“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, ఆగస్టు 2015, సోమవారం

గమ్యమే ఎరుగని పయనమే జీవితం - Satya Narayana Sarma















గమ్యమే ఎరుగని పయనమే జీవితం...

ఎవరి జీవితమైనా ఇంతే.ఎందుకు పుట్టామో తెలియదు.ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు.పోయాక ఏమౌతామో తెలియదు.ఏమీ తెలియకపోయినా బ్రతికినన్నాళ్లు బ్రతకక తప్పదు.మన చిరునవ్వుల వెనుక ఏదో తెలియని విషాదాన్ని దాచుకోకా తప్పదు.

ఎంతో అర్ధవంతాలైన జీవితాలను గడుపుతున్నామనుకునే వారి జీవితాలు కూడా నిజానికి గమ్యంలేని పయనాలే.ఆ జీవితాలకు ఏదో అర్ధం ఉందనుకోవడం వాళ్ళ భ్రమ మాత్రమే.ఆ అర్ధాలు వాళ్ళు కల్పించుకున్నవే గాని నిజానికి జీవితానికి ఒక అర్ధమంటూ ఏదీ లేదు.ఒకవేళ ఏదైనా పరమార్ధం దానికి ఉందనుకుంటే ఆ పరమార్ధాన్ని వాళ్ళు ఎలాగూ పొందనూ లేరు.

ఈ విషయం ఒక్కొక్కరికి జీవితపు ఒక్కొక్క స్టేజిలో అర్ధమౌతుంది.కానీ అంతిమ సత్యం మాత్రం ఇదే.

ఈ భావాన్నే ఈ పాటలో వ్రాశాను.

ఇప్పుడెందుకీ పాథోస్ సాంగ్స్? అని ఇప్పటికే ఒక అభిమాని అడగనే అడిగింది.కానీ తప్పదు.నాతో ప్రయాణం ఇలాగే ఉంటుంది మరి.

జీవిత సత్యాలను విస్మరించకూడదుగా.

Lyrics:-Satya Narayana Sarma
Karaoke Singer:--Satya Narayana Sarma
Music Track:--Jagjith Singh's Ghazal--'Aap Ko Dekh Kar'

Enjoy
----------------------------------------
గమ్యమే ఎరుగని పయనమే జీవితం-2
ఎందుకో తెలియని గమనమే జీవితం
గమ్యమే ఎరుగని పయనమే జీవితం

గతపు వాకిళ్ళనే తెరచి తిలకించగా-2
అర్ధమే లేని ఆశల లోగిళ్ళు నవ్వెగా-2
ఎచటికో తెలియని పరుగురా జీవితం

ఎదుట కనరాని లోకాల జడివానలే-2
అనుదినం అనుక్షణం నిన్నిలా తడపగా-2
ఎందుకో తెలియని ఎదురు చూపు జీవితం

శోకమోహాల నదిలోన ఎదురీతరా-2
రేవునే ఎరుగని నావరా జీవితం
తీరమే తెలియని సంద్రమీ జీవితం
గమ్యమే ఎరుగని పయనమే జీవితం