“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, అక్టోబర్ 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 32 (గాంజెస్ రిట్రీట్)

నాలుగు రోజుల గాంజెస్ రిట్రీట్ ముగిసింది. వచ్చినవారందరూ, క్రొత్త అనుభవాలతో, క్రొత్త అవగాహనలతో, వారి జీవితాలకు క్రొత్త దిశానిర్దేశాలతో వెనక్కు బయలుదేరి వారివారి ఊర్లకు చేరుకున్నారు.

గాంజెస్ అనేది మిషిగన్ రాష్ట్రంలో అల్లెగాన్ కౌంటీలో లేక్ మిషిగన్ ఒడ్డున ఉన్న ఒక టౌన్ షిప్. అడవులు, లేక్స్ మధ్యన ఉన్న ఈ టౌన్ షిప్ జనాభా కేవలం 2500 మాత్రమే. సిటీ లైఫ్ నుండి విసిరేసినట్లుగా దూరంగా ఉండే ఈ స్లీపింగ్  టౌన్ 1847 లో మొదలైంది.

1960 లలో స్వామి భాష్యానందగారు చికాగో వేదాంత సొసైటీ ఇంచార్జ్ స్వామిగా ఉండేవారు. ఈయన తెలుగాయనని విన్నాను. చిన్నతనం నుండి వైరాగ్యభావాలతో పెరిగిన ఈయన పెళ్లిచేసుకోకుండా రామకృష్ణ మఠంలో బ్రహ్మచారిగా చేరి తరువాత సన్యాసాన్ని స్వీకరించారు. ఈయన 1964 లో న్యూయార్క్ వేదాంత సొసైటీకి వచ్చారు. 1965 లో చికాగో మఠానికి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. వివేకానంద స్వామి పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో ఉపన్యాసం ఇచ్చింది చికాగోలోనే కావడంతో రామకృష్ణ సాంప్రదాయంలో చికాగో సిటీకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడినుంచే వివేకానందస్వామికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. స్వామి భాష్యానంద గారి నాయకత్వంలో చికాగో రామకృష్ణమఠం (ఇక్కడ వీటిని వేదాంత సొసైటీ అంటారు) ఎంతో అభివృద్ధి చెందింది.

1969 లో గాంజెస్ లో 100 ఎకరాల స్థలాన్ని కొని, వివేకానంద రిట్రీట్ సెంటర్ గా దానిని అభివృద్ధి చేయడం మొదలుపెట్టారాయన. 1971 లో ఈ రిట్రీట్ సెంటర్ మొదలయింది. అప్పటినుంచీ 1996 లో చికాగోలో ఆయన చనిపోయేవరకూ, గాంజెస్ రిట్రీట్ సెంటర్ ఎన్నో మైలురాళ్లను చూసింది.

సాక్షాత్తు శ్రీ శారదామాత వద్ద మంత్రదీక్ష తీసుకున్న స్వామి అశేషానందగారు, స్వామి రంగనాధానందగారు, ఇంకా ఎందరో పెద్దస్వామీజీలు గాంజెస్ లో జరిగిన రిట్రీట్స్ కి వచ్చారు. అమెరికా నాలుగు మూలలనుండి ఇక్కడకు వచ్చిన అనేకమంది హిందూ కుటుంబాలు, వారి పిల్లలు, భాష్యానంద గారి ప్రభావంతో భారతీయ యోగ, వేదాంత తత్వాలను అర్ధం చేసుకుని, ఉన్నతమైన జీవన విధానాలను అందుకున్నారు. పాత తరాలలోని ఎన్నో NRI కుటుంబాలు ఈ విధంగా ధార్మిక జీవనాన్ని, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని అందుకున్నాయి. 

అలాంటి గాంజెస్ రిట్రీట్ సెంటర్ లో అక్టోబర్ 6 నుండి 9 వరకూ మేమున్నాం. 5 లేదా 6  డిగ్రీల సెంటీగ్రేడ్ చలి అక్కడుంది. రాత్రిపూట 3 డిగ్రీలకు కూడా పోయినట్లుంది.  సింపుల్ లివింగ్, యోగాభ్యాసం, ధ్యానం, చర్చలు, సందేహాలు సమాధానాలు, అడవిలో ట్రెయిల్ వాక్స్ కు వెళ్లడం, ఇక్కడున్న పెద్ద లైబ్రరీలో దొరికిన కొన్ని అరుదైన గ్రంధాలను అధ్యయనం చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం, ఇక్కడి అమెరికన్స్ తో మాట్లాడటం. మొదలైన టైం టేబుల్ తో  ఈ నాలుగు రోజులూ గడిచాయి.

ఈ నాలుగు రోజులూ ఈ నూరెకరాల అడవి మధ్యలో మేము కొద్దిమందిమే ఉన్నాం. అంత పెద్ద సెంటర్ని కూడా హరిదాస్ అనే ఒకే ఒక్క అమెరికన్ చూసుకుంటున్నాడు. అతను బ్రహ్మచారి, ఒక్కడే ఉంటూ ఉంటాడు. సెంటర్ మొత్తం మీద ఒక డజను ఇళ్లుంటాయి. అవి కూడా విసిరేసినట్లుగా అడవిలో అక్కడక్కడా ఉంటాయి. వాటికి తాళాలు ఉండవు. ఎవరూ ఉండరు. హరిదాస్ కూడా ఆ అడవిలో ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదు. సెల్ ఫోన్ లో దొరక్కపోతే అక్కడ అతన్ని పట్టుకోవడం అసాధ్యం. ఆ అడవిలో అతను తిరుగుతూ, రోజుకొక ఇంట్లో ఉంటూ ఉంటాడు. చాలా విచిత్రమైన ప్రదేశం ఇది.

ఈ రిట్రీట్ కు వచ్చిన పంచవటి USA సభ్యులకు, ఉన్నత ప్రాణసాధనలు, ఉన్నత యోగక్రియలు నేర్పించాను, ధారణ, ధ్యాన, సమాధులలో శిక్షణ ఇచ్చాను. ఉన్నత స్థాయికి చెందిన దీక్షలిచ్చాను. నా సాధనామార్గాన్ని కూలంకషంగా పరిచయం చేశాను. ఈ నాలుగు రోజులలో ఈ రిట్రీట్లో ఏర్పడిన బలమైన యోగతరంగాల వల్ల వారికి అనేక అనుభవాలు కలిగాయి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో వారికి డైరెక్ట్ గా అర్ధమైంది. నా సాధనా మార్గాన్ని పూర్తిగా అర్ధం చేసుకోగలిగారు. 

జీవితాలకు ఔన్నత్యాన్ని, ధన్యత్వాన్ని సంతరించుకుని, నాలుగు రోజుల సాధనా సమ్మేళనం తర్వాత అందరూ వెనుకకు బయలుదేరి, అమెరికాలో ఎవరి రాష్ట్రాలకు వారు చేరుకున్నారు.

ఈ విధంగా అమెరికా మారుమూల అడవీప్రాంతపు చలివాతావరణంలో మా నాలుగు రోజుల సాధనాసమ్మేళనం విజయవంతంగా ముగిసింది.