అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

10, మార్చి 2026, మంగళవారం

సంజీవినీ మూలిక

'మీరు చెప్పేదంతా బాగానే ఉందిగానీ, మీ దగ్గరకు నేనిప్పుడే రాలేను' అన్నది గతంలో ఒక శిష్యురాలు. గతంలో అంటే, పదేళ్ళక్రితమన్నమాట.

'అదేంటి? నా దగ్గరకు రమ్మని నేనెప్పుడూ ఎవరినీ పిలవలేదే?' అన్నాను ఆశ్చర్యపోతూ.

'అంటే, మీ దారిలో నడవలేనని అర్ధం' అన్నది.

'సరే నడవలేకపోతే ఎవరైనా ఆర్ధోపెడిక్ డాక్టరుకు చూపించుకో' అన్నాను.

'కొన్ని బాధ్యతలు తీరితేగాని ఈ మార్గంలోకి రాలేను' అన్నది.

'ఏమిటా బాధ్యతలు?' అడిగాను.

'ముందు మా అమ్మాయి చదువు పూర్తి కావాలి'  అంది

'ఇప్పుడేం చదువుతున్నది మీ అమ్మాయి' అడిగాను.

'ఎనిమిదో క్లాసు' అన్నది.

'ఏం చదవాలనుకుంటున్నది?' అన్నాను.

'మెడిసిన్ చేస్తుందిట' అన్నది.

'అంటే ఇంకో ఇరవై ఏళ్ళు పడుతుందిగా' అన్నాను.

'అటూ ఇటూగా పట్టచ్చు' అన్నది.

'ఆ ! ఎంతసేపులే ఇరవైఏళ్ళేగా ఇరవైనిముషాల్లో అయిపోతుంది. కానీయ్' అన్నాను.

'ఆ తర్వాత దానికి పెళ్లి చెయ్యాలి' అంది.

'చేసుకుంటుందా?' అడిగాను.

'అదేం మాట?' తనకి కోపం వచ్చింది.

'అంటే, అమెరికాలో కుర్రకారు పెళ్లొద్దంటున్నారు కదా. పైగా ఇంకా ఇరవైఏళ్ల తర్వాతాయె. అప్పటికి ఎలా ఉంటుందో? పోనీ ఆ తర్వాతైనా కుదురుతుందా?' అన్నాను.

'దానికి ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టాలిగా' అంది.

'అంటే ఇంకో పదేళ్లు. ఇక నే చెప్తా విను. ఆ తర్వాత ఆ పిల్లలు చదువుకోవాలి. పెద్దవాళ్ళు కావాలి. సెటిల్ కావాలి. పెళ్లిళ్లు చేసుకోవాలి. ఇదంతా అయ్యేటప్పటికి ఇంకో ఏభై ఏళ్ళు అవుతుంది. అప్పటికి నీకు నూటఇరవైఏళ్ళు వస్తాయి. పోనీలే అప్పుడైనా కుదురుతుందా?' అడిగాను.

'ఏంటి నా లైఫుతో మీకు ఎగతాళిగా ఉందా?' ఈ సారి కోపం ఎక్కువగా వచ్చింది.

'అబ్బే. నాకెందుకంత అదృష్టం? నీ లైఫు పూర్తిగా నీ ఇష్టమే. అలాగే కానియ్. నేను మాత్రం అర్జెంటుగా హిమాలయాలకు పోతున్నాను రేపే' అన్నాను.

'ఎందుకు?' అడిగింది.

'నీకంటే శక్తులున్నాయి గనుక 120 ఏళ్ళు ఉంటావు. నేనంతకాలం ఉండలేను. మరి ఉండాలంటే సంజీవినీమూలికను వెతుక్కోవాలి కదా. అదేమో హిమాలయాలలో తప్ప లోకల్ మెడికల్ షాపుల్లో దొరకడం లేదు. అందుకు' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

ఆ తర్వాత ఆ శిష్యురాలేమైందో తెలియదు. బహుశా పిల్లల కాలేజీ అడ్మిషన్ల కోసం అమెరికాలో ఇంకా తిరుగుతూ ఉందేమో !

బోడి సాధనదేముంది? ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తుంది. దానికంటే, పిల్లల చదువులు ముఖ్యం కదా !

తను చెప్పినట్టే పదేళ్లు వెయిట్ చేసినా తన జాడాజవాబూ కనిపించడం లేదు. ఏమైందో ఏమిటో? ఏ బెమ్మకుమారీ గానో, సాయిబాబీ గానో మారిపోలేదు కదా ! లేక, సంజీవినీ మూలికను అమెరికాకు పార్శిల్ చెయ్యాలేమో !