“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, మార్చి 2023, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 48 (శ్వాస మీద నిఘా)

నిన్న ఉదయాన్నే బయటకెళ్ళి ఒక బడ్డీ హోటల్లో టిఫిన్ తెచ్చుకుంటుంటే దారిలో అప్పారావుగారు ఎదురయ్యారు. అమ్మ గుడినుంచి ఇంటికి పోతున్నాడాయన. ప్రతిరోజూ అమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకుని మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి పోతూ ఉంటాడు.

మా ఇళ్లమధ్యన దూరం నాలుగిళ్లే. వాళ్ళ అల్లుడుగారు కట్టించినవే నేనుంటున్న అపార్ట్ మెంట్స్.

'ఎప్పుడొచ్చారు?' అన్నాడు

'రెండు రోజులైంది' అన్నా

'మరి కలవవచ్చు కదా?' అన్నాడాయన

నవ్వేసి, 'వీలు చూచుకొని వస్తా లెండి. మీరీ మధ్యన బాగా బిజీ అని తెలిసింది. మీ యూట్యూబ్ వీడియో చూచామని చాలామంది చెబుతున్నారు' అన్నా

'అవును. నెలక్రితం ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు 'కుండలినీ యోగాన్ని సులభంగా నేర్పించే అజ్ఞాతయోగి' అంటూ ఒక వీడియో చేశారు. అప్పటినుంచీ జనం వరదలాగా వస్తున్నారు. హైద్రాబాద్ నుంచి కూడా కార్లేసుకుని మరీ వస్తున్నారు. కుండలినీ యోగం టెక్నిక్  ఏమిటో చెప్పమంటారు. నేర్పించమంటారు. నేనేం చెప్పేది? అమ్మ ఇచ్చింది. వచ్చింది. అంతే చెబుతున్నాను వాళ్ళకి' అన్నాడాయన

'మీరు మంచిపని చేస్తున్నారు. అబద్ధాలు చెప్పకుండా ఉన్నదున్నట్లు చెబుతున్నారు. అది మంచిది. ప్రస్తుతం కుండలిని అనేది పెద్ద బిజినెస్. దానిపైన కోట్ల డాలర్ల వ్యాపారం నడుస్తోంది. "ఈ టాబ్లెట్ వేసుకో. జ్వరం తగ్గుతుంది" అన్నట్లు జనానికి చెప్పాలి. అప్పుడు వాళ్ళు గురువులై ఇంకో షాపు పెట్టుకుంటారు. కుండలిని అలా రాదని చెబితే ఎవడికి అర్ధమౌతుంది ఈ మాయాలోకంలో? దేవుడిని కూడా రూపాయికి అమ్మేసే మనుషులు ప్రస్తుతం' అన్నాను

'శ్వాస మీద నిఘా వెయ్యి' అని అమ్మ ఒక ఇరవై ముప్పై మందికి చెప్పింది. వాళ్లలో ఇద్దరో ముగ్గురో మాత్రం సక్సెస్ అయ్యాము' అన్నాడాయన

'క్లాసులో అందరికీ డిస్టింక్షన్ రాదుగా. పైగా శ్వాస మీద నిఘా వేసిన అందరికీ కుండలిని అందదు. దానికి శుద్ధమైన ప్రాణశక్తి ఉండాలి, సాధనాబలం ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి కదా' అన్నా నేను నవ్వుతూ.

నా మాట వినిపించుకోకుండా,  ఆయన ధోరణిలో ఆయన  చెప్పడం సాగించాడు.

'మొదట్లో ప్రాణసంచారం దగ్గర ఆగిపోయింది. తరువాత అదంతా భ్రూమధ్యంలో ఒక వెలుగుగా మారింది. అవి మెరుపుల లాగా కనిపించే చిత్కళలు కావు. వెలుగే కనిపించింది. ఆ తరువాత ఆ వెలుగు పలచబడి ఒళ్ళంతా వ్యాపించింది' అన్నాడు.

ఆయన ధోరణికి అడ్డుతగుల్తూ  'మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడా స్థితి వస్తుందా?' అడిగాను

'ఇప్పుడది కూడా అవసరం లేదనిపిస్తోంది. అంతా ప్రశాంతంగా ఉంది. ఆలోచనలు లేవు. రెండూ ఒకేసారి ఉన్నాయి' అన్నాడాయన

'అంటే బాహ్యమూ అంతరికమూనా?'ఆడిగాను. 

'అవును. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా అది ఉంది. రెండూ ఒకేసారి ఫీలౌతున్నా' అన్నాడు.

'మంచిదే, మీరు ముందుకే ప్రయాణిస్తున్నారు. ఇంకా నడవాలి' అన్నాను.

'తర్వాతేమౌతుందో తెలియదు. నాకు శాస్త్రజ్ఞానం లేదు. అమ్మ యోగానుభూతి ఇచ్చింది. అందుకే శాస్త్రాలు తెలిసిన మీలాంటి వారిని అడుగుతున్నాను' అన్నాడాయన.

'నాకూ శాస్త్రాలు తెలీవు. నేనేమీ గురువులదగ్గర శాస్త్రాధ్యయనం చెయ్యలేదు' అన్నా నేను.

'మరి మీరు వ్రాసిన అన్ని పుస్తకాలు?' అన్నాడాయన సందిగ్ధంగా.

'అమ్మ మీకు అనుభూతిని ఇచ్చినట్లే నాకూ ఇచ్చింది. అంతే. అయినా అమ్మ ఇచ్చిందంటున్నారు కదా. ఇతరులను అడగడమెందుకు? అమ్మకే వదిలెయ్యండి. ఎక్కడికి నడిపించాలో అక్కడికి అమ్మే నడిపిస్తుంది. మళ్లీ  దాంట్లో సందేహమెందుకు?' అన్నాను నవ్వుతూ,

'మీ అనుభవాలు చెప్పండి' అన్నాడాయన

నవ్వాను

'మీ అనుభూతిని అర్ధం చేసుకోగలగడమే నా అనుభూతి' అన్నా.

'పెద్దవాడినయ్యాను. ప్రస్తుతం 88 నడుస్తున్నాయి. మీరున్న చోటకు రాలేను. మీరే వచ్చి పోతూ ఉండండి' అన్నాడాయన.

'వీలున్నప్పుడు నేనే మీ ఇంటికి వస్తాను. మీరు శ్రమపడకండి. ఒక్కమాట వినండి. ప్రయత్నంతో వచ్చేది అసహజం. అప్రయత్నంగా వచ్చేది సహజం. ఇది నా మాట కాదు. అమ్మ మాటే' అని చెప్పాను.

ఆయన దారిన ఆయనెళ్లిపోయాడు. నా దారిన నేనొచ్చేశాను.