“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, మార్చి 2023, సోమవారం

అరుణాచల యాత్ర - 9 (సింహాన్ని సింహం గుర్తుపట్టలేదా?)

అరుణాచలంలో ఉండగా ఒకరోజున ఒక సంఘటన జరిగింది.

మేమంతా కలసి ఆశ్రమం రోడ్డులో నడుస్తూ ఉండగా, ఒక స్వామీజీ కనిపించాడు. మేము రోడ్డుకు ఇవతలవైపున్నాము. అతను అవతలవైపున్నాడు.  ఒక పండ్ల బండి దగ్గర ఏదో బేరం చేస్తున్నాడు. అతని డ్రస్సు చూస్తూనే అది రామకృష్ణమఠం డ్రస్సని నేను గుర్తుపట్టాను.

'ఒక తమాషా చూడండి' అని నాతో ఉన్న శిష్యులతో చెప్పి ఆయన వైపు గబగబా నడిచాను.

'నమస్తే స్వామీజీ' అన్నాను ఆయన పక్కనే నిలబడి.

'నమస్తే' అన్నాడాయన నా వైపు చూస్తూ

'మీరు రామకృష్ణ మఠం స్వామీజీనా?' అడిగాను.

'ఒకప్పుడు' అన్నాడు.

ఇది కూడా డ్రాపౌట్ కేసేనని నాకర్ధమైంది. కొంతమంది మఠంలో బ్రహ్మచారి పీరియడ్ పూర్తి చేసుకుని, స్వామీజీలయ్యి, కొన్నాళ్లో, కొన్నేళ్లో ఉండి అప్పుడు బయటకొచ్చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఖర్మ !

కాషాయం కట్టుకున్నంతమాత్రాన ఖర్మ వదలదు కదా !

'మీరంతా ఏంటి?' అన్నాడు మా గ్రూపు వైపు చూస్తూ.

'మేము ఒక ఆశ్రమం కట్టుకుంటున్నాం. అందుకని, దానికంటే ముందు అన్ని ఆశ్రమాలూ స్టడీ చేస్తున్నాం' అన్నా

'ఆశ్రమం ఆలోచన ఎవరిది?' అన్నాడు

'నాదే' అన్నాను

'మంచిదే. కానీ మీకు ధ్యానం గురించి తెలియాలి. ధ్యానం పునాది లేకపోతే, ఆశ్రమం త్వరలోనే బోరు కొడుతుంది' అన్నాడు.

అతనేంటో నాకర్ధమైపోయింది.

'అవును. మా ఉద్దేశ్యం కూడా అదే' అన్నాను

'ఊరకే ఉద్దేశ్యం ఉంటే చాలదు. ధ్యానం గురించి కొంతకాకపోతే కొంతైనా తెలుసుకోండి' అన్నాడు స్వరం పెంచి.

నేను వెంటనే చేతులు కట్టుకుని అటెన్షన్లో నిలబడుతూ 'అలాగే స్వామీజీ. తప్పకుండా తెలుసుకుంటాము. ధ్యానం గురించి  ఉపదేశించేవాళ్ల కోసమే మేమందరమూ వెతుకుతున్నాము' అన్నాను వినయంగా.

'లా రోడ్లమీద వెతికితే ధ్యానం దొరకదు. ధ్యానం మీద నేనొక బుక్కు రాశాను. అది త్వరలో ప్రింట్ అవుతున్నది. చదవండి' అన్నాడు దర్పంగా .

'తప్పకుండా స్వామీజీ. కానీ మాబోటివాళ్లకు అది అర్ధమౌతుందా?' అన్నాను భయభక్తులతో చేతులు అలాగే కట్టుకుని.

'ఇన్నేళ్లొచ్చినై. ఎందుకురా నువ్వు?' అన్నట్లు జాలిగా నావైపు చూశాడు స్వామీజీ.

'సాయంత్రం రండి. నేను ఫలానా చోట ఉంటున్నాను. ఒక్క అరగంట మాత్రం మీకు టైము కేటాయించగలను.  ధ్యానం గురించి మీకు ఫండమెంటల్స్ నేర్పిస్తాను. అంతకంటే టైం ఇవ్వలేను మీకు' అన్నాడు ఆయన సీరియస్ గా.

నాకు లోపల పొట్ట చెక్కలయ్యే నవ్వొస్తోంది. కానీ బయటకు బిగబట్టుకుని మౌనంగా చూస్తున్నా. 

'ఓకేనా?' అన్నాడు పిల్ల స్వామీజీ గదమాయిస్తున్నట్లు.

'ఓకే స్వామీజీ. ప్రస్తుతానికి ఈ డబ్బులుంచండి' అంటూ కొంత డబ్బు ఆయన చేతిలో పెట్టాను.

ఆ డబ్బులు జేబులో పెట్టుకున్న అతను, రోడ్డు క్రాస్ చేసి చాలా విసురుగా నడుస్తూ ఒక సందులోకి వెళ్లిపోయాడు.

ఆయన మాయం కావడంతోనే అందరం ఆ రోడ్డుమీదనే పగలబడి నవ్వుకున్నాం.

'అర్థమైందా స్వామీజీలు ఎలా ఉంటారో?' అడిగాను శిష్యులవైపు తిరిగి.

'బాగా అర్ధమైంది. ఛీ ఇలాంటి వాళ్ళా స్వామీజీలు?' అన్నారు శిష్యులు.

'ఈ ట్రిప్ లో ఇదే హైలైట్ సంఘటన, మీ యాక్టింగ్ మాత్రం అద్భుతం గురూజీ' అన్నాడు గణేష్.

అందరం మళ్ళీ నవ్వుకున్నాం.

'గురూజీ నాదొక సందేహం' అడిగాడు ప్రవీణ్.

'ఏంటది చెప్పు' అన్నాను

'ఒక సింహం ఇంకొక సింహాన్ని గుర్తుపడుతుందంటారు కదా? ఆ స్వామీజీ మిమ్మల్ని గుర్తుపట్టలేదెందుకు?' అడిగాడు.

నవ్వాను.

'వెరీ సింపుల్ ప్రవీణ్. దీనికి లాజికల్ గా మూడే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అతనైనా సింహం కాదు. రెండు, నేనైనా సింహం కాదు. మూడు, ఇద్దరమూ సింహాలం కాదు. ఈ మూడు తప్ప వేరే కావడానికి ఆస్కారం లేదు. అన్నాను.

'అంతే కదా' అన్నాడు ప్రవీణ్

'నేను సింహాన్ని కాను. మామూలు మనిషినే. ఆ సంగతి నాకు తెలుసు. అతను సింహం అయ్యి ఉండవచ్చు. అందుకే మనల్ని చూచి అలా పారిపోయాడు, బహుశా గ్రామసింహం అయ్యుంటాడు' అన్నాను.

మళ్ళీ అందరం నవ్వుకున్నాం.

అరుణాచలం రోడ్లమీద నడుస్తూ శిష్యులతో ఇలా చెప్పాను.

'కాషాయవస్త్రాలు, ఆశ్రమాలు, పటాటోపాలు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి గుర్తులు కావు. కాషాయం చూచి మోసపోకండి. గడ్డాలు పెంచిన అందరూ ఋషులనుకోకండి. నిజమైన ఔన్నత్యం సాధనతో మాత్రమే వస్తుంది. సాధనాబలం లేనప్పుడు ఉత్తవేషం ఎందుకూ పనికిరాదని గ్రహించండి'.

ఇదంతా వింటున్న మరొక శిష్యుడు ఇలా అడిగాడు

'మరి మీరెందుకు ఆ స్వామీజీకి డబ్బులిచ్చారు?'

ఇలా వివరించాను.

'శ్రీ రామకృష్ణుల పేరుమీద అతను సన్యాసి అయ్యాడు. దానికి నేను విలువనిచ్చాను. ఈ మనిషికి నేను విలువనివ్వలేదు. శ్రీ రామకృష్ణులకు ఇచ్చాను. అతనికా డబ్బు ఇచ్చింది కూడా ఆయనే. సంస్థను వదిలేసి వచ్చినా కూడా అతన్ని రామకృష్ణులు అలా కాపాడుతున్నారు. అది ఆయన కరుణకు నిదర్శనం. ఆ విషయం ఈ స్వామీజీ ఎన్నటికీ గ్రహించలేడు. గ్రహించే దృష్టి అతనిలో లేదు. సన్యాసిగా అయిన తరువాత అతను మఠాన్ని వదలిపెట్టి బయటకు వచ్చినట్లున్నాడు. అది అతని ఖర్మ. మనకనవసరం.

ఏదేమైనప్పటికీ అతనొక సాధువు.  పాపం వాళ్లకు ఆదాయం ఏముంటుంది? మనలాగా వాళ్లకు పొద్దున్నే కాఫీలు, టిఫిన్లు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? మనం ఇచ్చిన డబ్బుతో ఆయనకు రెండు రోజుల భోజనం దొరికితే చాలు. ఆయన సక్రమంగా ఉంటే ఇంకా ఇచ్చి ఉండేవాడిని. అతని అహంకారమే అతన్ని పాడుచేసింది. మనల్ని గుర్తించకుండా అతనికి అడ్డుపడినది కూడా ఆ అహమే. అహంకారం వల్ల, తన జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని ఈ స్వామీజీ కోల్పోయాడు. అహాన్ని పెంచే కాషాయం కషాయం అవుతుంది. మాయాప్రభావం ఇలా ఉంటుందని గ్రహించండి'. అన్నాను

'ఇది మాకందరికీ గొప్ప పాఠం గురూజీ' అన్నారు శిష్యులు.

'అవును. ఇంతటితో అతన్ని వదిలెయ్యండి. అతని ఖర్మ అతనిది. పదండి మంచి టీ త్రాగుదాం' అన్నాను.

అందరం కలసి ఆశ్రమం ఎదురుగా ఉన్న టీ హోటల్ వైపు దారితీశాము