“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, మార్చి 2023, మంగళవారం

ఆరోవిల్ లో మూడు రోజులు

ఇద్దరు కలలు గన్న ఒక స్వర్గం

నరకానికి నమూనా అయింది

హద్దులు లేవన్న విశ్వనగరం

సంకుచితపు సంత అయింది


అత్యున్నత ఆదర్శం 

ఐపు లేకుండా పోయింది

అనవసరపు ఆర్భాటం

అడుగడుక్కూ ఎదురౌతోంది


రేసిజాలు భేషజాలు విలాసాలు వినోదాలు

గ్రూపులు గూడుపుఠాణీలు కులాసాలు కుతంత్రాలు

గమ్యం తెలియని జీవితాలు

గట్టుకు చేరని ప్రయాణాలు


అవసరాల స్నేహాలు అడ్డురాని మోహాలు

చెడ్డీలు నిక్కర్లు అర్ధరాత్రి చక్కర్లు

'అంతా యోగమే' అంటూ

అదుపు లేని వ్యాపకాలు


సినిమాలు షికార్లు ఆదర్శాల కబుర్లు

ఆడామగా స్నేహాలు అచ్చిరాని వేషాలు

బ్రతుకుతెరువు అగచాట్లు

చాటుమాటు అలవాట్లు


కళల పండుగలు కలల కల్లోలాలు

కథలు కల్మషాలు కాఠిన్యాలు కార్పణ్యాలు

ఆదర్శాల ముసుగులలో

సంపాదనా ప్రయత్నాలు


యోగాలు గీగాలు నటనలు నాట్యాలు

భోగాలు భాగాలు కటకటల కష్టాలు

పూర్ణయోగ పెరట్లో

అంతులేని అగచాట్లు


ప్లాస్టిక్ నవ్వులు పైపై నటనలు

మనసుల నిండా గతుకులు

మట్టిలో కలుస్తున్న చితుకులు

పంటరాని సేద్యంలో

పగిలిపోతున్న బ్రతుకులు


అధికారపు చట్రంలో

ఆదర్శాలన్నీ పావులు

అయోమయపు లోకంలో

అలసిపోతున్న జీవులు


ఇదొక చావురాని సమాజం

ఇదొక పిచ్చిగుంపు ప్రయాణం

ఇదొక అలవిగాని అసహనం

ఇదొక ఆధ్యాత్మిక ప్రహసనం