“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, ఆగస్టు 2015, బుధవారం

చంద్రశేఖర సరస్వతి

నిన్న రాత్రి చంద్రశేఖర్ నుంచి ఫోనొచ్చింది.

'ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావ్?' ప్రశ్నించాను.

'బాగున్నాను అన్నగారు.మీతో ఒక అయిదు నిముషాలు మాట్లాడాలి' అన్నాడు.

'అలాగే.చెప్పు.' అన్నాను.

చంద్రశేఖర్ తో మాట్లాడటం నాకు చాలా ఆనందాన్నిస్తుంది.ఎందుకంటే - ఎవరిలో అయితే సిన్సియారిటీ ఉంటుందో, ఎవరిలోనైతే కపటం ఉండదో అహంకారం ఉండదో అలాంటివారితో సంభాషణను నేను చాలా ఇష్టపడతాను.మిగతా వారితో మాట్లాడటం మాత్రం నాకు మహా కంపరంగా ఉంటుంది.అసలు వాళ్ళే నాతో మాట్లాడలేరు.ఎంత ప్రయత్నించినా నన్ను కలవనూ లేరు.ఒకవేళ వారి అదృష్టవశాత్తూ నాతో పరిచయం అయినా క్రమేణా దూరమై పోతుంటారు.

'అన్నగారు ! నేను ఉద్యోగం మానెయ్యబోతున్నాను.'

సంతోషంతో ఎగిరి గంతెయ్యాలన్నంత ఆనందం కలిగింది నాకు.

'చాలా మంచిది తమ్ముడూ.ఎప్పుడు ముహూర్తం?' అడిగాను.

'ఈ నెలాఖరుకు రిజైన్ చేస్తున్నాను.అరుణాచలం వెళ్లిపోతున్నాను.ఇక ఎన్నాళ్ళు బ్రతికితే అన్నాళ్ళు అక్కడే తపస్సులో ఉంటాను.' అన్నాడు.

''ఎక్సలెంట్ డెసిషన్ తమ్ముడు. ప్రొసీడ్.' అన్నాను.

చంద్రశేఖర్ గురించి ఇక్కడ కొంత చెప్పాలి.

తను నాకు 20 ఏళ్ళనుంచి పరిచయం.సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు.చాలా తెలివైన వాడు.చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో ఫస్ట్ వచ్చేవాడు.చాలా చిన్న వయసులోనే LIC లో ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాడు.ఒక పదిహేనేళ్ళు అందులో ఉద్యోగం చేశాడు.ఆ తర్వాత రిజైన్ చేసి, ప్రైవేట్ సెక్టార్ కు షిఫ్ట్ అయ్యాడు.మూడు నాలుగు MNC లలో మంచి పోజిషన్స్ లో ఎదుగుతూ వచ్చాడు.నోయిడా, భోపాల్ లలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఒక మంచి కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్నాడు.

మొదటినుంచీ ఆధ్యాత్మిక భావాలు మెండు.రమణ మహర్షికీ రామకృష్ణులకూ మహాభక్తుడు.మంచి అందగాడు.మంచి పొజిషన్లో ఉన్నాడు.కానీ ఆధ్యాత్మిక భావాల వల్ల పెళ్ళిచేసుకోకుండా అలా ఉండిపోయాడు.ఎన్నో మంచి మంచి సంబంధాలు వచ్చాయి.ఎందఱో అమ్మాయిలూ అతన్ని టెంప్ట్ చెయ్యాలని చూచారు.కానీ అతనికున్న ఆధ్యాత్మిక తపనవల్ల చలించకుండా నిబ్బరంగా ఉండిపోయాడు.

20 ఏళ్ళ క్రితం అతను మొదటిసారి నాకు పరిచయం అయినప్పుడే అతనిలోని డివైన్ స్పార్క్ ను నేను గమనించాను.అందుకే అప్పటినుంచీ అతన్ని 'చంద్రశేఖర సరస్వతి' అని పిలిచేవాడిని.తనేమో నాకంటే తొమ్మిదేళ్ళు చిన్నవాడు.అందుకు నన్ను అన్నగారు అని పిలిచేవాడు.

ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి వేదాలు ఉపనిషత్తులు యోగవాసిష్టం భగవద్గీత బ్రహ్మసూత్రాలు రామకృష్ణ వివేకానంద రమణమహర్షి సాహిత్యాల మీద నాతో గంటలపాటు చర్చ చేసేవాడు.ఏదో రోజు ఇలా చేస్తాడని ముందే తెలుసు.

ఆరోజు ఇప్పుడు వచ్చిందన్నమాట.

నా ఆలోచనలను బ్రేక్ చేస్తూ చంద్రశేఖర్ స్వరం వినిపించింది.

'42 ఏళ్ళు వస్తున్నాయన్నగారు.జీవితంలో ఇంతవరకూ డబ్బు డబ్బు అని దానిచుట్టూ తిరగడం తప్ప ఆధ్యాత్మికంగా సాధించినది లేదు.ఇంకెన్నాళ్ళు ఈ గోల? చూస్తూ ఉండగానే జీవితం అయిపోతుంది.ఇక ఇదంతా అనవసరం అని గట్టిగా నిర్ణయించుకున్నాను.అందుకే రిజైన్ చేసి అరుణాచలం వెళ్ళిపోతున్నాను.జీవితాంతం ఇక అక్కడే ఉంటాను.' అన్నాడు.

'మరి మీ బాస్ కి చెప్పావా?' అడిగాను.

'చెప్పానన్నగారు.ఆయన బిత్తరపోయాడు.నీలాంటి మనిషిని నా జన్మలో చూడలేదు.ఇదేంటి ఇలాంటి మంచి పొజిషన్లో ఉండి సడెన్ గా రిజైన్ చేసి ఎక్కడో అనామకంగా మిగతా జీవితం గడుపుతావా? సర్ప్రైసింగ్? నీకేం తక్కువని ఈ పని చేస్తున్నావు?- అన్నాడు.'

'అంతేలే తమ్ముడు.వాళ్లకు అర్ధం కాదులే.' అన్నాను నవ్వుతూ.

'నిజం అన్నగారు.ఈ కృత్రిమ జీవితం చాలా బోరుగా ఉన్నది.ఎంతసేపూ డబ్బుకోసం పరుగులు.లేదా అమ్మాయిలకోసం.వాటికోసం మోసాలు. అబద్దాలు.ఈగోలు.కుళ్ళు కుతంత్రాలు.ఇంతేగా జీవితం? ఇంకేముంది?ఈ జీవితం అంటేనే అసహ్యం వేసింది.ఇలాంటి మనుషుల మధ్యన నేను బ్రతకలేకపోతున్నాను. వాళ్ళ ఆరాలు నేను తట్టుకోలేకపోతున్నాను.చాలా కంపరంగా ఉన్నది.' అన్నాడు.

'అదేంటి తమ్ముడూ అందరూ నీలాంటి హైఫై జీవితం కావాలని కలలు కంటుంటే నువ్వేంటి అలా అంటావు?'- అడిగా సరదాగా.

'వాళ్ళ ముఖం !! అనుకోనివ్వండి.పెంటలో ఉన్న పురుగుకు అదే సుఖంగా ఉంటుంది కదా అన్నగారు.వాళ్ళ పరిస్థితీ అంతే.ఈ ప్రపంచంలో ఏముంది అన్నగారు? అంతా చెత్త తప్ప. నావరకూ నాకు విరక్తి వచ్చేసింది.ఇక నా వల్ల కాదు.ఈ కృత్రిమ జీవితం నేనింక గడపలేను.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.సరదాగా మీరు ఇలా అంటున్నారు గాని మీ మనసు నాకు తెలీదా? నా నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వాగతిస్తారని నాకు తెలుసు.అందుకే మొదటగా మీకు చెబుతున్నాను.' అన్నాడు.

'చాలా మంచి నిర్ణయం తమ్ముడూ.మీ పూర్వీకులలో ఎవరో మహానుభావులు ఋషులు ఉన్నారు.అందుకే ఇంత డబ్బు, అమ్మాయిలూ,విలాసాల మధ్య ఉండి కూడా నీ మనస్సు ఎంతసేపూ ఆధ్యాత్మికత వైపూ, సాధన వైపూ, దైవం వైపూ లాగుతున్నది.నువ్వు తప్పకుండా నీ ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకుంటావు.వ్యామోహాలలో చిక్కుకుని పొద్దున్న లేచిన దగ్గరనుంచీ సంసారమే స్వర్గం అనుకునే మూర్ఖులకు అజ్ఞానులకు నీ చర్య వింతగా అనిపించవచ్చు.ఇటువంటి ఉన్నతమైన ఆశయాలను లోకులు అర్ధం చేసుకోలేరు.వారి మాటలు పట్టించుకోకు.

నీ జన్మ సార్ధకం.ధన్యం.చాలా మంచిపని చేస్తున్నావు.మానవజన్మ ఎత్తినందుకు అసలు చెయ్యవలసిన పనినే చేస్తున్నావు.నువ్వు కోరుకుంటున్న గమ్యం వైపు నడువు.మనం మళ్ళీ అరుణాచలంలో నీ గదిలో కలుసుకుందాం.' అన్నాను ఆనందంగా.

'చాలా ధాంక్స్ అన్నగారు.మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది.నాకు సరియైన సలహా మీరే ఇవ్వగలరని నాకు అనిపిస్తుంది. అందుకే మీకు ఫోన్ చేశాను.అరుణాచలం వెళ్ళిన తర్వాత ముందుగా ఒక పన్నెండేళ్ళపాటు నిష్టగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శ్రవణ, మనన,ధ్యానాలలో ఉంటూ పూర్తి మౌనంలో ఉండి తపస్సు చెయ్యబోతున్నాను.మధ్యమధ్యలో కొంచంసేపు కావాలంటే అక్కడ ఆశ్రమంలో ఏ చెప్పులస్టాండు దగ్గరో, పుస్తకాలు అమ్మే దగ్గరో కొన్ని గంటలు డ్యూటీ చేస్తాను.మీరు మాత్రం అరుణాచలం వస్తే నా గదిలో నాతో ఉండాల్సిందే.నావంట నేనే చేసుకుంటూ మితంగా ఆహారం తీసుకుంటూ తపస్సులో ఉంటాను.మీరు వస్తే మీకు నేనే వండి వడ్డిస్తాను.మీరు తప్పకుండా రావాలి.' అన్నాడు.

'మరి డబ్బు సరిపోతుందా? ఏమైనా దాచావా?' అడిగాను.

'పెద్దగా దాచలేదన్నగారు.అయినా నాకెంత కావాలి? ఒక చిన్న గది అద్దెకు తీసుకుంటాను.నా ఒక్కడి తిండికి అదీ నేను తినే సింపుల్ తిండికి ఎంత కావాలి? నేను కట్టుకునే రెండు చొక్కాలూ రెండు లుంగీలకు ఎంత డబ్బు కావాలి? చాలా తక్కువ డబ్బు చాలన్నగారు.సరిపోతుంది.' అన్నాడు.

ఆనందంతో నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. మాట పెగలలేదు.

'మంచిది తమ్ముడూ.మరొక్కసారి నీకు నా ఆశీస్సులు.' అన్నాను గద్గద స్వరంతో.

'ప్రణామాలు అన్నగారు.ఉంటాను.' అని ఫోన్ పెట్టేశాడు.

ఋషులు సాధకులు మహనీయులు లేరని ఎవరన్నారు? అందరూ అనుకుంటారు.ఈ కలియుగంలో అలాంటివారు లేరు.పాతకాలంలో ఉండేవారేమో? ఇప్పుడెక్కడున్నారు? - అని.

కాదు.అలాంటి మనుషులు ఇప్పుడూ ఉన్నారు.మన మధ్యనే ఉన్నారు.కానీ వారి పరిచయం కావాలంటే మనకు అదృష్టం ఉండాలి.మనం మన చర్యలద్వారా ఎంతో సుకృతాన్ని సంపాదించి ఉండాలి.మన మనస్సులు స్వచ్చంగా ఉండాలి.అప్పుడే అలాంటి వారి పరిచయమూ సాంగత్యమూ మనకు కలుగుతుంది.లేకుంటే వారు మన పక్కనే ఉండికూడా మనకు పరిచయం కారు.ఒకవేళ అయినా వారినుంచి మనం ఏమీ పొందలేము.

ప్రపంచం పూర్తిగా కుళ్ళిపోలేదు.ప్రపంచం అంతా డబ్బు చుట్టూ సుఖాల చుట్టూ తిరగటం లేదు.కనీసం అక్కడక్కడా ఇలాంటి జాతి వజ్రాలు ఇంకా ఉన్నాయి.అందుకే భూమి బద్దలవకుండా ఇంకా నిలిచి ఉన్నది.

నిజమైన బ్రాహ్మణ రక్తం ఇలా ఉంటుంది. మహర్షుల జీన్స్ ఇలా ఉంటాయి.

కొంతమందిని నేను చూస్తుంటాను.70 ఏళ్ళు వచ్చినా ఇంకా కామం చావని మనుషులూ, వావీ వరసలు లేకుండా ప్రవర్తించే మనుషులూ, 80 ఏళ్ళు వచ్చినా ఇంకా పార్టీలూ క్లబ్బులూ కేసినోలూ పేకాటలూ తిండీ తాగుడూ అమ్మాయిలూ అంటూ తిరిగే ఘనులూ,ఏభై దాటినా ఇంకా బ్యూటీ పార్లర్లకు తిరిగే మనుషులూ, చావబోయే క్షణం వరకూ డబ్బూ సంపాదనా అంటూ కలవరించే మనుషులూ ఉన్న ఈ రోజుల్లోకూడా ఇలాంటి వివేకమూ వైరాగ్యమూ మూర్తీభవించిన యువకులు ఉండటం ఎంత అద్భుతం?

చంద్రశేఖర్ నిజంగా 'చంద్రశేఖర సరస్వతి'గా అతి త్వరలోనే మారాలనీ,అతను తపిస్తున్న ఆధ్యాత్మిక గమ్యాన్ని ఈ జన్మలోనే అతను చేరుకోవాలనీ ఆత్మజ్ఞానాన్నీ భగవంతుని దర్శనాన్నీ అతడు ఈ జన్మలోనే పొందాలనీ ఆ విధంగా అతన్ని అనుగ్రహించమనీ శ్రీరామకృష్ణులను ప్రార్ధిస్తూ నిద్రకు ఉపక్రమించాను.