“The gates of the winehouse are wide open. Come ye all who want to enjoy a good drink”

23, జూన్ 2014, సోమవారం

ఆనంద నాట్యం




ప్రకృతి మొత్తం 
ఆనందనాట్యం చేస్తోంది 
తన హృదిలో ఉన్న ప్రియునిమోమును 
తదేకంగా చూస్తోంది 

యుగయుగాల ఆటల్లో  
చిలిపి దాగుడుమూతల్లో 
చిప్పిల్లిన ఆనందం 
లోకంగా మారింది 

ప్రియునిగా ఉన్న తాను 
ప్రేయసిగా మారింది 
తిరిగి ప్రియుని వెదుకుతోంది 
వింతైన ఆటలలో వినోదాన్ని పొందుతోంది 

ఆటకోసం ఈ జాలం 
సమస్తం సృష్టించింది 
ఆట జోరుగా సాగుతోంది 
ఆనందం వెదజల్లుతోంది 

తెలియని వారికి వెలుగులూ చీకట్లు 
తెలిసినవారికి రెండూ ఒకటే
రెంటినీ మించిన రెండూ తానైన 
వెలుగు కానట్టి ఒక వింతవెలుగు 

ఎగిరే గాలిపటాలలో 
ఏదో ఒకటి తెగిపోతోంది 
విశ్వాంతరాళంలో వేగంగా ఎగురుతోంది 
దారం ఆధారం లేకనే దిక్కులలో విహరిస్తోంది 

క్షణకాలం ప్రియుని కౌగిలిలో 
కళ్ళుమూసి సేదతీరుతుంది 
మరునిముషం ప్రియునితో 
చిలిపి ఆటలాడుతుంది 

ఇంకోక్షణం బుంగమూతితో 
అలిగి దూరంగా పోతుంది 
మరుక్షణం ముద్దు మాటలతో 
ప్రేమగా లాలిస్తుంది 

ఒక నిముషం భక్తిగా సేవిస్తుంది 
మరునిముషం కాలితో తాడిస్తుంది 
చిలిపితనం రూపుదాల్చింది 
ప్రేమహృదయం తనకే ఉంది 

ఏడ్చేవారిని చూస్తూ
ఎక్కువగా నవ్వుతుంది 
నవ్వేవారిని మట్టుకు 
ఏడిపింప చేస్తుంది  

రెండూ సంద్రపు అలలని  
ఎరిగినవారిని మాత్రం 
ఓరకంట చూస్తూ
చిలిపినవ్వు రువ్వుతుంది

ఆట వద్దు పొమ్మంటే 
అమితబాధలు పెడుతుంది 
వాటిలో గెల్చినవారిని  
ఒడిలోనికి లాగుతుంది

తనలా మారినవారిని 
తనతో ఆడనిస్తుంది
వారడిగిన తాయిలం 
ఏదైనా వెంటనే ఇస్తుంది  

ప్రకృతి ఆనందనాట్యం చేస్తోంది
తన ప్రియుని మోమును 
పరవశించి చూస్తోంది...........