“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

15, ఆగస్టు 2017, మంగళవారం

స్వతంత్రం ఎలా వస్తుంది??


స్వతంత్ర దినోత్సవ సమావేశం జరుగుతోంది.

మీటింగులో కూచుని ఉన్నానేగాని పరమ చిరాగ్గా ఉంది. హిపోక్రసీతో నిండిన మనుషుల ఆరాలు పరమ అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి.కుళ్ళిపోయిన మురికిగుంటలో కూచుని ఉన్నట్లుంది. తప్పదుగా? అందుకని భరిస్తూ, అన్యమనస్కంగా కూచుని చూస్తున్నా.

అవినీతి పరులందరూ నీతిగురించి మైకులో ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. ఒకరికొకరు భుజకీర్తులు తగిలించుకుంటున్నారు. కిరీటాలు పెట్టుకుంటున్నారు. దండలేసుకుంటున్నారు. స్వతంత్రం వాళ్లవల్లే వచ్చినట్లు తెగ ఉపన్యాసాలిస్తున్నారు. నాకేమో వాళ్ళ లోపలి స్వరూపాలు కనిపిస్తున్నాయి. ఒకపక్కన నవ్వొస్తోంది. ఇంకోపక్క మనుషులంటేనే అసహ్యమేస్తోంది.

స్వతంత్రం స్వతంత్రం అంటున్నారు.అసలైన స్వతంత్రమంటూ మనిషికి ఉందా? అని ఆలోచనలో పడ్డాను. లేదని జవాబొస్తోంది. కానీ మనస్సు ఒప్పుకోవడం లేదు. ఇలా ఉన్న నా అంతర్నేత్రం ముందు అకస్మాత్తుగా అయిదుగురు అమ్మాయిలు కనిపించారు. అందరూ ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. వారివైపు ప్రశ్నార్ధకంగా చూచాను.

'ఎవరు మీరు?' మానసికంగా వారిని అడిగాను.

'మేము నీలో భాగాలం' అన్నారు వారు ముక్త కంఠంతో.

'మీకేం కావాలి? ఎందుకు నా ముందుకొచ్చారు?' అడిగాను మళ్ళీ.

వారిలో బలంగా ఉన్న ఒకామె ఇలా అంది.

'స్వతంత్రం ఎలా వస్తుందని సందేహ పడుతున్నావుగా? అందుకే వచ్చాం?'

ఏం చెప్తారా అని నేను వారివైపే నిశితంగా చూస్తున్నా.

మళ్ళీ ఆమే ఇలా అంది.

'నేను కరిగినప్పుడే నాకు స్వతంత్రం'

రెండో ఆమె అందుకుంది.

'నేను ఆవిరైనప్పుడే నాకు స్వతంత్రం'

మూడో ఆమె అంది.

'నేను ఆరిపోయినప్పుడే నాకు స్వతంత్రం'

నాలుగో ఆమె ఇలా అంది.

'నేను ఆగిపోయినప్పుడే నాకు స్వతంత్రం'

ఐదో ఆమె మౌనంగా చూస్తోంది.

'నువ్వేం చెప్పవా?' అన్నాను మౌనంగా.

'నా మౌనంలోనే నా జవాబుంది. అర్ధం చేసుకో.' అందామె తనూ మౌనంగా.

'మీ అయిదుగురికీ స్వతంత్రం వస్తే నాకేమౌతుంది?' అడిగా మళ్ళీ మౌనంగానే.

'ఇలా అడుగుతున్నంత వరకూ నీకు స్వతంత్రం ఎప్పటికీ రాదు' అని నవ్వుతూ వాళ్ళు మాయమై పోయారు.

చూస్తున్న దృశ్యం మాయమైంది.

స్వతంత్రం ఎలా వస్తుందో అర్ధమైంది.

అలాగే అప్పటిదాకా వినిపించకుండా మ్యూట్ అయిపోయిన మీటింగ్ గోల సడెన్ గా మళ్ళీ వినిపించడం మొదలైంది.

'మహానుభావులు ఎంతో కష్టపడి తెచ్చిన స్వతంత్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి' అంటూ మైకులో ఏదేదో వాగుతున్నాడు ఒక అవినీతి తిమింగలం.

నవ్వుకుంటూ బేరర్ అందించిన టీ కప్పును చేతిలోకి తీసుకున్నా.