Spiritual ignorance is harder to break than ordinary ignorance

2, ఆగస్టు 2015, ఆదివారం

Nee Letha Gulabi Pedavulatho - Ghantasala



ఈ పాటను యూ ట్యూబ్ లో ఇక్కడ చూడండి.
https://www.youtube.com/watch?v=fCLZ66VmG8M&feature=youtu.be

నీ లేత గులాబీ పెదవులతో...కమ్మని మధువును తాకాలి...
విందులు చేసే నీ అందాలూ నా మదిలోనే చిందాలీ...

లేత గులాబీ పెదవులతో ... కమ్మని మధువును తాకాలి...

తెలుగుసినిమాలలో ఘజల్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఘజల్స్ ను ఎంజాయ్ చెయ్యాలంటే ఒక ఉన్నతమైన టేస్ట్ ఉండాలి. తెలుగువారిలో ఆ టేస్ట్ ఉన్నవారు బాగానే ఉన్నప్పటికీ, తెలుగు సినిమా ఖర్మకొద్దీ సినిమారంగం అంతా చవకబారు పాటలతో నిండిపోయి ఉన్నది. సినిమాలు తీసేవారికి టేస్ట్ ముఖ్యం కాదు.వారిది వ్యాపారం.జనాల నేలబారు కోరికలను రెచ్చగొట్టి సొమ్ము చేసుకునే పాటలే సినిమాలు తీసేవారికి అవసరం. కాలక్రమేణా చూసేవారు కూడా ఆ చవకబారు పాటలకు అలవాటు పడిపోయి మంచి సంగీతం అంటే ఇదేనేమో అనుకునే దుస్థితికి దిగజారారు.

ఘంటసాల మాస్టారిది గంధర్వగానం అన్న సంగతి అందరికీ తెలుసు.ఆయన పాడిన ఘజల్స్ ఏమున్నాయా? అని వెదికితే ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకకపోవడమే తెలుగు సినిమా పాటల దౌర్భాగ్య స్థితికి నిదర్శనం.

బాగా ఆలోచించగా ఆలోచించగా 'మా ఇంటి దేవత' అనే సినిమాలో దాశరధి గారు వ్రాసిన ఒక మంచి ఘజల్ ను ఘంటసాల మాస్టారు పాడినట్లు గుర్తొచ్చింది. అదే ఇది.

మెలోడీ లవర్స్ కు బాగా ఇష్టమైన పాటలలో ఇదొకటి.

సినిమా పాటలలో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి ఏమంటే -- ఎక్కువ శాతం మధురగీతాలు వింటే మాత్రమె బాగుంటాయి.తెరమీద చూస్తే బాగుండవు.ఈ పాట కూడా దాదాపు అలాంటిదే.పాట యొక్క మధురమైన భావం చిత్రీకరణలో దెబ్బతినడమే దీనికి కారణం.

నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది.ఎందుకంటే ఈ పాట అంతా ఉమర్ ఖయ్యాం ఫిలాసఫీ తో నిండి ఉంది.పాట చిత్రీకరణలో కూడా ఉమర్ ఖయాం పెయింటింగ్ ని గోడమీద చూపిస్తారు ఒక సీన్లో.

సరే ఈ పాటని పాడుదామని రెడీ అవుతుంటే యధాప్రకారం కర్ణపిశాచి ప్రత్యక్షమైంది.

'ఏంటి చాలా రోజులకు కనిపిస్తున్నావ్?' అడిగాను.

'నాదేముంది నాయనా! మీలా నాకొక ఇల్లా పాడా? గాలికి తిరిగే బ్రతుకు నాది.ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటా.సరేగాని అదేంటి నువ్వొక ఆధ్యాత్మిక గురువువై ఉండి ఈ పాట పాడుతున్నావ్? వినేవాళ్ళు ఏమనుకుంటారు?' అడిగింది చిలిపిగా.

'వినేవాళ్ళ కోసం నేను పాడటంలేదు తల్లీ.నాకోసం నేను పాడుకుంటున్నాను.వాళ్లకు ఇష్టమైతే వింటారు.కష్టమైతే మానుకుంటారు. అది వాళ్ళిష్టం.ఇది నా ఇష్టం.అంతే.' అన్నా విసుగ్గా.

'మరి ఇలాంటి పాటలు పాడితే నీ గురుత్వానికి భంగం రాదా?' అడిగింది.

'చూడూ...నువ్వు నా శిష్యురాలివి కాదు.నీకు సమాధానం చెప్పవలసిన పని నాకు లేదు.నా ఇష్టం వచ్చిన పాటలు నేను పాడతాను.ఎక్కువగా చిర్రెక్కించావంటే 'మసకమసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో", "పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు" వంటి పాటలు కూడా పాడతా. మధ్యలో నీకెందుకు? మాటమాటకీ డిస్టర్బ్ చెయ్యకు. గెటౌట్. నేను పిలిచినప్పుడు మాత్రమె రా.'- అంటూ ఉచ్చాటన బీజాక్షరాన్ని మనసులో జపించాను.

కర్ణపిశాచి కెవ్వున కేకేసి మాయమైపోయింది.

నేను నవ్వుకుంటూ పాట పాడి అప్లోడ్ చేశాను.

Movie:--Maa Inti Devatha
Lyrics:--Dasaradhi
Music:--Master Venu
Singer:--.Ghantasala Venkateswara Rao
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------

నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి
విందులు చేసే నీ అందాలూ నా మదిలోనే చిందాలీ
లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి

మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే సిగ్గులతో -2 
చంద్రుని ముందర తారవలే-2
నా సందిట నీవే ఉండాలీ
ఈ మధువంతా నీ కోసం
పెదవుల మధువే నాకోసం
విందులు చేసే నీ అందాలూ నా మదిలోనే చిందాలీ
లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి

మధువు పుట్టింది నాకోసం
నేను పుట్టింది నీకోసం
ఊ.... హుహు హుహు
మధువు పుట్టింది నాకోసం
నేను పుట్టింది నీకోసం
కన్నుల కాటుక కరగక ముందే - 2
సిగలో పూవులు వాడక ముందే - 2
పానీయముతో పరవశమై -2
నీ కౌగిట నన్నే బంధించుకో
లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి...