' సాధన చెయ్యడం నావల్ల కావడం లేదు' అన్నాడు ఈ మధ్యనే ఒక శిష్యుడు.
'మంచిదే' అన్నాను.
'అదేంటి? సాధన చెయ్యకపోతే ఆధ్యాత్మికంగా ఎదిగేదెలా?' అన్నాడు తనే.
'అలా అనుకుంటే, చెయ్యి మరి' అన్నాను.
'అదే చెయ్యలేకపోతున్నాను' అన్నాడు నీరసంగా.
'చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం, చేయాలనుకున్నది చెయ్యలేకపోవడమే జీవితం' అన్నాను.
'సాధన మొదలుపెట్టగానే ఏదో ఒక అవాంతరం వస్తున్నది' అన్నాడు.
'దానికి బుద్ధి లేదు. ఈసారి అలా రావద్దని దానిని చెప్తాలే. కనీసం అదైనా నామాట వింటుందేమో చూద్దాం' అన్నాను.
'అందరూ బాగానే చేస్తున్నారు. నేనే చెయ్యలేకపోతున్నాను' అన్నాడు మళ్ళీ.
'వాళ్ళు వయసులో ఉన్నారు. నీకేమో వయసైపోయింది. నువ్వు మాత్రం ఏం చేయగలవు పాపం' అన్నాను.