అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

11, మార్చి 2026, బుధవారం

లక్ష డొనేషన్

'లక్షరూపాయలు మీకు డొనేషన్ ఇస్తున్నాను. తీసుకోండి' అన్నది ఒకామె.

వాళ్ళు అమెరికాలో ఉంటారు. రెండువారాల ట్రిప్పుమీద ఆమె ఇండియాకు వచ్చింది.

' నాకెందుకు నీ డొనేషన్?' అన్నాను.

'మీక్కాదు. సంస్థకు ఉపయోగపడుతుంది' అన్నది.

'ఇది నీ కష్టార్జితమా?' అడిగాను.

'కాదు. ఇది నా పాకెట్ మనీ. మా ఆయనిచ్చాడు. వాడుకోమని' అన్నది.

వాళ్ళాయన అమెరికాలో పెద్ద డాక్టరు.

'మీ ఆయన డబ్బులు నాకెందుకు? నేను తీసుకోను. నువ్వు సంపాదించు అప్పుడు చూద్దాం' అన్నాను.

'నాకు సంపాదించవలసిన అవసరం లేదు, మాకు ఒక చార్టర్ విమానమే ఉంది' అన్నది.

'వేరేవాళ్ళ సొమ్మును మనం దానం చెయ్యకూడదు. మనం కష్టపడి సంపాదించినది మాత్రమే దానానికి అర్హతను పొందుతుంది' అన్నాను.

'మా ఆయన వేరే ఎలా అవుతాడు?' అన్నది. 

'కర్మదృష్టిలో ఎవరి ఎకౌంట్ వారిదే' అన్నాను.

'పరవాలేదు తీసుకోండి'  అని బలవంతం చేసింది.

'ఆడపిల్ల పాకెట్ మనీని సంస్థకైనా సరే తీసుకోవడానికి నేను విరుద్ధం' అని ఖరాఖండిగా చెప్పేశాను.

'నేనిలా డొనేషన్ ఇచ్చినట్టు మా ఆయనకు తెలియదులెండి' అన్నది.

'అలా అయితే అస్సలు తీసుకోను. ఆయన ఈ డబ్బులు ఎందుకోసం నీకిచ్చాడో అందుకోసం మాత్రమే వాడాలి. వేరే పనులకు వాడకు' అన్నాను.

'నా పాకెట్ మనీ నా ఇష్టం' అన్నది.

'నీ డొనేషన్ తీసుకోవడం తీసుకోకపోవడం నా ఇష్టం' అన్నాను.

ఆమె ఈగో దెబ్బతిన్నది.

'చివరిగా అడుగుతున్నాను. తీసుకుంటారా లేదా?' అడిగింది.

'ఒకసారి చెప్పాక నా నిర్ణయంలో మార్పుండదు' అన్నాను.

'అయితే నేను మీ సంస్థలో ఇమడలేను. పోతున్నాను' అన్నది.

'ఆలస్యం చెయ్యకు' అన్నాను.

ఆమె మాయమైపోయింది.

ఎంతమంది పిచ్చోళ్ళురా దేవుడా నీ లోకంలో !