“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, అక్టోబర్ 2015, శనివారం

నా రమణాశ్రమ జీవితం - 2 (రమణమహర్షి వ్రాసిన పద్యాలు)

ఈ పుస్తకంలో సూరినాగమ్మగారు వ్రాసిన కొన్ని విషయాలు ఆలోచించదగినవి.

రమణమహర్షి చాలా పద్యాలు వ్రాశారు.వాటిలో కొన్ని తమిళంలోనూ కొన్ని తెలుగులోనూ వ్రాశారు.తమిళ ఛందస్సు వారికి తెలుసు గనుక వాటితో బాధ లేదు.తెలుగు చందస్సు కూడా ఆయనకు తెలుసు.కానీ అవి వ్రాసేటప్పుడు కొంత తమిళ ఛందస్సు మిళితం అయింది.ఆ పద్యాలు కొందరు విమర్శకులకు విందుభోజనం లాగా పనికొచ్చాయి.

ఆ పద్యాలను తాము దిద్దుతామని వారు ముందుకొచ్చారు.ఆ ఛందస్సులో యతి ప్రాసలు తప్పాయనీ గణాలు తప్పయ్యాయనీ వారు వాదించసాగారు.అలా చెయ్యకూడదు మహర్షి వ్రాసిన పద్యాలను దిద్దరాదు అంటూ ఇంకొందరు వాదించారు.ఈ విధంగా రెండు గ్రూపులు ఆశ్రమంలో తయారయ్యాయి.ఈ గొడవంతా చూచి నాగమ్మతో మహర్షి ఇలా అన్నారు.

'చూడు.నువ్వేమో ఏదన్నా వ్రాయమంటావు.వీరేమో అందులో తప్పులున్నయ్యంటారు.ఇంతకు ముందు కూడా కొన్ని పద్యాలు వ్రాశాను. అందులో వ్యాకరణం తప్పిందని కొందరు తెలుగు పండితులు ఆక్షేపించారు.ఆ తర్వాత వ్రాయడం మానేశాను.అందుకే నేను వ్రాయను.'

ఎప్పుడైనా మహర్షిని ఏదైనా వ్రాయమని ఎవరైనా అడిగితే ఆయన ఈ మాటే అనేవారు.

'ఎందుకు?నేను వ్రాస్తే మీకు నచ్చదు.అందులో యతిప్రాసలు తప్పాయంటారు.ఈ గొడవంతా నాకెందుకు? వద్దులే.' అనేవారు.

ఈనాడు మనం మహర్షిని మహాజ్ఞానిగా ఆరాదిస్తున్నాం గాని,ఆయన బ్రతికున్న రోజులలో ఆయన్ను విమర్శించిన జనమూ ఉన్నారు.వారిలో పండితులు కూడా ఉన్నారు.వారి పని విమర్శించడమే కదా !

ఈ గొడవంతా విని మహాపండితులైన వేలూరు శివరామశాస్త్రిగారు ఇలా అన్నారట.

'జ్ఞానుల రచనలను దిద్దరాదు.అలా దిద్దడం చాలాతప్పు.వారి చుట్టూ ఛందస్సులు ఎల్లప్పుడూ ఆవరించే ఉంటాయి.వారికి మనం ఛందస్సు నేర్పడమా?ఎంత అపచారం?మహర్షి వ్రాసిన పద్యాలలో తప్పులున్నప్పటికీ వాటిని అలాగే ఉంచండి.పొరపాటున కూడా వాటిని దిద్దకండి.'

వేలూరు శివరామశాస్త్రిగారు మహాపండితుడు గనుకా ఆయనే తీర్పు ఇచ్చినప్పుడు ఇంకా మాట్లాడేది ఏమీ లేదు గనుకా ఆ గొడవ అంతటితో సమసిపోయింది.మహర్షి అప్పుడు వ్రాసిన పద్యాలను ఇప్పుడు కూడా మనం చదవవచ్చు.

భాష శరీరం లాంటిది.భావం ఆత్మ లాంటిది.దృష్టి ఆత్మ మీదే ఉండాలి గాని శరీరం మీద కాదు.కానీ ఆత్మను దర్శించడానికి శరీరం కూడా అవసరమే.అది ఎంతవరకో అంతవరకే గాని అంతకు మించి కాదు.ఆత్మకూ శరీరానికీ క్లాష్ ఏర్పడినప్పుడు ఆత్మనే మనం అనుసరించాలి.అలాగే భాషకూ భావానికీ క్లాష్ ఏర్పడినప్పుడు భావాన్నే మనం స్వీకరించాలి.ఎప్పుడూ భాష మీదే దృష్టి ఉంచడం ఎప్పుడూ శరీరం మీదే దృష్టి ఉంచి దానికి మేకప్ చేసుకుంటూ జీవితమంతా గడపడం లాంటిది.

శరీరధ్యాసను వదలిపెట్టి ఆత్మను అందుకోమని చెప్పిన రమణమహర్షి పద్యాలలోనే తప్పులుపట్టి వాటిని దిద్దబోయిన ఘనులున్నారు.అసలు ఆయన బోధనను వారు ఎంతవరకూ అర్ధం చేసుకున్నారో దీనిని బట్టే అర్ధమౌతున్నది.ఇలాంటి వారిని చూచీచూచీ విసుగు పుట్టబట్టే మహర్షి ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయేవారు.

వాల్మీకీ కాళిదాసూ వ్రాసిన కవిత్వాలనే విమర్శించిన వారూ దిద్దినవారూ ప్రబుద్ధులున్నారు.ఇక మనలాంటి మామూలు మనుషులెంత? అసలు విషయం అది కాదు.దైవప్రేరణతో ఒక ఒరవడిగా పైనుంచి గంగానదిలా దూకుతూ వచ్చిన కవిత్వాన్ని ఎప్పుడూ దిద్దకూడదు.అలా దిద్దడం అంటే దైవాన్ని అవమానించినట్లే.ఛందో దేవతలను అవమానించినట్లే అవుతుంది.ఎందుకంటే - ఆ ఒరవడిలో ఒక సౌందర్యం ఉంటుంది.ఆ సౌందర్యం ఒక్కొక్కసారి యతిప్రాసల ఇనుపచట్రంలో ఇమడకపోవచ్చు.కానీ అది ఒక అతీత సౌందర్యమే.నిజమైన సౌందర్యం అనేది కట్టుబాట్లకు అతీతంగానే ఎల్లప్పుడూ ఉంటుంది.

కవిత్వం అనేది సౌందర్యారాధకుల కోసమే గాని, పరీక్ష పేపర్లు దిద్దినట్లు దానిని దిద్ది మార్కులేసే వారికోసం కాదు.అలా దిద్దడంవల్ల యత్రిప్రాసలు సరిపోవచ్చేమోగాని ఆ భావదారలోని స్వచ్చసౌందర్యం మలినం అవుతుంది. కవితా సరస్వతికి అది తీవ్రమైన అపచారం అవుతుంది.అలా దిద్దినవారికీ దిద్దించినవారికీ అది శాపం అవుతుంది.

ఈరోజు ఈ టాపిక్ వ్రాద్దామని అనుకుంటుండగా నిన్న సాయంత్రం ఒక ఫోన్ వచ్చింది.

"నేను మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు నుంచి మాట్లాడుతున్నాను.మీ 'శ్రీవిద్యారహస్యం' నా చేతిలో ఉంది.చదువుతున్నాను.ఎన్నో విషయాలు తెలిసినట్లు వ్రాశారు.కానీ యతిప్రాసలు చాలా తప్పులున్నాయి.వ్యాకరణ దోషాలున్నాయి."-అన్నాడాయన పరిచయం కూడా లేకుండా డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వస్తూ.

గొంతు వింటే ఎవరో చాదస్తపు పండితునిలా అనిపించాడు.

ప్రతివారితోనూ ఏం వాదన పెట్టుకుంటాం? ఎంతకని వివరిస్తాం? అనుకుంటూ 'సరే మంచిది.' అన్నా.

ఆయనకు విషయం అర్ధమైనట్లు లేదు.బహుశా నాకు వినపడలేదేమో అనుకున్నాడల్లే  ఉంది.

పెద్ద గొంతులో చెప్పినదే మళ్ళీ చెప్పాడు.

నేను మళ్ళీ 'మంచిది' అన్నాను.

అరిగిపోయిన రికార్డులాగా ఆయన మళ్ళీ అదే చెప్పాడు.

ఇక ఇలా కాదని -'వాటి మీద మీ దృష్టి పెట్టకండి.భావం మీద దృష్టి లగ్నం చెయ్యండి.ఏం చెప్పానో దానిని అర్ధం చేసుకోండి' అన్నాను.

'ఓహో అలాగా' అంటూ 'మా గురువుగారు విజయవాడలో ఉండే ఫలానా ఆయన.మీకు తెలుసా?ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత.'అన్నాడు.

'అలాగా నాకు తెలీదు' అంటూ 'ఇంతకీ మీ పేరేంటో చెప్పనేలేదు.' అన్నాడు.

'నా పేరు ఫలానా శర్మ' అన్నాడాయన. అదా సంగతి అనుకున్నా. పండితాహంకారం విషయాన్ని అర్ధం చేసుకోనివ్వదు.ఇది మామూలే.

ఆయన ఫోన్ పెట్టేశాడు.

పండితుల సంగతి ఇలా ఉంటుంది !! వారికి అన్నీ తప్పులే ముందుగా కనిపిస్తాయి. రమణమహర్షినే వీరు వదలలేదంటే ఇక మనమెంత?

ఒకాయన భారతం అంతా చదివానని గొప్పలు చెబుతున్నాడట.ఏం అర్ధమైందో చెప్పమని ఎవరో అడిగితే - 'ధర్మరాజుకి పేకాట బాగా వచ్చని అర్ధమైంది' అని చెప్పాడట. అంత చదివిన తర్వాత ఆయన అర్ధం చేసుకున్నది అది! మనమేం చెయ్యగలం?

ఇంకొకాయన రామాయణాన్ని ఏళ్ళ తరబడి అధ్యయనం చెశాట్ట. ఏమర్ధమైఁదో చెప్పవయ్యా అంటే - 'ఆడదాని కామమే అన్ని అనర్దాలకూ కారణం' అన్నాట్ట. విన్నవారికి మతులు పోయి "అదేంటయ్యా బాబూ"- అంటే - "అవును.తనకు తాపం ఎక్కువగా ఉన్నదని శూర్పణఖ కోరినప్పుడు రాముడో లక్ష్మణుడో ఆమె తపన తీర్చి ఉంటే రావణుడు వచ్చి సీతను ఎత్తుకుపోవడమూ, రామలక్ష్మణులు ఏడుస్తూ అడవుల్లో తిరగడమూ, ఇంత గొడవా యుద్ధమూ అందులో అంతమంది చావడమూ జరిగేవే కావు కదా? ఏందో పెద్ద నీతులు చెప్పి ఆ అమ్మాయికి అన్యాయం చేశారు.ఆమె కోరిక తీరిస్తే ఏం పోతుంది గనుక?లక్ష్మణుడికి ఒక ఆడతోడుగా ఆ అడవిలో తనంత తానై వచ్చింది.కోరి వచ్చిన ఆడదాన్ని అలా చెయ్యవచ్చా?అసలు తప్పంతా రాముడిదీ లక్ష్మణుడిదే.ఆడదాని ఉసురు అలా పోసుకోవచ్చా?తప్పుకదూ?ఆడది నోరుతెరిచి అడిగినప్పుడు అంత బలవంతులై ఉండీ ఆమెను శాటిస్ఫై చెయ్యలేక పోయారు.అందుకే అన్ని కష్టాలు పడ్డారు.కనుక నేనన్నది కరెక్టే' అన్నాట్ట.

రామాయణం అంతా తిరగా మరగా చదివితే ఆయనకు అర్ధమైన విషయం అది !! ఎవరి లాజిక్కు వారిది.ఎవరెవరి మానసిక స్థాయిని బట్టి పురాణాలు గానీ ఇంకేదైనాగానీ వారికి అర్ధమౌతాయి.

రమణమహర్షి వ్రాసిన పద్యాలలో - ఆయన ఏం చెబుతున్నాడో - మనల్ని ఏం చెయ్యమంటున్నాడో - ఆ విషయం వదిలేసి వ్యాకరణదోషాలు వెదికారు అప్పటి కొందరు పండితులు.పండితులందరూ అలాంటివారని నా ఉద్దేశ్యం కాదు.వారిలో వేలూరి శివరామశాస్త్రి వంటి విజ్ఞులూ ఉన్నారు.కానీ అలాంటివారు కొందరే ఉంటారు.ఎక్కువమంది తప్పులు వెదికేవారే ఉంటారు.

'తారా స్తోత్రం' పుస్తకం ఫస్ట్ కాపీని ఒకాయనకు చదవమని ఇచ్చాను.అదొక అనుగ్రహం. ఆ విషయం ఆయనకు అర్ధం కాలేదు.ఆయన ఆ పుస్తకాన్ని ఒక మహాపండితునికి ఇచ్చి తప్పులు దిద్దించి నాకు పోస్ట్ లో తిరిగి పంపాడు.ఆ పండితులవారు తప్పులు దిద్దడమేగాక పద్యాలకు పద్యాలే మార్చిపారేసాడు. వీరిద్దరి అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో నాకర్ధం కాలేదు.ఒక 'Divine Flow' లో వచ్చిన సాహిత్యాన్ని కళ్ళకద్దుకుని పూజించాలి.దానిని అర్ధం చేసుకుని ఆచరించాలి.అంతేగాని దానిమీద పెన్ను పెట్టకూడదు.ఆ విజ్ఞత ఉన్నవాడే నిజమైన విజ్ఞుడు, పండితుడూనూ.

అయితే, ఇష్టం వచ్చిన వ్యాకరణ దోషాలతో మీ కిష్టం వచ్చిన పద్యాలు వ్రాస్తే మేము నోరెత్తకుండా చదవాలా? అని ప్రశ్నిస్తే అవునని నేను చెప్పను. కొన్నిసార్లు తప్పులు దొర్లుతూనే ఉంటాయి.ఎన్ని సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసినా కొన్ని తప్పులు డీటీపీ ప్రాసెస్ లో చోటుచేసుకుంటాయి.ఇవి రెండూ మలిముద్రణలలో సరిదిద్దబడతాయి.దానిని ఎవరు వ్రాశారో వారే వాటిని దిద్దాలి. చదివేవారు ఆ విషయం అర్ధం చేసుకుని విషయం మీద దృష్టి నిలపాలి. అసలు విషయం అది.

ఇంకొకాయనకు 'శ్రీవిద్యారహస్యం' చదవమని పంపిస్తే చదివి దానిని పోస్ట్ లో వెనక్కు తిప్పి పంపించాడు.బాగా వ్రాసినా ఓర్చుకోలేనివారు కూడా కొందరు ఉంటారని అప్పుడే నాకు అర్ధమైంది.

అన్నీ వదిలేసి జీవితమంతా సన్యాసినిగా త్యాగమయంగా అరవై ఏళ్ళుగా జీవిస్తున్న ఒక మాతాజీ 'శ్రీవిద్యారహస్యం' పుస్తకం చదివి బ్రహ్మానంద భరితురాలై, తనుండేది బెంగాల్ లో కనుక, తన దర్శనం కోసం వచ్చేవారికి ఈ పుస్తకాన్ని తెలుగునుంచి బెంగాలీలోకి అనువాదం చేసి మరీ చెబుతోంది. వారు విని ఆనందిస్తున్నారు.

కనుక మన స్థాయిని బట్టే ఏదైనా మనకు అర్ధమౌతుంది.వారి రియాక్షన్ బట్టి వారి స్థాయి ఏమిటో నాకర్ధమౌతుంది.

మనుషులలో అందరూ పొట్టు కోసం కొట్టుకునేవారే గాని లోపలి పప్పును కోరుకునేవారు ఎక్కడో ఒకరో ఇద్దరో మాత్రమె ఉంటారు.అందరూ పిప్పికోసం కాట్లాడుకునేవారేగాని లోపలి రసాన్ని త్రాగుదామని తపించేవారు ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటారు.అలాంటివారే మన అసలైన సహచరులు, అనుచరులు.మిగిలిన వారితో మనకు అనవసరం.ఊకలో దొర్లేవారు మనతో నడవలేరు.వారి దారి మన దారితో కలవదని గ్రహించి వారిని దూరం ఉంచాలి.

మనకు కావలసింది మనల్ని మెచ్చుకునేవారూ కాదు.విమర్శించేవారూ కాదు.మనల్ని ప్రేమించేవారూ మనతో నడిచేవారూ మనకు కావాలి.ఒకరు విమర్శిస్తే మనదేమీ పోదు.ఒకరు మెచ్చుకుంటే మనకేమీ కొత్తగా రానూ రాదు.కనుక ఈ రెండూ మనకు అనవసరములైనవే.పొట్టులో పప్పులను వెదుక్కున్నట్లు గుంపులోనుంచి మనవారిని వెదుక్కోవడమూ మనకు తెలిసినదాన్ని వారికి నేర్పడమే మనం చెయ్యవలసిన అసలైన పని.