తాయి.దుమ్ము దులపడం మొదలౌతుంది.పాత వ్యవస్థలనూ,స్తంభించిపోయిన అనేక పనులనూ ఈదశ కదిలిస్తుంది.అసలు మనం ఎక్కడున్నాం అని బేలెన్స్ షీట్ వేసుకుని పరిస్థితిని బేరీజు వేసుకునే కార్యక్రమం మొదలౌతుంది.చంద్రబాబు తీసుకునే అనేక చర్యలవల్ల బద్ధకస్తులైన ఉద్యోగులకు అనేకమందికి కంటగింపు మొదలౌతుంది.కానీ ఏమీ అనలేక ఊరుకుని ఉంటారు.అదే సమయంలో ఎవరి వర్గాలను వారు బాగుచేసుకునే క్రమంలో నాయకుల లోలోపలి ప్రయత్నాలు మొదలౌతాయి.

రాహుదశ:--సెప్టెంబర్ 2014 నుంచి మే 2015
శపితయోగం తన శక్తిని చూపడం మొదలౌతుంది.అయితే దీనిని లాభస్థానంలో ఉంచినందువల్ల సంస్థాగతమైన అనేక పనులు మొదలౌతాయి.విదేశీ ప్రయాణాలు ఉంటాయి.అక్కడివారు జరిపే సన్మాన కార్యక్రమాలకు హాజరు కావలసి ఉంటుంది.

ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారో గాని వారు ఈ యోగాన్ని లాభస్థానంలో ఉంచి చాలా మంచిపని చేశారు. లేకుంటే దాని చెడుప్రభావాన్ని అరికట్టడం చాలా కష్టం అయ్యేది.

కేంద్రసహాయం చురుకుగా అందటం మొదలుపెడుతుంది.కేంద్రంలో ఉన్న మిత్రులూ మంత్రులూ సహాయం చెయ్యడం ప్రారంభిస్తారు.ప్రజలకిచ్చిన అనేక హామీలూ ప్లానులూ కార్యరూపాన్ని ధరించడం మొదలౌతుంది.రోడ్లు,సివిల్ పనులు,విద్యుత్తు పనులు,పెట్రోలియం కారిడార్,IT పార్కులకు సంబంధించిన పనులు మొదలౌతాయి.

అయితే సహచరుల రహస్యకార్యక్రమాలూ ఇప్పుడే మొదలౌతాయి.పెద్ద మొత్తంలో కేంద్రనిధులు అందటం మొదలౌతుంది గనుక ఇక ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులను వాడుకోవాలని ప్లానులు వేస్తారు. దీనిని చంద్రబాబు ఒక కంటితోకాదు పదికళ్ళతో కనిపెడుతూ కట్టడి చెయ్యకపోతే అవినీతి మళ్ళీ భయానకంగా విజ్రుంభించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదే గనుక జరిగితే ప్రజల్లో పార్టీ విశ్వాసాన్ని త్వరగా కోల్పోయే ప్రమాదం ఉన్నది.ఇది జరుగకుండా జాగ్రత్త వహించాలి.

గురుదశ:--మే 2015 నుంచి జనవరి 2016
ఇది చాలా కీలకమైన కాలం.రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం కోసం కేంద్రంచుట్టూ బాగా తిరగవలసి వస్తుంది.చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి నిధుల సమీకరణ కోసం చాలా శ్రమపడవలసి వస్తుంది.సిఎంకు దూరప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.విదేశీయాత్రలు ముఖ్యంగా అమెరికాయాత్ర చెయ్యవలసి వస్తుంది.అక్కడ ఎన్నారైల పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది.అలాగే ప్రతిపక్షాల ఎదురుదాడులు ఎదుర్కొడానికి చాలా శ్రమపడవలసి వస్తుంది.వారికి సమాధానం చెప్పడానికి హోమ్ వర్క్ చెయ్యవలసి వస్తుంది.

శనిదశ:--జనవరి 2016 నుంచి అక్టోబర్ 2016 వరకు
శపితయోగం మళ్ళీ ముందుకొస్తుంది.అయితే ఈసారి క్రమశిక్షణా సమాజ పునర్నిర్మాణమూ పుంజుకుంటాయి.కేంద్రంలో ఉన్న మిత్రుల తోడ్పాటుతో నూతనరాజధాని నిర్మాణం మొదలౌతుంది.మీడియా కూడా బాగా సహకరిస్తుంది.ప్రజలలో ధైర్యం పెరుగుతుంది.ప్రభుత్వం చెప్పిన పనులు చేస్తున్నదన్న విశ్వాసం పెరుగుతుంది.పేదప్రజలకోసం అనేక కార్యక్రమాలు మొదలుపెట్టబడతాయి.అధికారులూ ప్రజలూ కష్టపడి పనిచెయ్యడం మొదలౌతుంది.అయితే అనుకున్నంత వేగంగా పనులు సాగవు.అనుకోని అవాంతరాలు ఎదురౌతాయి.

బుధదశ:--అక్టోబర్ 2016 నుంచి జూన్ 2017 వరకు
ఇది కూడా చాలా ముఖ్యమైన కాలం.ఫిబ్రవరి వరకూ అనేక నూతనప్రభుత్వ కార్యక్రమాలు మొదలు పెట్టబడతాయి.ఇంకొక రెండేళ్ళలో ఎన్నికలు మళ్ళీ వస్తున్న సందర్భంగా ప్రజావిశ్వాసాన్ని పొందటంకోసం ప్రజాకర్షక పధకాలు ముమ్మరంగా మొదలౌతాయి.అయితే ఫిబ్రవరినుంచి మొదలౌతున్న అర్ధాష్టమశని వల్ల అనేక అవాంతరాలు ఎదురౌతాయి.మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లు సకాలంలో పూర్తవుతాయా లేదా అనుమానాలు ప్రారంభం అవుతాయి. సమయానికి నిధులు అందవు.పనులు పూర్తికావు.చాలా కష్టపడవలసి ఉంటుంది.ఇదే అదునుగా ప్రతిపక్షాలు తమదాడిని ముమ్మరం చేస్తాయి.

కేతుదశ:--జూన్ 2017 నుంచి సెప్టెంబర్ 2017 వరకు
ప్రభుత్వానికి ఆందోళన ఎక్కువౌతుంది.వాగ్దానాలు నెరవేర్చడం కష్టమౌతుంది. పనులు సగం అయ్యి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది.నాయకులకు ఆదుర్దా గాభరా ఎక్కువౌతాయి.నిధులకు సంబంధించి కొన్ని కుంభకోణాలు జరిగే సూచనలున్నాయి.మిత్రులు విడిపోయే సూచనలున్నాయి.ఖర్చు విపరీతంగా అవుతుంది.

శుక్రదశ:--సెప్టెంబర్ 2017 నుంచి జూలై 2018 వరకు
ఇది చాలా ముఖ్యమైన కాలం.ఈ సమయంలో గనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తికాకపోతే ప్రజావిశ్వాసం అతివేగంగా కుంటుపడే అవకాశం ఉన్నది.అలాగే మిత్రులూ దూరమయ్యే అవకాశం ఉన్నది.ఇలా జరుగకుండా ఉండాలంటే అష్టకష్టాలూ పడి గుజరాత్ తరహాలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లవలసి ఉంటుంది.

ఈ క్రమంలో సక్సెస్ అయితే మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి ఈసారి కూడా ధోకా ఉండదు.విషయాన్ని అటోఇటో తేల్చే దశ ఇది.ఈ దశలో చంద్రబాబు కుటుంబంలో ఉన్న మిగిలిన నాయకులు ముందుకు వస్తారు.వారి భవిష్యత్ పునాదులు వెయ్యబడతాయి.పరిపాలనలో వారి భాగస్వామ్యం బాగా ఎక్కువౌతుంది.పార్టీని బలోపేతం చెయ్యడానికీ కార్యకర్తలలో ఉత్సాహం నింపడానికీ ప్రయత్నాలు జరుగుతాయి.సర్వశక్తులూ ఒడ్డి అభివృద్ధిపధంలో రాష్ట్రాన్ని నడపాలని చర్యలు మొదలౌతాయి.

సూర్యదశ:--జూలై 2018 నుంచి అక్టోబర్ 2018 వరకు
పాలనాపరంగా గట్టి నిర్ణయాలు తీసుకోబడతాయి.ఆ క్రమంలో డిల్లీ పెద్దలతో కూడా కొంత విరోధం తలెత్తే సూచనలున్నాయి.రాష్ట్రం బాగుకోసం డిల్లీ స్థాయిలో గట్టిగా పోరాడవలసిన పరిస్థితి తలెత్తుతుంది.అలాగే రాష్ట్రంలో క్రమశిక్షణతో కూడిన పాలన అందించబడుతుంది.

చంద్రదశ:--అక్టోబర్ 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు
రాబోయే ఎన్నికలకు ప్రచారం మొదలౌతుంది.చేసిన పనులు చెప్పుకోవడం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే కార్యక్రమం మొదలౌతుంది. కొన్ని రంగాలలో పరిపాలన చాలా బాగుందని ప్రజలు మెచ్చుకునే తీరులో పరిపాలన ఉంటుంది.కానీ అనుకున్న పనులు అన్నీ చెయ్యలేకపోయిన పరిస్థితి కూడా ఉంటుంది.మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు మిగిలిపోయిన పనులను పూర్తిచేస్తాం అని చెప్పుకోవలసిన ఓవర్ లాప్ ఉండిపోతుంది.