“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

18, మార్చి 2023, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 47 (సౌందర్యలహరి పారాయణ)

మర్నాడు ఉదయం టిఫిన్లు అయిన తర్వాత 'వ' ఇంటికి వెళదామని బయలుదేరాము. దారిలో 'అ' ఎదురయ్యాడు. ఈయన రైల్వేలోనే పనిచేసి రిటైరై ఇక్కడ సెటిలయ్యాడు. డైరెక్ట్ గా నా క్రింద పని చేయకపోయినా నా స్టాఫ్ లోకే వస్తాడు.

నన్ను చూస్తూనే, 'సార్. పైన సౌందర్యలహరి జరుగుతోంది.  వెళ్లి చూడండి' అన్నాడు

నేను వెంటనే తల పైకెత్తి ఆకాశంలోకి చూస్తూ 'ఎక్కడా?' అన్నాను.

'భలేవారు సార్ మీరు. పైనంటే ఆకాశంలో కాదు. డాబామీద' అన్నాడు

'డాబామీద సౌందర్యలహరేంటి?' అన్నాను అనుమానంగా.
 
'అదికాదండి. హైద్రాబాద్ నుండి మూడు బస్సులలో  సౌందర్యలహరి బ్యాచ్ వచ్చింది. అందరూ  లేడీసే.  పైన  పారాయణం  జరుగుతోంది' అన్నాడు

'మరి మీరిక్కడున్నారేంటి? వెళ్లి పాల్గొనకుండా?' అడిగాను.

'మా మామయ్య వస్తే ఆయనతో ఉన్నా' అంటూ, 'మీరెక్కడికి?' అన్నాడు

'నేను మా అత్తయ్యగారింటికి వెళుతున్నా. అయినా, మీకు మామయ్య ముఖ్యమా సౌందర్యలహరి ముఖ్యమా?' అడిగాను.

'రెండూ ముఖ్యమే అనుకోండి. మీ అత్తయ్యగారు ఇక్కడుంటారా? ఎవరామె?' అన్నాడు అనుమానంగా.

'మీ మామయ్య భార్యే' అన్నాను నవ్వుతూ.

'మీవన్నీ జోకులే సార్. వెళ్లి చూదండి బాగుంటుంది' అన్నాడు.

'తెలుసు, నాకు గతంలో పరిచయమే, బానే ఉంటుంది. అయినా మీరు చెప్పాక చూడకపోతే ఎలా? రండి కలిసే పోదాం' అంటూ గట్టిగా చెయ్యి పట్టుకున్నా.

'ఆమ్మో, నాక్కొంచెం పనుంది. వదలండి సార్' అన్నాడు చెయ్యి గింజుకుంటూ.

'అలా రా దారికి' అని నవ్వుకుంటూ అతని చెయ్యి వదిలేసి 'వ' ఇంటివైపు దారితీశాము.

ఇంట్లోకి వెళ్లి కూర్చోవడంతోనే, 'పైన సౌందర్యలహరి జరుగుతోంది. వెళ్లి చూడండి, మూడు బస్సుల్లో వచ్చారు హైద్రాబాద్ నుండి' అంటూ 'వ' కూడా మళ్ళీ అదే పాట మొదలుపెట్టింది.

చిరాకేసింది.

తాపీగా బెంచీమీద కూచుంటూ, 'చేసేవాళ్ళకే దిక్కులేదు. చూసేవాళ్ళకి ఏమొస్తుంది?' అన్నాను.

'వ' అనుమానంగా చూసింది.

సూక్ష్మంగా చెబుతుంటే ఎంత చెప్పినా వీళ్లకు ఎక్కదనిపించి, ఇలా వివరించాను.

'సౌందర్యలహరి అనేది పారాయణ చేసే స్తోత్రం కాదు. అది తంత్రసాధనా రహస్యాలతో కూడుకున్న సాధనాదిక్సూచి. అది ఆచరించవలసినది. అందులో అనుభవం ఉన్న గురువు  దగ్గర ఆ సాధనలు నేర్చుకుని అభ్యాసం చేయాలి. అది తంత్రశాస్త్రం. ఈ విషయం తెలీని ఆడాళ్ళు పదిమంది చేరి అరుస్తూ పారాయణాలు చేసి మురిసిపోతున్నారు. ఇలాంటి బ్యాచ్ లను ఇప్పుడు మీరు చూస్తున్నారేమో. 1986 లో నేను గుంతకల్లులో ఉన్నప్పుడే అక్కడ ఈ పారాయణాలు చేసేవాళ్ళు నాకు తెలుసు. అంతకు ముందు 1979 ప్రాంతాలలోనే అలా పారాయణాలు చేసేవాళ్లను నేను చూచాను. అసలు విధానం అది కాదు. సౌందర్యలహరి అనేది ఒక తాంత్రిక సాధనామార్గం. శ్రీవిద్యలో లోతుపాతులు తెలిసినవాడికి ఆ శ్లోకాలు, ఆ సాధనారహస్యాలు అర్ధమౌతాయి. ఊరకే పారాయణ చేస్తే నోరునొప్పి తప్ప ఏమీ రాదు. తెలివిలేని వాళ్ళు చేరి పొలోమంటూ పారాయణ చేస్తుంటే నేనెళ్ళి చూడటమేంటి? వెళ్లి చూడమని నువ్వు చెప్పడమేంటి? అర్ధముందా అక్కయ్యా అసలు?' అన్నాను.

నేను చెప్పినది ఆమెకు నచ్చలేదని ఆమె ముఖం చూస్తే అర్ధమైంది. అంతేకాదు, వీళ్ళతో నా వేవ్ లెంగ్త్ కుదరదని కూడా నాకు బాగా అర్ధమైపోయింది.

నాదేమో తాత్విక జ్ఞానచింతనతో కూడిన  ఆచరణాత్మక యోగ-వేదాంత మార్గం. అమ్మలో నాకు నచ్చినది అదే.

వీళ్లేమో పూజలు, పారాయణలు, ప్రదక్షిణలు, వ్రతాలు, మొక్కులు, కోరికలు తీరడాలు, చవకబారు మహిమలలో మునిగిపోయి ఉన్నారు. అమ్మ ఏదైతే వద్దన్నదో దానినే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎవరినైతే నేను  శుద్ధమైన స్వాములుగా గుర్తించనో వారిని గొప్పవాళ్ళుగా వీళ్ళు అనుకుంటున్నారు. చెబితే వినే స్థితిలో కూడా లేరు. చాలా విసుగనిపించింది.

ఇకమీదట జిల్లెళ్ళమూడి రావడం తగ్గించాలని, వచ్చినా అందరినీ కలవకూడదని అదేక్షణంలో నిశ్చయించుకున్నా

ఇక అక్కడ కూచోలేక లేచి మా ఇంటికి వచ్చేశాను.

భోజనాల సమయంలో డైనింగ్ హాలంతా పట్టుచీరల ఆడాళ్ళతో హడావుడిగా ఉంది. పారాయణ అయిపోయినట్టుంది. అందరూ భోజనాలకని క్రిందకు వచ్చి, గోలగోలగా కబుర్లు చెప్పుకుంటూ, సెల్ఫీలు దిగుతూ, ఒక సంతలాగా అటూఇటూ తిరుగుతూ కనిపించారు.

మేము ఒక ప్రక్కగా కూచుని భోజనం చేస్తూ వాళ్ళ గోలను మౌనంగా గమనిస్తున్నాము.

'ప్రపంచమంతా మాయే' అని శంకరులు ఎందుకన్నారో మళ్ళీ ఇంకోసారి నాకర్ధమైంది.