“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, జూన్ 2014, శుక్రవారం

శపితయోగపు ఆఖరి ఘట్టం

ప్రస్తుతం శపితయోగం తన చివరిఘట్టంలోకి వస్తున్నది.త్వరలో రాహువు శనీశ్వరుని చెలిమిని వదలి వెనక్కు మరలి కన్యారాశిలోకి అడుగుపెట్ట బోతున్నాడు.ఏడాదిన్నర నుంచీ ప్రజలను పీడిస్తున్న రాహుప్రభావం త్వరలో మాయం కాబోతున్నది.

కానీ ఏడాదినుంచీ బలీయమైన శపిత యోగాన్నించి జనులను ఒక శక్తి రక్షిస్తున్నది.అదే దేవగురువు బృహస్పతి యొక్క దృష్టి.మిధునరాశినుంచి తన కరుణాపూరితమైన పంచమదృష్టితో శనిరాహువులను వీక్షిస్తున్న గురువువల్ల అనేకమంది అనేక ప్రమాదాలనుంచి వారికి తెలియకుండానే రక్షింపబడ్డారు.

కానీ మరి నిత్యం జరుగుతున్న సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.

ఎవరైతే అయాచితంగా లభిస్తున్న దేవగురువు యొక్క అనుగ్రహాన్ని చేజేతులా కోల్పోయారో,లెక్కచెయ్యకుండా అహంతో దానిని కాల దన్నుకున్నారో అలాంటివారే ఈ శపితయోగానికి బలయ్యారు.ధర్మాన్ని అనుసరిస్తూ పద్దతిగా దానికి లోబడి ఉన్నవారిమీద శపితయోగపు ప్రభావం ఎంతమాత్రమూ లేదు.

జాగ్రత్తగా గమనిస్తే ఒక్కవిషయం స్పష్టంగా గోచరిస్తుంది.అందరూ దీనికి బలికాలేదు.కొందరే దానివాత బడ్డారు.దీనికి కారణం ఇదే.తెలిసో తెలియకో ఎవరైతే దేవగురువు బృహస్పతి నీడలో ఉన్నారో,ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉన్నారో వారు ఈ శపితయోగపు ఛాయనుంచి క్షేమంగా బయటకు వచ్చారు.ఎవరైతే దానిని కాలదన్నుకున్నారో వారు కాలసర్పం నోట పడిపోయారు.

ప్రస్తుతం రాబొయే నెలా నెలన్నరలో అతికీలకమైన మార్పులు చోటు చేసుకో బోతున్నాయి.దానికి ఒక బలీయమైన కారణం ఉన్నది.

ఇన్నాళ్ళూ శపితయోగపు బారి నుంచి రక్షిస్తున్న బృహస్పతి అనుగ్రహం ఇప్పుడు నిన్నటినుంచి తొలగిపోయింది.బృహస్పతి కర్కాటకరాశి లోకి మారడంద్వారా తులారాశి మీద ఇప్పటివరకూ ఉన్న ఆయన దృష్టి మాయమైంది.

కనుక చకచకా కలిగే కొన్ని మార్పులను ఇప్పుడు అందరూ ప్రత్యక్షంగా చూడవచ్చు.

ఎవరైతే దైవానుగ్రహానికి దూరంగా ఉన్నారో వారందరికీ ఇప్పుడు శిక్షలు పడటం మొదలౌతుంది.నిత్యజీవితంలో ఎవరికివారు గమనించుకుంటే నిన్నటినుంచీ చిన్నాపెద్దా సంఘటనలలో ఎవరికి వారికి సమస్యలు పెరగడం,మానసికశాంతి కోల్పోవడం,యాక్సిడెంట్లు కావడం,దెబ్బలు తగలడం,రోగాలు తిరగబెట్టడం,దూరపు ప్రయాణాలు చెయ్యవలసి రావడం, జీవితం విసుగ్గా మారడం,ఉన్నట్టుండి చెడుకాలం మొదలుకావడం మొదలైన సంఘటనలు జరగడాన్ని గమనించవచ్చు.

నేను చెబుతున్న దానిలో నిజం ఎంతో మీకుమీరే మీ జీవితాలనూ మీ చుట్టుపక్కల జరుగుతున్న అనేక సంఘటనలనూ కళ్ళు తెరిచి చూడండి. గమనించండి.నా మాటలలో నిజం ఏమిటో మీకే గోచరిస్తుంది.

రాబోయే నెలన్నర కాలం చాలా కీలకమైనది.మనల్ని రక్షిస్తున్న దైవకృప ఇప్పుడు పక్కకు తప్పుకుంది.ప్రస్తుతం అందరమూ దైవన్యాయస్థానపు బోనులో నిలబడి ఉన్నాము.శిక్షకోసం వేచిచూస్తున్నాము.ఇక ఎవరి తప్పులకు తగినట్లు వారికి శిక్షలు పడటం ఖాయం.దీనినుంచి మనల్ని రక్షించగలిగేది ఒక్క ధర్మం మాత్రమే.

ధర్మపుఛాయలో నిశ్చింతగా ఉండండి.

శపితయోగపు కోపం నుంచి తప్పుకోండి.

లేదా మీఇష్టం.

మిగిలి ఉన్న కర్మబాకీలను రాబోయే నెలన్నరలో రాహువు చాలా చిత్రవిచిత్రమైన విధానాలలో,ఎవరి ఊహలకూ అందని అనూహ్యమైన రీతులలో పూర్తి చెయ్యబోతున్నది.ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నవారైనా ఈ ప్రభావానికి అతీతులు ఏమాత్రమూ కారు.

ఈ కర్మాగ్రహం నుంచి రక్షించేది ప్రస్తుతం ఒక్క ధర్మాచరణమే అన్నది ప్రత్యక్ష సత్యం.ధర్మపు చేతిని పట్టుకుని ఉన్నంతవరకూ ఏమీకాదు.దానిని వదలిన మరుక్షణం రాహుప్రభావంలోకి మీరు వెళ్ళవలసి వస్తుంది.అప్పుడు చింతించి ఎంతమాత్రం ఉపయోగం ఉండదు.

చెప్పడమే నా ధర్మం.వినకపోతే మీ ఖర్మం.