“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

17, మార్చి 2023, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 46 (స్వామి సింహస్వప్నానంద)

బాపట్లలో రైలు దిగి  జిల్లెళ్ళమూడి చేరేసరికి రాత్రి పన్నెండయింది.

మర్నాడు ఉదయమే లేచి స్నానపానాలు ముగించి అమ్మ దర్శనం చేసుకుని 'వ' ఇంటికివెళ్ళాము.

ఆ  మాటా ఈ మాటా మాట్లాడుతూ కూచుని ఉండగా ఒకామె అక్కడకు వచ్చింది. ఆమె పేరు 'స' అని పరిచయం చేసింది 'వ'. ఆమెకు 40  లోపు ఉంటాయి. ఆరేళ్ళనుంచీ CVV గారి మార్గంలో సాధన చేస్తోందంటూ నాకు గొప్పగా పరిచయం చేసింది 'వ'.

ఒక్క క్షణం ఆమెవైపు చూశాను. విషయం అర్ధమైంది. చచ్చే నవ్వొచ్చింది. చాలా స్పీడుగా ఉందామె.

'నమస్తే' అన్నాను.

ఇంతలో ఆమె ఒక కుర్చీని బర్రున లాక్కుని మా ఎదురుగా కూచుని, ' మీదేదో ఆశ్రమం అని అక్కయ్య చెప్పింది. ఏ ఆశ్రమం మీది?' అడిగింది దర్పంగా.

'ఉత్త ఆశ్రమమే' అన్నాను నేను నవ్వుతూ.

'అలా కాదు' అంటూ, కొంతమంది పాపులర్ గురువుల పేర్లు చెప్పి, 'వాళ్ళ ఆశ్రమం బ్రాంచా?' అడిగింది మళ్ళీ.

'కాదు మా బ్రాంచే' అన్నా నేను నవ్వాపుకుంటూ.

'అంటే మీదాంట్లో ఏముంటుంది? అందామె

'మా దాంట్లో అన్నీ ఉంటాయి' అన్నాను.

'అన్నీ అంటే?' రెట్టించింది దర్పంగా 

'కొన్ని కానివి' అన్నాను కూల్ గా.

ఇలా కాదనుకుందేమో తన గురించి చెప్పడం మొదలుపెట్టింది.

'నేను మొదట్లో సాయిబాబా భక్తురాలిని' అంది.

'ఏ మొదట్లో?' అన్నాను నేను

'అంటే ఆరేళ్లదాకా' అంది.

'మీరు పుట్టినప్పటినుంచీ ఆరేళ్లదాకానా?' అడిగా నేను సీరియస్ గా నవ్వాపుకుంటూ

ఆమెకు కోపమొచ్చింది.

'కాదు. ఆరేళ్ళ క్రిందటిదాకా' అంది స్వరం పెంచి

'సాయిబాబా దేవుడా?' అడిగా నేను సూటిగా రంగంలోకి దిగుతూ

'అవును. ఆయనే నన్ను CVV గారికి అప్పజెప్పాడు' అంది తను

'ఏం తన వల్ల కాలేదా?' అడిగా నేను పొట్ట చేత్తో పట్టుకుంటూ

ఆమె అహం దెబ్బతింది

'CVV గారి ప్రేయర్ తో రోగాలు తగ్గుతాయి' అంది

'అలాగా. మరి CVV గారు ఎందుకు రోగంతో చనిపోయాడు? ఆయన భక్తులందరికీ రోగాలెందుకొస్తున్నాయి?' అడిగాను

'అది వాళ్ళ కర్మ' అందామె 

'అంటే, జరిగితే మన గొప్ప, జరగకపోతే కర్మనా? ఇంతకీ CVV కర్మకు అతీతుడా కాదా?' అడిగాను

'మీరు అయన సాధన చేస్తే తెలుస్తుంది' అందామె

'ఇది తెలియడానికి సాధన ఎందుకు? మీరు చెప్పొచ్చుగా.  అయినా, నేను  సాధన చెయ్యలేదని మీకెవరు చెప్పారు?' అడిగాను

'మీకు CVV గారు ఎప్పుడు తెలుసు?'అడిగిందామె తగ్గకుండా

ఏకవచనంలోకి దిగాను.

'నువ్వు పుట్టడానికి పదిహేనేళ్ల ముందు నుంచి తెలుసు' అంటూ, 'మేకమాంసం తింటూ, హిందూ పద్ధతులు ఏమాత్రమూ పాటించకుండా, నమాజ్ చేస్తూ,  మసీదులో ఉంటూ, అల్లాని ప్రార్ధించిన సాయిబాబా దేవుడని నువ్వెలా అనుకున్నావు? ఎలా పూజించావు?' అన్నాను

తగ్గి, బిక్కముఖం వేసింది.

'వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, MN గారు, EK గారు చివర్లో రోగాలతో ఎందుకు చనిపోయారు? CVV ప్రేయర్ చేసినవాళ్ళే కదా వీళ్ళందరూ?  అయినా, ప్రేయరేంటి? క్రైస్తవులా వీళ్ళు? ఆ తర్వాత నమాజా? ఆడాళ్లకి బురఖానా? లేక మొగాళ్ళకి కూడా వేస్తున్నారా బురఖా?' అడిగాను

'వాళ్లెవరో నాకు తెలీదు' అందా పిల్లకాకి

జాలేసింది. 

ఇంతలో ఆమె మళ్ళీ అందుకుని 'జిల్లెళ్ళమూడి అమ్మగారికి జబ్బుచేస్తే శార్వరిగారి శిష్యులు CVV ప్రేయర్ చేశారు హైదరాబాద్ లో. అప్పుడు అమ్మకు తగ్గింది' అన్నది

'వాళ్లింకా ఉన్నారా?' అడిగాను.

'లేరు. శార్వరిగారు పోయారు,  శిష్యులు కూడా పోయారు' అందామె.

తలుపు దగ్గర అలికిడయింది.

'ఎవరా?' అని చూస్తే, గుంటూరునుంచి మూర్తి. రాత్రి బాపట్లలో దిగకుండా, రైల్లో గుంటూరు పోయి, పొద్దున్నే కారేసుకుని జిల్లెళ్ళమూడి వచ్చేశాడు.

'రా మూర్తీ కూచో ' అంటూ, 'అమ్మగారు కూడా పోయి 38 ఏళ్లవుతోంది. మరి రోగం వచ్చినవాళ్లు, ప్రేయర్ చేసి తగ్గించినవాళ్లు అందరూ  వెళ్లిపోవడమేంటి? ప్రేయర్ చేసుకుంటూ ఇక్కడే శిలాశాసనంగా  ఉండాలి కదా?' అడిగాను.

'అది దేహధర్మం' అన్నదామె తెలివిగా.

'రోగం రావడం దేహధర్మం కాదా?' అడిగాను.

మళ్ళీ తెల్లముఖం వేసింది.

'చావొక్కటే దేహధర్మమైతే మిగతావన్నీ ఏ ధర్మాలు?' అడిగాను.

మళ్లీ బిక్కముఖం.

తేనెటీగ చేతిని కుడుతూ చెయ్యంతా వాచిపోతుంటే, 'పోనీలే దాని భక్తి దానిది' అంటూ చూస్తూ నిర్వికారంగా ఊరుకుంది అమ్మ. 

'అమ్మా, జబ్బు కాస్త తగ్గిందా?' అని భక్తులంతా అడిగితే, 'మీలాగా అది కూడా వచ్చి, వదిలి పోనంటోంది'  అని నవ్వేసింది.

అలాంటి అమ్మెక్కడ? పొద్దున మోషన్ కాకపోతే, "దేవుడా మోషన్ వచ్చేట్టు చెయ్యి ప్లీజ్' అని వేడుకుంటూ దానికోసం ప్రేయర్ లో కూచునే వీళ్లంతా ఎక్కడ? అసలు పోలికుందా? పోల్చడానికి నీకు బుద్దుందా అసలు? అమ్మకు రోగమొస్తే తగ్గించగలిగేవాళ్ళా వీళ్ళు?' స్వరం పెంచాను.

అప్పటికి దిగి నేలమీదకు వచ్చి, 'ఏమోనండి. అంత జ్ఞానం నాకు లేదు' అన్నది.

'జ్ఞానం లేనప్పుడు లేనట్టు ఉండాలి. ఉన్నట్టు మాట్లాడకూడదు. నీకు జలుబో దగ్గో జ్వరమో వస్తే డాక్టర్ని కలుస్తావా? ప్రేయర్ చేసుకుంటూ రూములో తలుపేసుకొని కూచుంటావా? నిజాయితీగా చెప్పు' అడిగాను.

'అంటే మనకంత శక్తి లేదు కదండీ' అన్నది

'మనకు అంటూ నన్ను కూడా కలిపావు సంతోషం. నాకెలాగూ అంత శక్తి లేదు. మరి ఆరేళ్ళ నుంచీ CVV ప్రేయర్ చేస్తున్న నీకుండాలి కదా? ఎందుకు లేదు? ప్రేయర్ అనేది క్రైస్తవ విధానం. అది మనకెందుకు? పోనీ కాసేపు సరే అనుకుందాం. ప్రేయర్ ప్రయోజనం రోగాలు తగ్గడమా?  ఇంకేదైనా ఉందా? చక్రవర్తి దర్బారులో నిలబడి పుచ్చువంకాయలు కోరుకున్నట్లుంది' అన్నాను.

ఆమెకు విషయం అర్థమైంది.

గాభరాగా మొబైల్లో టైం చూసుకుందామె

'ఉంటానండి. పదౌతోంది. ఆఫీసులో  అర్జెంటు పనుంది. వస్తానక్కయ్యా' అంటూ హడావుడిగా లేచి వెళ్లిపోయిందామె.

ఇంతలో తలుపుదగ్గర మళ్ళీ అలికిడైతే అటువైపు చూశాం అందరం.

రాధిక వాళ్ళ బంధువు గతంలో మాతో మాట్లాడినామె. 'వ' కోసం వచ్చినట్టుంది. లోపలకు రాబోయి, నన్ను చూసి, ఏదో దయ్యాన్ని చూసినట్టు గతుక్కుమని, తలుపేసి అమ్మ గుడివైపు గబగబా పారిపోయింది.

మళ్ళీ భలే నవ్వొచ్చింది. 'పిచ్చి రాధిక  చేతిలో బాగా దరువు పడినట్టుంది ఈమెకి' అనుకున్నా. 

ఈ మధ్య ఎక్కడ చూసినా కామెడీ కేసులే.

నవ్వే నవ్వు.

ఇంకెందుకులే అక్కడుండి అందరినీ ఇబ్బందిపెట్టడమని 'వస్తామక్కయ్యా' అంటూ లేచి మా ఇంటికి దారితీశాము. 

దారిలో నడుస్తుండగా 'మూర్తీ. త్వరలో సన్యాసం స్వీకరించి 'స్వామి సింహస్వప్నానంద' అని పేరు మార్చుకుందామనుకుంటున్నా, ఈ ఒక్క నెలే నార్మల్ డ్రస్. ఆ తర్వాత కాషాయవస్త్రాలే. ఇక దరువే అందరికీ' అన్నాను.

అందరూ గొల్లున నవ్వేశారు.

అలా సరదాగా మాట్లాడుకుంటూ అందరం ఇంటిదారి పట్టాం.