“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

28, జూన్ 2014, శనివారం

డిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల భవనం-శపితయోగానికి మరో తిరుగులేని తార్కాణం

ఈరోజు ఉదయం 8.55 ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒకటి డిల్లీలో కూలిపోయింది.పదకొండు మంది చనిపోయారని అంటున్నారు. ఎంతమంది కూలిపోయిన సిమెంట్ స్లాబుల క్రిందా,రాళ్ళక్రిందా చిక్కుకుని ఉన్నారో తెలియదు.నిదానంగా ఆ లెక్క తెలుస్తుంది.

రాహువు కుజుడు అమావాస్య కలసిన ప్రభావాలకు ఇది ఇంకొక తిరుగులేని నిదర్శనం.శపితయోగపు నిరాఘాటమైన పదఘట్టనకు ఇది మరొక ఋజువు.జ్యోతిష్యపరమైన కోణాలు ఇందులో ఏమున్నాయో ఒక్కసారి పరికిద్దాం.

లగ్నం ఆశ్లేషా నక్షత్రంలో ఉన్నది.ఆశ్లేషా నక్షత్రం సర్పనక్షత్రం.దీనికి అధిష్టాన దేవత రాహువు.కనుక రాహుప్రభావం స్పష్టంగా ఉన్నది.

గృహాలను సూచించే చతుర్దంలో శపితయోగం కూర్చొని ఉండటం స్పష్టంగా కనిపిస్తున్నది.కనుక భవనం కూలిపోయింది.కానీ లగ్నంలో గురువు ఉచ్చంలో ఉండటం వల్ల ప్రాణనష్టం తగ్గింది.లేకుంటే మంచి రద్దీగా ఉండే ప్రాంతంలో అంత భవనం కూలిపోతే చుట్టుపక్కల భవనాలకు కూడా నష్టం జరగాలి.ఇక్కడ కూడా గురు అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నది.గురువుగారి అనుగ్రహానికి మరొక్క నిదర్శనం ఈరోజు పునర్వసు నక్షత్రం నడుస్తూ ఉండటం.కరుణామయుడైన గురువు వల్లనే ఇంత ఘోరప్రమాదంలో కూడా ప్రాణనష్టం తగ్గింది.

ఈప్రాంతంలో 7.30 నుంచి 8.30 వరకూ కుజహోర నడిచింది.ఆ సమయం లోనే భవనం కూలడానికి ఇతర కారణాలు బలాన్ని సంతరించుకుని ఉండాలి.ఆ చుట్టుపక్కల ఏదో ఇంకొక కట్టుబడి జరుగుతూ ఉన్నదని అంటున్నారు.ఆ ప్రకంపనలకు ఆ భవనం బాగా వీక్ అయి ఉండాలి.అంటే కుజహోరలో భవనం పడిపోవడానికి రంగం సిద్ధం అయింది.తర్వాత ఒక అరగంటలో రాహునక్షత్రంలో ఉన్న సూర్యహోరలో అది కూలిపోయింది.

8.30 నుంచి సూర్యహోర మొదలైంది.సూర్యుడు కూడా ఆశ్లేషా నక్షత్రంలో ఉండటం స్పష్టంగా చూడవచ్చు.అంటే ఈ సమయం పైన కూడా రాహువు ప్రభావం నక్షత్రపరంగా ఉన్నది.

నవాంశను ఒక్కసారి పరికిద్దాం.లగ్నాధిపతి గురువు పంచమంలో ఉచ్చంలో ఉన్నప్పటికీ నీచంలో ఉన్న కుజునితో కలసి ఉన్నాడు.వీరిద్దరినీ నీచంలో ఉన్న శనిస్థానం నుంచి హోరాధిపతి సూర్యుడు చూస్తున్నాడు.కుజుడు భవనాలకు భూమికి అధిపతి.చతుర్దాదిపతి బుధుడు అష్టమంలో రాహువుతో కలసి వక్రించి ఉన్నాడు.

అమావాస్య ప్రభావం దాని తర్వాత మూడురోజుల వరకూ ఉంటుందని కూడా ఎన్నోసార్లు పాతపోస్ట్ లలో వ్రాశాను.ఈరోజు అమావాస్య తర్వాతి రోజే.గమనించండి.

గత మూడురోజులనుంచీ జరుగుతున్న సంఘటనల వల్ల ఇంకొక విషయం కూడా స్పష్టంగా తెలుస్తున్నది.ప్రమాద కంపాస్ అనేది స్థిరంగా ఉండదు. భూమి తిరుగుతున్నట్లే అదికూడా తిరుగుతూ ఉంటుంది.కర్మబీజాలు ఎక్కడ పక్వానికి వచ్చాయో అక్కడ అది ప్రభావం చూపిస్తుంది.అందుకే ఒక్కొక్కరోజు ఒక్కొక్కచోట అది తన చేతిని విదిలిస్తున్నది.

వ్యక్తిగత జీవితాలలో అయితే గత అయిదురోజులుగా ఎన్నో రకాలైన దుర్ఘటనలు జరుగుతున్నాయి.ఎవరికి వారు గమనించుకుంటే తెలుస్తుంది.

శపితయోగానికీ,రాహువు,కుజుడు,అమావాస్య ప్రభావాలకు ఇది మరొక్క ప్రత్యక్షనిదర్శనం.