“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, ఆగస్టు 2017, ఆదివారం

ఛిన్నమస్తా సాధన - 4

బౌద్ధతంత్రాలలో ఈమెను వజ్రవారాహి అనీ వజ్రయోగిని అనీ వజ్రతార అనీ పిలుస్తారు. 'చిన్నముండ వజ్రవారాహి సాధన' అనేది వజ్రయాన తంత్రాలలోని ఒక గ్రంధం. దీనిలో ఈ దేవత సాధనలు వివరంగా ఇవ్వబడ్డాయి. హిందూ తంత్రాలలో అయితే ఈమెను క్రోధకాళి అనీ ఉన్మత్తకాళి అనీ పిలుస్తారు. దశ మహావిద్యా దేవతలలో కాళి, తార, చిన్నమస్తిక ఒక గ్రూపుకు చెందిన దేవతలు.ఎందుకంటే వీరి ఆకారాలు భయానకంగా ఉండటమే గాక, మామూలు మనుషులకు అర్ధంకాని రహస్య తాంత్రిక కాన్సెప్ట్ లతో ముడిపడి ఉంటాయి. ఆయా మార్గాలలో సాధన చేసేవారికే వీరి ఆకారాల వెనుక ఉన్న రహస్యాలు అర్ధమౌతాయి గాని ఊరకే గుడికెళ్ళి భయం భయంగా 'దేవుడా నా తప్పులు క్షమించు.నన్ను కాపాడు' అంటూ దణ్ణాలు పెట్టుకునే మామూలు నేలబారు భక్తులకు ఈ రహస్యాలు అందవు. ఎందుకంటే ఇవి సాధనా రహస్యాలు గాబట్టి వీటిని అనుభవ పూర్వకంగా గ్రహించాలి గాబట్టి. అర్హత ఉన్న సాధకులకూ సాధికలకే ఈ రహస్యాలు చెప్పబడతాయి గాని ఊరకే కుతూహలపరులకు ఎన్నటికీ ఇవి తెలియబడవు, అందవు.

వజ్రయానంలో ఈ దేవత మహాసిద్ధ సాంప్రదాయంలో మనకు కనిపిస్తుంది. వజ్రయానంలో 84 మంది మహాసిద్ధులు ఉన్నారు. వీరిలో రాజులు రాణుల నుంచి అతి సామాన్యులైన భిక్షుకుల వరకూ అన్ని వర్గాల వారూ అన్ని కులాలవారూ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మహత్తరమైన గాధ. వీరిలో మనకు కనిపించే లక్షణాలు - ఉన్నతమైన అనుభవ జ్ఞానంతో బాటు అతీతశక్తులను ప్రదర్శించే సిద్ధత్వం. దీనికి తోడుగా వీరిలో కొందరు మహాపండితులై ఉండేవారు. మరికొందరు చదువురాని వారై ఉండేవారు. కొందరేమో సమాజంలో ఉన్నతకులాల నుంచి వచ్చిన వారైతే ఇంకొందరు చాలా తక్కువ కులాల నుంచి వచ్చిన సిద్దులై ఉండేవారు. బహుశా వీరికి పోటీగా హిందూమతంలో నవనాధ సాంప్రదాయం వచ్చి ఉండవచ్చు. ఈ మహాసిద్ధులూ, నవనాధులూ అందరూ దాదాపుగా సమకాలికులే. అంతేగాక వైష్ణవ ఆల్వార్లూ శైవ నాయనార్లూ కూడా వీరి పంధాలో నడిచినవారే కావచ్చు (సిద్ధాంత పరమైన భేదాలున్నప్పటికీ).

మహాసిద్ధ కన్హప అనే గురువు చరిత్రలో వజ్రవారాహి యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. కన్హ అంటే కృష్ణ అని అర్ధం. కృష్ణయ్య కన్నయ్య అనేవి పర్యాయపదాలే. ఈయన అసలు పేరు. కృష్ణాచార్యుడు. రంగులో నల్లగా ఉండేవాడని ఈయనకు 'కృష్ణ' అనే పేరు వచ్చి ఉండవచ్చు. ఈయన మహాసిద్ధ గోరఖ్ నాధునికి సమకాలికుడని అంటారు. గోరఖ్ నాదునితో ఈయనకు వైరం ఉండేదనీ, ఇద్దరికీ చాలాసార్లు గొడవ జరిగిందనీ, శక్తులు ప్రదర్శించడంలో ఎవరు ఎక్కువ అని పోటీ పడ్డారనీ, వాటిల్లో చాలాసార్లు కృష్ణాచార్యుడు ఓడిపోయాడనీ తంత్ర ప్రపంచంలో గాధలున్నాయి. అయితే, టిబెటన్ తంత్ర సంప్రదాయంలోనూ, బెంగాల్ తంత్ర మార్గమైన 'సహజ' మార్గంలోనూ కృష్ణాచార్యుని 'చర్యానాధ', 'కన్నప' అనే పేర్లతో చాలా గౌరవిస్తారు. బహుశా తెలుగువాడైన 'భక్త కన్నప్ప' కు ఆ పేరు అతనికంటే ప్రాచీనుడైన ' మహాసిద్ధ కన్హప' పేరు మీదనే పెట్టబడి ఉండవచ్చు.

ఈయన గురువు జాలంధరనాధుడు. శైవ సాంప్రదాయపు నాధసిద్దులైన మస్త్యేంద్రనాధుడు, గోరక్షనాధుడు టిబెటన్ తంత్రసాంప్రదాయం (వజ్రయానం) లో కూడా మహాసిద్దులుగా స్వీకరించబడ్డారు. అలాగే వీరి పరంపరలోని వాడైన కృష్ణాచార్యుడు కూడా. సామాన్యంగా ఆ కాలంలో నాధసిద్ధులకూ బౌద్దులకూ మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటూ ఉండేది. ఎందుకంటే ఒకరు శివభక్తులు ఇంకొకరు బుద్ధుని శిష్యులు. కానీ విచిత్రంగా, ఈ ముగ్గురు సిద్ధులూ మాత్రం రెండు సంప్రదాయాలలోనూ సమానంగా గౌరవింపబడుతూ మనకు కనిపిస్తారు.

'చతురశీతి సిద్ధ ప్రవృత్తి' అనే గ్రంధం లోనూ, 17 వ శతాబ్దానికి చెందిన టిబెటన్ గురువు పండిత తారానాధుడు వ్రాసిన పుస్తకాల లోనూ మహాసిద్ధ కృష్ణాచార్యుని గాధలు మనకు లభిస్తున్నాయి. ఈ గాధలలోనే మనకు 'చిన్నముండా/ చిన్నమస్తా దేవి' యొక్క మూలాలు దర్శనమిస్తాయి. 

తన గురువైన జాలంధరనాధుని వద్ద ఈయన బౌద్ధతంత్రమైన 'హేవజ్ర తంత్రం' లో దీక్ష స్వీకరించినట్లు తెలుస్తున్నది. ఈయన దేవపాలుడనే రాజు కాలంలో (క్రీ.శ. 800 ప్రాంతం) బెంగాల్లో బౌద్ధభిక్షువుగా నివసించినట్లు ఆధారాలున్నాయి. అనేక సంవత్సరాల పాటు వజ్రవారాహి సాధన చెయ్యడం వల్ల ఈయనకు అనేక అద్భుత శక్తులు కలిగాయి.ఈయనకు అనేక వేలమంది శిష్యులు కూడా ఉండేవారు. వారిలో ఇద్దరు మహిళామణులతో 'వజ్రవారాహి' సాధన ముడిపడి ఉన్నట్లు మనకు టిబెటన్ తంత్రగ్రందాల నుంచి తెలుస్తున్నది. వాళ్ళిద్దరి పేర్లు మేఖల, కనఖల.

ఈ మేఖల కనఖల అనే ఇద్దరు బ్రాహ్మణ అక్కా చెల్లెళ్ళ రూపాలే మనం చూచే చిన్నమస్తా చిత్రంలో ముఖ్యదేవతకు రెండువైపులా నిలబడి ఆమె ఖండిత శిరస్సు నుంచి వెలువడే రక్తాన్ని త్రాగుతున్న ఇద్దరు దేవతలుగా చూడవచ్చు.

కృష్ణాచార్యుడు వ్రాసిన 'శ్రీ హేవజ్రైకవీర సాధన' అనే గ్రంధాన్ని బట్టి 'చిన్నమస్తా దేవతకు 'ఏకవీర' అనే పేరు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. హిందూ మతంలోని జానపద సాంప్రదాయాలలో పూజింపబడే 'రేణుక', 'ఎల్లమ్మ తల్లి' 'ఏకవీర', 'పోలేరమ్మ' మొదలైన గ్రామదేవతలందరూ ఈ చిన్నమస్తాదేవి యొక్క రకరకాలైన రూపాలే. అందుకే వీరికి ఒక్క శిరస్సు మాత్రమే ఉండి ఆ శిరస్సు చుట్టూ జ్వాల ఆవరించి ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇది ఖండిత శిరస్సుకు సూచిక.

శైవతంత్రాలలో భాగమైన శివశక్తి సంభోగ సాధనలను టిబెట్ కు పరిచయం చేసినది ఈ క్రిష్ణాచార్యుడే అని చరిత్రకారుల భావన. హేవజ్రతంత్రంలో కూడా వజ్రయోగిని - హేరుక చక్రసంవరులు, యాబ్-యుమ్ భంగిమలో సంభోగముద్రలో ఉన్నట్లు మనం చూడవచ్చు. టిబెటన్ తంత్రంలో వీళ్ళిద్దరూ భైరవి - భైరవులకు సమానంగా స్వీకరించబడ్డారు. హేవజ్ర తంత్రంలో స్త్రీ పురుష ఉపాసకుల సంభోగం అనేది ఒక తప్పనిసరి భాగంగా ఉంటుంది. శైవ శాక్త తంత్రాల సాధనా విధానాలకూ, బౌద్ధ తంత్రమైన వజ్రయానంలోని సాధనా విధానాలకూ చాలా పోలికలున్నాయి. ఇవన్నీ రహస్య సాధనలని మామూలు భక్తులకు మామూలు మతాచార పరులకు ఏ మాత్రము తెలియని అందని రహస్యాచరణలని ఇంతకు ముందే చెప్పాను.

శైవంలో భైరవుడు అనే కాన్సెప్ట్ బౌద్ధంలో బుద్ధునికి సూచికగా స్వీకరించబడింది. అదే విధంగా భైరవి అనే కాన్సెప్ట్ బౌద్ధ తంత్రంలో యోగిని లేదా 'ముద్ర' గా స్వీకరించబడింది. పంచ మకారాలలో 'ముద్ర' అనే పదానికి సాధకురాలు, తంత్రసాధనలో సహచరి, సహయోగిని అనేవే అసలైన అర్ధాలు. టిబెటన్ తంత్రంలో ఎక్కువగా వాడబడే 'కర్మముద్ర', 'జ్ఞానముద్ర', మహాముద్ర' అనే పదాలలో కర్మముద్ర అంటే సహయోగిని, సహసాధకురాలు, తంత్ర సహచరి అనేవే అసలైన అర్ధాలు.


హేవజ్ర తంత్రానికి క్రిష్ణాచార్యుడు వ్రాసిన భాష్యం 'యోగరత్న మాల', 'హేవజ్ర పంజిక' అనే పేర్లతో మనకు ప్రింటులో లభిస్తున్నది.ఇది దాదాపు వంద సంవత్సరాల క్రితం ప్రింటు చెయ్యబడింది. ఈయన జ్ఞానసంపద కలిగిన మహాసిద్ధుడేగాని తన శక్తులను నలుగురిలో ప్రదర్శించడంలో బాగా ఇష్టం ఉన్నవాడని, అనవసరంగా ప్రతి సాటి సిద్దునితోనూ గొడవ పడుతూ ఉండేవాడని, చివరకు అలాంటి ఒక పోటీఘట్టంలో ఇంకొక యోగినితో వచ్చిన గొడవలో ఈయన ఓడిపోయి ఆమె ప్రయోగించిన మంత్రాన్ని తట్టుకోలేక చనిపోయాడని గాధ ఒకటి ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈయన వజ్రవారాహి/ వజ్రయోగిని/ చిన్నమస్తా తాంత్రిక సాధనలో నిష్ణాతుడని మనకు తెలుస్తున్నది.

ఈయన రచనలలో, మార్మిక పద్యాలలో, తనను తాను కాపాలికునిగా పిలుచుకున్నందువల్ల, శైవంలో ఒక భాగమైన కాపాలిక మతపు సాధనలు ఏడో శతాబ్దంలో శంకరుల చేత ఓడించబడి నేపాల్, టిబెట్ లకు పాకి అక్కడ బౌద్ధసాధనలలో చోటు చేసుకున్నాయని చిన్నమస్తా సాధనకూడా అలాంటిదేననీ మనం భావించవచ్చు. నేను ముందే చెప్పినట్లు మూడో శతాబ్దం నుంచి పదో శతాబ్దం మధ్యలో మన దేశంలోని అన్ని మతాలూ కలగా పులగం అయిపోయాయి. ఎందులోనుంచి దేనిని ఎవరు స్వీకరించారో ఏం చేశారో చివరకు అది ఎలా తేలిందో ఎవ్వరూ చెప్పలేనంతగా ఒక సాంప్రదాయం నుంచి ఇంకో సాంప్రదాయానికి దేవతలు, సాధనలు మార్పు చెంది రకరకాల రూపాలను సంతరించుకున్నాయి. కనుక ఏది ముందు ఏది తర్వాత అనేది మనం నిర్ధారణగా ఇప్పుడు చెప్పలేము.

క్రిష్ణాచార్యుని శిష్యురాళ్ళలో మేఖల కనఖల అనేవాళ్ళు ఇద్దరు బ్రాహ్మణ యువతులు. వీళ్ళు చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వీళ్ళకు పెళ్ళిళ్ళు చెయ్యబడ్డాయి. కానీ ఎన్నాళ్ళకూ వీళ్ళు రజస్వలలు కాకపోతుంటే భర్తలు వీళ్ళను వదిలేశారు. ఆ పరిస్థితిలో  వీళ్ళకు కృష్ణాచార్యుడు తారసపడి వీరికి వజ్రయోగిని చిన్నమస్తా సాధనలో దీక్షను ఇచ్చాడు. పది పన్నెండేళ్ళ సాధన తర్వాత ఆ సాధనలో వీళ్ళు సిద్ధిని సంపాదించారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు వీళ్ళు తమ తలలను ఖండించుకుని వాటిని తమ చేతులతో పట్టుకుని నాట్యం చేస్తూ ప్రాణాలు వదిలారు. అప్పుడు వజ్రవారాహి కూడా వారి మధ్యన ప్రత్యక్షమైనదని ఈ ముగ్గురి నాట్యమే నేడు మనం చూస్తున్న చిన్నమస్తా చిత్రమని అనేకమంది టిబెటన్ బౌద్ధ గురువులు నమ్ముతారు. అది నిజం కావచ్చు కూడా ఎందుకంటే - ఆ కాలంలో ఇలాంటి తాంత్రిక ప్రయోగాలూ, శక్తి ప్రదర్శనలూ, తలలు నరుక్కోడాలూ సర్వసామాన్యంగా జరుగుతూ ఉండేవి.

ఇలాంటి అభ్యాసాల జాడలు ఇప్పటికీ మన సమాజంలో అక్కడక్కడా మిగిలి ఉన్నాయి. మనం చూడవచ్చు. తెలంగాణాలో కొన్ని ప్రాంతాలలో, ఆంధ్రాలో శ్రీకాకుళం విజయనగరం వంటి ప్రాంతాలలో, రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో మనకు ఇలాంటి ఆచరణలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. నాలుకలో శూలాలు గుచ్చుకోవడం, వంటికి కొక్కీలు వేలాడదీసి వాటిల్లో బరువులు ఎత్తడం, ఒంటిని కత్తులతో కోసుకొని రక్తాలు కార్చడం వంటి మూర్ఖపు పనులు మనం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల మతాచరణలలో చూడవచ్చు. వాటికి పరాకాష్ట వంటిదే ఈ తల నరుక్కోవడం అనేది. పాతకాలంలో ఇలాంటి గుళ్ళు కొన్ని ఊళ్లలో ఉండేవి. వీటిని 'చంపుడు గుళ్ళు' అనేవారు.

ఏదేమైనప్పటికీ ఈ వజ్రయోగిని/ వజ్రవారాహి సాధనకు మూలం హేవజ్ర తంత్రమనేది నిర్వివాదాంశం. ఈ తంత్రాన్ని ఎనిమిదో శతాబ్దంలో కంపల, సరోరుహ అనే ఇద్దరు బౌద్దాచార్యులు ప్రచారంలోకి తెచ్చారు. ఈ సరోరుహునికే 'పద్మవజ్ర' అనే పేరుంది. టిబెటన్ సాంప్రదాయంలో 'పద్మ' అనే పదం యోనికీ 'వజ్ర' అనే పదం లింగానికీ మార్మిక సూచికలు. కనుక ఈయన తాంత్రిక సంభోగ సాధనలో నిష్ణాతుడని తెలుస్తున్నది.

వీరిద్దరూ ఇంద్రభూతి మహారాజు దగ్గర ఉండేవారు. మహామాయాతంత్రాన్ని వ్రాసిన కుక్కురిపాదుడు కూడా వీరి సమకాలికుడే. ఈ రాజు ఎనిమిదో శతాబ్దం నాటి వాడని చరిత్ర చెబుతున్నది. ఈ సమయంలోనే మంత్రయానం, తంత్రయానం అనే మార్గాలూ ఆచరణలూ బెంగాల్ ఒరిస్సాలలో బాగా ప్రచారంలోకి వచ్చాయి.

నలందా విశ్వవిద్యాలయం ఐదో శతాబ్దంలో స్థాపించబడినప్పటికీ ఏడో శతాబ్దం నాటికి మంత్ర తంత్రాలలో బాగా ఖ్యాతి సంపాదించింది. మన దేశానికి వాయవ్యప్రాంతమైన (North West Frontier) ఉడ్డియానంలో కూడా ఈ మంత్ర తంత్ర యానాలు ఎక్కువగా ఉండేవి. ఇది నేటి పాకిస్తాన్ లోని స్వాట్ లోయలో ఉన్న ప్రాంతం. సరస్వతి నదీ పరీవాహక ప్రాంతం పేరు సర -స్వాట్ అని మారి చివరకు స్వాట్ లోయగా స్థిరపడి ఉండవచ్చు. కనుక ఇరాన్ ఇరాక్ దేశాలకు చెందిన మంత్రతంత్ర విద్యలు కూడా ఆ ప్రాంతపు బౌద్ధతంత్ర సాధనలతో మిళితములై కొత్త కొత్త రూపాలు దాల్చాయని మనం చక్కగా భావించవచ్చు.

హిందూ బౌద్ధ తంత్ర సాంప్రదాయాలలో నలందా, తక్షశిల, విక్రమశిల, సోమశిల విశ్వవిద్యాలయాలు చాలా పేరెన్నిక గన్నవి. వీటిలో నలందా ఐదో శతాబ్దంలోనూ, తక్షశిల క్రీ పూ ఐదో శతాబ్దం లోనూ, విక్రమశిల క్రీ.శ. 800 ప్రాంతంలోనూ స్థాపించబడ్డాయి. వీటిల్లో తక్షశిల అతి ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటికే ఇది ఉన్నది. శ్రీరాముని కుమారుడైన లవుని పేరుమీద లవహోర్/ లాహోర్ అనే పట్టణమూ, భరతుని కుమారుడైన తక్షుని పేరుమీద తక్షశిలా నగరమూ రామాయణ కాలంనాడే స్థాపించబడ్డాయి. ప్రస్తుతం ఇవి రెండూ పాకిస్తాన్ లో ఉన్నాయి. 

క్రీ.శ.ఎనిమిదో శతాబ్దంలో ధర్మపాలుడనే రాజు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. నలందాలోని ఆచార్యులలో పాండిత్యం తగ్గిపోయినందువల్లా అక్కడ చదువుకునే వారిలో మంచిగా విద్యార్ధులు రాణించక పోవడం వల్లా ఈ విక్రమశిల విహారాన్ని స్థాపించవలసి వచ్చిందని అంటారు. టిబెట్ కు తంత్రాన్ని పరిచయం చేసిన అతిశ దీపాంగారుడు ఈ విక్రమశిల విహారంలోని ఆచార్యుడే. అలాగే సోమపాలుడనే రాజు సోమపురి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇందులోనే కృష్ణాచార్యుడు చదువుకుని ఆ తర్వాత అక్కడే ఆచార్యునిగా చేరి బోధించేవాడు.

ఇతడే తన భద్రపాదుడనే శిష్యునికి హేవజ్ర తంత్రాన్నీ, వజ్రయోగినీ సాధననూ ఉపదేశించాడు. ఇతని నుంచి ఈ సాధన ఇతని టిబెటన్ శిష్యులైన మార్పా, నరోపా, మిలారేపా లకు చేరింది. ఇదంతా క్రీ.శ. 900, 1000 సంవత్సరాల ప్రాంతంలో జరిగింది. ఈ మార్పా అనే బౌద్ధతంత్ర గురువు తన ఎనిమిది మంది శిష్యురాళ్ళతో కలసి టిబెట్ లో ఈ హేవజ్ర తంత్రాన్ని (చిన్నమస్తా సాధనను, సంభోగ సాధననూ) అభ్యసించాడని ఆధారాలున్నాయి. హేవజ్ర తంత్రసాధనకు ఒక స్త్రీ సాధకురాలి సహాయం అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ సాధనలలో సంభోగం (సెక్స్) అనేది తప్పనిసరి భాగంగా ఉంటుంది. ఈ సాధకురాలిని 'యోగిని' అంటారు. హిందూ శైవతంత్రాలలో ఈమెను 'భైరవి' అని పిలుస్తారు. ఈ హేవజ్ర తంత్రం అనేది అయిదు లక్షల శ్లోకాలతో కూడిన గ్రంథమనీ అనేక రహస్య సిద్ధులను సమకూర్చే సాధనలు దీనిలో ఇవ్వబడ్డాయనీ మనకు తెలుస్తున్నది.

ఈ తంత్రసాధనలో ఆచార్య, గుహ్య, ప్రజ్ఞాజ్ఞాన, చతుర్ధములనబడే నాలుగు క్రమదీక్షలుంటాయి. మూడవ దీక్షలో సంభోగసాధన ఉంటుంది. లైంగికశక్తిని నిద్రలేపి మామూలుగా అది ప్రవహించే లాలన, రసన అనే నాడుల నుండి దానిని విడిపించి అవధూతి అనే మధ్యనాడి గుండా దానిని నాలుగు చక్రాలైన ధర్మకాయ, సంభోగకాయ, నిర్మాణకాయ, మహాసుఖములనే స్థితులలో నడిపించవలసి ఉంటుంది. ఈ లాలన రసన అనే నాడులే హిందూయోగం లోనూ తంత్రంలోనూ ఇడా పింగళా అనే నాడులుగా చెప్పబడ్డాయి. అవధూతి నాడి సుషుమ్నానాడి అయింది.

ఈ కార్యక్రమమంతా ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో ముద్ర, దేవి, సంజ్ఞ, విద్య అనబడే యోగిని సహాయంతో జరుగుతుంది. ఇవన్నీ యోగినికి పర్యాయపదాలు. ఈ సాధనకు ఇంద్రియ నిగ్రహమూ, స్ఖలననిగ్రహమూ అత్యంత అవసరం. తన ఇష్టానుసారం ఎంతసేపైనా సరే స్ఖలనాన్ని నిగ్రహించుకోవడం చేతకాని సాధకుడు ఈ సాధనకు అర్హుడు కాడు. ఈ సాధన మామూలుగా అందరికీ తెలిసిన సెక్స్ కాదు. దానికీ దీనికీ నక్కకూ నాకలోకానికీ ఉన్నంత భేదం ఉంటుంది.

బౌద్ధ తంత్రంలోని బుద్ధుని త్రికాయాలకూ హిందూయోగ తంత్ర సాధనలోని చక్రాలకూ సంబంధాన్ని ఇప్పుడు వివరిస్తాను.

ధర్మకాయం అనబడేది హిందూతంత్రంలోని అనాహత చక్రానికి సమానం. దీనికి ఎనిమిది దళాలున్నాయని బౌద్ధతంత్రం అంటుంది.సంభోగకాయం విశుద్ధచక్రంతో సమానం. దీనికి పదహారు దళాలున్నాయని బౌద్ధం అంటుంది. నిర్మాణకాయానికి అరవైనాలుగు దళాలుంటాయి. ఇది బొడ్డు ప్రాంతంలో ఉన్న మణిపురచక్రం. మహాసుఖస్థానం సహస్రార చక్రానికి సమానం. దీనికి ముప్పై రెండు దళాలుంటాయి. హిందూతంత్రాలలో కూడా సహస్రారాన్ని మహాసుఖ స్థానమనే అంటారు.

ఈ చక్రాల దళాలు 8,16,32,64  ఈ విధంగా ఒక వరుసలో (progression) ఉన్నట్లు మనం చూడవచ్చు. ఈ దళాలకు ఈ క్రమానికీ కూడా రహస్యమైన సంకేతార్ధాలున్నాయి.

ఈ మూడు బుద్ధకాయాలే వజ్రయానంలో త్రికరణములయ్యాయి. స్థూలంగా చెప్పుకుంటే బుద్ధ,ధర్మ,సంఘాలకు ఇవి సూచికలు. తాన్త్రికపరమైన అర్ధంలో నిర్మాణకాయమంటే శరీరం. ఇది మణిపుర చక్రం. ఎందుకంటే శరీర ధర్మాలైన ఆహారం తినడం, అరుగుదల, దేహపు వేడి మొదలైన ధర్మాలను ఇదే పోషిస్తూ ఉంటుంది.  ధర్మకాయమంటే మనస్సు లేదా హృదయం. వీటిని అనాహతచక్రం సంరక్షిస్తుంది. సంభోగకాయమంటే వాక్కు. ఇది గొంతులో ఉన్న విశుద్ధ చక్రపు అదుపులో ఉంటుంది. మహాసుఖమనేది సహస్రారచక్రం. ఎందుకంటే చండాలి/ చాండాలి అని పిలువబడే కుండలినీ శక్తి సహస్రార చక్రానికి చేరినప్పుడే మామూలుగా అందరికీ తెలిసిన సామాన్యసుఖానికి భిన్నమైన మహాసుఖం అనేది సాధకునికి అనుభవంలోకి వస్తుంది.

బౌద్ధ తంత్రంలో కుండలినీ సాధనను 'చాండాలి సాధన' అని పిలుస్తారు. కుండలినీ శక్తిని 'చండాలి' అని సంబోధిస్తారు.

ఈ నాలుగు స్థితులూ నాలుగు విధాలైన ఆనందాలను (సమాధి స్థితులను) అందిస్తాయి. అవి ఆనందం, పరమానందం, విరామానందం, సహజానందం. ఈ నాలుగు చక్రములు ఆత్మ, జ్ఞాన, మంత్ర, దేవతలనే నాలుగు స్థితులతో అనుసంధానమై ఉంటాయి. ఈ అన్నింటినీ సంభోగతంత్ర సమయంలో ఇద్దరూ అందుకొని సమాధిలో లీనం అవడం జరుగుతుంది. బోధిచిత్తాన్ని జాగృతి చెయ్యడమూ, త్రికాయములను దాటి మహాసుఖస్థానంలో మనస్సును లీనం చెయ్యడమూ, వజ్రవారాహీ/ హేరుక చక్రసంవరుల సంయోగానుభూతిలో ప్రవేశించి ఆనంద సమాధిలో నిలిచి ఉండటమూ ఈ సాధనా పరమ గమ్యాలు. ఇదే బుద్ధుడు పొందిన పరిపూర్ణ సమ్యక్ సంబోధి అని బౌద్ధతంత్రం అంటుంది.

తంత్రములు, అవి బౌద్ధ తంత్రాలైనా, హిందూ తంత్రాలైనా, ఈ విధంగా సంధ్యాభాష (secret coded language) లో ఉంటాయి. అంటే మామూలు చదువరులకు అర్ధం కాని రహస్యమైన భాషలో చెప్పబడతాయి. వాటి భాష అలాగే ఉంటుంది.ఈ మార్మిక భావాలను అర్ధం చేసుకోగలిగే వారికి మాత్రం అంతా చక్కగా అర్ధమౌతుంది. లేకపోతే ఆ భాషేంటో ఆ తంత్రాలు ఏమి చెబుతున్నాయో అస్సలంటూ ఏమీ అర్ధం కాదు. వీటిలో అనుభవ జ్ఞానం ఉన్న గురువు వివరిస్తేనే వీటి రహస్యాలు అర్ధమౌతాయి గాని లేకుంటే ఏదో గ్రీక్ లాటిన్ చదివినట్లు ఉంటుంది.

ఈ సాధనలలో స్త్రీపురుష సంభోగం ముఖ్యమైన సాధనగా ఉంటుందని ఇంతకు ముందే చెప్పాను, కానీ ఇది మామూలుగా అందరికీ తెలిసిన సంభోగక్రియ కాదు. మామూలు సంభోగం నేలబారు చవకబారు ప్రక్రియ. తాంత్రికసంభోగం అలాంటిది కాదు. అది మంత్ర,తంత్ర,ధ్యాన పూర్వకమైన సాధన. కనుకనే చిన్నమస్తాదేవి కాళ్ళ క్రింద సంభోగక్రియలో ఉన్న రతీమన్మధులుంటారు. కొన్ని చిత్రాలలో వీరిని రాధాకృష్ణులుగా కూడా చిత్రించడం జరిగింది. దీనికి కారణం బెంగాల్లో ఉన్న కృష్ణభక్తి తత్త్వం ఈ తంత్ర సాధనలపైన ప్రభావం చూపడమే.

అయితే, బౌద్ధతంత్రాలలో ఉన్న వజ్రయోగిని/ చిన్నముండా మూర్తుల కాళ్ళ క్రింద రతీమన్మదులు ఉండరు. వజ్రయోగినీ దేవతే తన నాధుడైన హేరుక చక్రసంవరునితో సంభోగక్రియలో ఉన్నట్లుగా ఆ చిత్రాలు ఉంటాయి. ఇది ప్రజ్ఞ - కరుణల సంగమానికి గల తాంత్రిక పరమైన సంకేతమై ఉంటుంది. హిందూ తంత్రాలలో ఇదే సత్ - చిత్ - ఆనందం అని చెప్పబడింది.

(ఇంకా ఉంది)