గతంలో ఒకమ్మాయి నా భావాలకు ఆకర్షితురాలై నన్ను సంప్రదించింది.
'నేను మీ సంస్థలో చేరతాను' అన్నది.
'సరే చేరు' అన్నాను.
'అయితే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి' అన్నది.
రూల్స్ పెట్టాల్సింది నేనుకదా అని నాకు డౌటొచ్చినా, తమాయించుకొని, 'చెప్పు ఏంటవి?' అన్నాను.
'మీ సంస్థ రూల్స్ ఏవీ నేను పాటించను. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. మీరేమీ అడ్డుచెప్పకూడదు' అన్నది.
'ఎందుకలా?' అడిగాను.
'నాకు మొదట్నుంచీ స్వతంత్రంగా ఉండటం అలవాటు' అన్నది.
'అంతేనా ఇంకా ఏవైనా ఉన్నాయా?' అడిగాను.
'నామీద ఎవరూ అజమాయిషీ చెయ్యకూడదు. ఇది చెయ్యి అది చెయ్యి అంటూ చెప్పకూడదు. అలా చెబితే నాకు పిచ్చికోపం వస్తుంది' అన్నది.
'ఇంకా చెప్పు' అన్నాను.
'నాకు తంత్రా నేర్చుకోవాలని ఉంది. మీకది తెలుసని మీ వ్రాతలను బట్టి అర్ధమైంది. నాకు నేర్పించాలి' అన్నది.
'దానికి కొన్ని అర్హతలుండాలి. అందరికీ అది పనికిరాదు' అన్నాను.
'నన్ను మించిన అర్హతలు ఇంకెవరికుంటాయి?' అన్నది.
'సరే చూద్దాం. ముందు నీ రూల్స్ మొత్తం చెప్పు' అన్నాను.
'నా ఇష్టం వచ్చినపుడు మా ఊరికి వెళతాను. నా ఇష్టం వచ్చినపుడు వస్తూ ఉంటాను. ఆశ్రమంలో కూడా నా టైం టేబుల్ ప్రకారం నేనుంటాను. మీ షెడ్యూల్ నేను పాటించను. నాకు కొన్ని అలవాట్లున్నాయి. ఉదాహరణకు, సరిగ్గా అర్ధరాత్రి పన్నెండుకు నేను టీ త్రాగుతాను. అప్పుడు లేచి నేను టీ పెట్టుకుంటుంటే నాకు ఎవరూ అడ్డు చెప్పకూడదు. ఇలాంటివి చాలా ఉన్నాయి' అన్నది.
'అమావాస్యకీ పౌర్ణమికీ ఒకరకంగా ప్రవర్తిస్తూ ఉంటావు. అప్పుడు కూడా మేమేమీ పట్టించుకోకూడదు. కదా?' అడిగాను.
'మీకెలా తెలుసు?' అడిగింది ఆశ్చర్యంగా.
'దీనికేదో పెద్ద నాలెడ్జి అవసరం లేదులే గాని, ఇంతేనా ఇంకా ఏవైనా ఉన్నాయా?' అడిగాను.
'ప్రస్తుతానికి ఇంతే. ఇంకా గుర్తొచ్చినపుడు ముందుముందు చెబుతాను' అన్నది.
'నీ రూల్స్ చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి' అన్నాను.
'నిజంగానా?' ఆమెకు అనుమానమొచ్చింది.
'అవును. నాకిన్ని రూల్స్ లేవు. ఒక్కటే ఉంది. దాన్ని నీవు పాటిస్తే చాలు. ఆశ్రమంలో నీకు అడ్మిషన్ రెడీ' అన్నాను.
'ఒక్కటేనా? చెప్పండి' అన్నది ఉత్సాహంగా.
'ఏమీలేదు. నాదగ్గర ఒక పంచింగ్ బ్యాగ్ ఉంది. దానిపైన పంచెస్ కిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. కొట్టీ కొట్టీ అది చినిగిపోయింది' అని ఆపాను.
ఆమె అనుమానంగా చూస్తోంది.
'దాని స్థానంలో నిన్ను వేలాడగడతాను. రోజూ ఒక గంటపాటు నా ప్రాక్టీస్ చేసుకుంటాను. ఆ తర్వాత కిందకి దించుతాను. నువ్వొప్పుకోవాలి. అంతే. వెరీ సింపుల్ ' అన్నాను.
యధావిధిగా ఆమెకూడా మాయమైపోయింది. తిరిగిచూస్తే ఒట్టు !
ఇంత సింపుల్ రూల్లో అంత నచ్చనిది ఏముందో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు !