మొన్నీ మధ్యన ఇద్దరు సాయిబాబీలు ఆశ్రమం చూడటానికొచ్చారు.
సాయిబాబా భక్తురాళ్లని అలా పిలవడం నాకలవాటు.
భాభీ అంటే 'వదిన' కాబట్టి అలా పిలవడం తప్పుకాదు.
వచ్చినప్పటినించీ ఒకామె భయంభయంగా చుట్టూ చూస్తోంది.
'ఒకవేళ నాలో బాబా ఏమన్నా దర్శనమిచ్చాడేమో కొంపదీసి' అని నేనామెను చూసి భయపడ్డాను.
చూసీ చూసీ, 'ఇంత అడివిలో ఉంటున్నారు. ఇక్కడ క్రూరజంతువులేమీ ఉండవా?' అందామె భయంగా.
'నేనున్నాగా వేరే జంతువులెందుకు?' అన్నాను.
ఇంతలో రెండో ఆమె కల్పించుకుని తన విజ్ఞానప్రదర్శన చేసింది.
బాబీలకు విజ్ఞానప్రదర్శన ఎక్కువని నాకు ముందే తెలుసుకాబట్టి నేనేమీ ఆశ్చర్యపోలేదు.
'అవుండే చోటికి మనం వచ్చి ఉంటున్నాం. మనం ఉంటున్న చోటకు అవి రాలేదు' అందామె. ఈ మాటను చాలామంది అంటూనే ఉంటారు.
నేను నవ్వాను.
'అది కరెక్ట్ కాదు' అన్నాను.
'మరి?' అంటూ ప్రశ్నార్ధకంగా చూశారు బాబీలు.
'అడవులలో బోరుకొట్టి అవన్నీ సిటీలకు చేరాయి. వాటికి భయపడి మేము అడివిలోకి వచ్చి ఉంటున్నాము' అన్నాను.
నేనన్నది బాబీలకు అర్ధం కాలేదు. వాటికి కాగడాహారతి మాత్రమే అర్ధమౌతుంది. మనకేమో అది రాదు. ఏం చేస్తాం?
బాబీలు చాలామాట్లాడారు గాని బాబా విషయం ఎత్తలేదు.
బ్రతికిపోయారు.