“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, మార్చి 2023, సోమవారం

అరుణాచల యాత్ర - 3 (దుర్భరంగా మారిన టోపీ అమ్మ బ్రతుకు)

నడుస్తుండగా మాట్లాడటం సాగించాడు చంద్రశేఖర్.

'అరుణాచలం పాడైపోయింది అన్నగారు. 2017 లో నేనొచ్చినపుడు కూడా ప్రశాంతంగా ఉండేది. గత నాలుగేళ్లనుంచి తెలుగుజనాల దాడి మొదలైంది. ప్రశాంతత మాయమైంది. యూ ట్యూబు గురువులు కొంతమంది అరుణాచలాన్ని బాగా పాపులర్ చేశారు. ఇలా తయారైంది' అన్నాడు.

1983 లో మొదటిసారి నేనిక్కడికి వచ్చినపుడు అరుణాచలం ఎలా ఉండేదో గుర్తొచ్చింది. నవ్వుకున్నా.

చంద్రశేఖర్ కంటిన్యూ చేశాడు.

'పౌర్ణమి వచ్చిందంటే చాలు. లక్షలాది జనం బస్సుల్లో కార్లలో  పోలోమంటూ వచ్చేస్తున్నారు. ఆ రెండురోజులు, లోకల్స్ బయటికిరావాలంటే భయపడి చస్తున్నారు. అంత దారుణంగా ఉంటోంది. రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ మధ్య ఎవడో యూ ట్యూబరుడు, 'టోపీ అమ్మ' అని ఒకామెని బాగా పాపులర్ చేశాడు. ఆమె ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె బ్రతుకు బస్టాండ్ ఐపాయింది. ఎప్పుడు చూసినా కనీసం ఒక ఇరవైమంది ఆమె వెంట తిరుగుతూ ఫోటోలు తీస్తూ ఆమె జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు. మొన్నీ మధ్య ఏం జరిగిందో తెలుసా అన్నగారు? ఆమె పాసు పోసుకుంటుంటే చుట్టూ పదిమంది తెలుగుభక్తులు నిలబడి చూస్తున్నారట.యూట్యూబ్ గురువుల వల్ల అంత దరిద్రం అయిపొయింది ఆమె లైఫ్' అన్నాడు బాధగా.

నవ్వొచ్చింది.

'ఇంకా నయం వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టలేదు సంతోషించు. పిచ్చిజనం పిచ్చిలోకం. ఎవరి ఖర్మ వారిది. మంచి చెబితే ఎవడూ వినడు. టైం వచ్చినపుడు, వాత పడినపుడు మాత్రమే వీళ్లకు అర్ధమౌతుంది అదంతే' అన్నా. 

'టోపీ అమ్మ అవధూత అయితే వీళ్ళకెందుకు? కాకపోతే వీళ్ళకెందుకు? ఎటుచూచినా లోకంతో ఆమెకు పనిలేదు. ఆమెతో లోకానికి కూడా ఉపయోగం లేదు. వెరసి యూట్యూబు వల్ల ఆమె జీవితం మాత్రం దుర్భరం అయిపోయింది' అన్నాడు.

'ఎంతమంది అమ్మలొచ్చినా జనానికి బుద్ధి మాత్రం రాదు తమ్ముడూ. ప్రజల అజ్ఞానం  కూడా ఎంతమాత్రమూ పోదు, ఈ లోకం ఇలా సాగవలసిందే' అన్నా నవ్వుతూ.

మాటల్లోనే చలంగారి సమాధి వచ్చేసింది.