24, మార్చి 2026, మంగళవారం

R. I. P Chuck Norris


హాలీవుడ్ యాక్షన్ హీరో 'చక్ నారిస్' మొన్న 19 వ తేదీన అమెరికాలోని హవాయ్ లో చనిపోయాడు. అతనికి 85 ఏళ్ళు. చివరివరకూ ఆరోగ్యంగానే ఉన్న ఇతను, ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి పోయాడంటున్నారు. కారణాలు తెలియవు.

'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' లో బ్రూస్లీ తో ఇతను చేసిన క్లైమాక్స్ ఫైట్ చాలా హిట్టయింది. ఆ విధంగా ఇతనికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చినప్పటికీ, అప్పటికే ఇతను వరల్డ్ కరాటే ఛాంపియన్ అయి ఉన్నాడు. వరుసగా ఆరేళ్లపాటు ఈ టైటిల్ ను ఇతను గెలుచుకున్నాడు.

1958 లో US ఎయిర్ ఫోర్స్ లో చేరి,  డిప్యూటేషన్ పైన దక్షిణకొరియాలో పనిచేస్తున్నప్పుడు, తన 18 ఏట 'టాంగ్ సు డో' (కొరియన్ కరాటే వంటిది) అభ్యాసాన్ని మొదలుపెట్టిన ఇతను ఆ తరువాత జూడో, టాయ్ క్వాన్ డో, బ్రెజిలియన్ జుజుట్సు మొదలైన ఇతరవిద్యలలో కూడా బ్లాక్ బెల్టులను పొందాడు. 

1967 లో ఇతను అమెరికన్ కరాటే ఛాంపియన్ అయ్యాడు. 1968 లో, 1969 లో కూడా మళ్ళీ ఛాంపియన్ షిప్ గెలుచుకుని రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ప్రాక్టీస్ ఆపలేదు. తన 85 వ ఏట చనిపోయేవరకూ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు.

యోగా, మార్షల్ ఆర్ట్స్ అనేవి వైరస్ ల వంటివి. ఒకసారి పట్టుకుంటే జీవితాంతం వదలవు. కానీ మనకు మంచినే చేస్తాయి. అందుకే, మార్షల్ ఆర్టిస్టులు ఎంత వయసొచ్చినా అభ్యాసం చేస్తూనే ఉంటారు.

ఇతను వివాదాలు లేని వ్యక్తి. మంచివాడు. కలుపుగోలు మనిషి. సౌమ్యుడు. ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ గర్వం లేనివాడు. ఈ గుణాలవల్ల ఇతనిని నేనుకూడా అభిమానిస్తాను.

ఇతని ఆత్మకు శాంతి కలుగుగాక !