“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, ఆగస్టు 2015, సోమవారం

గురు శుక్ర మౌఢ్యములకు ఋజువులివిగో

గురు శుక్ర మౌడ్యమి గురించి ఈ మధ్యనే ఒక పోస్ట్ వ్రాశాను.

అవి మొదలైన దగ్గరనుంచీ ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో కళ్ళు తెరిచి గమనించేవారికి అర్ధం అవుతూనే ఉన్నది.విమాన ప్రమాదాల నుంచి రోడ్డు ప్రమాదాల వరకూ ప్రతిరోజూ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.అవన్నీ మళ్ళీ నేను ఏకరువు పెట్టబోవడం లేదు. న్యూసులో అదంతా వస్తూనే ఉన్నది.

కానీ నిన్న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి మాత్రం వ్రాయదలుచుకున్నాను.ఎందుకంటే ఇది చాలా విచిత్రమైనది.

అనంతపూర్ జిల్లా మడకశిర అనే ఊరిదగ్గర నిన్న రాత్రి 2.23 కి ఈ ప్రమాదం జరిగింది.బెంగుళూరు నాందేడ్ ఎక్స్ ప్రెస్ వేగంగా పోతుండగా ఒక గ్రానైట్ లోడు లారీ స్పీడుగా వచ్చి లెవెల్ క్రాసింగ్ గేటును దాటి రైలుమధ్యలో సరిగ్గా ఏసీ బోగీలను అడ్డంగా డీ కొట్టింది.లారీ డ్రైవరు తాగి ఉన్నాడని అంటున్నారు.లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని అంటున్నారు.నిజానిజాలు విచారణలో తెలుస్తాయి.

సాధారణంగా అయితే రైలు - బస్సునో లారీనో ట్రాక్టరునో గుద్దుతుంది.కానీ ఇక్కడ అందుకు రివర్స్ లో జరిగింది.లారీయే అతివేగంగా వచ్చి స్పీడుగా పోతున్న రైలును మధ్యలో గుద్దింది.అసలు విచిత్రం అది కాదు.

ఆ వేగానికి లారీలో ఉన్న గ్రానైట్ దిమ్మ ఎగిరి ఫస్ట్ ఏసీ బోగీని ఈ పక్కనుంచి ఆపక్కకు చీల్చుకుంటూ దూసుకుపోయింది.ఆ క్రమంలో ఆ ఏసీ బోగీలో నిద్రిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ ను తీవ్రంగా గాయపరచింది ఆ గ్రానైట్ దిమ్మ.

అతనితో బాటు నలుగురో అయిదుగురో తోటి ఏసీ ప్రయాణీకులు కూడా స్పాట్లో చనిపోయారు.ఏం జరిగిందో తెలిసేలోపు వారి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.దాదాపు 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

నేనెప్పుడూ కర్మ గురించి, దాని విచిత్ర విధానాల గురించి వ్రాస్తూ ఉంటాను.చాలామంది దానిని చదివి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు.ఇప్పుడు కళ్ళారా చూడండి.కర్మ విధానాలు ఎంత విచిత్రంగా ఉంటాయో?

ఇందులో జ్యోతిష్య కోణం:--
సరిగ్గా ఇప్పుడు గురువు సూర్యునికి రెండే రెండు డిగ్రీల దూరంలో ఉండి deep combustion లో ఉన్నాడు.ఇప్పుడు గురుమౌడ్యమి  అతి తీవ్రంగా ఉన్నది. చనిపోయిన వారివీ గాయపడిన వారివీ జాతకాలు చూస్తే, వాటిలో భయంకరమైన గురుదోషాలు ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.ఇది గురు మౌఢ్య ప్రభావమే.ఈ సంఘటన జరిగింది కూడా శుక్రహోర లోనే.

కర్మకోణం:--
హాయిగా ఏసీ బోగీలో ఆదమరచి నిద్రిస్తున్న ప్రయాణీకులు ఏమిటి? చీకట్లో దూసుకొచ్చిన లారీ - రైలుమధ్యలో ఉన్న ఏసీ బోగీని సరిగ్గా గురిచూచినట్లు గుద్దడం ఏమిటి? అందులోని గ్రానైట్ దిమ్మ విష్ణుచక్రంలాగా ఎగిరొచ్చి రైలు బోగీని చీల్చుకుని అందులో నిద్రిస్తున్న అయిదుగురు ప్రయాణీకులను స్పాట్లో చంపడం ఏమిటి? ఇదంతా కర్మవిచిత్రం కాకుంటే మరేమిటి?

ఏదో హాలీవుడ్ మూవీలోని సీన్ లా అనిపించడం లేదూ? కర్మరహస్యాలు అర్ధం కాకపోతే అలాగే అనిపిస్తుంది.

కర్మ అనేది హాలీవుడ్ వారినీ వదలదు.బాలీవుడ్ వారినీ వదలదు.ఎవరినీ వదలదు.తమ కర్మకు చలానా కట్టకుండా ఎవరూ ఈ లోకంలో తప్పించుకోలేరు.ఈ భూమ్మీద ఎవరు ఎక్కడున్నా తమ కర్మను మాత్రం తప్పించుకోలేరు.ఒక్క గురు అనుగ్రహమూ దైవానుగ్రహములే దానిని తప్పించగలవు.ఇంకేదీ ఈ సృష్టిలో కర్మను తప్పించలేదు.

మనిషి ఎవరినుంచైనా దాక్కోవచ్చుగాని తన కర్మ నుంచి దాక్కోలేడు.ఇది సత్యం. 

గ్రహస్థితుల సూచనలకు ఖచ్చితంగా సరిపోయే ఇలాంటి విచిత్రమైన ప్రమాదాలను ఎన్నింటినో నేను గత ఎన్నో ఏళ్ళుగా గమనిస్తున్నాను.మానవ జీవితంలో జరిగే సంఘటనలకూ ఆకాశంలోని గ్రహస్థితులకూ ఖచ్చితమైన అవినాభావ సంబంధం ఉన్నదన్న విషయం నా జ్యోతిశ్శాస్త్ర పరిశీలనలో ఎన్నోసార్లు ఋజువైంది. 

జ్యోతిశ్శాస్త్రం సత్యం.

కర్మ సత్యం.

ఇంకెన్ని రుజువులు కావాలి?