ఇవాళ తెల్లవారుఝామున బ్రహ్మముహూర్తంలో మంచినిద్రలో ఉండగా నారదమహర్షి కలలో కొచ్చాడు.
'నాయనా ! నీవు ఆశ్రమమునకే పూర్తిగా పరిమితమై పోయితివి. బయటి ప్రపంచమును ఈషణ్మాత్రమూ పట్టించుకొనుటలేదు. మరీ దద్దమ్మవగుచున్నావు. అప్పుడప్పుడు కాస్త బయటకు కూడా వెళ్లి లోకసంచారము చేయుచుండుము. అప్పుడు మాత్రమే నీకు లోకపుతీరు అవగతం కాగలదు' అని సెలవిచ్చి, నేనేదో చెబుదామనుకునేలోపు డామ్మని మాయమైపోయాడు.
'దేవతలకీ ఋషులకీ కూడా ప్రస్తుతం తీరిక ఉండటం లేదు. అందరూ డెలివరీ బాయ్స్ అయిపోతున్నారు. చెప్పాలనుకున్నది చెప్పేయడం మాయమైపోవడం. ఎదుటివాడి రియాక్షన్ కోసం ఆగడం లేదు. స్పీడు బ్రతుకులైపోయాయి. ఏం చేస్తాం?' అనుకుంటూ బద్దకంగా నిద్రలేచాను.
ఫ్రెష్షయ్యి, ప్రధానశిష్యురాలిని తీసుకుని లోకసంచారానికి బయల్దేరాను.
అదేంటో మరి, టిఫిన్ చేద్దామంటే అన్ని హోటళ్ళూ మూసేసి ఉన్నాయి. కనీసం టీ షాపులు కూడా లేవు.
'ఏంటిది? ఇంతఘోరకలిగా యున్నది?' అని శిష్యురాలిని అడిగాను.
'యుద్ధం ప్రభావంతో గ్యాసు ఆగిపోయింది. హోటళ్లు బంద్' అని చెప్పింది
ఒక గేటెడ్ కమ్యూనిటీ ముందు అందరూ కర్రలతో కొట్టుకుంటున్నారు.
'ఇదేంటి? ఈ విధముగా యుద్ధము చేయుచున్నారు?' అడిగాను.
'అది యుద్ధం కాదు. ఒక్కటే గ్యాస్ సిలెండర్ ఉందిట. దానికోసం అందరూ అలా కొట్టుకుంటున్నారు' చెప్పింది.
'గతంలో నా చిన్నప్పుడు, నీళ్ళపంపులవద్ద ఈ దృశ్యములను చూచితిని. ఇప్పుడు ఈ విధముగా చూడవలసి వచ్చినది. ఇదియేకదా మాయాప్రభావము' అన్నాను.
'నోరుముయ్యి' అన్నట్టు చూసింది శిష్యురాలు.
'ఇరాన్ యుద్ధం వల్ల ఇలా ఉంది' అన్నది.
'యుద్దమా? అదెక్కడ?' అన్నాను అయోమయంగా.
'అందుకే అప్పుడప్పుడూ లోకసంచారం చెయ్యమని మహర్షి చెప్పింది' అన్నది కోపంగా.
'ఓహో నా అగ్నానం నీక్కూడా తెలిసిపోయిందా?' అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాను.
కొద్దిగా ముందుకెళ్లాం.
'గ్యాసు నామమె పావనము, ప్రభు గ్యాసే రక్షణ కారణము' అంటూ ఒక ప్రార్ధనామందిరంలో నుంచి మైకు మోగుతోంది.
'రామరామ ! బంగారంలాంటి పాటని ఇదేంటి ఇలా మార్చేశారు? అన్నాను విస్తుపోతూ.
'నిన్ననే గ్యాసుదేవుని వైపు కన్వర్ట్ అయ్యారు.యుద్ధం ప్రభావం' కామ్ గా అంది శిష్యురాలు.
మతిపోయింది.
ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి 'గ్యాసో హో సిలెండర్' అంటూ ఇంకో చోటనుంచి పెద్దగా శోకాలు వినిపించాయి.
భయమేసింది.
'ఇదేంటి? వీళ్ళుకూడానా?' అన్నాను.
'అవును. గ్యాసు దొరకడం లేదుగా. కన్వర్ట్ కాక వాళ్ళకీ తప్పలేదు' అంది శిష్యురాలు.
ఇంకో వందగజాలు వెళ్లేసరికి ఇంకొక ప్రార్ధనామందిరంలో నుండి శ్లోకాలు వినిపించాయి.
'గ్యాసుదేవాయ నమః, గ్యాసుప్రభువే నమః, గ్యాసురాజాయ నమః, సిలెండరు మాతాయ నమః' అంటూ మైకు పెద్దగా మ్రోగుతోంది.
'వీళ్ళకేం పోయేకాలం?' అడిగాను.
'కన్వర్ట్ కావడానికి వీళ్ళు ముందుంటారు కదా. నిన్ననే ఎవరో గ్యాస్ సిలెండర్ ఇచ్చారట. వెంటనే మతం మారిపోయారు. గ్యాసుమీద అష్టోత్తరాలు రాసుకున్నారు. పాడుతున్నారు' అన్నది శిష్యురాలు.
విరక్తిగా నవ్వుకున్నాను.
ఇంతలో ఒక పెద్దగుంపు ఎదురొస్తే ప్రక్కకు తప్పుకుని 'ఏంటా?' అని చూచాం.
అందరి తలలపైనా గ్యాస్ సిలెండర్ ఆకారంలో టోపీలున్నాయి.
'వీళ్లెవరు?' అడిగాను.
'సిలెండర్ ఫౌండేషన్' అని క్రొత్తసంస్థ. సిలెండరు బొమ్మని అలా నెత్తిమీద పెట్టుకుని రోడ్లమీద తిరుగుతుంటే, స్థూలదేహంలో నుండి సూక్ష్మదేహం బయటకొచ్చి, ఎక్కడెక్కడో తిరుగుతుందట' అంది శిష్యురాలు.
'అంటే, స్థూలదేహం రోడ్లమీద తిరుగుతుంటే, సూక్ష్మదేహం లోకలోకాలు తిరుగుతుందా? ఎందుకలా? రెండూ ఒకేచోట చావచ్చుగా?' అడిగాను.
'ఏమో? నీ దేహానికి ఒకచోట ఉండటం ఇష్టమైనట్టే, వాళ్ళ దేహాలకు బయటతిరుగుళ్లు ఇష్టం. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, కాదనడానికి మనమెవరం?' అంది శిష్యురాలు.
ఖాళీగా ఉంటే ఎవడైనా వచ్చి సిలెండర్ టోపీ పెడతాడేమో అని భయమేసి వెంటనే జేబులోంచి కర్చీఫు తీసి తలచుట్టూతా కట్టుకున్నాను.
మరికొన్ని అడుగులేసేసరికి, ఒక బోర్డు కనిపించింది.
'గ్యాసు రావడం లేదని విసిగిపోతున్నారా? మీకు గ్యాసు ఎప్పుడు వస్తుందో గ్యారంటీగా చెప్పబడును' ఇట్లు ప్రసిద్ధ కోయజ్యోతిష్కులు, అని దానిమీద రాసుంది.
'గ్యాసు రావడం ఏంటి?' అన్నాను అర్ధం కాక.
'అంటే, గ్యాస్ సిలెండర్ డెలివరీ అని అర్ధం' అంది శిష్యురాలు చిరాగ్గా.
'ఓహో అదా ! చివరకు వీళ్ళుకూడా తయారయ్యారా?' అన్నాను నిరాశగా.
'అప్పుడే ఏమైంది? అటుచూడండి' అంది శిష్యురాలు.
'మీ మోకాలు చూసి, గ్యాసు ఎప్పుడొస్తుందో చెప్పబడును. జాతకంతో పనిలేదు' అని ఇంకో బోర్డు కనిపించింది.
'ఇదేంటి ఇలా పెట్టాడు?' అన్నాను.
'అందరూ చేతులు, ముఖాలు చూసి జ్యోతిష్యం చెబుతున్నారు కదా. వెరైటీగా ఉంటుందని ఇలా పెట్టాడు. బ్రెయిన్ అక్కడే ఉంటుందని వాళ్ళ పెద్దదొర చెప్పాట్ట. అందుకే వాళ్ళు మోకాళ్ళు మాత్రమే చూస్తారు' అంది.
'ఇక నా వల్లకాదు. పీచే ముడ్' అని గట్టిగా అరిచాను.
కట్ చేస్తే, ఇద్దరం ఆశ్రమంలో తేలాం.
'హమ్మయ్య' అని గాలి పీల్చుకునేలోపు, ఫోన్ మ్రోగింది.
ఫోనెత్తి 'హలో' అనేలోపే, 'గురూగారు. నాకిప్పుడే అబ్బాయి పుట్టాడు. బెడ్ పక్కనించే ఫోన్ చేస్తున్నా. ఏం పేరు పెట్టమంటారు?' అడిగాడు ఒక పరమాణువు.
'నీకు పుట్టటం ఏంటి?' అరిచాను విసుగ్గా.
'అంటే, వాళ్ళావిడకని అర్ధం. నువ్వూ నీ చచ్చు సందేహాలు' అని పక్కనించి అరిచింది శిష్యురాలు.
'గ్యాసు నాధ్' అని పెట్టుకో ఫో' అని మళ్ళీ ఫోన్లోకి అరిచాను.
'టాంక్యూ గురూజీ. మా ఆవిడక్కూడా కలలో గ్యాసునాధుడు కనపడి, పుట్టబోయే పిల్లాడికి తన పేరే పెట్టాలని. లేకపోతే మా సంగతి తేలుస్తానని బెదిరించాట్ట. మేముకూడా ఇదే అనుకున్నాము. కానీ సెకండ్ ఒపీనియన్ కోసం మీకు ఫోన్ చేశాము. మీరు కూడా అదే చెప్పారు. టాంక్యూ సోమచ్' అని పొంగిపోతున్నాడు.
'ఎక్కువ పొంగిపోకు, పొయ్యిలో పడగలవు' అన్నాను.
'ఇంకొక్క విషయం గురూజీ. మా చెల్లెలిక్కూడా ఇప్పుడే అమ్మాయి పుట్టింది. దానికేమని పేరు పెట్టాలి?' అడిగాడు.
'అస్సలు టైం వేస్ట్ చెయ్యడం లేదురా మీరు?' అనుకుంటూ, 'సిలెండర్ రాణి' అని పెట్టండి. ఎలాగూ పెద్దయ్యాక అయ్యేది అదేగా' అన్నాను.
'టాంక్యూ గురూజీ' అని ఫోన్ పెట్టేశాడు శిష్యుడు.
'హమ్మయ్య' అని చుట్టూ చూడగానే శిష్యులెవరూ కనిపించలేదు.
'వీళ్లంతా ఎక్కడికి పోయారు?' అరిచాను కోపంగా.
'కట్టెపుల్లలేరుకు రావడానికి పక్కపొలాల్లో తిరుగుతున్నారు. మనకీ గ్యాసు లేదు మరి' అంది శిష్యురాలు.
ప్రశ్నార్ధకంగా చూశాను.
'ప్రపంచం ఎన్ని కష్టాలలో ఉందో చూశారు కదా గురూజీ. ఏదైనా రెమెడీ చెప్పి పుణ్యం సంపాదించుకోండి' ప్రాధేయపడింది శిష్యురాలు.
తీవ్రంగా ఆలోచించాను.
'ఓకే ! దీనికొకటే మార్గముంది. వెంటనే అందరూ టవల్స్ కట్టుకుని దీక్ష మొదలుపెట్టండి. నలభైరోజులపాటు అదే టవల్లో ఉండాలి. అదే మన దీక్షాడ్రస్సు. 'జై గ్యాసుదేవాయ నమః' అనే మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. అన్నిపనులూ మానేసి దీన్ని రోజుకు ఇరవైకోట్లసార్లు జపించాలి. నలభైరోజులపాటు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అయితే, 'స్ట్రా'తో బిందెలోనుంచి పీల్చుకుంటూ తాగచ్చు. కానీ గాలిమాత్రం ఈ నలభైరోజులపాటు అస్సలు పీల్చరాదు. అప్పుడన్ని సమస్యలూ గాలిలో కలసిపోతాయి. వెంటనే అన్నిదేశాలలో ఉన్న మన శిష్యులందరికీ మెయిల్స్ పంపండి. అందరూ ఈ దీక్షను మొదలుపెట్టండి' ఆజ్ఞాపించాను.
'ఓకే గురూజీ !' అని శిష్యురాలు ఆ పనిలోకి దిగింది.
'జై గ్యాసునాధాయ నమః' అనుకుంటూ నేను పక్కమీద వాలాను.