“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, ఆగస్టు 2015, మంగళవారం

హోమియో అద్భుతాలు - తిరిగి అతుక్కున్న ఎముకలు

మూడు వారాల క్రితం ఒక విషయం తెలిసింది.

మా ఎదురింటిలో ఉండే ఒకాయన యాక్సిడెంట్ అయి బాగా దెబ్బలు తగిలి ఇంట్లో మంచం మీద ఉన్నారని మా పనమ్మాయి చెప్పింది.

వెంటనే మా శ్రీమతీ నేనూ వెళ్లి పలకరించాం.

ఒంటినిండా దెబ్బల గాయాలతో, ముఖం ఉబ్బరించి, చేతులు స్లింగ్ లో ఉంచుకుని ఆయన మంచం మీద మగతగా పడుకుని ఉన్నారు.

'ఏం జరిగింది?' అడిగాం.

'ఏం లేదు శర్మగారు.ఒక వారం క్రితం పొద్దున్నే నరసింహస్వామి గుడికి వెళదామని మోటార్ సైకిల్ మీద నేనూ మా అబ్బాయీ బయలుదేరాం. జనం కూడా రోడ్లమీద పెద్దగా లేరు.కొంచం దూరం వెళ్లేసరికి హటాత్తుగా ఒక కుక్క అడ్డంగా వచ్చింది.దానిని తప్పించబోయి బైక్ స్కిడ్ అయి ఇద్దరం క్రింద పడిపోయాం.అంతే.ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు.కళ్ళు తెరిచేసరికి ఆస్పత్రి ఐసీయూ లో ఉన్నాను.'-అన్నాడాయన.

వాళ్ళబ్బాయి అందుకున్నాడు.

'నాన్న డ్రైవ్ చేస్తున్నారంకుల్.నేను వెనుక కూచుని ఉన్నాను.ఇద్దరం క్రింద పడిపోయాం.నేను లేచాను.నాన్న కూడా లేస్తారులే అని చూస్తున్నాను. ఎంతకీ లేవరే? రోడ్డు మీద అలాగే పడిపోయి ఉన్నారు.స్ప్రుహలేదు.దగ్గరకెళ్ళి చూస్తే ముక్కులోనుంచి చెవులలోనుంచి రక్తం వస్తున్నది.భయపడిపోయి వెంటనే ఆటో పిలిచి ఆస్పత్రికి తీసుకెళ్ళి అడ్మిట్ చేశాను.అమ్మకు ఫోన్ చేశాను.అమ్మ వెంటనే వచ్చేసింది.డాక్టరు గారు కూడా పాపం వెంటనే వచ్చేశారు.ట్రీట్మెంట్ మొదలయింది.' అన్నాడు.

"భుజం దగ్గరా,రిబ్స్ లోనూ,మోచెయ్యి దగ్గరా ఇలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి శర్మగారు.ముఖం కొట్టుకుపోయింది.అయితే దైవవశాత్తూ తలలో ఇంటర్నల్ ఇంజ్యూరీస్ లేవు.అందుకే బ్రతికాను.మొదట్లో ముక్కులోనుంచి చెవులలోనుంచి రక్తం కారితే అదే అనుకున్నారు అందరూ.కానీ కాదు.వారం నుంచీ ఆస్పత్రిలో ఉండి రాత్రే ఇంటికి వచ్చాను.కనీసం మూడు నెలలు బెడ్ లో ఉండాలన్నారు డాక్టరు గారు.ఇవిగో ఈ మందులు వ్రాశారు చూస్తారా?"- అని కాయితం చూపబోయారు.

"వద్దులెండి.స్పెషలిస్టు డాక్టరు చూచాక ఇంకా నేను చూచేదేముంది? కానీ నేను కొన్ని హోమియో మందులు ఇస్తాను.మీ మందులతో బాటు ఇవీ వేసుకుంటారా?చాలా త్వరగా తగ్గిపోతుంది.విరిగిన ఎముకలు కూడా త్వరగా అతుక్కుంటాయి.' అడిగాను.

అంతకంటేనా? మీ మీద నాకు నమ్మకం ఉంది.గతంలో కొన్ని సందర్భాలలో చూచాను మీ వైద్యం ఎలా పనిచేస్తుందో? చెప్పండి.' అన్నాడాయన.

రెండు మందులు వ్రాసిచ్చి వాటిని ఎలా వాడాలో చెప్పి మేము ఇంటికి వచ్చేశాము.

ఈరోజున ఆయన దగ్గరనుంచి ఫోనొచ్చింది.

'శర్మగారు.మీ మేలు జన్మలో మరిచిపోలేను.' అన్నాడాయన.

'ఏమైంది?' అడిగాను.

'ఈరోజు ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ బిందేశ్ గారి దగ్గరకు చెకప్ కు వెళ్లాను.ఆయన నా రిపోర్టులు చూచి ఆశ్చర్యంగా ఒక్కటే మాట అడిగాడు.' అన్నాడు.

'ఏమడిగాడు?' అన్నాను.

'నేనిచ్చిన మందు కాకుండా మీరు ఇంకా వేరే ఏవైనా మందులు వాడారా?ఎందుకంటే మా మందులతో ఇంత స్పీడుగా తగ్గదు. మీకు 90 % తగ్గిపోయింది.మిగతాది నెగ్లిజిబుల్.త్వరలో అది కూడా తగ్గుతుంది.You have recovered very fast.Unbelievable.' అన్నాడు.

'అవునండి.మా ఇంటి ఎదురుగా శర్మగారని ఉన్నారు.ఆయన ఇచ్చిన హోమియో మందులు వాడాను.' అని చెప్పాను.

'ఏమన్నాడాయన?విసుక్కున్నాడా?' అడిగాను.

ఎందుకంటే  హోమియో వైద్యం అంటే ఇంగ్లీషు డాక్టర్లకు చాలా చిన్నచూపు ఉంటుంది.ఆ సంగతి నాకు బాగా తెలుసు.

'అబ్బే అదేం లేదు శర్మగారు.ఆయనేమన్నారో తెలుసా? 'మీరు చాలా మంచి పని చేశారు.Homoeopathy is the best pathy for all diseases.Even though I am an Allopath, I say this very confidently' అన్నాడాయన.

వింటున్న నాకు సంతోషం కలిగింది.పరవాలేదు అల్లోపతిక్ డాక్టర్లలో కూడా హోమియోపతి అంటే ఏమిటో అర్ధమౌతున్నదన్నమాట.

'చాలా ధాంక్స్ శర్మగారు.పిలవకుండానే మా ఇంటికి వచ్చి పలకరించారు.అడక్కుండానే మందులిచ్చారు.మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను.మీరిచ్చిన మందులు ఇంకా వాడాలా?ఆపెయ్యనా?' అడిగాడు ఈయన ఫోన్లో.

'అందులో ఒకటి ఆపెయ్యండి.ఇంక అవసరం లేదు.రెండోది మాత్రం ఇంకొక వారం వాడి అదీ ఆపెయ్యండి.మిగతా 10% కూడా తగ్గిపోతుంది.' అని చెప్పాను.

ఆయన ఎంతో కృతజ్ఞతగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు.

విరిగిన ఎముకలను కూడా అతి త్వరగా అతికించడంలో హోమియోపతి సిస్టం కు ఉన్నటువంటి శక్తి ఏమిటో మరొక్కసారి ఇలా రుజువైంది.

మనకు తెలిసిన జ్ఞానంతో ఇతరులకు నిస్వార్ధంగా మేలు చెయ్యడం కంటే మించిన తృప్తి ఈలోకంలో ఇంకేం ఉంటుంది?