“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

30, మార్చి 2023, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 51 (నేను చేస్తున్నాననే అహం)

మొన్నొకరోజున వాకింగ్ సమయంలో 'శ్రీ' కనిపించాడు. 'ఇంతమంది ఉండి ఇంతచిన్న విషయాన్ని పట్టించుకోవడం లేదేంటి?' అని మైకుల గోల గురించి ఆయన్ను ప్రశ్నించాను.

'ఈగో సమస్యలు' అన్నాడాయన. 'ఎవరికి వారు  మాకెందుకు అనుకోవడం కారణం'

సంస్థలలో ఉండే అహంకారాల వైపు మా సంభాషణ సాగింది.

'ఎవరూ అహాలు పెంచుకోకండి. తలచుకుంటే గడ్డిపోచతో పని చేయిస్తాను' అని అమ్మ ఒకసారి అన్నది. 'మేం కాబట్టి ఇంత పని జరుగుతోంది' అనుకుని విర్రవీగిన కొందరిని చూచి అమ్మ ఆ మాటంది' అన్నాడాయన.

ఒకసారి ఏదో చర్చ జరుగుతుంటే, 'ఈ విషయం నీకు తెలీదులేమ్మా' అని 'రా' అన్నాడు. అహంకారపూరితంగా అనలేదు గాని, మామూలుగా మాటవరసకు అన్నట్లుగా అన్నాడు.  కానీ అదికూడా తప్పే కదా? తర్వాత, 'అదేంటమ్మా? 'రా' అలా అన్నాడు?' అని 'అ' అమ్మను అడిగాడు. దానికి అమ్మ ఇలా చెప్పింది.

'అనుకున్నా చేస్తున్నాడుగా?'

తనేమంటున్నదో  మాకు అర్ధం కాకపోతే, ఇలా వివరించింది.

'నేనే చేస్తున్నాను' అనుకోకపోతే చెయ్యలేడు నాన్నా. ముందు 'నేనే చేస్తున్నాను' అనుకుంటాడు. చేస్తాడు. ఎంతో జీవితం గడిచాక 'చేస్తున్నది నేను కాదు. అది జరుగుతోంది' అని తెలుసుకుంటాడు' అని వివరించింది.

'శ్రీ' చెబుతున్నది విన్నపుడు నాకు చాలా సంతోషం కలిగింది.

'ఇంత అజ్ఞానం మధ్యలో, ఇన్ని అహాలతో ఈ నాటకం నడపడం అమ్మకే సాధ్యమౌతుంది. సృష్టి ఇలాగేగా నడుస్తోంది?' అన్నా.

ఆయన నవ్వేశాడు.

నా దారిన నేనొచ్చేశాను.