“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

14, జూన్ 2014, శనివారం

బాకీ తీర్చుకుంటున్న శపితయోగం

శపిత యోగం 24-12-2012 న మొదలైంది.

అప్పటినుంచీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన దుర్ఘటనలను ఎవరైనా ఒకచోట పోగుచేసి చూస్తే ఎన్ని వేలమంది ఎన్నెన్ని విచిత్ర కారణాలతో లోకాన్ని వదలి వెళ్ళిపోయారో అర్ధమౌతుంది.ఆసంఖ్య లక్షలలో కూడా ఉండవచ్చు. ఆత్మహత్యలూ,యాక్సిడెంట్లూ,దుర్మరణాలూ,ప్రకృతివిలయాలూ ఇలా ఒకటి కాదు రకరకాలుగా శపితయోగం అనేది తన ప్రభావాన్ని చూపింది.ఎవరెవరు చేసుకున్న చెడుకర్మ వారిని వదలకుండా వెంటాడింది.ఫలితాలను అనుభవింపజేసింది.

ఇదంతా జరుగుతుందని నేను అప్పుడే హెచ్చరించాను.తమ తమ పద్దతులను వేగంగా మార్చుకోకపోతే భయానకమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అనేక పాత పోస్ట్ లలో సూచించాను.కావలసినవారు శపితయోగం మీద నేను వ్రాసిన పాత పోస్ట్ లు ఒక్కసారి చూడండి. అలాగే కాలజ్ఞానం పోస్ట్ లూ చూడండి.నిత్యనైమిత్తిక ప్రళయాలు అనేకం జరుగుతాయనీ ఎంతమందివో ప్రాణాలు ఈ క్రమంలో పోతాయనీ నేను సూచించాను.ఈ 19 నెలలలో అంతా ఊహించినట్లే జరిగింది.

ప్రస్తుతానికి త్వరలో శపితయోగం అయిపోవస్తున్నది.కనుక మిగిలిపోయిన బాకీలను అది వేగంగా తీర్చుకుంటున్నది.ప్రస్తుతం ఎక్కడ చూచినా జరుగుతున్న దుర్ఘటనలు దీని ప్రభావమే.

మొన్న 8 నుంచి 10 లోపు గనుక గమనిస్తే ఎన్నెన్నో దుర్ఘటనలు జరిగాయి.మచ్చుకి ఒకటి రెండు సంఘటనలు చెబుతాను.మీమీ జీవితాలలో మీ చుట్టుపక్కలవారి జీవితాలలో గమనిస్తే మీరుకూడా ఎన్నో సంఘటనలను చూడవచ్చు.

మా కొలీగ్ వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ లో ఉంటాడు.పని ముగించుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ రోడ్డు అంచు దగ్గర టూ వీలర్ స్కిడ్ అయి కింద పడిపోయాడు.కణతకు రాయి కొట్టుకుని కోమాలోకి పోయి మరుసరిరోజు ఆస్పత్రిలో చనిపోయాడు.అతనికి 37 ఏళ్ళు.

మా ఫోటోగ్రాఫర్ భార్యకు ఉన్నట్టుండి బ్రెయిన్ లో రక్తం క్లాట్ అయ్యి అదే రోజున గుంటూరులో ఆస్పత్రిలో చేరింది.అప్పటినుంచీ కోమాలో ఉన్నది.పరిస్తితి ఇంకా ప్రమాదకరమే అంటున్నారు.

బియాస్ నది దుర్ఘటన కూడా అప్పుడే జరిగింది.

నిత్యజీవితంలో గమనిస్తే యాక్సిడెంట్లూ,ఉన్నట్టుండి రోగాలతో ఆస్పత్రిలో చేరడాలూ,విచిత్ర పరిస్తితులలో చనిపోవడాలూ ఎన్నో కేసులను ప్రతిరోజూ గమనించవచ్చు.ఇవన్నీ శపితయోగ ప్రభావాలే.

అందుకే చెడుకర్మను పోగుచేసుకోకూడదు అని మన పెద్దలు గట్టిగా చెప్పేవారు.పద్దతిగా బ్రతకాలి అనీ,ఎవరి హద్దులలో వారు ఉండాలనీ మరీమరీ అనేవారు.డబ్బు అహంకారంతోనో,పదవీ అహంకారంతోనో,ఇంకా రకరకాల అహంకారాలతో కన్నూ మిన్నూ గానక కర్మ పోగుచేసుకుంటారు. చేసేటప్పుడు నవ్వుతూ చేస్తారు.అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తారు.'అయ్యా బాబూ మమ్మల్ని రక్షించండి.సహాయం చెయ్యండి'- అంటారు.కాని అహంకారంతో కర్మను పోగుచేసుకునేటప్పుడు అదే బుద్ధి ఉండదు.మీరు ఇతరులను బాధపెట్టినపుడు వారుకూడా ఇలాగే రక్షించమని ఏడిచి ఉంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ప్రతివారూ తాము చాలా మంచివాళ్ళమని అనుకుంటారు.మేమేమీ తప్పులు చెయ్యలేదు.మాకిలా ఎందుకు జరుగుతున్నదో తెలియడం లేదు అనుకుంటారు.దేవుడు లేడు ఉంటె ఇలా ఎందుకు జరుగుతుంది? అనుకుంటారు.దేవుడు ఉండబట్టే ఇలా జరుగుతున్నది.ఎవరి తప్పులకు వారికి శిక్షలు పడుతున్నాయి.

గతం స్వచ్చంగా ఉంటె మనకు ఏ విధమైన చెడూ జరగదు.గతంలో ఎన్నో తప్పులు చేశాము గనుకనే ఇప్పుడు బాధలు పడుతున్నాము.గతజన్మలు గుర్తు తెచ్చుకునే సామర్ధ్యం అందరికీ ఉండదు. కానీ ఈజన్మలోనే వెనక్కు తిరిగి చూచుకుంటే మనం చేసిన అనేక తప్పులు స్పష్టంగా కనిపిస్తాయి.

మాటలతో ఇతరులను బాధించడం,నమ్మకద్రోహం చెయ్యడం,గురునింద చెయ్యడం,అనవసరంగా ఇతరులను నోరుపారేసుకుని దూషించడం,పొగరుగా మాట్లాడటం,నోరుతెరిస్తే అబద్ధాలు చెప్పడం,ఇతరులను మోసంచెయ్యడం, వారికి న్యాయంగా రావలసిన వాటిని మనం కాజేయ్యడం,ఇతరుల అవకాశాలను చెడగొట్టడం,మన స్వార్ధంకోసం ఇతరులను ఏడిపించడం ఇలా రకరకాలుగా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం.అవన్నీ ఎక్కడా రికార్డ్ కావని మనం అనుకుంటాం.అవేవీ వృధాగా పోవు.

మనం ఒకర్ని ఏడిపిస్తే మనమూ ఏడవక తప్పదు.మనం ఒకరిని మోసం చేస్తే మనమూ మోసపోక తప్పదు.మనం ఒకరి ప్రాణం తీసుకుంటే మన ప్రాణమూ అర్పించక తప్పదు.ప్రతి చర్యకూ ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది.

మానవ న్యాయస్థానంలో మనకు శిక్ష పడకపోవచ్చు కాని కర్మస్థానంలో మనకు శిక్ష తప్పదు.ఆ సమయం వచ్చినపుడు మనం చేసిన ప్రతిదానికీ మనం జవాబు చెప్పవలసి ఉంటుంది.దీనిని ఎవరూ తప్పించలేరు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది అదే.ఈ 19 నెలల శపితయోగం త్వరలో అంటే జూలై పదమూడు తో అయిపోతున్నది.కానీ సంధ్యాసమయం ఒక నెలపాటు ఉంటుంది.అంటే ఆగస్ట్ 15 వరకూ అది ఉంటుంది.ఈ లోపల ఇంకా ఎన్నో ఎన్నెన్నో దుర్ఘటనలు జరుగబోతున్నాయి.ఎవరెవరి కర్మానుసారం వారికి దైవన్యాయస్థానంలో శిక్ష పడబోతున్నది.

పెట్రోల్ కేంద్రాల ప్రమాదాలూ,రోడ్డు జల వాయుయాన ప్రమాదాలూ,అగ్ని ప్రమాదాలూ,ఆత్మహత్యలూ,హత్యలూ,దోపిడీలూ,తీవ్రవాదుల చర్యలూ,విద్రోహ చర్యలూ,సామూహిక దుర్మరణాలూ ఇలాంటివన్నీ రాహువు యొక్క పరిధిలోకే వస్తాయి.

వేచి చూడండి.రాబోయే రెండునెలలలో రోజుమార్చి రోజు జరిగే సంఘటనలు చూచి నామాటలు నిజమే అని మీరే ఒప్పుకుంటారు.