అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

10, మార్చి 2026, మంగళవారం

త్వరగా బయల్దేరు

'ఎన్నో గుళ్ళు తిరిగాను. ఎందరో గురువులను చూశాను. ఏమీ ఉపయోగం లేదు' అన్నదొక శిష్యురాలు గతంలో.

'నీలాంటివాళ్లతో వాళ్ళకి బాగానే ఉపయోగం ఉంటుంది' అన్నాను.

'నేను చెబుతున్నది నా గురించి' అన్నది కోపంగా.

'పోనీ తిరుగుడు మానేసి చూడు. ఉపయోగం ఉంటుందేమో?' అన్నాను.

'మీ దగ్గర కూడా ఏమీ ఉపయోగం లేదు. మీరు చెప్పేవి నాకేమీ ఎక్కడం లేదు' అన్నది నిరాశగా.

'నేను నీకేమీ చెప్పలేదుగా?' అన్నాను.

'అందరికీ చాలా చెబుతున్నారుగా?' అన్నది.

'అందరికీ చెప్పినవి నువ్వెందుకు ఎక్కించుకోవాలని చూస్తున్నావు?' అడిగాను.

'మరి నేను వెనుకబడిపోతున్నాను కదా?' అన్నది.

'ఆలా అనుకుంటే ముందుకు రా' అన్నాను.

'ఎందుకు రాలేకపోతున్నాను?' అడిగింది మళ్ళీ.

'ముందు ఉన్నచోటనుంచి లేస్తే, ఆ తర్వాత ముందుకో వెనక్కో ఎక్కడికో ఒకచోటకు రావచ్చు' అన్నాను.

'నాకు కర్మ బరువు చాలా ఎక్కువగా ఉంది' అన్నది.

'దించుకో మరి. ఎందుకు మోస్తున్నావు?' అడిగాను.

'మీరు చెప్పేవి నాకేమీ అర్ధం కావడం లేదు' అన్నది.

'అర్ధమయ్యేదాకా పూర్ణంగా ఉండు' అన్నాను.

'ఎప్పటికర్ధమౌతాయి' అడిగింది.

'నువ్వు నేనైనప్పుడు అర్ధమౌతాయి' అన్నాను.

'అప్పుడేమౌతుంది?' అంది మళ్ళీ.

'అప్పుడు నువ్వు అడిగేదీ ఉండదు, నేను చెప్పేదీ ఉండదు. నీకీ బాధా ఉండదు' అన్నాను.

'నేను మీ దగ్గర ఉండలేను' అంది.

'త్వరగా బయల్దేరు' అన్నాను.