27, అక్టోబర్ 2015, మంగళవారం

నా రమణాశ్రమ జీవితం - 5 (ఆశ్రమాలలో లుకలుకలు)

ఆశ్రమాలన్నీ మేడిపళ్ళే.

ఈ స్టేట్మెంట్ చాలామందికి మింగుడు పడకపోవచ్చు.కోపాన్ని తెప్పించవచ్చు. కానీ నేను చెప్పే అనేక ఇతర విషయాలలాగే ఇదీ నిజమే.నేటి నవీనకాలపు ఆశ్రమాలైతే సరే,మరి పాతకాలపు ఆశ్రమాలు కూడా ఇంతేనా? అన్న సందేహం చాలామందికి రావచ్చు.నవీన కాలమైనా పాతకాలమైనా మనుషుల మనస్తత్వాలలో ఏమీ మార్పు రాలేదు.అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మనుషులు ఒకేలా ఉన్నారు.

గత 10,000 ఏళ్ళుగా మనిషి యొక్క మౌలికమైన ఆటవిక మనస్తత్వంలో ఎలాంటి మార్పూ రాలేదని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు.ఇది నిజమే. మనిషి ఒకప్పుడు అడవిలో ఉండేవాడు.ఇప్పుడు జనాటవిలో ఉంటున్నాడు. అప్పుడు పాశవికంగా జంతువులను వేటాడేవాడు.ఇప్పుడు తెలివిగా సాటి మనిషిని వేటాడుతున్నాడు.అప్పుడు ఇంత సైన్సూ,టెక్నికల్ పరికరాలూ లేవు.ఇప్పుడున్నాయి.అయితే మనిషి చేసే పనిలో మాత్రం మౌలికమైన మార్పు ఏమీ రాలేదు.మనిషి అంతరంగంలో ఏమీ తేడా రాలేదు.

ఆటవిక సమాజంలో ఉన్న కక్షలూ కుళ్ళూ కుత్సితాలూ అసూయా దురాశా ఇప్పుడూ ఉన్నాయి.కాకుంటే అప్పుడు వాటిని దాచుకోవడం తెలియక వెంటనే ప్రదర్శించేవాడు.ఇప్పటి మనుషులు తెలివిగా వాటిని లోలోపల అణచిపెట్టి పైకి నవ్వుతూ మోసాలు చేస్తున్నారు.నమ్మించి వెన్నుపోటు పొడుస్తున్నారు. అంతే తేడా.

మనిషిలో తెలివి పెరిగింది.దీనిని తెలివి అనడం కంటే నక్కజిత్తులు అంటే బాగుంటుందేమో?తెలివి పెరిగినా,అంతరిక పరివర్తన అనేది మనిషికి రాలేదు. అందుకే సామాజిక శాస్త్రవేత్తలు అంటారు - మనిషి ఇప్పటికీ ఆటవికుడే అని.

"మనిషి ఒక సామాజిక జంతువు"- అన్నాడు అరిస్టాటిల్.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే - ఆ పుస్తకంలో నాగమ్మగారు వ్రాస్తారు. ఒకరోజున ఉదయం నుంచీ సాయంత్రం వరకూ మహర్షి నాగమ్మతోనే మాట్లాడుతూ ఉన్నారట.అది చూచి, మహర్షి దర్శనార్ధమై వచ్చిన మిగతా భక్తులు ఎకసెక్కంగా కామెంట్ చేశారని ఆమే వ్రాశారు.ఆ వచ్చిన వారిలో ఒక తమిళ పండితుడు కూడా ఉన్నాడట.ఆయనిలా అన్నాడు.

మహర్షినుద్దేశించి వ్రాస్తూ గణపతిముని తన రచనలలో ఒకదానిలో - 'గణరాన్ముఖ సూరిసభా గురుణా' అని ఒకచోట అన్నారు.ఇవాళ కూడా సూరిసభేగా జరిగింది' అన్నాడట ఎగతాళిగా.నాగమ్మగారి ఇంటిపేరు కూడా 'సూరి' కాబట్టి ఎప్పుడో గణపతిముని వ్రాసిన ఒక ముక్కను తీసుకొచ్చి ఎగతాళిగా అలా అన్నాడట.ఆ పదానికి గణపతిముని వాడిన అర్ధం వేరు. "సూరిసభా గురుణా" అంటే పండితసమూహానికి గురువైనవాడవు అనీ, 'గణరాన్ముఖ" అంటే - "గణపతిచే నాయకత్వం వహించబడే" అనీ అర్ధాలు. కానీ ఆ పండితుడేమో - 'ఇవాళంతా మహర్షి నీతోనే మాట్లాడుతూ ఉన్నారు' - అని ఎగతాళిగా అసూయగా అన్నాడట. 

ఆ అర్ధాలు ఎలా ఉన్నప్పటికీ - అక్కడకు వచ్చే భక్తులలో కూడా పరస్పర అసూయలూ,ద్వేషాలూ,ఒకరినొకరు ఎగతాళి చేసుకోడాలూ,వెక్కిరింతలూ ఉండేవని దీనిని బట్టి అర్ధమౌతున్నది.అది సహజమే కదా ! మహర్షి జ్ఞాని అయినంత మాత్రాన ఆయన చుట్టూ చేరినవారు కూడా మహాజ్ఞానులు కావాలని ఎక్కడుంది? ప్రకృతిలో అది సాధ్యం కూడా కాదు.ఒక జ్ఞాని చుట్టూ అజ్ఞానులు చేరడమే ప్రకృతిధర్మం.వెలుతురు చుట్టూ చీకటేగా ఉండేది?వెలుగు చుట్టూ వెలుగు ఉంటే అది ప్రత్యేకంగా కనిపించదు.ఆ వెలుగులో ఈ వెలుగు కలసిపోతుంది.ప్రత్యేకంగా కన్పించింది అంటే అది చీకటి అనే అర్ధం. అలాగే ఒక మహనీయుని దగ్గర చేరిన వారిలో నిజంగా ఆయన్ను ప్రేమించి ఆయన్ను అనుసరించేవారు ఆయనలాగే తయారౌతారు.వారికీ ఆయనకూ ఏమీ భేదం లేనంతగా ఆయనతో వారు కలసిపోతారు.తద్రూపులే తద్గుణులే వారుకూడా అవుతారు. దీనినే 'భ్రమరకీట న్యాయం' అని వేదాంతంలో అంటారు.

కానీ అలా అయ్యేవారు ఎక్కడో నూటికి కోటికి ఒక్కరో ఇద్దరో ఉంటారు. మిగిలినవారు ఆయనపేరు చెప్పి తమతమ వేషాలు వేసేవారే ఉంటారు.ఏ ఆశ్రమంలో చూచినా,ఏ గురువు దగ్గర చూచినా ఇదే తంతు జరుగుతుంది. దీనికి ఎక్కడా మినహాయింపు ఏమీ ఉండదు.

నేను పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి 1979 లో మొదటిసారి వెళ్లాను.అప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయింది.డిగ్రీలో చేరుదామని ఉద్దేశ్యం.అక్కడైతే ఏదో ధార్మికమైన శిక్షణ కూడా ఉంటుంది,ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఉత్తమమైన పౌరుడిగా ఎదగవచ్చు.అన్న భ్రమలో మా పెద్దలు అక్కడ కాలేజీలో అడ్మిషన్ కోసం నన్ను అక్కడకు పంపించారు.పెద్దవాళ్ళ మాటకు ఎదురు చెప్పడం ఆ తరంలో లేదు గాబట్టి, నోర్మూసుకుని నేనూ అక్కడకు వెళ్లి ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యాను.కానీ అక్కడ వాతావరణం చూస్తూనే నాకు అర్ధం అయిపోయింది - పుస్తకాలలో వ్రాసినంత ఆధ్యాత్మిక ఔన్నత్యం అక్కడ ఏమీ లేదని.అదంతా హైక్లాస్ మాఫియా వ్యవహారమని.

మా పెద్దలలో కొందరు సత్యసాయిబాబా భక్తులున్నారు.వారు చెబుతుంటే విన్న వాతావరణం అక్కడేమీ నాకు కన్పించలేదు.ఇంకా పైగా - దానికి పూర్తి వ్యతిరేకమైన ఒక ఇబ్బందికరమైన మాఫియా వాతావరణం దర్శనమిచ్చింది. అంత చిన్నవయసు లోనే నాకేంటో ఆ వాతావరణం అంతా చాలా అసహజంగా చాలా అసౌకర్యంగా ఉన్నట్లు ఫీలింగు కలిగింది.బైటకు ప్రొజెక్షన్ అయ్యే ప్రచారాలకూ,వాస్తవంగా ఆశ్రమాలలో ఉండే పరిస్థితులకూ ఎంత తేడా ఉంటుందో నాకు అదే ప్రధమానుభవం.అదృష్టవశాత్తూ అక్కడ నాకు సీటు రాలేదు.జీవితంలో సెటిలయ్యాక అఫిషియల్ పనులమీద చాలాసార్లు అక్కడకు వెళ్లాను.ప్రతిసారీ అక్కడ ఒకవిధమైన కృత్రిమ వాతావరణమే నాకు కనిపించింది.అక్కడ ఏ రకమైన దివ్యత్వమూ లేదని నా నిశ్చితాభిప్రాయం. ఇన్నేళ్ళ తర్వాత సత్యసాయిబాబా మరణం సమయంలో జరిగిన ప్రహసనం అంతా చూచాక చాలామంది హతాశులయ్యారు.కానీ నాకేమీ అనిపించలేదు. 36 ఏళ్ళ క్రితం నాకు కలిగిన ఫీలింగ్ నిజమేనని నాకు నిరూపణ అయింది.

ఆ తర్వాత రామకృష్ణా మఠాలతో సహా అనేక ఆశ్రమాలను నేను చాలా దగ్గరగా పరిశీలించాను.అన్నింటిలోనూ ఇవే లుకలుకలు దర్శనమిచ్చాయి.బయట పుస్తకాలలో ఉండేవి వేరు.ఆశ్రమాలలో జరిగేవి వేరు.కాకపోతే మిగతా అన్ని ఆశ్రమాలతో పోలిస్తే రామకృష్ణా మఠాలు చాలావరకూ నయం. మిగతా ఆశ్రమాలలో ఉండే రకరకాల మోసాలూ, ఘోరాలూ,వంచనలూ అక్కడ జరగవు.వాళ్ళు శుద్ధంగానే ఉంటారు.కానీ అక్కడ కూడా అహంకారాలూ గ్రూపు ఫీలింగులూ ప్రాంతీయ ఫీలింగులూ గర్వాలూ మొండితనాలూ ఉండటం నేను గమనించాను.తరాలు మారే కొద్దీ సాధువులలో క్వాలిటీ తగ్గిపోవడాన్ని కూడా నేను గమనించాను.

మిగతా ఆశ్రమాల గురించి ఇక నేను వ్రాయదలచుకోలేదు.ఎందుకంటే వాటి గురించి వ్రాయడం సంగతి అలా ఉంచి, ఆలోచించడం కూడా పరమ వేస్ట్ అన్న స్థాయిలో అవి ఉన్నాయి.అందుకే అన్నింటికీ ఆదర్శంగా ఉండే రామకృష్ణ మఠాల గురించే నేను వ్రాశాను.

ఓషో ఆశ్రమం కూడా నేను చూచాను.ఓషో తన పుస్తకాలలో వ్రాసినదానికీ అక్కడ జరిగేదానికీ ఏమీ సంబంధం లేదు.అది ఒక హైక్లాస్ క్లబ్బులాగా నాకు అనిపించింది.మిగతా ఆశ్రమాలకూ దానికీ నాకు తేడా ఏమీ కన్పించలేదు. కాకపోతే మన ఆశ్రమాలలో నల్లతోలు కనిపిస్తే అక్కడ ఎక్కువగా తెల్లతోలు కన్పిస్తుంది.అంతేతేడా.అది తప్ప మనుషుల మనస్తత్వాలలో గాని ప్రవర్తనలలో గాని ఏమీ భేదం నాకు కన్పించలేదు.ఓషో పుస్తకాలలో కన్పించే ఉన్నతమైన విషయాలు ప్రాక్టికల్ గా ఆ ఆశ్రమంలో నాకెక్కడా కన్పించలేదు. ఆ దెబ్బతో నాకు మళ్ళీ పూనా వెళ్ళాలన్న ధ్యాసే కలగలేదు.

గతించిన గురువులు గనుక నిజంగా ఉన్నతులైతే, ఆ బోధనలను ఇప్పుడున్నవారు ఎవరూ యధాతధంగా పాటించడం లేదు.వాటిని చాలా మార్చారు లేదా వక్రీకరించారు.ఇప్పుడు బ్రతికున్న గురువులను చూద్దామా అంటే వీరిలో ఎవరిలోనూ నిజమైన క్వాలిటీ లేదు.వీళ్ళందరూ పాతవాళ్లకు కాపీరాయుళ్ళే

ఉదాహరణ కోసం ఈ రెండు ఆశ్రమాల విషయం చెప్పానుగాని మిగతా ఆశ్రమాలన్నీ ఈ రెంటి మధ్యనున్న స్పెక్ట్రం లో ఇమిడిపోయేవే.ఆచరణ లోపాలలో స్థాయీభేదాలే గాని ఔన్నత్యంలో ఉన్నతస్తరాలు నాకెక్కడా కన్పించలేదు. అందుకే ఏ ఆశ్రమానికీ ఏ గురువుదగ్గరకూ వెళ్ళకూడదన్న నిశ్చయానికి నేను 25 సంవత్సరాల క్రితమే వచ్చేశాను.

పూర్ణసత్యం ఈ ప్రపంచంలోని ఏ ఆశ్రమంలోనూ లభించదు.ఏ గురువుదగ్గరా లభించదు.అలుపెరుగని అంతరికాన్వేషణ ద్వారానే అది లభ్యమౌతుందన్న విషయమూ,దానికోసం ఎక్కడికీ తిరగవలసిన అవసరం లేదన్న విషయమూ,ఏ గురువులనూ దేబిరించవలసిన అవసరం లేదన్న విషయమూ,అసలు వారికే ఆ సత్యజ్ఞానం లేదన్న విషయమూ - ఆ విధంగా నాకు ప్రాక్టికల్ గా అర్ధమైంది.
read more " నా రమణాశ్రమ జీవితం - 5 (ఆశ్రమాలలో లుకలుకలు) "

27-10-2015 పౌర్ణమి ప్రభావం


ఈ రోజు ఆశ్వయుజ పౌర్ణమి.

సరిగ్గా నిన్న సాయంత్రం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ లోనూ పాకిస్తాన్ లోనూ భూకంపం (7.5) వచ్చింది.ఈ భూకంపంలో దాదాపు 275 మంది చనిపోయి ఉండవచ్చని మీడియాలో అంటున్నారు.

ఈ ప్రకంపనలు ఉత్తరభారత దేశంలో కూడా కనిపించాయి.రాహు బుధుల సంయోగం భూతత్వ రాశి అయిన కన్యలో జరగడమే దీనికి కారణం అయి ఉండవచ్చు అనిపించినా అసలు కారణం సింహరాశిలో జరిగిన గురు-కుజ-శుక్రుల అతిసమీప సంయోగమే.శని కుజులకు పరస్పర దృష్టి ఉండటం గమనార్హం.ఇదే ఈ భూకంపాన్ని ట్రిగ్గర్ చేసింది.వీరు ముగ్గురూ శుక్ర నక్షత్రం అయిన పూర్వ ఫల్గునీ లో ఉండటం వల్ల ముస్లిం దేశం దెబ్బతిన్నది.శుక్రుడు ముస్లిం దేశాలకు సూచకుడని మనకు తెలుసు.

అమావాస్యా పౌర్ణములకు చంద్రప్రభావం భూమిమీద ఎక్కువగా ఉంటుందని దానివల్ల చాలా అనర్ధాలు జరుగుతాయనీ చెప్పడానికి ఇది మరో ఋజువు.
read more " 27-10-2015 పౌర్ణమి ప్రభావం "

21, అక్టోబర్ 2015, బుధవారం

HIV రోగులకు శుభవార్త - హోమియోపతి మిమ్మల్ని రక్షించగలదు

ప్రాణం మీద ఆశను వదిలేసుకుని బ్రతుకుతున్న ఎయిడ్స్ రోగులకు శుభవార్త.మీ జీవిత కాలాన్ని పొడిగించడమే కాక, మీకు మళ్ళీ ఆరోగ్యాన్ని ప్రసాదించగల మందు హోమియోపతి విధానంలో ఉన్నది.

హోమియోపతిలో రోజురోజుకీ అద్భుతమైన కొత్త కొత్త మందులు కనిపెట్టబడుతూ ఉన్నాయి.రోగాలు కొత్త కొత్తవి పుట్టుకొచ్చే కొద్దీ మందులు కూడా కొత్త కొత్తవి అవసరం అవుతూ ఉంటాయి.ఈ క్రమంలో వచ్చినదే - ఎయిడ్స్ వైరస్ ను సమర్ధవంతంగా అడ్డుకోగల నూతన హోమియో ఔషధం - CD4 Num.

రోగకారక పదార్ధాలను పోటెన్సీలుగా మార్చి విషాన్ని అమృతంగా మలిచే విధానం హోమియోపతి విధానానికి సొంతం.అలా తయారు చేసిన ఔషధాలను 'నోసోడ్స్' అంటారు.

సిఫిలినం(సిఫిలిస్ వైరస్),మెడోరైనం(గనేరియా వైరస్),సోరినం(గజ్జిరసి), ట్యూబర్కులినం(టీబీ వైరస్), టైఫాయిడినం(టైఫాయిడ్ బాక్టీరియా), యాంత్రాక్సినం(యాంత్రాక్స్ వైరస్),పెర్టుస్సిన్(కోరింతదగ్గు కారక బాక్టీరియా),కేర్సినోసిన్(కేన్సర్ కణజాలం) మొదలైన అనేక మందులు హోమియోపతిలో ఉన్నాయి.

ఇవి కాక మానవశరీరంలో ఉండే ద్రవాలను పోటేన్సీలుగా మార్చి చేసే మందులను 'సార్కొడ్స్' అంటారు.గ్లాండులర్ మందులన్నీ ఈ కోవకు చెందినవే. ఈ క్రమానికి చెందినదే  CD4 Num అనే మందు.

HIV రోగిలో చాలా మార్పులు వేగంగా చోటుచేసుకుంటూ ఉంటాయి.అతని రోగనిరోధక శక్తి చాలా వేగంగా క్షీణిస్తుంది.దానికి కారణం - HIV వైరస్ తన రూపాన్నీ తన స్ట్రక్చర్ నీ అతివేగంగా మార్చేసుకుంటూ శరీరంలో వ్యాపించడమే.అందుకే ఈ వైరస్ కు విరుగుడును ఇంతవరకూ కనిపెట్టలేకపొతున్నారు.

మన శరీరంలో CD-4 మరియు CD-8 కణాలు అనేవి ఉంటాయి.ఇవి శరీరానికి రక్షణదళం వంటివి.బయటనుంచి శరీరంలో ప్రవేశించిన ఏ క్రిమినైనా వైరస్ నైనా బాక్టీరియా నైనా ఇవి ఎదుర్కొని హతమారుస్తాయి.వీటికి CD-2 & CD-3 కణాలు సహాయపడతాయి.వీటిని క్లస్టర్ కణాలు అంటారు.మనిషి పుట్టిన రెండు సంవత్సరాల లోపే ఇవి థైమస్ గ్లాండ్ లో తయారౌతాయి.అలా అవి తయారు కావాలంటే బిడ్డకు తల్లిపాలు పట్టాలి. టీకాలు వేయించకూడదు.ఈ రెండు పనులూ చేస్తే బిడ్డకు రోగనిరోధకశక్తి చాలా బాగా ఉంటుంది.

కానీ నవీనవనితలు పాలివ్వకుండా బిడ్డను రోగగ్రస్తుడిని చేస్తున్నారు.పాలిస్తే స్త్రీ స్తనసౌందర్యం పాడైపోతుందన్న భ్రమలో హైక్లాస్ స్త్రీలు పిల్లలకు డబ్బా పాలు అలవాటు చేసి ఆ పిల్లల్ని రోగిష్టి వాళ్ళుగా మారుస్తున్నారు.తల్లిపాలు త్రాగని పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎప్పటికీ బలంగా ఉండదు.సెరెలాక్ త్రాగిన పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉంటారేమో గాని వారిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది.వాళ్ళు లోలోపల డొల్లలే. అందుకే డబ్బున్న కుటుంబాల పిల్లలకున్నన్ని రోగాలు పేదవారి పిల్లలకు ఉండవు.పేదవాళ్ళు చక్కగా పిల్లలకు పాలిస్తారు.కాయకష్టం చేసుకునే కుటుంబాల పిల్లలలో చిన్నవయసులో షుగర్ రోగం రాదు.వారికి పుట్టుకతోనే గుండెలో రంద్రాలుండవు.వారికి చీటికీ మాటికీ జలుబులు దగ్గులు జ్వరాలు రావు. చిన్నప్పుడే వాళ్ళ కళ్ళకు సైట్ రాదు.వారికి పళ్ళు అంత త్వరగా ఊడవు. వారికి ఊబకాయం రాదు.వారికి ఆటిజం రాదు.ఇవన్నీ డబ్బుతో విలాసాలతో అతిసుఖాలతో వచ్చే రోగాలు.

దీనికి తోడు మానవజాతిని పీడిస్తున్న ఇంకొక భయంకరమైన శాపం ఏమంటే - టీకాలు వేయించడం.టీకాలు వేసిన రోజునుంచే పిల్లల రోగనిరోధకశక్తి వేగంగా క్షీణిస్తుంది.ఇప్పుడు మూడు నాలుగు టీకాలను కలిపి ఒకే టీకాగా వేస్తున్నారు.ఇలా చెయ్యడం వల్ల కొన్నిచోట్ల ఆ టీకా వేసిన మరుక్షణమే ఆ పిల్లలు కొలాప్స్ అయి చనిపోయారు.ఈ విషయాలు మీడియాలో ఎక్కడా బయటికి రావు.మందుల కంపెనీలు ఈ నిజాలను తొక్కిపెడతాయి.టీకాలు వేయించడం వల్ల ఎన్నెన్ని రోగాలు వస్తాయో,మనిషి జీవితం ఎంతగా దుర్భరం అవుతుందో మీరు ఊహించలేరు.చెప్పినా నమ్మలేరు. ప్రభుత్వాలు కూడా వీటిని ఒక ఉద్యమంగా ప్రచారం చేస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.

అసలు నిజం ఏమంటే, మనిషికి ఏ విధమైన టీకా అవసరం లేదు.ఆ వివరం ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను.ప్రస్తుతానికి ఒక్క విషయం సూక్ష్మంగా గమనించండి.పిల్లవాడికి గానీ పిల్లకు గానీ టీకాలు వేయించక ముందు ఉన్న ఆరోగ్యం ఆ తర్వాత ఉండదు.గమనించండి.అసలైన సమస్యలన్నీ టీకాలతోనే మొదలౌతాయి.యానిమల్ సిరం నుంచి తియ్యబడిన టీకా మందు శరీరంలో విషంలా వ్యాపించి స్లో పాయిజన్ గా పనిచేస్తూ తర్వాత్తర్వాత అనేక అంతుబట్టని రోగాలకు కారణం అవుతుంది.ఈ విషయం ఒక్క హోమియోపతి సూక్ష్మపరిశీలనలోనే తెలుసుకోబడింది.ఇంకే మెడికల్ సిస్టంకూ ఈ రహస్యం తెలియదు.

తల్లి పాలు ఇవ్వకపోవడం మరియు టీకాలు వేయించడాల వల్ల పిల్లల్లో పైన చెప్పిన CD డిఫెండర్ సెల్స్ తగినంత బలంగా ఉండవు.తగినంత కౌంట్ లో కూడా ఉండవు.అందుకే వారిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది.ఆ విషయం అలా ఉంచుదాం.

మీ కళ్ళు తిరిగిపోయే ఒక పచ్చినిజాన్ని ఇప్పుడు చెబుతాను.

ప్రపంచం మొత్తం ఫార్మా కంపెనీల మాయాజాలంలో మునిగి ఉన్నది.ఆ కంపెనీల కబంధ హస్తాలలో ప్రపంచ ప్రజల ఆరోగ్యం పణంగా పెట్టబడుతున్నది.ఇది వాస్తవం.మనుషుల చేత ఆయా కంపెనీలు వాడిస్తున్న మందులు నిజానికి అవసరం లేదు.ఇదంతా పెద్ద మాయ.ఈ పెనుమాయలోనే ప్రపంచం మొత్తం అల్లాడుతున్నది.మెడికల్ ఇండస్ట్రీ మొత్తం ఫార్మా కంపెనీల చేతుల్లో ఇరుక్కుని ఉన్నది.వారు చెప్పిన మందులే మనం వాడాలి.అవి నిజంగా అవసరం ఉన్నా లేకపోయినా సరే.వాళ్ళు సూచించిన టెస్టులే మనం చేయించుకోవాలి.అవసరం ఉన్నా లేకున్నా సరే.డాక్టర్లు కూడా ఈ కంపెనీల ఏజెంట్లే.మెడికల్ రిప్రజెంటేటివ్ లు అందరూ ఈ కంపెనీల తొత్తులే.వారికి తెలియకుండానే వారీ మహామాయలో పావులై బ్రతుకుతూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు.ఇదంతా పెద్ద మాయాలోకం.కానీ బయటకు ఏమీ కనిపించదు.అంతా సరిగ్గా ఉన్నట్లే భ్రమ కల్పించబడుతూ ఉంటుంది.బాగా చదువుకున్న వాళ్ళూ తెలివైన వాళ్ళూ కూడా ఈ మాయలో పడి శుభ్రంగా మోసపోతూ తమతమ ఆరోగ్యాలను పణంగా పెడుతూ బ్రతికేస్తుంటారు.ఇది ఇంకొక పెద్ద విచిత్రం.

అసలైన నిజాలను ఈ ఫార్మా కంపెనీలు జనానికి చెప్పవు.చెబితే వాటి వ్యాపారం సాగదు.ఒక చిన్న ఉదాహరణ. HIV వైరస్ ఉన్న టెస్ట్ ట్యూబులో కూడా T -cells చక్కగా పెరుగుతున్నాయి.కనుక ఎయిడ్స్ అనేది వైరస్ కాదు అని కుండ బద్దలు కొట్టి చెప్పిన నోబుల్ బహుమతి గ్రహీత డాక్టర్ పీటర్ డ్యూస్ బర్గ్ తన ఉద్యోగాన్ని అర్ధాంతరంగా కోల్పోవలసి వచ్చింది.బెర్కిలీ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లో ఈయన మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసేవాడు.ఈ నిజాన్ని వెల్లడించిన పాపానికి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.మెడికల్ మాయాలోకంలో నిజాలు చెబితే ఎవరూ నమ్మరు.పైగా చెప్పినవాడిని వెక్కిరిస్తారు.వాడిని శిక్షిస్తారు.ఈ లోకం ఇలా మాయలో బ్రతకాల్సిందే.

ఈ విషయాలను ఇలా ఉంచితే - CD-4 కణాలను కూడా HIV వైరస్ ఎటాక్ చేసి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించేస్తుంది.అందుకే ఎయిడ్స్ రోగి శరీరంలో రోగనిరోధక శక్తి అతివేగంగా క్షీణిస్తుంది.ఈ CD4 కణాల సంఖ్యను గనుక తిరిగి పెంచగలిగితే అవి మళ్ళీ ఎయిడ్స్ వైరస్ ను ఎదుర్కొని శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.ఎయిడ్స్ వైరస్ ను మనం డైరెక్ట్ గా ఏమీ చెయ్యలేకపోయినా,శరీరంలోని CD- 4 కణాల సంఖ్యను కనుక ఒక స్థాయిలో మెయింటెయిన్ చెయ్యగలిగితే అప్పుడు HIV వైరస్ శరీరంలో ఉన్నప్పటికీ మనిషి ఆరోగ్యం గానే ఉంటాడు.బాధలు ఏమీ ఉండవు.కొందరు వ్యక్తులలో ఇది జరుగుతుంది.వారిలో HIV వైరస్ ఉన్నప్పటికీ వారు ఆరోగ్యంగానే ఉంటారు.దీనికి కారణం - వారి శరీరంలో సరియైన సంఖ్యలో ఉన్న CD-4 కణాలే.ఈ కణాలను పోటెన్సీలోకి మార్చి దానినే CD-4 Num అనే ఒక ఔషధంగా తయారు చెయ్యాలన్న ఆలోచన డాక్టర్ అన్వర్ మీర్జా బేగ్ అనే హోమియో డాక్టర్ కు వచ్చింది.ఈయన ముంబైలో హోమియోపతి ప్రాక్టీస్ చేస్తాడు.14 ఏళ్ళ క్రితమే తన ఆలోచనకు కార్యరూపాన్నిచ్చి ఈ ఔషధాన్ని ఆయన తయారు చేశాడు.తన దగ్గరకు వచ్చిన HIV రోగులలో CD-4 కౌంట్ 200 కంటే క్రిందకు పడిపోయినప్పుడు ఈ మందును వాడి మళ్ళీ ఆ కౌంట్ ను నిలబెట్టి వారిని ఆరోగ్యవంతులుగా ఈయన ఎన్నో కేసులలో చేశాడు.ఈ మందు వాడటం వల్ల క్షీణిస్తున్న CD-4 కణాలు వేగంగా తిరిగి పుంజుకుని HIV వైరస్ చర్యలను సమర్ధవంతంగా నిరోధిస్తున్నాయి.ఈ మందు ప్రపంచం మొత్తం మీద ఆయన ఒక్కడి దగ్గరే ఉన్నది.దీనిని ఈయన తయారు చేసి ఇప్పటికి 14 ఏళ్ళయింది.ఈ 14 ఏళ్ళలో ఆయన ఎంతోమంది HIV పేషంట్ల మీద ఈ మందును వాడి దీని ప్రభావాన్ని నిరూపించాడు.

కానీ ఫార్మా కంపెనీలు దీనిని ఒప్పుకోవడం లేదు.అసలు హోమియోపతి ఒక వైద్యవిధానమే కాదు అని అవి దుష్ప్రచారాన్ని సాగిస్తున్నాయి.అలా చెయ్యకపోతే వాటి వ్యాపారం సాగదు.అది చిన్నా చితకా వ్యాపారం కాదు ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న కొన్ని వేల మిలియన్ డాలర్ల వ్యాపారం.ఇలాంటి హోమియో మందులు బయటకొస్తే ఆ వ్యాపారం కుప్పకూలుతుంది.అందుకని వాటిని బయటకు రానివ్వవు.ఆ రీసెర్చికి ఫండ్స్ ను అందనివ్వవు. హోమియోపతిని ఒక వైద్యవిదానంగా అసలు గుర్తించకుండా WHO ని తమ శక్తివంతమైన లాబీయింగ్ ద్వారా సమర్ధంగా అడ్డుకుంటాయి.ప్రజలేమో గొర్రెల్లా అవి చెప్పిన మందులు వాడుతూ ఒళ్ళు గుల్ల చేసుకుంటూ ఉంటారు.ఇదొక ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న మహామాయ.మనుషుల కపట జీవితాలకు భగవంతుడు వేస్తున్న శిక్షే ఈ ఫార్మా మహామాయ.ఇది గ్లోబల్ కర్మ ప్రభావం.మోడరన్ హిపోక్రాటిక్ జీవితాలకు ప్రకృతి వేస్తున్న శిక్షే ఇంగ్లీషు వైద్యం.

సైంటిఫిక్ గా ఎంతో ఎదిగిన USA లో కూడా హోమియోపతి ఒక వైద్యంగా పరిగణించబడటం లేదు.అదొక "కల్ట్ మెడిసిన్" గానే అమెరికాలో కూడా చూడబడుతున్నది.దీనికి వెనుక ఉన్నది ఫార్మా కంపెనీల లాబీయింగే.వీటి కుట్ర వల్లనే మానవజాతికి అద్భుతమైన వరం అయిన హోమియోపతికి గుర్తింపు లేకుండా పోయింది.భూలోకం అంతా సైతాన్ గుప్పిట్లోనే ఉన్నది అని ఇతరమతాలు చెప్పేదానిలో ఈ విధంగా నిజం ఉన్నదన్నమాట.

సరే ఆ సంగతి అలా ఉంచండి.

మీలో ఎవరైనా ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులుంటే వెంటనే డాక్టర్ మీర్జా అన్వర్ బేగ్ ను సంప్రదించండి.CD-4Num అనే మందు వాడండి.మీ CD-4 సెల్స్ కౌంట్ పెంచుకోండి.రోగాన్ని తగ్గించుకోండి. హాయిగా బ్రతకండి. ఆయన అడ్రస్ ఈ క్రింద ఇస్తున్నాను.

https://www.lybrate.com/doctor/mirzaanwerbaig


ఆయన ఫేస్ బుక్ ఎకౌంట్ ఇదిగో

https://www.facebook.com/drbaig2011?fref=ts

Good Luck.
read more " HIV రోగులకు శుభవార్త - హోమియోపతి మిమ్మల్ని రక్షించగలదు "

19, అక్టోబర్ 2015, సోమవారం

నా రమణాశ్రమ జీవితం - 4 (భిన్న ధృవాలు)


మహర్షి గతించిన తర్వాత ఆశ్రమంలో నైరాశ్యం అలముకున్నది. అందరూ ఒక్కసారిగా డిప్రెషన్ కు గురయ్యారు.అంతకు ముందు కొన్ని నెలలుగా ఇక మహర్షి బ్రతకరు ఇవి చివరిరోజులే అని అందరికీ చూచాయగా తెలిసి పోయింది.బయటపడి బాహాటంగా ఎవరూ అనకపోయినా అందరూ గుసగుసలుగా అనుకునేవారు.చివరకు అందరినీ నిరాశా సముద్రంలో ముంచి 14-4-1950 న మహర్షి శరీరాన్ని వదిలేశారు.

అది ఖచ్చితంగా మేష సంక్రమణదినం. సూర్యుడు మీనరాశిని వదలి తనకు ఉచ్చస్థితి అయిన మేషరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి దినం.అదే రోజున మహర్షి కూడా నశ్వరమైన శరీరాన్ని వదలి జాజ్జ్వల్యమానంగా ప్రకాశించే తన ఆత్మస్థితిలోకి శాశ్వతంగా ప్రవేశించారు.మహనీయుల జననమూ మరణమూ కూడా ఖగోళపరంగా జ్యోతిష్యపరంగా ప్రత్యేకమైన దినాలలోనే జరుగుతాయి. ప్రతి మహనీయుని జీవితంలోనూ దీనిని ఖచ్చితంగా గమనించవచ్చు. మామూలు మనుషులకు ఇవి అర్ధంకాని అంతుబట్టని విషయాలు.కానీ అంతరిక మార్మికశాస్త్రాలలో పరిజ్ఞానం ఉన్నవారికి ఈ రహస్యాలు కరతలామలకంగా అర్ధమౌతాయి.

సూర్యమానం ప్రకారం అప్పుడే వికృతి నామసంవత్సరం ప్రవేశించింది. అంతకు కొద్దిరోజుల ముందు నాగమ్మ మహర్షితో మాట్లాడుతూ ఇదేమాట అంటే - 'ఓహో వచ్చిందీ వికృతి?' అని మహర్షి ఒకవిధమైన స్వరంతో అంటారు. అంటే దేహానికి వికృతి కలిగి తన ప్రకృతిలోకి తాను ప్రవేశించబోతున్నానని సూచనాప్రాయంగా మహర్షి ఆనాడే అన్నారు.

మహర్షి శరీరత్యాగంతో ఆయన్ను నమ్ముకుని ఆయన చుట్టూ గ్రహాలలాగా పరిభ్రమిస్తున్న వారంతా కకావికలై పోయారు.వారు దిక్కుతోచని పక్షులై పోయారు.ఏం చెయ్యాలో వారికి అర్ధం కాలేదు.ఇకమీద తమ గతి ఏమిటో వారికి దిక్కు తోచలేదు.ఇన్నాళ్ళూ వారికి ఏ సందేహం కలిగినా చెప్పడానికి మహర్షి ఉండేవారు.ఏ సమయంలోనైనా నిస్సంకోచంగా ఆయన్ను సమీపించి తమ సందేహాన్ని తీర్చుకునేవారు. సాయంకాలపు నీరెండ వంటి ఆయన సమక్షంలో సేదదీరేవారు.తమను వేధిస్తున్న అనేక బాధలనుంచి ఓదార్పును పొందేవారు.ఇప్పుడో - ఆ వెసులుబాటు హటాత్తుగా మాయమై పోయింది. ఇకమీద వారికి ఆశ్రమంలో ఉండబుద్ధి కాలేదు.రోజూ మనుషులతో కిటకిటలాడే హాలు ఉన్నట్టుండి నిర్మానుష్యమై పోయింది.అందరూ ఒక్కొక్కరుగా ఆశ్రమాన్ని వదలి పోవడం మొదలు పెట్టారు.

ప్రతి మహనీయునికీ ఇదే గతి పడుతుంది.ఆయన/ఆమె గతించిన తర్వాత ఇక అక్కడ సామాన్య భక్తులు ఎవ్వరూ ఉండరు.తమ స్వార్ధం కోసం, తమ కోరికలకోసం వారిని ఆశ్రయించిన దొంగ భక్తులు అందరూ ఉన్నట్టుండి మాయమౌతారు.ఎవరో అతి కొద్దిమంది మాత్రం ఆ బాధను దిగమింగి అక్కడే ఉంటారు.

సామాన్యంగా ఏం జరుగుతుందంటే - ఒక మహనీయుని బోధను - ఆయన భక్తులతో సహా - ఈలోకంలో ఎవరూ నిజంగా పాటించరు అని ఇంతకు ముందే వ్రాశాను.ఇది ప్రత్యక్షరసత్యం.ఈలోకంలో అందరూ ప్రశ్నలు అడుగుతారు, సోది మాట్లాడతారు,చొప్పదంటు ప్రశ్నలు గుప్పిస్తారు-కాని ఆచరణాత్మక సందేహాలను అడిగేవారు మాత్రం ఎక్కడో ఒకరో ఇద్దరో మాత్రమే ఉంటారు. అలా అడిగి తెలుసుకున్నవాటిని సాధనలో ఆచరించేవారు ఇంకా అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు.మిగతా అందరూ ఊరకే కాలక్షేపంరాయుళ్ళే. పనిలేని ఆడవాళ్ళు ఒకచోట కూచుని సోదిముచ్చట్లు చెప్పుకున్నట్లుగా వీరి సందేహాలు ఉంటాయి.అందుకే ఇలాంటి వాగుడుకాయలకు మహర్షి ఏమీ జవాబు ఇచ్చేవారు కారు. వారు ఎందుకు అడుగుతున్నారో ఆయనకు వెంటనే తెలిసిపోయేది.వీరు ఊరకే మాటలవరకే గాని చేతలకు పనికిరారన్న విషయం ఆయనకు బాగా తెలుసు.అందుకే ఎవరుబడితే వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు చెప్పేవారు కారు.

ఒక మహనీయుడిని నిజంగా అనుసరిస్తే, ఆయన చెప్పినదానిని నిత్యజీవితంలో ఆచరిస్తే, అప్పుడు ఆ మనిషిలో కలిగే అంతరిక పరివర్తన అనూహ్యంగా ఉంటుంది.అలా ఆచరించే వ్యక్తిలో రోజురోజుకీ మార్పు కలుగుతుంది.ఒక ఏడాది తర్వాత ఆ పాతమనిషి స్థానంలో ఒక క్రొత్తమనిషి ఉంటాడు.అతని ఆలోచనావిధానమూ అతని ప్రవర్తనా సమూలంగా మారిపోతాయి.మారిపోవాలి కూడా.అలా జరిగినప్పుడే అది నిజమైన సాధన అవుతుంది.అంతేగాని ఆ మహనీయుడు చెప్పిన విషయాలను బట్టీపట్టి ఇంకొకరికి అప్పగించడమూ,ఆయనమీద పుస్తకాలు వ్రాయడమూ, ఆయన మీద అష్టోత్తరాలూ సహస్రనామాలూ గిలకడమూ,ఆయనకు విగ్రహాలు చేయించడమూ,నగలు చేయించడమూ,ఆయనకు పెళ్లి చెయ్యడమూ  - ఇలాంటి పనికిమాలిన పనులన్నీ ఎందుకంటే - ఆయన చెప్పిన అసలైన సాధనను చెయ్యకుండా తప్పించుకోవడానికి వేసే దొంగఎత్తులే ఇవన్నీను. అలాంటి భక్తులందరూ ఎన్నేళ్ళు గడచినా ఏ మార్పూ లేకుండా పాతమనుషుల లాగే ఉంటారు.లేదా ఇంకా దరిద్రంగా దిగజారుతారు. ఉన్నతంగా మాత్రం ఎదగలేరు.ఇలాంటి వారిని ఈలోకంలో ఎటుచూచినా గమనించవచ్చు.

భక్తులమనీ శిష్యులమనీ అనుకునేవారిలో నూటికి తొంభైమంది ఇలాంటి పనిదొంగలే ఉంటారు.కానీ వారు తమను తాము అత్యంత గొప్ప భక్తులుగా భావించుకుంటూ ఉంటారు. ఇదే అసలైన ఆధ్యాత్మిక మాయ.

అసలు ఆధ్యాత్మిక ప్రపంచమే పెద్ద మాయ.లోతుగా విచారిస్తే ఈ విషయం చక్కగా అర్ధమౌతుంది.

భిన్నధృవాలు ఆకర్షించుకుంటాయన్న విషయం మనకు ఫిజిక్స్ లో తెలుసు. సజాతిధృవాల మధ్యన వికర్షణ ఉంటుందనీ మనకు తెలుసు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది.

ఒక మహనీయుని చుట్టూ ఎవరు చేరతారంటే - ఎవరైతే ఆయన చెప్పినదానిని ఆచరించరో - ఎవరైతే ఆయన భావాలకు పూర్తి వ్యతిరేకమైన జీవితాలు గడుపుతూ ఉంటారో - ఎవరైతే ఊరకే మాటలతో కాలక్షేపం చేస్తుంటారో - ఎవరైతే ఆయన విగ్రహాలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వాళ్ళ బిజినెస్ చేసుకుంటారో - అలాంటివాళ్ళే ఆయా మహనీయుల చుట్టూతా ఎక్కువగా చేరతారు.వారిలో అతి కొద్దిమంది మాత్రం ఆయన చెప్పిన బోధను ఆచరించేవాళ్ళు ఉంటారు.దీనికి ఉదాహరణలుగా ఎన్నైనా ఇవ్వవచ్చు.

ఒంటిమీద ఉన్న గుడ్డలను కూడా వదిలేసిన దిగంబర మహావీరుడి చుట్టూ వస్త్రవ్యాపారం చేసే వ్యాపారులూ, బంగారునగల వ్యాపారం చేసే వ్యాపారులూ భక్తులుగా చేరుతారు. "హింస అస్సలు పనికిరాదు,ఊపిరి గట్టిగా వదిలితే కూడా గాలిలోని కొన్ని జీవులు చనిపోతాయి,అందుకని ముక్కుకూ మూతికీ గుడ్డ కట్టుకో" - అని చెప్పిన ఆయన భక్తులేమో వడ్డీవ్యాపారం చేసి మనుషుల రక్తాన్ని జలగలలా డైరెక్ట్ గా పీల్చేవాళ్ళూ ఎదుటి మనిషిని పూర్తిగా దోచుకునే వాళ్ళూ అయి ఉంటారు.

రాజభోగాలను వదిలేసి జీవితమంతా చెట్లక్రింద బ్రతికిన గౌతమబుద్ధుని భక్తులందరూ భవనాలలో ఉంటూ సమస్త భోగాలూ అనుభవించే మహారాజులూ మహారాణులూనూ."అంతా శూన్యం.ఇక్కడ సత్యం లేదు" అని చెప్పిన ఆయన భక్తులేమో "ఇదంతా సత్యం. అన్నీ అనుభవిద్దాం" అనుకునే బాపతు మనుషులు.

కామకాంచన త్యాగమే అసలైన రహస్యం అని చెప్పిన రామకృష్ణుని భక్తులేమో వాటిల్లో పడి జోరుగా ఈత కొడుతున్నవారు,ఆయన బోధలను దేనినీ సక్రమంగా అర్ధం చేసుకోలేనివారూ, ఆచరించలేనివారూను. One sidedness, narrow mindedness అస్సలు పనికిరావని చెప్పిన రామకృష్ణుని భక్తులందరూ వాటితో నిండా నిండిపోయి నిలువెల్లా సంకుచితంగా స్వార్ధపూరితంగా ఆలోచించేవారే అయిఉంటారు.

జీవితంలో ఏది జరిగినా అన్నింటినీ 'సరే' అంటూ యాక్సెప్ట్ చెయ్యమని చెప్పిన జిల్లెళ్ళమూడి అమ్మగారి భక్తులెవరంటే - జీవితంలో దేనినీ యాక్సెప్ట్ చెయ్యలేనివారూ, అంతా తమ ఇష్టప్రకారమే జరగాలని ఆశించేవారూ, తద్భిన్నంగా జరిగితే ఏమాత్రం తట్టుకోలేక గిలగిలలాడిపోయే చౌకబారు మనుషులూను.ఇక దీనిలో అమ్మ చెప్పిన acceptance ఎక్కడుందో నాకైతే అర్ధం కాదు.వీరెవరూ అమ్మ చెప్పినది చెయ్యరు.అమ్మను వదలరు.వారి కోరికలను మాత్రం తీర్చమని మొక్కుకుంటూ ఉంటారు.

జీవితమంతా యోగమే అని చెప్పిన అరవిందుల చుట్టూ చేరిన భక్తులు ఎవరయ్యా అంటే - తామేదో పైనుంచి ఊడిపడిన దేవతలమనీ మిగిలిన మనుషులందరూ క్షుద్రులనీ అనుకునే బాపతు దురహంకారులు.ఇంతా చేస్తే అరవిందుల యోగాన్ని వారు ఆచరిస్తున్నారా అంటే - ఆచరణ మాట అటుంచి దానిని అర్ధం చేసుకోవడమే వారి వల్ల కాదు.

ఇక - ఎల్లప్పుడూ ఆత్మస్థితుడవై ఉండమని చెప్పిన రమణమహర్షి చుట్టూ చేరిన భక్తులు ఎవరంటే - ఇరవై నాలుగ్గంటలూ దేహభ్రాంతిలో మునిగి ఉంటూ అదే సర్వస్వంగా భావిస్తూ,ఆయన దేహచిత్రానికి పటం కట్టి పూజిస్తూ,పైకి మాత్రం వాచావేదాంతం చెప్పే మనుషులు.

అత్యున్నతమైన సూఫీ తత్వాన్ని బోధించిన షిర్డీ సాయిబాబా చుట్టూ మూగే భక్తులు ఎవరంటే - కోరికలతో నిలువెల్లా కుళ్లిపోయి నిరంతరమూ ఏదో ఒక అద్భుతాలను ఆశిస్తూ, నిత్యజీవితంలో అవినీతితో దురహంకారంతో నిండిపోయి బ్రతికే అతితక్కువ స్థాయి మనుషులు.

ఇస్లాం అంటే శాంతి అని చెప్పేవారి వల్ల జరిగినంత రక్తపాతమూ, దుర్మార్గమూ ఇంకేమతం వారివల్లా ఈ భూమిమీద జరుగలేదు.శాంతే మా మతం అని చెప్పేవారి ఆచరణేమో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది.

అలాగే - "ఇతరుల కోసం అన్నీ త్యాగం చెయ్యి.చివరకి నీ ప్రాణాన్ని కూడా ఇచ్చెయ్యి.ఒకచెంప మీద ఎవరైనా కొడితే రెండో చెంపను కూడా చూపించు" - అని చెప్పిన జీసస్ ను అనుసరించే భక్తులూ దేశాలూ ఎవరయ్యా అంటే - కేపిటలిస్ట్ భావజాలంతో ఇతర దేశాలను దోచుకుంటూ, ఇతర సంస్కృతులను నాశనం చేస్తూ, మత మార్పిడులు చేస్తూ, ప్రేమ ముసుగులో ద్వేషాన్ని ప్రచారం చేస్తూ, ఎదుటి మనిషికి ఈ చెంపా ఆ చెంపా రెండూ ఒకేసారి వాయించేవాళ్ళు.

ప్రపంచం మొత్తం మీద ఏ మతమైనా ఇంతే.ఏ మహనీయుని గతి అయినా ఇంతే.వారు చెప్పినదానిని వారి భక్తులే పాటించరు.దీనికి మూలకారణం ఒక్కటే - మనుషుల నీచ మనస్తత్వాలు, వారి మొండితనాలు,కపటంతో కూడిన వారి మోసపూరిత వ్యక్తిత్వాలే ఈ పరిస్థితికి అసలైన కారణాలు. ప్రపంచంలోని మనుషులందరూ దొంగలే.అందరూ అవకాశవాదులే.అందుకే వాళ్ళు ఎప్పటికీ ఉన్నతంగా మారరు.మహనీయుల బోధలను ఆచరించరు. ఆచరించినట్లుగా ఊరకే నటిస్తారు.లోపల్లోపల వారివారి సొంత అజెండానే నడిపించడానికి ప్రయత్నిస్తారు. అంతే. ఇది అసలైన సత్యం.

మహనీయులకు పట్టిన గతి ఇలాగే ఉంటుంది.వారి భక్తులే వారికి గుదిబండలు.వారు చెప్పిన బోధను ఆయా భక్తులు దమ్మిడీ కూడా పాటించరు.ఊరకే వారిని పూజిస్తారు.కోరికలు కోరతారు.అంతేగాని వారు చూపిన మార్గంలో నడవరు. నిజానికి వారిని తమ లోపల్లోపల ఏమాత్రం లెక్కచెయ్యరు.ఇదీ లోకం తీరు.

నేను చెప్పేది చాలామందికి మింగుడుపడదు.కానీ నేను వాస్తవాన్నే మాట్లాడతాను.అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాన్నే నేను వెల్లడిస్తాను.

కనుకనే - "ఏ తీర్ధయాత్రలూ అక్కర్లేదు మీలో మీరు ఉండండి"- అని చెప్పిన రమణమహర్షి చనిపోయిన వెంటనే ఆయన భక్తులందరూ పొలోమని భారతదేశం నాలుగు దిక్కులకూ తీర్ధయాత్రలకు బయలుదేరారు.ఇది విచిత్రంగా లేదూ? ఇక ఆయన బోధను వీరు ఏమి పాటింఛినట్లు? ఆయన భావాలను వీరు ఏమి అర్ధం చేసుకున్నట్లు? ఏళ్ళకేళ్ళు ఆయన చుట్టూ చేరి రకరకాల సోది ప్రశ్నలు అడిగి ఆయననుంచి ఏమి నేర్చుకున్నట్లు?

మనుషులందరూ గురువులను తమతమ స్వార్ధాలకు వాడుకుందామని చూచేవారే గాని, ఆయా గురువులు చెప్పినవాటిని ఆచరిద్దామని చూచేవారు ఎవ్వరూ లేరు.ఇలాంటి చౌకబారు మనుషులు తమచుట్టూ చేరడమే ఆయా మహనీయుల ఖర్మ.ఈ ఖర్మకు ఏ మహనీయుడూ మినహాయింపు కాడు.

మహర్షి చనిపోయిన వెంటనే నాగమ్మగారు కూడా భారతదేశం నలుమూలలా తీర్ధయాత్రలకు వెళ్ళింది.ఎక్కడకు పోయినా పూజారుల డబ్బు యావా,వాళ్ళ దౌర్జన్యమూ,మనుషుల నీచ మనస్తత్వాలే గాని తను కోరుకున్న మనశ్శాంతి ఎక్కడా దొరకలేదని ఆమె వాపోయింది.అది అలాగే ఉంటుందని ఎటూ తిరగవద్దని "మనశ్శాంతి నీ బయట లేదు,అది నీలోపలే ఉంది" అని మహర్షి ఎన్నోసార్లు నెత్తీ నోరూ మొత్తుకుని చెప్పారు.కానీ వినేవారెవరు? ఆయన శిష్యులే ఆయన చెప్పినది పాటించలేదు.

ఆయన శిష్యులే కాదు.ఏ గురువు శిష్యులూ ఆయన చెప్పినది సరిగ్గా అర్ధం చేసుకోరు.సరిగ్గా పాటించరు.ఇది ఆధ్యాత్మిక లోకపు తిరుగులేని నియమాలలో (శాపాలలో) ఒకటి.

మహనీయుల అసలైన శత్రువులు ఎవరయ్యా అంటే వారి భక్తులే.

వారి శిష్యులే.

వినడానికి చేదుగా ఉన్నప్పటికీ ఇదే అసలైన వాస్తవం.

వాస్తవాలన్నీ చేదుగానే ఉంటాయిగా మరి !!
read more " నా రమణాశ్రమ జీవితం - 4 (భిన్న ధృవాలు) "

13, అక్టోబర్ 2015, మంగళవారం

12-10-2015 అమావాస్య ప్రభావం

ఈ అమావాస్యకు ఈ క్రింది ప్రభావాలను గమనించవచ్చు.

ఈసారి కన్యారాశిలో అమావాస్య వచ్చింది.అక్కడే ఉచ్ఛ బుధుడున్నాడు.రాహువూ బుధుడూ అతి దగ్గరగా ఉన్నారు.ఇద్దరూ ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో ఉన్నారు.ఈ నక్షత్ర సూచకుడైన సూర్యుడు ప్రముఖులకు సూచకుడు.

ఈ అమావాస్య చాయలో ఇద్దరు ప్రముఖులు మరణించారు.ఒకరు ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్రజైన్.రెండు ప్రముఖ తమిళనటి మనోరమ.బుధుడు కళాకారులకు సూచకుడు.

జెరూసలెం లో పాలస్తీనియన్లు యూదుల మధ్య మళ్ళీ గొడవలు భగ్గుమన్నాయి.ఒక బస్సులో మారణకాండ జరిగింది.వీరి గొడవ భూభాగం కోసం అన్నది గమనార్హం.

చైనాలోని టిబెటన్ ప్రాంతంలో భూకంపం (5.2 m) వచ్చింది.కన్య భూతత్వ రాశి అనే పాయింట్ గమనార్హం.

కాబూల్ లో - తాలిబాన్ కార్ బాంబర్ ఒకటి నాటో కాన్వాయ్ ని ఎటాక్ చేసింది.ఇది భూవాహన ప్రమాదమే.

స్వైన్  ఫ్లూ కేసులు మళ్ళీ విజ్రుంభిస్తున్నాయి.పంది అనేది భూతత్వ జంతువే.

నార్త్ ఆరిజోనా యూనివర్సిటీ లో కాల్పులు జరిగాయి.బుధుడు విద్యాకారకుడన్నది గమనార్హం.

కరాచీలోని స్లం ఏరియాలో రాళ్ళు విరిగి పడి 13 మంది చనిపోయారు.ఇదీ భూసంబంధమే.

ఈ సంఘటన లన్నింటిలో "భూమి" యొక్క పాత్రను గమనించండి.
read more " 12-10-2015 అమావాస్య ప్రభావం "

నా రమణాశ్రమ జీవితం -3 (విధి)

రమణమహర్షి జీవితంలో 'కేన్సర్' ఘట్టం ఒక దయనీయమైన ఘట్టం.ఆ ఘట్టం ఎలా జరిగిందో దాదాపు రోజువారీగా నాగమ్మ గారు వర్ణించారు.

ఎడమ మోచేయి దగ్గర పుండు లేచి అది రోజురోజుకీ ఎదుగుతూ ఉన్నప్పుడు అది కేన్సరా కాదా అనేది చూచుకోకుండా  దానిని కోసేయాలని నిర్ణయించిన సర్జన్ భక్తులదే మొదటి పాపం.కేన్సర్ మీద కత్తి పెట్టరాదు.అలా పెడితే అది పదిరెట్లు వేగంగా మళ్ళీ పెరుగుతుంది.సరియైన డయాగ్నైసిస్ చెయ్యకుండా ఆ పుండును ఆపరేట్ చెయ్యాలని కొందరు పేరున్న డాక్టర్ భక్తులు నిర్ణయించారు.కనీసం నాటువైద్యుడైన 'మూసు' అనే ఆయనకు తెలిసినంతగా పేరు మోసిన సర్జన్లకు తెలీలేదంటే వింతగా ఉంటుంది.మొదటిసారి కంటితో చూచినప్పుడే అది 'పుట్టపుండు' అని మూసు చెప్పేశాడు.కానీ పెద్దపెద్ద డాక్టర్లు దానిని గ్రహించలేకపోయారు.

అది కేన్సర్ అని వారికి తెలియక పోవచ్చు.మహర్షికి తెలుసుకదా.కానీ ఆయన కూడా వారిని వద్దని చెప్పలేదు.కోయిస్తే కోయించుకున్నారు.ఆ తర్వాత అది ప్రాణాంతకం అవుతుందని ఆయనకు తెలీదా?ఆత్మజ్ఞానికి తెలియని భవిష్యత్తు ఉంటుందా? మరి తెలిస్తే, తెలిసి తెలిసీ ఆయన ఎందుకు మరణాన్ని ఆహ్వానించారు?ఆపరేషన్ చెయ్యడం ద్వారా అది ఇంకా ముదిరి మరణం వరకూ తీసుకుపోతుందని ఆయనకు తెలీదా? ఇవన్నీ ప్రశ్నలే.

మహర్షి ఏ వైద్యాన్నీ వద్దనేవారు కారు.పసర్లు ఇస్తే త్రాగేవారు.ఆయుర్వేదం ఇస్తే తీసుకునేవారు.హోమియో ఇస్తే తీసుకునేవారు.పూజలు చేసి ప్రసాదాలు తెస్తే తీసుకునేవారు.తైల మర్దనాలు చేస్తే చెయ్యమనేవారు.అలాగే ఆపరేషన్ చేస్తామంటే చేయించుకున్నారు.మత్తు ఇవ్వలేము అలాగే కోస్తాము అంటే సరే కొయ్యమని మత్తు లేకుండానే కోయించుకున్నారు.

అసలు ప్రశ్న ఏమంటే - అన్నీ తెలిసిన ఆయనకు ఇవన్నీ పనికిరావని ఉపయోగపడవని తెలియదా? తెల్సినప్పుడు ఎందుకు ఇవన్నీ ఆమోదించారు?

నాగమ్మ అడగనే అడుగుతారు - 'ఏ వైద్యం చేస్తే మంచిదో మీకు తెలుసుకదా చెప్పి చేయించుకోరాదా?' అని. మహర్షి జవాబు చెప్పరు.నవ్వి మౌనంగా ఊరుకుంటారు.

ఇవన్నీ చెయ్యక తప్పకపోవడమూ చేసినా కూడా చివరకు పోవడమే 'విధి' అని ఆయనకు తెలుసేమో? ఆయన పూర్వకర్మ అదేనేమో? అందుకే ఆయనలా ప్రవర్తించారేమో? ఇది తప్ప ఆయన ప్రవర్తనకు ఇంకే కారణమూ కనిపించదు.

భక్తుల దృష్టిలో మహర్షి అంటే ఎదురుగా కనిపిస్తున్న శరీరమే.కానీ మహర్షికి ఆ శరీరమే పెద్ద జైలు.అదెప్పుడు వదిలిపోతుందా అని ఆయన ఎదురుచూపు.అది ఉండాలని వీరి ప్రయత్నం.శరీరధ్యాస వద్దనీ ఆత్మభావనలో ఉండమనీ ఆయన బోధ.తమకు అంత జ్ఞానభిక్ష పెట్టిన ఆ మహనీయుని శరీరాన్ని వదలలేక వారి బాధ.ఈ ఘర్షణయే ఆ సమయంలో ప్రతిదినం ఆశ్రమ దినచర్యగా ఉండింది.

తనకు కేన్సర్ వస్తుందని ఆయనకు తెలుసు.దానిని అనుభవించక తప్పదనీ తెలుసు.పోగొట్టుకోవడం వల్ల పోదనీ, మళ్ళీ ఇంకోసారి తప్పదనీ తెలుసు. కర్మక్షాళనామార్గం అనుభవించడమేగాని,వాయిదా వెయ్యడం కాదనీ ఆయనకు తెలుసు.అందుకే ఏమి జరిగినా ఆయన మౌనంగా స్వీకరించి చూస్తూ ఉండిపోయాడు.తాను చెప్పిన బోధనే తాను ఆచరించి చూపాడు.అంతేగాని ఒకటి చెప్పి ఇంకొకటి చెయ్యలేదు.

'జరిగేది ఎలాగూ జరుగుతుంది.జరుగనిది ఎలాగూ జరుగదు.నీవు శాంతంగా ఉండు.' అనేదే మహర్షి బోధ. జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ' అనుకున్నది జరుగదు.తనకున్నది తప్పదు' అని ఎన్నోసార్లు అనేవారు.మనం అనుకున్నట్లు జరగడమే 'మంచి' అని మామూలు మనిషి అనుకుంటాడు. జరిగినట్లు జరగడమే విధి అని జ్ఞాని దర్శిస్తాడు.అసలా ఊహనే మామూలు మనిషి భరించలేడు.అందుకే అతను ఎప్పటికీ మామూలు మనిషిగానే ఉంటాడుగాని జ్ఞానిగా మారలేడు.

పూర్వకర్మ పరిపాకమే నేటి విధి.అది అనుభవానికి వచ్చినపుడు మౌనంగా స్వీకరించగల ధైర్యం ఉన్నవాడే నిజమైన ఆధ్యాత్మికుడు.దానిని తప్పించుకోవాలని చూచేవాడు మామూలు మనిషి.అలాంటివాడొక దొంగ. చేసిన తప్పుకు శిక్ష పడకుండా తప్పించుకోవాలని ఆశించేవాడు దొంగేకదా. ప్రపంచంలోని ప్రజలంతా దొంగలే.పూజలు చేసి శిక్షలు మాఫీ చేసుకుందామని ఆశిస్తారు.రెమేడీలు చేసి కర్మ ఉచ్చు నుంచి తప్పుకుందామని ఆశిస్తారు. ఇలాంటివారంతా నిజానికి దొంగలే.ఈ ప్రపంచంలో ఒక జ్ఞాని మాత్రమే దొర. మిగిలిన అందరూ దొంగలే.

జ్ఞానికి ప్రత్యేకమైన ఇచ్చ (will) అంటూ ఉండదు.దానిని ఎప్పుడో దైవేచ్చ (divine will) లో ఆయన కరిగించి పారేసి ఉంటాడు.కనుక ఏది జరిగినా అది తనకు సమ్మతమే అంటాడు జ్ఞాని.మనమో-మన ఇష్టప్రకారమే ఏదైనా జరగాలని ఆశిస్తాం.భక్తులు కూడా అదే ఆశిస్తారు.వారి కోరికంతా ఒకటే - మహర్షి వారి ఎదురుగా ఆరోగ్యంగా ఉండాలి.విధి అందుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారు అర్ధం చేసుకోలేరు.తట్టుకోలేరు.కానీ విధి వీరి ఫీలింగ్స్ కు అనుగుణంగా నడవదు.దాని దారిలో అది పోతూ ఉంటుంది.దానిని ఒప్పుకుంటే వీరు ధన్యులు లేకపోతే బాధ తప్పదు.ఒప్పుకోవడం అంత తేలిక కాదు.హృదయంలో నిండిన భక్తి అలా ఒప్పుకోనివ్వదు.అక్కడే అసలైన ఘర్షణ ఏర్పడుతుంది.

మహర్షి చుట్టూ చేరిన భక్తులలో ఒక్కరంటే ఒక్కరు కూడా(గణపతిమునితో సహా) ఆయన బోధను సరిగ్గా పాటించినవారు లేరని నా ఊహ.ఎందుకంటే మనుషులు బోధను వినడానికే ప్రాధాన్యతనిస్తారు గాని ఆచరణకు ఇవ్వరు.మహర్షిది సంపూర్ణ జ్ఞానమార్గం.ఈ భక్తులది సెంటిమెంటల్ భక్తిమార్గం.ఆ సెంటిమెంటల్ గోలతోనే ఆయన్ను వీరంతా ఇంకా ఇంకా బాధ పెట్టారు.

'అయ్యో పుండు ఇంకా ఎదుగుతున్నదే? బాగా రక్తం కారుతున్నదే? మీరు నీరసించి పోతున్నారే? ఇక తగ్గదా? మమ్మల్ని ఒదిలేసి పోతారా?' మొదలైన ఏడుపులతో ఆయన్ను చికాకు చేసేవారు భక్తులు.మహర్షి వినీ వినీ చివరకు ఇలా అనేవారు.

'మీరంతా చెబుతుంటే నాకొక దేహం ఉన్నదనీ దానికొక చెయ్యి ఉన్నదనీ ఆ చేతికొక పుండు ఉన్నదనీ దానినుంచి రక్తం కారుతున్నదనీ లీలగా అనిపిస్తున్నది కాని లేకుంటే నాకేమీ తోచడం లేదే? ఎలా మరి?'

ఆయన స్థితి అది. వీరి స్థితి ఇది.ఇద్దరూ ఒకచోట చేరాలని దైవసంకల్పం. ఇదేగా విధి అంటే?

ఒక సద్గురువును ఆశ్రయించిన భక్తులు గానీ శిష్యులు గానీ ఆయన చెప్పిన దానిని ఆచరించాలి.ఆయన చూపిన మార్గంలో నడవాలి.అంతేగాని ఆయన్నొక బొమ్మను చేసి కూచోబెట్టి పూజలు చెయ్యకూడదు.మా పద్ధతిలో మేముంటాం మా వరాలు మాత్రం మాకివ్వండి అనకూడదు.అలా చెయ్యడం వల్ల ఆయనకు ఇంకా బాధ ఎక్కువౌతుందిగాని తగ్గదు.మనవల్ల గురువుకు సంతోషం కలగాలి గాని బాధ పెరగకూడదు.నిజమైన శిష్యులనేవారు ఆ విధంగా ఉండాలి.

కర్మ ఉన్నంత కాలం దేహం ఉంటుందని జ్ఞానికి తెలుసు.అది తీరిన మరుక్షణం దేహం ఇక ఉండదనీ తెలుసు. ఆ సమయం కోసమే జ్ఞాని అయినవాడు ఎదురుచూస్తూ ఉంటాడు.ఈ దేహం అనే జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతానా అని ఆయన ఎదురుచూస్తూ ఉంటాడు.వీరేమో ఆ భావననే భరించలేరు.ఆ క్రమంలో ఏడుపులు పెడబొబ్బలు గోలా చేస్తారు. వారిది కూడా తప్పుకాదు.ఆయనంటే వారికున్న బంధం ఎలా అనిపింపజేస్తుంది.నిజమైన జ్ఞానమార్గంలో నడక చాలాచాలా కష్టం అనేది అందుకే. అందులో కోటికొకరు కూడా నడవలేరు. 

వారి సెంటిమెంటల్ భక్తిని చూచి ఆయన జాలిపడి మౌనంగా వీరి హింసను భరిస్తూ ఉండేవాడు.అది అర్ధం చేసుకోలేని వీరు తమ పిచ్చి భక్తితో ఆయన్ను ఇంకాఇంకా హింసిస్తూ ఉండేవారు.వీరిదేమో ఆరాధన.ఆయనదేమో పూర్ణజ్ఞానం.రెండూ వేటికవి సరియైనవే.ఎవరి పట్టు వారిదే.ఈ సమస్యకు పరిష్కారం లేదు.కర్మ తీరడమూ మహర్షి శరీరం రాలిపోవడమే ఈ సమస్యకు పరిష్కారం.

తామాశించిన విధంగా విధి నడవాలని భక్తుల తాపత్రయం.విధికి అనుగుణంగా మీరు నడవండి అని ఆయన బోధ.ఆయన మాట వీరికి అర్ధం కాదు.వీరి పద్దతి ఆయన చెప్పినట్లుగా మారదు.ఆ విషయం ఆయనకు తెలుసు.అందుకే చెప్పినా అర్ధం చేసుకోలేని వీరి స్థితిని చూచి ఆయనలో కరుణ అనేది పెల్లుబుకుతూ ఉండేది.

మహర్షిని అలాంటి స్థితిలో చూస్తూ కూడా నిబ్బరంగా ఉండగలగడం వీరికి పరీక్ష.వారి భక్తిహింసను భరిస్తూ కూడా చెక్కుచెదరకుండా ఉండటం ఆయనకు పరీక్ష.అనేకమంది సద్గురువులకు ఇలాంటి పరీక్షలే ఎదురౌతూ ఉంటాయి.రకరకాలుగా పరీక్షించకుండా అమ్మ ఎంత పెద్దవారినైనా అంత తేలికగా వదలదు.

అయినా, విధిని యధాతధంగా స్వీకరించలేనివారు అసలేమి ఆధ్యాత్మికులైనట్లు?
read more " నా రమణాశ్రమ జీవితం -3 (విధి) "

8, అక్టోబర్ 2015, గురువారం

క్రొత్త ఉదయం








ప్రతి వ్యాధీ ఒక క్రొత్త ఉత్సాహాన్ని మోసుకొస్తుంది
ప్రతి క్రుంగుబాటూ ఒక క్రొత్త ఉత్తేజాన్ని నింపిపోతుంది
జీవితాన్నే ఆటగా చూచేవాడికి బాధేముంటుంది?
ప్రతి కిరణమూ ఒక అంత:తిమిరాన్నే నిర్మూలిస్తుంది
ప్రతి మరణమూ ఒక క్రొత్త జీవితాన్నే ప్రసాదిస్తుంది

ప్రతి నిరాశా ఒక వెలుగు వైపే నడిపిస్తుంది
ప్రతి ఓటమీ ఒక గెలుపు దరికే దారితీస్తుంది
చీకటిని కూడా ప్రేమించేవాడికి చిరునవ్వు ఎలా మాసిపోతుంది?
ప్రతి వైఫల్యమూ తనను తానే అంతం చేసుకుంటుంది
ప్రతి అంధకారమూ ఒక తేజస్సునే సొంతం చేసుకుంటుంది

ప్రతి పతనమూ ఒక ఔన్నత్యానికే పునాదౌతుంది
ప్రతి వెనుకడుగూ ఒక నిద్రిస్తున్న బలాన్ని తట్టి లేపుతుంది
ప్రతిదాన్నీ చేయూతగా తీసుకునేవాడికి తిరోగమనమేముంటుంది?
ప్రతి వేదనా ఒక ఉజ్జ్వలానందాన్నే ప్రోది చేస్తుంది
ప్రతిరాత్రీ ఒక క్రొత్త ఉదయానికే తెరతీస్తుంది....
read more " క్రొత్త ఉదయం "

3, అక్టోబర్ 2015, శనివారం

నా రమణాశ్రమ జీవితం - 2 (రమణమహర్షి వ్రాసిన పద్యాలు)

ఈ పుస్తకంలో సూరినాగమ్మగారు వ్రాసిన కొన్ని విషయాలు ఆలోచించదగినవి.

రమణమహర్షి చాలా పద్యాలు వ్రాశారు.వాటిలో కొన్ని తమిళంలోనూ కొన్ని తెలుగులోనూ వ్రాశారు.తమిళ ఛందస్సు వారికి తెలుసు గనుక వాటితో బాధ లేదు.తెలుగు చందస్సు కూడా ఆయనకు తెలుసు.కానీ అవి వ్రాసేటప్పుడు కొంత తమిళ ఛందస్సు మిళితం అయింది.ఆ పద్యాలు కొందరు విమర్శకులకు విందుభోజనం లాగా పనికొచ్చాయి.

ఆ పద్యాలను తాము దిద్దుతామని వారు ముందుకొచ్చారు.ఆ ఛందస్సులో యతి ప్రాసలు తప్పాయనీ గణాలు తప్పయ్యాయనీ వారు వాదించసాగారు.అలా చెయ్యకూడదు మహర్షి వ్రాసిన పద్యాలను దిద్దరాదు అంటూ ఇంకొందరు వాదించారు.ఈ విధంగా రెండు గ్రూపులు ఆశ్రమంలో తయారయ్యాయి.ఈ గొడవంతా చూచి నాగమ్మతో మహర్షి ఇలా అన్నారు.

'చూడు.నువ్వేమో ఏదన్నా వ్రాయమంటావు.వీరేమో అందులో తప్పులున్నయ్యంటారు.ఇంతకు ముందు కూడా కొన్ని పద్యాలు వ్రాశాను. అందులో వ్యాకరణం తప్పిందని కొందరు తెలుగు పండితులు ఆక్షేపించారు.ఆ తర్వాత వ్రాయడం మానేశాను.అందుకే నేను వ్రాయను.'

ఎప్పుడైనా మహర్షిని ఏదైనా వ్రాయమని ఎవరైనా అడిగితే ఆయన ఈ మాటే అనేవారు.

'ఎందుకు?నేను వ్రాస్తే మీకు నచ్చదు.అందులో యతిప్రాసలు తప్పాయంటారు.ఈ గొడవంతా నాకెందుకు? వద్దులే.' అనేవారు.

ఈనాడు మనం మహర్షిని మహాజ్ఞానిగా ఆరాదిస్తున్నాం గాని,ఆయన బ్రతికున్న రోజులలో ఆయన్ను విమర్శించిన జనమూ ఉన్నారు.వారిలో పండితులు కూడా ఉన్నారు.వారి పని విమర్శించడమే కదా !

ఈ గొడవంతా విని మహాపండితులైన వేలూరు శివరామశాస్త్రిగారు ఇలా అన్నారట.

'జ్ఞానుల రచనలను దిద్దరాదు.అలా దిద్దడం చాలాతప్పు.వారి చుట్టూ ఛందస్సులు ఎల్లప్పుడూ ఆవరించే ఉంటాయి.వారికి మనం ఛందస్సు నేర్పడమా?ఎంత అపచారం?మహర్షి వ్రాసిన పద్యాలలో తప్పులున్నప్పటికీ వాటిని అలాగే ఉంచండి.పొరపాటున కూడా వాటిని దిద్దకండి.'

వేలూరు శివరామశాస్త్రిగారు మహాపండితుడు గనుకా ఆయనే తీర్పు ఇచ్చినప్పుడు ఇంకా మాట్లాడేది ఏమీ లేదు గనుకా ఆ గొడవ అంతటితో సమసిపోయింది.మహర్షి అప్పుడు వ్రాసిన పద్యాలను ఇప్పుడు కూడా మనం చదవవచ్చు.

భాష శరీరం లాంటిది.భావం ఆత్మ లాంటిది.దృష్టి ఆత్మ మీదే ఉండాలి గాని శరీరం మీద కాదు.కానీ ఆత్మను దర్శించడానికి శరీరం కూడా అవసరమే.అది ఎంతవరకో అంతవరకే గాని అంతకు మించి కాదు.ఆత్మకూ శరీరానికీ క్లాష్ ఏర్పడినప్పుడు ఆత్మనే మనం అనుసరించాలి.అలాగే భాషకూ భావానికీ క్లాష్ ఏర్పడినప్పుడు భావాన్నే మనం స్వీకరించాలి.ఎప్పుడూ భాష మీదే దృష్టి ఉంచడం ఎప్పుడూ శరీరం మీదే దృష్టి ఉంచి దానికి మేకప్ చేసుకుంటూ జీవితమంతా గడపడం లాంటిది.

శరీరధ్యాసను వదలిపెట్టి ఆత్మను అందుకోమని చెప్పిన రమణమహర్షి పద్యాలలోనే తప్పులుపట్టి వాటిని దిద్దబోయిన ఘనులున్నారు.అసలు ఆయన బోధనను వారు ఎంతవరకూ అర్ధం చేసుకున్నారో దీనిని బట్టే అర్ధమౌతున్నది.ఇలాంటి వారిని చూచీచూచీ విసుగు పుట్టబట్టే మహర్షి ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయేవారు.

వాల్మీకీ కాళిదాసూ వ్రాసిన కవిత్వాలనే విమర్శించిన వారూ దిద్దినవారూ ప్రబుద్ధులున్నారు.ఇక మనలాంటి మామూలు మనుషులెంత? అసలు విషయం అది కాదు.దైవప్రేరణతో ఒక ఒరవడిగా పైనుంచి గంగానదిలా దూకుతూ వచ్చిన కవిత్వాన్ని ఎప్పుడూ దిద్దకూడదు.అలా దిద్దడం అంటే దైవాన్ని అవమానించినట్లే.ఛందో దేవతలను అవమానించినట్లే అవుతుంది.ఎందుకంటే - ఆ ఒరవడిలో ఒక సౌందర్యం ఉంటుంది.ఆ సౌందర్యం ఒక్కొక్కసారి యతిప్రాసల ఇనుపచట్రంలో ఇమడకపోవచ్చు.కానీ అది ఒక అతీత సౌందర్యమే.నిజమైన సౌందర్యం అనేది కట్టుబాట్లకు అతీతంగానే ఎల్లప్పుడూ ఉంటుంది.

కవిత్వం అనేది సౌందర్యారాధకుల కోసమే గాని, పరీక్ష పేపర్లు దిద్దినట్లు దానిని దిద్ది మార్కులేసే వారికోసం కాదు.అలా దిద్దడంవల్ల యత్రిప్రాసలు సరిపోవచ్చేమోగాని ఆ భావదారలోని స్వచ్చసౌందర్యం మలినం అవుతుంది. కవితా సరస్వతికి అది తీవ్రమైన అపచారం అవుతుంది.అలా దిద్దినవారికీ దిద్దించినవారికీ అది శాపం అవుతుంది.

ఈరోజు ఈ టాపిక్ వ్రాద్దామని అనుకుంటుండగా నిన్న సాయంత్రం ఒక ఫోన్ వచ్చింది.

"నేను మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు నుంచి మాట్లాడుతున్నాను.మీ 'శ్రీవిద్యారహస్యం' నా చేతిలో ఉంది.చదువుతున్నాను.ఎన్నో విషయాలు తెలిసినట్లు వ్రాశారు.కానీ యతిప్రాసలు చాలా తప్పులున్నాయి.వ్యాకరణ దోషాలున్నాయి."-అన్నాడాయన పరిచయం కూడా లేకుండా డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వస్తూ.

గొంతు వింటే ఎవరో చాదస్తపు పండితునిలా అనిపించాడు.

ప్రతివారితోనూ ఏం వాదన పెట్టుకుంటాం? ఎంతకని వివరిస్తాం? అనుకుంటూ 'సరే మంచిది.' అన్నా.

ఆయనకు విషయం అర్ధమైనట్లు లేదు.బహుశా నాకు వినపడలేదేమో అనుకున్నాడల్లే  ఉంది.

పెద్ద గొంతులో చెప్పినదే మళ్ళీ చెప్పాడు.

నేను మళ్ళీ 'మంచిది' అన్నాను.

అరిగిపోయిన రికార్డులాగా ఆయన మళ్ళీ అదే చెప్పాడు.

ఇక ఇలా కాదని -'వాటి మీద మీ దృష్టి పెట్టకండి.భావం మీద దృష్టి లగ్నం చెయ్యండి.ఏం చెప్పానో దానిని అర్ధం చేసుకోండి' అన్నాను.

'ఓహో అలాగా' అంటూ 'మా గురువుగారు విజయవాడలో ఉండే ఫలానా ఆయన.మీకు తెలుసా?ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత.'అన్నాడు.

'అలాగా నాకు తెలీదు' అంటూ 'ఇంతకీ మీ పేరేంటో చెప్పనేలేదు.' అన్నాడు.

'నా పేరు ఫలానా శర్మ' అన్నాడాయన. అదా సంగతి అనుకున్నా. పండితాహంకారం విషయాన్ని అర్ధం చేసుకోనివ్వదు.ఇది మామూలే.

ఆయన ఫోన్ పెట్టేశాడు.

పండితుల సంగతి ఇలా ఉంటుంది !! వారికి అన్నీ తప్పులే ముందుగా కనిపిస్తాయి. రమణమహర్షినే వీరు వదలలేదంటే ఇక మనమెంత?

ఒకాయన భారతం అంతా చదివానని గొప్పలు చెబుతున్నాడట.ఏం అర్ధమైందో చెప్పమని ఎవరో అడిగితే - 'ధర్మరాజుకి పేకాట బాగా వచ్చని అర్ధమైంది' అని చెప్పాడట. అంత చదివిన తర్వాత ఆయన అర్ధం చేసుకున్నది అది! మనమేం చెయ్యగలం?

ఇంకొకాయన రామాయణాన్ని ఏళ్ళ తరబడి అధ్యయనం చెశాట్ట. ఏమర్ధమైఁదో చెప్పవయ్యా అంటే - 'ఆడదాని కామమే అన్ని అనర్దాలకూ కారణం' అన్నాట్ట. విన్నవారికి మతులు పోయి "అదేంటయ్యా బాబూ"- అంటే - "అవును.తనకు తాపం ఎక్కువగా ఉన్నదని శూర్పణఖ కోరినప్పుడు రాముడో లక్ష్మణుడో ఆమె తపన తీర్చి ఉంటే రావణుడు వచ్చి సీతను ఎత్తుకుపోవడమూ, రామలక్ష్మణులు ఏడుస్తూ అడవుల్లో తిరగడమూ, ఇంత గొడవా యుద్ధమూ అందులో అంతమంది చావడమూ జరిగేవే కావు కదా? ఏందో పెద్ద నీతులు చెప్పి ఆ అమ్మాయికి అన్యాయం చేశారు.ఆమె కోరిక తీరిస్తే ఏం పోతుంది గనుక?లక్ష్మణుడికి ఒక ఆడతోడుగా ఆ అడవిలో తనంత తానై వచ్చింది.కోరి వచ్చిన ఆడదాన్ని అలా చెయ్యవచ్చా?అసలు తప్పంతా రాముడిదీ లక్ష్మణుడిదే.ఆడదాని ఉసురు అలా పోసుకోవచ్చా?తప్పుకదూ?ఆడది నోరుతెరిచి అడిగినప్పుడు అంత బలవంతులై ఉండీ ఆమెను శాటిస్ఫై చెయ్యలేక పోయారు.అందుకే అన్ని కష్టాలు పడ్డారు.కనుక నేనన్నది కరెక్టే' అన్నాట్ట.

రామాయణం అంతా తిరగా మరగా చదివితే ఆయనకు అర్ధమైన విషయం అది !! ఎవరి లాజిక్కు వారిది.ఎవరెవరి మానసిక స్థాయిని బట్టి పురాణాలు గానీ ఇంకేదైనాగానీ వారికి అర్ధమౌతాయి.

రమణమహర్షి వ్రాసిన పద్యాలలో - ఆయన ఏం చెబుతున్నాడో - మనల్ని ఏం చెయ్యమంటున్నాడో - ఆ విషయం వదిలేసి వ్యాకరణదోషాలు వెదికారు అప్పటి కొందరు పండితులు.పండితులందరూ అలాంటివారని నా ఉద్దేశ్యం కాదు.వారిలో వేలూరి శివరామశాస్త్రి వంటి విజ్ఞులూ ఉన్నారు.కానీ అలాంటివారు కొందరే ఉంటారు.ఎక్కువమంది తప్పులు వెదికేవారే ఉంటారు.

'తారా స్తోత్రం' పుస్తకం ఫస్ట్ కాపీని ఒకాయనకు చదవమని ఇచ్చాను.అదొక అనుగ్రహం. ఆ విషయం ఆయనకు అర్ధం కాలేదు.ఆయన ఆ పుస్తకాన్ని ఒక మహాపండితునికి ఇచ్చి తప్పులు దిద్దించి నాకు పోస్ట్ లో తిరిగి పంపాడు.ఆ పండితులవారు తప్పులు దిద్దడమేగాక పద్యాలకు పద్యాలే మార్చిపారేసాడు. వీరిద్దరి అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో నాకర్ధం కాలేదు.ఒక 'Divine Flow' లో వచ్చిన సాహిత్యాన్ని కళ్ళకద్దుకుని పూజించాలి.దానిని అర్ధం చేసుకుని ఆచరించాలి.అంతేగాని దానిమీద పెన్ను పెట్టకూడదు.ఆ విజ్ఞత ఉన్నవాడే నిజమైన విజ్ఞుడు, పండితుడూనూ.

అయితే, ఇష్టం వచ్చిన వ్యాకరణ దోషాలతో మీ కిష్టం వచ్చిన పద్యాలు వ్రాస్తే మేము నోరెత్తకుండా చదవాలా? అని ప్రశ్నిస్తే అవునని నేను చెప్పను. కొన్నిసార్లు తప్పులు దొర్లుతూనే ఉంటాయి.ఎన్ని సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసినా కొన్ని తప్పులు డీటీపీ ప్రాసెస్ లో చోటుచేసుకుంటాయి.ఇవి రెండూ మలిముద్రణలలో సరిదిద్దబడతాయి.దానిని ఎవరు వ్రాశారో వారే వాటిని దిద్దాలి. చదివేవారు ఆ విషయం అర్ధం చేసుకుని విషయం మీద దృష్టి నిలపాలి. అసలు విషయం అది.

ఇంకొకాయనకు 'శ్రీవిద్యారహస్యం' చదవమని పంపిస్తే చదివి దానిని పోస్ట్ లో వెనక్కు తిప్పి పంపించాడు.బాగా వ్రాసినా ఓర్చుకోలేనివారు కూడా కొందరు ఉంటారని అప్పుడే నాకు అర్ధమైంది.

అన్నీ వదిలేసి జీవితమంతా సన్యాసినిగా త్యాగమయంగా అరవై ఏళ్ళుగా జీవిస్తున్న ఒక మాతాజీ 'శ్రీవిద్యారహస్యం' పుస్తకం చదివి బ్రహ్మానంద భరితురాలై, తనుండేది బెంగాల్ లో కనుక, తన దర్శనం కోసం వచ్చేవారికి ఈ పుస్తకాన్ని తెలుగునుంచి బెంగాలీలోకి అనువాదం చేసి మరీ చెబుతోంది. వారు విని ఆనందిస్తున్నారు.

కనుక మన స్థాయిని బట్టే ఏదైనా మనకు అర్ధమౌతుంది.వారి రియాక్షన్ బట్టి వారి స్థాయి ఏమిటో నాకర్ధమౌతుంది.

మనుషులలో అందరూ పొట్టు కోసం కొట్టుకునేవారే గాని లోపలి పప్పును కోరుకునేవారు ఎక్కడో ఒకరో ఇద్దరో మాత్రమె ఉంటారు.అందరూ పిప్పికోసం కాట్లాడుకునేవారేగాని లోపలి రసాన్ని త్రాగుదామని తపించేవారు ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటారు.అలాంటివారే మన అసలైన సహచరులు, అనుచరులు.మిగిలిన వారితో మనకు అనవసరం.ఊకలో దొర్లేవారు మనతో నడవలేరు.వారి దారి మన దారితో కలవదని గ్రహించి వారిని దూరం ఉంచాలి.

మనకు కావలసింది మనల్ని మెచ్చుకునేవారూ కాదు.విమర్శించేవారూ కాదు.మనల్ని ప్రేమించేవారూ మనతో నడిచేవారూ మనకు కావాలి.ఒకరు విమర్శిస్తే మనదేమీ పోదు.ఒకరు మెచ్చుకుంటే మనకేమీ కొత్తగా రానూ రాదు.కనుక ఈ రెండూ మనకు అనవసరములైనవే.పొట్టులో పప్పులను వెదుక్కున్నట్లు గుంపులోనుంచి మనవారిని వెదుక్కోవడమూ మనకు తెలిసినదాన్ని వారికి నేర్పడమే మనం చెయ్యవలసిన అసలైన పని.
read more " నా రమణాశ్రమ జీవితం - 2 (రమణమహర్షి వ్రాసిన పద్యాలు) "

1, అక్టోబర్ 2015, గురువారం

చంద్రశేఖర సరస్వతి -2

మొన్న సాయంత్రం చంద్రశేఖర్ నుంచి మళ్ళీ ఫోనొచ్చింది.

'నిన్న సాయంత్రం రిజైన్ చేసేశాను అన్నగారు' అన్నాడు.

'మంచిది.ఆలస్యం అయినట్లుందే?' అడిగాను.

'అవును.ఆఫీసులో కొన్ని పనులవల్ల లేటైంది.నిన్నటితో ఉద్యోగం పని అయిపోయింది' అన్నాడు.

'తరువాత ఏమిటి ఆలోచన?' అడిగాను.

'ఏముంది? ముందుగా అనుకున్నట్లు రమణాశ్రమం చేరడమే.ఆలోపల ఒక్కసారి మైసూరు వెళ్లి స్వామీజీని చూచి రావాలి' అన్నాడు.

'ఎలా ఉన్నారు వారిద్దరూ?' అడిగాను.

'బాగానే ఉన్నారు.బాగా పెద్దవాళ్లై పోయారు.' అన్నాడు.

ఇక్కడ ఈ 'ఇద్దరి గురించి' కొంత చెప్పాలి.

చంద్రశేఖర్ కు గత ఇరవై ఏళ్ళనుంచీ ఇద్దరు చాలా ఉన్నతులైన వ్యక్తులు పరిచయం ఉన్నారు. ఇద్దరూ సన్యాసజీవితం గడుపుతున్న వారే. వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళు.సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.అన్నగారికి ఇప్పుడు 90 ఏళ్ళు.చెల్లెలికి 80 పైన ఉంటాయి. ఆయన 60 ఏళ్ళక్రితం IAS ఆఫీసరు.బాగా ఆధ్యాత్మిక చింతనాపరుడు.తనకు దాదాపుగా 45 ఏళ్ళ వయసు ఉన్నపుడు ఉద్యోగానికి రిజైన్ చేసేసి సన్యాసం స్వీకరించాడు.ఆయన చెల్లెలు కూడా అలాంటి వ్యక్తే.ఆమెకూ ఆధ్యాత్మిక చింతన అధికం.ఇద్దరూ వివాహాలు చేసుకోలేదు.ఆమె కూడా సన్యాసం స్వీకరించింది.వీరికి ఇంకెవ్వరూ బంధువులు లేరు. హిమాలయాలలోని ఉత్తరకాశీలో నరసంచారం లేని అడవీ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ దాదాపు 20 ఏళ్ళపాటు వీరిద్దరూ తపస్సు చేశారు.కనీస వైద్యసౌకర్యం కావాలంటే ఒక 100 మైళ్ళు పోతేగాని ఏమీ దొరకనంత ఎత్తులో హిమాలయాలలో వీళ్ళు రెండు దశాబ్దాలున్నారు.ఆ తర్వాత హిమాలయాలు వదలి మైసూరు ఊరిబయట రెండెకరాల స్థలంలో ఆశ్రమం కట్టుకుని అక్కడే ప్రశాంతంగా ఉంటున్నారు.చంద్రశేఖర్ అంటే వీరిద్దరికీ ఎంతో ప్రేమ.అతను అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లి వస్తుంటాడు.

వీరి ఆశ్రమంలో వీరిద్దరూ తప్ప ఎవరూ ఉండరు.వాళ్ళు పూర్తిగా శంకరాద్వైత సంప్రదాయానికి చెందిన సాధువులు.ప్రపంచపు గొడవ వారికి లేదు.అధ్యయనమూ తపస్సూ తప్ప వేరే పని ఉండదు.నేటి 'మోడరన్ ఆశ్రమాల' లాగా వీరి ఆశ్రమం ఉండదు.నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. లోకంతో ఏ విధమైన పనీ వీరు పెట్టుకోరు.నేటి సోకాల్డు ఆశ్రమాలలో తండోపతండాలుగా కనిపించే దొంగభక్తులూ దొంగశిష్యులూ వీరికి లేరు.వీరిని చూచేవాళ్ళు కూడా ఎవరూ లేరు.'మరెలా? ఈ వయస్సులో ఎవరూ తోడు లేకుండా మీరు ఎలా ఉంటున్నారు?' అని ఎవరైనా అడిగితే వారినుంచి 'దైవమే మాకు దిక్కు దైవమే మాకు తోడు' అంటూ ఒకటే జవాబు వస్తుంది."నరసంచారం కనిపించని హిమాలయపు ఎత్తులలోనే భగవంతుని పైన భారం వేసి ఎన్నో ఏళ్ళు ఉన్నాము.దానితో పోల్చుకుంటే ఇప్పుడు సిటీలో ఉన్నట్లే లెక్క"- అంటారు.

'ఈ మధ్యనే ఒకసారి మైసూరు వెళ్లి వచ్చాను అన్నగారు.ఇద్దరూ బాగా వృద్దులై పోయారు.కానీ ఎవరినీ తమ పనులు చెయ్యనివ్వరు.వారి పనులు వారే ఇప్పటికీ చేసుకుంటారు.వంట కూడా వారే చేసుకుంటారు.వేరే వాళ్ళు చేసిన వంటను వారు తినరు.అలాంటి తపోధనులను నేను ఇప్పటిదాకా చూడలేదు' అన్నాడు.

వింటున్న నాకు దైవాదేశం లాగా ఒక ఆలోచన వచ్చింది.

'తమ్ముడూ. ఒక మాట చెబుతాను.వింటావా?' అడిగాను.

'చెప్పండి' అన్నాడు.

'నువ్వు ప్రస్తుతం రమణాశ్రమం వెళ్ళవద్దు.వెళ్లి మైసూరులో స్థిరపడు' అన్నాను.

'అదేంటి అన్నగారు?' అన్నాడు.

'అవును తమ్ముడూ. రమణాశ్రమం ఎప్పుడైనా వెళ్ళవచ్చు.కానీ ఇలాంటి మహనీయులకు సేవచేసే అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు.మైసూరు వెళ్ళు.అక్కడే ఆశ్రమంలో వారికి తోడుగా ఉండు.వాళ్ళిద్దరికీ సేవ చెయ్యి.నీ సాధన కూడా చేసుకో.వాళ్ళున్నంత కాలం వారికి సేవకునిగా ఉండు.ఆ తర్వాత ఎలాగూ నీవు రమణాశ్రమం చేరవచ్చు.లేదంటే ఆ ఆశ్రమంలోనే ఉండిపోవచ్చు.

నువ్వనుకున్నట్లు రమణాశ్రమంలో ఉండటం అంత సులభం ఏమీ కాదు.ఒక్క వారంలోనే నీకు భయంకరమైన బోరు కొడుతుంది.ఏం చెయ్యాలో తెలియక పిచ్చి పుడుతుంది.అప్పుడైనా అక్కడ ఏదో ఒక సేవ చెయ్యక తప్పదు.మనిషి 24 గంటలూ ధ్యానంలో ఉండలేడు,ఈ విషయం తెలిసే, కర్మను యోగంగా చెయ్యమని వివేకానందస్వామి రామకృష్ణా మిషన్ ను స్థాపించారు. నిస్వార్ధంగా, యోగంగా చెయ్యబడిన కర్మ, ధ్యానం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.

కనుక నా మాటను దైవాదేశంగా స్వీకరించు.మైసూరుకు వెళ్లి వారి సేవలో పునీతుడవు కా.ఇంకొక విషయం విను.తపోధనులూ నిష్కల్మష హృదయులూ అయిన అటువంటివారి సేవాభాగ్యం అంత తేలికగా లభించదు.దానికి ఎన్నో జన్మల పుణ్యబలం ఉండాలి.చాలామంది ఇలాంటివారిని కనీసం చూడను కూడా చూడలేరు.ఈ అదృష్టం అందరికీ దొరకదు.నీకు దొరికింది.ఈ అవకాశాన్ని వృధా చేసుకోకు.రమణాశ్రమం ఎక్కడికీ పోదు.కానీ వీరిద్దరూ ఎంతోకాలం ఈ భూమిమీద ఉండరు.ఇది నీకు సువర్ణావకాశం.దీనిని చేజార్చుకున్నావంటే తరువాత చాలా బాధపడతావు.వారు దైవం మీద భారం వేసి జీవిస్తున్న పవిత్రాత్ములు.ప్రస్తుతం వారికి ఎటువంటి సాయమూ లేదు.కనీసం సుస్తీ చేస్తే మందులిచ్చే దిక్కు కూడా లేరు.వండిపెట్టే వారు కూడా లేరు.వారికి నీవు గనక ప్రేమగా భక్తిగా నిస్వార్ధంగా సేవ చెయ్యగలిగావా, దైవం నిన్ను ఎంత కరుణిస్తాడో నేను మాటల్లో చెప్పలేను.

నీవు చేసే ఈ నిస్వార్ధమైన సేవవల్ల ఆ మహనీయుల కటాక్షం నీవు పొందగలిగావంటే నీకంటే అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు.అలాంటివారి కృపవల్ల సాధనలో నీవు అనూహ్యంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోతావు.నీవు ఏకాంతంగా చేసే సాధన కూడా అంత ఫలితాన్ని ఇవ్వదు.నీ మనస్సు ఎంతో శుద్ధంగా మారుతుంది.నీలోని చెడు వాసనలన్నీ దగ్ధమై పోతాయి.ఇది సత్యం.కనుక నా మాట విను. నీ రమణాశ్రమం ఆలోచన మానుకో.కావాలంటే నెలకొకసారి అక్కడకు వెళ్లి ఒకటో రెండో రోజులు ఉండి వస్తుండు. సరిపోతుంది.ఇప్పుడు మాత్రం నీవు చెయ్యవలసిన పని ఇదే.సంసారంలో ఇరుక్కుని పోయిన మాలాంటి వారికి ఈ అవకాశం రాదు.నీకా బాదరబందీ లేదు.ఈ అవకాశం సద్వినియోగం చేసుకో.వారికి సేవ చెయ్యి.వాళ్ళ అనుగ్రహాన్ని పొందు.అందులోనే భగవంతుని అనుగ్రహం ఉన్నది.' - అన్నాను.

చంద్రశేఖర్ కాసేపు మాట్లాడలేదు.

'నిజమే అన్నగారు.ఒక ఏడాది క్రితం స్వామీజీకి బాగా సుస్తీ చేసింది.పూర్తిగా మంచం పట్టారు.ఆ సమయంలో నేను లీవుపెట్టి ఆయన దగ్గరే ఉండి, ఒక వారంరోజులు ఆయనకు అన్ని సేవలూ నేనే చేశాను.స్వామీజీ ఎవరి సహాయాన్నీ కోరుకోరు చేసినా ఒప్పుకోరు.అలాంటిది నేను సేవ చేస్తుంటే మాత్రం ఏమీ అనలేదు.మాతాజీ కూడా అదే అన్నారు.'నువ్వు చాలా పవిత్రాత్ముడివి.ఎప్పుడూ జపం చేస్తూనే ఉంటావు.దైవస్మరణలోనే ఎల్లప్పుడూ ఉంటావు గనుక నీ సేవను ఆయన స్వీకరించారు.లేకుంటే ఆయనను ఎవరూ అసలు తాకరు.ఆయన కూడా ఎలాంటి పరిస్థితిలోనూ ఎవ్వరి సాయమూ స్వీకరించరు.నువ్వు అదృష్టవంతుడివి' అన్నారు. నాకుకూడా ఆ వారం రోజులూ చాలా ఆనందంగా ఉన్నది.మనస్సు ఎంతో పవిత్రం అయిపోయినట్లు అనిపించింది.ప్రపంచాన్ని దాటి ఎంతో ఎత్తులో ఉన్నట్లు ఫీల్ వచ్చింది.

ఎందుకోగాని మీకు ఫోన్ చేసిన ప్రతిసారీ నేను ఊహించని రీతిలో నా జీవితం మారుతున్నది అన్నగారు.మీరు చెప్పినట్లే చేస్తాను.దీనిని భగవంతుని ఆదేశంగా స్వీకరిస్తాను.ప్రస్తుతం రమణాశ్రమం వెళ్ళను.మైసూరు వెళ్లి మాతాజీని అర్ధిస్తాను.వారు ఒప్పుకుంటే అక్కడే వారికి సేవకుడుగా ఉండిపోతాను.' అన్నాడు.

ఆ మాట విని నాకు చాలా ఆనందం కలిగింది.

'నీలాంటి ఉత్తముడిని వాళ్ళు తప్పకుండా వారితో ఉండనిస్తారు తమ్ముడూ.ఆ నమ్మకం నాకుంది.ఇక ఆలస్యం చెయ్యకు.వెంటనే మైసూరు బయల్దేరు.' అన్నాను.

మనుషులలో నిస్వార్ధపరులు ఇంకా ఉన్నారు.నిజమైన విలువల కోసం బ్రతికేవాళ్ళు ఇంకా అక్కడక్కడా నైనా ఉన్నారు.జీవితపు అంతిమగమ్యం కోసం తపించేవాళ్ళూ దానిని వెదికేవాళ్ళూ ఇప్పటికీ ఉన్నారు.

షేవ్ చేసుకుంటుంటే చెంప తెగితే దానికోసం ఇన్స్యూరెన్స్ చేసే అల్పులమైన మనమెక్కడ?చావుబ్రతుకుల్లో ఉన్నాకూడా తపోదీక్షను వీడని వారెక్కడ?ఒకరోజు టీవీ లేకపోతే,కాసేపు కరెంటు పోతే,లేదా కాసేపు సెల్ ఫోన్ నెట్ వర్క్ అందకపోతే ప్రపంచం తల్లకిందులైపోయినట్లు గందరగోళ పడిపోయే మనమెక్కడ? జీవితం ఏమైపోయినా సరే అనే మొండిధైర్యంతో భగవంతుని మీద భారం వేసి ఎక్కడో హిమాలయాలలో అన్ని వేల అడుగుల ఎత్తున,రేపటి చింత లేకుండా,సౌకర్యాల ఆలోచనే లేకుండా,అన్నెన్నేళ్ళు దైవం కోసం తదేకదీక్షతో తపస్సు చేసిన వారెక్కడ? అసలు పోలికే లేదేమో?

మనం జంతువుల స్థాయిలో బ్రతుకుతున్నాం.వాళ్ళు దేవతాస్థాయిలో ఉన్నారు.

ఇలాంటి ఉత్తమవ్యక్తులను నాకు పరిచయం చేసినందుకూ,వారికి మార్గదర్శనం చేసే అదృష్టాన్ని నాకిచ్చినందుకూ,మనుషులమీదా మానవత్వం మీదా నానాటికీ దిగజారిపోతున్న నా నమ్మకాన్ని ఇలాంటి సంఘటనలద్వారా ఇంకా నిలబెడుతున్నందుకూ శ్రీరామకృష్ణులకు మనస్సులోనే ప్రణామాలు అర్పించాను.

మనద్వారా దైవనిర్ణయం పనిచెయ్యడం కంటే, మనల్ని దైవం ఒక సాధనంగా వాడుకోవడం కంటే మనకు కావలసింది ఇంకేముంటుంది?
read more " చంద్రశేఖర సరస్వతి -2 "

నా రమణాశ్రమ జీవితం - కొన్ని ఆలోచనలు -1

ఈ మధ్య ఒక ప్రయాణంలో 'నా రమణాశ్రమ జీవితం' అనే పుస్తకాన్ని తెచ్చి ఇచ్చాడు రమణమూర్తి. ఇంతకుముందు దీనిని నేను చదవలేదు. రమణసాహిత్యం చాలావరకూ నేను చిన్నప్పుడే చదివాను.ఇదెలా మిస్సయిందా? అసలు దీని ప్రచురణ ఎప్పుడా? అని చూస్తే 2011 అని ఉన్నది.ఓహో అందుకా ఇది మిస్సయింది అనుకున్నాను.

ఈ పుస్తకంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది నాగమ్మగారి రచనాశైలి. ఆమె వ్రాసిన 'రమణాశ్రమ లేఖలు' ముముక్షువులకు సుపరిచితమే.అందులో కూడా ఇదే శైలి ఉంటుంది.అప్పట్లో బ్రాహ్మణ కుటుంబాలలో వాడే కొన్ని మాటలూ ఆ భాషా యధాతధంగా ఉండి చదవడానికి చాలా ఆహ్లాదంగా హాయిగా ఉంటుంది.

వీరి స్వగ్రామం కొలనుకొండ అన్న విషయం ఇప్పుడే నాకు తెలిసింది.అది విజయవాడ పక్కనే ఉన్న గ్రామం.ఈ గ్రామంలో ఒక కొండ మీద భోగేశ్వరాలయం అని ఉన్నదని ఆమె వ్రాశారు.విజయవాడ పోయి వచ్చేటప్పుడు కొలనుకొండ దగ్గర ఒక కొండమీద గుడి కనబడుతూ ఉంటుంది.అదే కావచ్చునేమో మరి.ఆ గుడిని చాలావరకూ బాగుచేయించినది వీరి కుటుంబమే అని ఈ పుస్తకంలో వ్రాశారు.ప్రస్తుతం ఆ కొండను చాలా వరకూ తవ్వి పారేశారు.ఇప్పుడది ఒక ఒంటిస్థంభం కొండలాగా కనిపిస్తూ ఉంటుంది.గుడి ఉన్నది గనుక అంతవరకూ అన్నా ఉంచారన్నమాట.లేకుంటే ఆ కాస్తా కూడా 'హరీ' మనేది. ఒకసారి వెళ్లి చూడాలి.

నరసరావుపేట పక్కనే ఇక్కుర్తి అని ఒక గ్రామం ఉంటుంది.అక్కడ ఇక్కుర్తి కొండ అని ఇలాగే ఒక కొండ ఉన్నది.దానిమీద రామాలయం ఉంటుంది. అక్కడే ఒక పెద్దగుహ లాంటి అమరిక సహజంగా ఏర్పడినది ఉంటుంది.దాదాపుగా నూరేళ్ళనాడు ఇక్కుర్తి రామయ్యగారని మా నాయనమ్మగారి తండ్రిగారు ఆ ఊరిలో ఉండేవారు.

1978-79 లలో నేను ఇంటర్ చదివే రోజుల్లో నర్సారావుపేట నుంచి సైకిలేసుకుని తరచుగా ఆ కొండకు వెళ్లి అక్కడ ఉన్న గుహలాంటి రాతిమంటపంలో కూచుని ధ్యానం చేసేవాడిని.అప్పట్లో ఆ కొండమీదకు ఎవరూ వచ్చేవారు కారు.వారానికొకరోజున అక్కడకు పోయి దాదాపు రోజంతా ఆ గుహలో కూచుని ఉండేవాడిని.ప్రస్తుతం చాలాసార్లు నరసరావుపేట మీదుగా రైల్లో పోయేటప్పుడు ఆ కొండా గుడీ దూరం నుంచి కనిపిస్తూనే ఉంటాయి.ఈమధ్య ఒకసారి నరసరావుపేట వెళ్ళినప్పుడు ఆ కొండ ఎలా ఉన్నదో చూద్దామని అక్కడకు వెళ్లాను.ఆ కొండను కూడా నాలుగుపక్కల నుంచీ తవ్వి పారేస్తున్నారు.కంకర కోసం జరుగుతున్న ఈ తవ్వులాటలో అనేక కొండలు ఇలాగే క్రమేణా అదృశ్యమై పోతున్నాయి.

మేము అక్కడకు వెళ్లేసరికి - కంకర కోసం వచ్చామేమో అని - ఒక పదిమంది చెట్టుకింద కూచుని పేకాట ఆడుతున్న పల్లెటూరివాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. మేమందుకోసం రాలేదని కొండను చూడ్డానికి వచ్చామని చెప్పాను.వాళ్ళు నమ్మలేదు.

'ఇప్పటికే ఇక్కడ చాలామంది గుప్తనిధులకోసం తవ్వారు.ఏమీ దొరకలేదు' అని అందులో ఒకడన్నాడు.అంటే మా వాలకం చూస్తే గుప్తనిధుల కోసం వెతికేవారిలా అగుపించామన్నమాట."ఇప్పటికే మేము చాలా తవ్వి చూచాము. మీరిప్పుడు త్రవ్వించినా ఏమీ దొరకదు."--అన్నట్లు ధ్వనించి, పిచ్చి నవ్వొచ్చింది.

మనుషులలో భావుకత రాన్రాను పూర్తిగా అదృశ్యమై పోతున్నది.ప్రకృతిని ఇష్టం వచ్చినట్లు కొల్లగొట్టడమూ తమ స్వార్ధానికి దానిని వాడుకోవడాలే ఎక్కడ చూచినా రాజ్యాలేలుతున్నాయి. "ప్రకృతిని ప్రేమించడం" అనే మాట ముందు ముందు ఎవరైనా మాట్లాడితే వాడినొక పిచ్చివాడిలా చూస్తారేమో ఈ జనం అనిపించింది."ప్రకృతిని ప్రేమించడం ఏమిటి?నీ ముఖం! దానిని వాడుకోవాలి గాని?" - అంటారేమోనని వారి మాటలు వింటే అనిపించింది.

ఎవరైనా సరే కొండలను గాని,చెట్లను గాని,నదులను గాని పాడు చేస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది.కానీ ఏం చేస్తాం? ప్రస్తుతం ఎక్కడ చూచినా ఇదే జరుగుతున్నది.మనిషి ప్రకృతిని నిర్లజ్జగా దోచి పారేస్తున్నాడు.దీని ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో అన్న ఆలోచనే వాడికి లేదు. వర్తమానం బాగుంటే చాలు.భవిష్యత్తు ఏమైపోయినా పరవాలేదు అనే భావం ఎక్కడ చూచినా కనిపిస్తున్నది.నవీనకాలపు గురువులు బోధిస్తున్న 'Living in the present' అంటే ఇదేనేమో?

సూరినాగమ్మ గారి పుస్తకం బాగానే ఉంది.జరిగినది జరిగినట్లుగా వ్రాయడం వల్ల చదువుతుంటే చక్కని ఫీల్ వస్తుంది.కానీ అక్కడక్కడా చాలా బోరు కొడుతుంది.ప్రయాణంలోనే ఆ పుస్తకాన్ని చదివేసి మూర్తికి తిరిగి ఇచ్చేశాను.

(ఇంకా ఉంది)
read more " నా రమణాశ్రమ జీవితం - కొన్ని ఆలోచనలు -1 "