నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

3, ఆగస్టు 2015, సోమవారం

సిద్ధులు ప్రసిద్ధులు -వక్తలు ప్రవక్తలు

జిల్లెళ్ళమూడి అమ్మగారి మాటలన్నీ వేదవాక్యాలే.అవి చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నట్లు కనిపిస్తాయి.కాని వాటిల్లో అనంతమైన అర్ధం దాగి ఉంటుంది. తీసుకుని ఆచరించగలిగితే - వాటిల్లో ఒక్కొక్క వాక్యం చాలు ఒక జీవితం పూర్తిగా మారిపోవడానికి.

అంత అర్ధం కాకపోవడానికి ఆ మాటలు ఏవో పెద్దపెద్ద వ్యాకరణ సమాసాల సమాహారాలా అంటే అదీ ఉండదు.అవన్నీ మనం రోజూ వాడే వాడుక మాటలే.కానీ అమ్మ వాటికి ఇచ్చే అర్ధగాంభీర్యమూ, ఆత్మసౌందర్యమూ అనూహ్యంగా ఉంటుంది.

మాటలలో చిన్న చిన్న మార్పులతో వాటి అర్ధంలో ఒక అద్భుతమైన తేడాను తీసుకురావడం లోనూ, అంతుతెలియని చిక్కుముళ్ళను చాలా తేలిక మాటలలో పరిష్కరించడం లోనూ జిల్లెళ్ళమూడి అమ్మగారికి సాటి వచ్చేవారు - ప్రపంచ చరిత్రలో మనం చూచే మహనీయులలో - ఇప్పటివరకూ ఇంకెవ్వరూ లేరు.

ఈ వాక్యం కూడా అలాంటిదే.

ఒక సందర్భంలో అమ్మ ఇలా అన్నారు.

"సిద్దులందరూ ప్రసిద్ధులూ కారు.ప్రసిద్ధులందరూ సిద్ధులూ కారు.
వక్తలందరూ ప్రవక్తలూ కారు.ప్రవక్తలందరూ వక్తలూ కారు".

వినేవాళ్ళకు మతులు పోయాయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.

ఈ వాక్యాన్ని కొంచం వివరిస్తాను.

లోకంలో సిద్ధులు ఎందఱో ఉంటారు.ఆయా సిద్ధులు కూడా రకరకాల స్థాయీ భేదాలతో ఉంటారు.ఎవరి సిద్ధి వారిది.అతి చిన్నవైన క్షుద్రసిద్దులనుంచీ, మహత్తరమైన ఆత్మసిద్ధి వరకూ ఈ మధ్యలో ఉన్న రకరకాల స్థాయిలలో సిద్ధి పొందినవారు ఎందఱో ఉంటారు.కానీ వారిలో లోక ప్రసిద్ధులు కొందరే ఉంటారు.వారికి లోకంతో ఉన్న కర్మబంధం వల్ల వారు లోకంలో ప్రసిద్దులౌతారు.కానీ లోకానికి తెలియని సిద్ధులు ఎందఱో అజ్ఞాతంగానూ ఉంటారు.వారికి లోకవాసన ఉండదు గనుక వారికి లోకంలో పేరు ప్రఖ్యాతులు రావు.వాటిని వారు కోరుకోరు కూడా.

లోకప్రసిద్దులైన సిద్ధులను మించిన అమేయమైన శక్తి కలిగిన సిద్ధులు అజ్ఞాతంగా ఉండటంలో వింతా ఆశ్చర్యమూ ఏమీ ఉండవు.కలిమాయలో పడిన జనులు ఏమనుకుంటారంటే, ఒకనికి ఒక శక్తి ఉంటే దానిని తప్పకుండా ప్రదర్శించుకోవలసిందే అనుకుంటారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది.అంతరిక ప్రపంచంలోని పోకడలు బాహ్య ప్రపంచపు పోకడలకు భిన్నంగా ఉంటాయి.అంతరిక ప్రపంచంలో నిజమైన సిద్ధి కలిగిన వారు వాటిని ప్రదర్శనకు పెట్టడానికి ఇష్టపడరు.

అందుకే అమ్మ - 'సిద్దులందరూ ప్రసిద్ధులు కారు'-అన్నారు. 

దీనినే పొడిగిస్తూ -"ప్రసిద్ధులందరూ సిద్ధులూ కారు" అనికూడా అమ్మ అన్నారు.

అంటే - లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన మహనీయులు నిజానికి పెద్ద గొప్ప సిద్దులేమీ కాదని అమ్మ ఒక్కమాటతో తేల్చేశారు.

మరి వారికి ఆ పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయి? అన్న అజ్ఞానపు సందేహం మన  అజ్ఞానపు మనస్సులకు వెంటనే వస్తుంది.

దానికి ఒకటే జవాబు.

'లోకంలో ప్రసిద్ధి కలగాలంటే నీకు సిద్ధి ఉండనక్కరలేదు.లోకులలో అజ్ఞానం ఉంటే చాలు. అపుడు నీకు సిద్ధి లేకపోయినా ప్రసిద్ధి తేలికగా వస్తుంది'.

మొన్నీ మధ్యన ఒకాయన నన్నిలా ప్రశ్నించారు.

'కొందరు గురువులలో శక్తి లేకపోతే వారి శిష్యులకు అనుభవాలు ఎలా కలుగుతున్నాయి?'

దానిని ఇలా చెప్పాను.

'అనుభవం అనేది ఇచ్చేవాడిని బట్టి ఉండదు.పొందే వాడిని బట్టి ఉంటుంది'.

నామాటలోని అర్ధం ఆయనకు అర్ధమైందో లేదో నాకు అనుమానమే.కానీ ఉన్న సత్యాన్ని నేను చెప్పక తప్పదు.

నేడు పిచ్చిజనం వేలం వెర్రిగా ఆరాధిస్తున్న వారంతా నిజానికి నిజమైన సిద్దులేనా? అంటే -- అనుమానమే.వారు తప్పకుండా లోకప్రసిద్దులే.కానీ నిజమైన సిద్దులేనా? అంటే జవాబు ఉండదు.

అలాగే ఈ వాక్యానికి పొడిగింపుగా ఇంకొక మాటను అమ్మ అన్నారు.

"వక్తలందరూ ప్రవక్తలూ కారు.ప్రవక్తలందరూ వక్తలూ కారు"

నేడు మనం ఎందఱో వక్తలను బయట ప్రపంచం లోనూ టీవీలలోనూ కూడా చూస్తున్నాం.వారు మంచి వక్తలే.అందులో ఏమీ సందేహం లేదు.కానీ ప్రవక్తలేనా? అంటే సందేహమే.

ఈ మధ్యలో ఒకరు నాతో అన్నారు.

'టీవీ వక్తల మధ్య కూడా జెలసీలున్నాయి.మాటల యుద్దాలున్నాయి. ఒకాయనకు మార్కెట్ బాగా ఉన్నదని మిగతా వారికి అసూయ.అందుకని ఒకరిమీద ఒకరు బురద జల్లుకుంటూ ఉంటారు.కేసులు పెట్టుకుంటూ ఉంటారు.కోర్టులకు కూడా ఎక్కుతూ ఉంటారు.'

నిజమా?

నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

నేను టీవీ చూడను.టీవీ ప్రవచనాలు అసలు విననే వినను గనుక ఈ విషయాలు నాకు తెలియవు.

అమ్మ మాటల్లో ఎంత సత్యం ఉందో మళ్ళీ ఒక్కసారి నాకు స్ఫురించింది.

వక్తలందరూ ప్రవక్తలైతే ఇక వారిమధ్యన యుద్దాలెందుకు ఉంటాయి? హింస చెయ్యమని నిజమైన ప్రవక్త అయినవాడు ఎప్పుడూ చెప్పడు. తనూ చెయ్యడు.ఒకవేళ అలా చెబితే అతడు ప్రవక్త కానేకాడు. వక్త నిజంగా ప్రవక్త అయినప్పుడు అతనికి జెలసీ ఉండడానికి ఆస్కారమే లేదు.

అందులోనూ ఈ వక్తలందరూ చెబుతున్నది వారి సొంత అనుభవజ్ఞానం నుంచి కాదు.మన గ్రంధాలలోని విషయాలనే వారందరూ ఎవరెవరి మేధాశక్తిని బట్టీ, వాక్చాత్యుర్యాన్ని బట్టీ ఊకదంపుడుగా వల్లె వేస్తున్నారు. అదంతా వారి వారి సొత్తు కాదు.ఇక వారిలో వారు కొట్టుకోవలసిన పని అందులో ఏముంది?

వక్తలందరూ ప్రవక్తలు కారు - కాలేరన్నది మనకు తెలిసిన విషయమే.కానీ ప్రవక్తలందరూ వక్తలు కూడా కారు.

రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు, అరవిందులు మొదలైన వారు గొప్ప వక్తలేమీ కారు. వారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఏమీ ఇవ్వలేదు.కానీ వీరు నిజమైన ప్రవక్తలు.మరి ఉపన్యాసకులలో ప్రవక్తలు ఉండరా? ఉండకూడదా? అంటే ఉంటారు అనే చెప్పవలసి వస్తుంది.

ప్రపంచమంతా తిరిగి అన్ని ఉపన్యాసాలిచ్చిన నవీన యుగప్రవక్త వివేకానందస్వామి కూడా అదంతా తన గురుదేవులు తనద్వారా చేయించారని,తానొక మామూలు మనిషినని భావించాడు గాని, తానే అదంతా చేశానని ఎప్పుడూ అనుకోలేదు.తన గురుదేవులు తనకిచ్చిన పని అయిపోయిన తదుపరి ఒక్కక్షణం పాటు అసలీ లోకంలో ఉండటానికే ఆయన ఇష్టపడలేదు. ఉపన్యాసాలిచ్చినంత మాత్రాన ఆయన ప్రవక్త కాకుండా ఎలా ఉంటాడు?

నిజమైన ప్రవక్తలు స్వతస్సిద్ధంగా పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు.లోకులతో ఎక్కువగా పూసుకోవడానికి కూడా వారు ఇష్టపడరు.కానీ ఒకవేళ అవసరమై మాట్లాడినంత మాత్రాన వారి ప్రవక్తత్వానికి ఏమీ భంగమూ ఉండదు. వివేకానందస్వామి అలాంటి మహనీయుడే.

మాట్లాడగలిగిన ప్రతివారూ ప్రవక్తలు కాలేరు. కానీ లోకులేమనుకుంటారంటే ఒక మహోపన్యాసం ఇవ్వగలిగితే అతడు మహాప్రవక్త అనుకుంటారు. ఇది పూర్తిగా పొరపాటు అభిప్రాయం.ఈ చిన్నపాటి లొసుగులోనే మామూలు వక్తలందరూ ప్రవక్తలలా చెలామణీ అయిపోతూ బ్రతికేస్తుంటారు.

మాట్లాడకుండా మౌనంగా ఉన్నవారందరూ జడులూ కారు.చాలామంది ప్రవక్తలు మౌనంగా వారి జీవితాలను వెళ్ళబుచ్చడానికే ఇష్టపడతారు.లోకంతో , లోకులతో పెట్టుకుంటే అనవసరమైన గోల తప్ప ఇంకేమీ ఉండదని వారికి బాగా తెలుసు.

అందుకే అమ్మ చెప్పినట్లు - "వక్తలందరూ ప్రవక్తలూ కారు.ప్రవక్తలందరూ వక్తలూ కారు"- అనేమాట అక్షరాలా నిజం.

వెరసి ఏమి తెలుతున్నదంటే --

వక్తలు అందరూ ప్రవక్తలు కాలేరు.
వక్తలు కానంత మాత్రాన ప్రవక్తలు కారని అనలేము.
ప్రవక్తలు అందరూ వక్తలు కారు.
ప్రవక్తలలో కూడా కొందరు వక్తలు ఉంటారు.

సిద్ధులు అందరూ ప్రసిద్ధులు కారు.
లోక ప్రసిద్ధి ఉన్నంత మాత్రాన సిద్దులనీ చెప్పలేము.
కొండొకచో సిద్ధులకు కూడా లోకప్రసిద్ధి ఉండవచ్చు.
లోకప్రసిద్ధి లేనివారిలో కూడా సిద్ధులు ఉండవచ్చు.

కానీ - ప్రసిద్దులతోనూ, వక్తలతోనూ లోకానికి పని లేదా? అంటే ఉందనే చెప్పాలి. లోకం అంతా అజ్ఞానపు చీకటిలో అల్లాడుతున్న మనుషులతో నిండి ఉన్నది గనుక అలాంటి జనులకు - పురాణ కాలక్షేపం చెప్పడానికి -  ఇలాంటి వక్తలూ ప్రసిద్ధులూ అవసరమే.

అసలైన ఆధ్యాత్మికత అంటే తెలియని ఇలాంటి చాలామంది, న్యూస్ పేపర్లలో ఆధ్యాత్మిక కాలమ్స్ వ్రాస్తూ ఉంటారు.అసలు వారేమి వ్రాస్తున్నారో వారికే తెలీదు.ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి 'ఆధ్యాత్మిక న్యూస్ కాలమ్' చదివినప్పుడు నాకు భలే నవ్వు వస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి వారు కూడా లోకానికి అవసరమే.వారు వ్రాసినది చదివి ఏదో అర్ధమైందని అనుకునేవారు అనుకుంటారు.చదివేవారిని చూచి తమకేదో తెలుసనీ వ్రాసేవారు అనుకుంటారు. భలే ప్రహసనం !!!

ఈ లోకం చాలా విచిత్రమైనది.

నేనెప్పుడూ ఒక మాట అంటుంటాను.

"హంసలు హంసల గుంపులో కలుస్తాయి.
కొంగలు కొంగల గుంపులో కలుస్తాయి.
కాకులు కాకుల గుంపులో కలుస్తాయి"

లోకంలో హంసలూ ఉంటాయి, కొంగలూ ఉంటాయి, కాకులూ ఉంటాయి.వేటి పని వాటిది.దేని అవసరం దానిది.దేని తిండి దానిది.దేని తిప్ప దానిది.దేని కర్మ దానిది.వాటివాటి కర్మానుసారం అవి ఆయా గుంపులలో కలసి బ్రతుకుతూ ఉంటాయి.

హంసలు మౌనంగా మర్యాదగా పద్దతిగా ఉంటాయి.
కొంగలు అతితెలివిగా ఉంటాయి.
కాకులు గోలగోలగా అరుస్తూ ఉంటాయి.

దేని పాత్ర దానిది.దేని పాత్రపోషణ దానిది.ఈ లోకంలో దేనినీ తప్పు పట్టలేం.ఇక్కడ ఒక కోణంలో చూస్తే అన్నీ అవసరమే.ఇంకొక కోణంలో చూస్తే ఏదీ అవసరం లేదు.

లోకంలో రుచిగా శుచిగా ఇంటిలో వండిన భోజనమూ దొరుకుతుంది.రోడ్డు పక్కన చెత్తా చెదారం మధ్యలో వండి వడ్డించే భోజనమూ దొరుకుతుంది.

ఈలోకంలో వజ్రాల అంగళ్లూ ఉంటాయి.చేపల బజారూ ఉంటుంది. దేవాలయ సముదాయమూ ఇక్కడ ఉంటుంది.వేశ్యావాటికలూ ఇక్కడ ఉంటాయి.ఎవరి టేస్ట్ ను బట్టి వారు వారికి నచ్చినదానిని స్వీకరిస్తూ ఉంటారు.ఎవరి ఖర్మను బట్టి వారి జీవితం నడుస్తూ ఉంటుంది.

ఏమీ తెలియని వారికి కొంత విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి వక్తలూ, లోకప్రసిద్దులూ అవసరమే.వారి పని అంతవరకే.వారు ఎల్కేజీ టీచర్ల వంటివారు.పసివాడికి ఎల్కేజీ టీచర్ అవసరమే.సమాజం ఆధ్యాత్మికంగా పసిదే గనుక వీరూ దానికి అవసరమే.

కానీ ఆ ఆవరణ దాటి, అసలైన ఆధ్యాత్మికతను తెలుసుకోవాలి, అందులో అడుగులు వెయ్యాలి, ఆ మార్గంలో నడవాలి, అక్కడ ఏముందో ప్రత్యక్షానుభూతి ద్వారా తెలుసుకోవాలి- అని ఆశించేవారు మాత్రం ఈ వక్తలతోనూ, ప్రసిద్దులతోనూ ఆగిపోరాదు.ఎందుకంటే వారు ఆశిస్తున్నది అక్కడ దొరకదు.

వారు నిజమైన ప్రవక్తలకోసం,సిద్దులకోసం దీక్షగా వెదకాలి.దొరికితే గట్టిగా పట్టుకోవాలి.దీక్షగా వారిని అనుసరించాలి. అప్పుడే వారు వెదుకుతున్నది వారికి దొరుకుతుంది.

మిగతా మనుషులందరూ వక్తలనూ, లోక ప్రసిద్దులనూ అనుసరించక తప్పదు. వారికి పుస్తకజ్ఞానం మాత్రమే దక్కుతుంది.పై తరగతులకు ఎదగలేనప్పుడు ఎప్పటికీ ఎల్కేజీలోనే ఉండక తప్పదు. ఎల్లకాలమూ అవే సర్వస్వం అనుకుంటూ 'అ ఆ ఇ ఈ' లు దిద్దుకోకా తప్పదు.