“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, అక్టోబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 37 (బాలామంత్రానికి అర్ధమడిగిన అమెరికన్)


తను వ్రాసిన కవితలను చూపిస్తూ గ్రెగరీ


ఆరుబయట కుర్చీలో కూచుని ట్రీ కటింగ్ పనిలో ఉన్న గ్రెగరీని మాతో భోజనం చెయ్యమని ఆహ్వానించాను


శ్రీనివాస్, గ్రెగరీలు, డైనింగ్ హాల్లో

మదర్స్ ట్రస్ట్ నుండి వెనక్కు వచ్చి కొద్దిసేపు లైబ్రరీలో కూర్చున్నాను.

రిట్రీట్ హోమ్ బయట ఉన్న పెద్ద ఆవరణలో చాలా చెట్లున్నాయి. అదంతా అడవి అయితే, కొన్ని చెట్లను కొట్టేసి ఇళ్ళు కట్టారు. మిగతా చెట్లను అలాగే ఉంచేశారు. వాటిలో కొన్ని విల్లో ట్రీస్ ఉన్నాయి. వాటిని వీపింగ్ విల్లోస్ అంటారు. రాత్రిళ్ళు చూస్తే, జడలు విరబోసుకున్న భూతాలలాగా ఉంటాయి. అందులో కొన్నింటిని కొట్టెయ్యమని పురమాయించారు లాగుంది, ఒక అమెరికన్ ఆ పనిమీదున్నాడు. ఒక వ్యాన్ లో టూల్స్ తెచ్చుకుని ఒక్కడే ఆ పనంతా చేస్తున్నాడు. 

ఇండియాలో అయితే పాతికమంది ఈ పనిని చేసేవాళ్ళు. లేదా చేస్తున్నట్టు నటించేవాళ్ళు. ముచ్చట్లు చెప్పుకుంటూ, టీలు తాగుతూ, అటూఇటూ తిరుగుతూ, రోజుకొక గంట మాత్రం పనిచేసి, డబ్బులు మాత్రం బాగా లాగుతారు. ఇక్కడ అలా లేదు. ఇక్కడ పనంటే పనే. చాలా నిక్కచ్చిగా చేస్తారు. అదీ గాక, ఆటోమేషన్ వల్ల, ఇరవై మంది చేసే పనిని ఒక్కడే చేస్తాడు. లేబర్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు మెకనైజేషన్ వస్తుంది తప్పదు మరి.

ఈలోపల లంచ్ రెడీ అయింది. మా బృందంలోని శిష్యురాళ్లందరూ కలసి వంట చేసేశారు. ఆ అమెరికన్ ని కూడా లంచ్ కి పిలిచాము. లేకపోతే అక్కడేమీ లేదు. మళ్ళీ ఊళ్ళోకెక్కడికో పోయి తిని రావాలి.

ఇంత మారుమూల కూడా మనకొక అతిధి లభించాడని శ్రీనివాస్ ఎంతో సంతోషపడ్డాడు.

అతని పేరు గ్రెగరీ ట్రాయ్. మాతో చాలా త్వరగా కలిసిపోయాడు. గ్రాండ్ రాపిడ్స్ లో ఉంటానని అన్నాడు. తనకు 64 ఏళ్ళని చెప్పాడు. కానీ 35 ఏళ్ల యువకునిలో ఉండే చురుకుదనం ఉంది. అంతచలిలో కూడా రోజంతా కష్టపడి ఆరుబయట పనిచేస్తూనే ఉన్నాడు. మధ్యమధ్యలో ఆరుబయట వేసుకున్న కుర్చీలో కూర్చుని సిగరెట్ త్రాగుతూ, చెట్లతో మాట్లాడుతూ ఉంటాడు. మనకు తోడుబోయిన ఇంకొక పిచ్చివాడు దొరికాడని అనిపించింది.

లంచ్ సమయంలో తన గురించి చెప్పుకొచ్చాడు.

ఈ ఆశ్రమం పెట్టిన దగ్గరనుంచీ 1996 లో భాష్యానందగారు చనిపోయేవరకూ గ్రెగరీ ఇక్కడే ఉన్నాడు.  ఈ హోమ్, లైబ్రరీ, ఇతర ఇళ్ళు ఇవన్నీ కట్టడంలో ఇతని పాత్ర కూడా ఉంది. భాష్యానందగారు చనిపోయాక, వీరిలో విభేదాలు వచ్చాయి. కొంతమంది విడిపోయి మదర్స్ ట్రస్ట్ పెట్టుకున్నారు. తరువాత ఇక్కడనుండి వెళ్ళిపోయాడు. ఆరోజులు స్వర్ణయుగమని మాతో అన్నాడు.

ఈ హోమ్, ఇక్కడున్న పదికి పైగా ఇళ్లన్నీ బాబా, స్వామి తపసానంద, ఇంకొక అమెరికన్ స్వామి ముగ్గురే కట్టారని చెప్పాడు.  ఆ అమెరికన్ స్వామికి ఇళ్ల కట్టుబడి,  ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అన్నీ వచ్చట. ఈ ముగ్గురే ఈ అడవిలో ఉంటూ కొన్నేళ్లపాటు ఇవన్నీ కట్టారని అన్నాడు. లైబ్రరీని డోమ్ లాగా కడుతుండగా, పైనుంచి అమెరికన్ స్వామి జారి క్రింద పడిపోయాడట. నిలువుగా కాళ్ళమీద పడటంతో, అతని రెండు పాదాలు గిలకల దగ్గర పగిలిపోయాయి. అలాగే నేలమీద పడిఉండి, మూలుగుతూ, కొన్ని గంటలున్నాడట. దగ్గరలో ఎవరూ లేరు. ఉన్నవాళ్లు కూడా ఆ అడవిలో ఎక్కడెక్కడో వాళ్ళ పనులలో ఉన్నారు. అరిచినా కూడా ఎవరికీ వినపడదు. ఎప్పుడో ఆ తర్వాత మిగతా వాళ్లొచ్చి చూసి, అతన్ని ఆస్పత్రిలో చేర్చారట. చాలా ఏళ్లపాటు నడవలేకపోయాడట. ఆ తరువాత కూడా వీల్ చైర్ లో కూచుని పనులను పర్యవేక్షిస్తూ ఉన్నాడట. విభేదాలొచ్చాక, వెళ్ళిపోయి, టెక్సాస్ ప్రాంతాలలో ఎక్కడో ఉండి చనిపోయాడని గ్రెగరీ అన్నాడు. ఈ సెంటర్ వెనుక ఎంతోమంది నిస్వార్ధంగా చేసిన 20 ఏళ్ల శ్రమ ఉంది. ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. ఈ విషయాలు కొత్తవాళ్లకు తెలియవు.

ఇక్కడ దగ్గరలో ఒక మెంటల్ ఆస్పత్రి ఉండేదట. ఫండ్స్ లేవని దానిని మూసేస్తే, ఆ అమెరికన్  పిచ్చివాళ్లందరినీ ఆదరించిన భాష్యానంద గారు, ఇక్కడి ఆపిల్, పియర్స్ తోటలో వారిని పనివాళ్లుగా పెట్టుకుని  ఇదే రిట్రీట్ హోమ్ లో వారిని ఉంచి, భోజనం పెట్టి, ఆదరించారట. సీజన్లో ఆపిల్, పియర్స్ పండ్లను కోయడం వాళ్ళ పని. బేబీ ఫుడ్ తయారుచేసే ఒక ప్రముఖ కంపెనీ వీరి తోటలోని పండన్నీ కొనేదట. భాష్యానందగారు ఇక్కడ చేసిన నిస్వార్ధ సేవ ఎంతో ఉంది. శ్రీ రామకృష్ణుల సేవలో తన జీవితాన్ని త్యాగం చేసిన పునీతుడు స్వామి భాష్యానంద గారు.

పండ్లను కోయడానికి నిచ్చెన వేసుకుని ఆపిల్ చెట్టుపైకి ఎక్కాలి. ఆ నిచ్చెన నేలమీద వెడల్పుగా ఉండి, పైకి పోయేకొద్దీ కోసుగా ఉంటుంది. ఆలాగైతేనే చెట్ల కొమ్మల మధ్యలోకి పోవడానికి వీలౌతుంది. నిచ్చెన చివరకేక్కేసరికి బేలెన్స్ ఉండటం లేదని, క్రిందపడతామేమోనని భయమేస్తోందని వాళ్లంతా భాష్యానంద గారికి చెబితే, 'ఓం నమశ్శివాయ, శివాయనమః ఓం' అని జపం చేస్తూ నిచ్చెనెక్కండి. ఏమీ కాదని వారికి చెప్పిన భాష్యానందగారు  ఆ అమెరికన్స్ చేత పంచాక్షరీజపం చేయించేవారట. వాళ్ళు అలాగే చేసేవారట. కానీ, నేలపైన ఉన్నపుడు ధాటిగా ఛాంటింగ్ చేసినవాళ్లు, చెట్టు చిటారుకొమ్మ దగ్గర మాత్రం వణుకుతున్న గొంతుతో జపం చేసేవారని యాక్టింగ్ చేసి మరీ నవ్వుతూ చూపించాడు గ్రెగరీ.

స్విట్జర్ ల్యాండ్ లో స్వామి ఓంకారానందగారి ఆశ్రమంలో కొన్నేళ్లపాటు  తానున్నానని, ఆయన తన గురువని గ్రెగరీ అన్నాడు. ఓంకారానందగారు, డివైన్ లైఫ్ సొసైటీ శివానంద గారి పరంపరలోని స్వామి. వాళ్ళది కూడా చాలా స్వచ్ఛమైన యోగవేదాంత పరంపర. అక్కడే తను చాలా శ్లోకాలు నేర్చుకున్నానని చెబుతూ, 'త్రయంబకం యజామహే' అనే మంత్రాన్ని  చదివి వినిపించాడు. ఆశ్చర్యమేసింది.

భోజనం అయిన తర్వాత, 'మీరు నాకొక్క సాయం చేయాలి' అని అడిగాడు.

'ఏంటది?' అన్నాను.

'ఈ మంత్రానికి అర్థమేంటి?' అంటూ, బాలా మహామంత్రాన్ని అమెరికన్ యాసలో పైకి గట్టిగా ఉచ్చరించాడతను. నాకు మళ్ళీ ఆశ్చర్యమేసింది.

బాలామంత్రాన్ని నేను చిన్నతనంలో ఎన్నో ఏళ్లపాటు ఉపాసన చేశాను. అందుకే ఇతనిప్పుడు ఈ విధంగా వచ్చి కలిశాడని అర్ధమైంది.

'మీ గురువుగారు చెప్పలేదా?' అడిగాను.

'లేదు. ఉపదేశం మాత్రం ఇచ్చారు. ఇదేంటో కూడా నాకు తెలియదు. కానీ, నేను ఏం చేస్తున్నా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉంటాను.  ట్రక్కు తోలుతున్నా, చెట్లు కటింగ్ చేస్తున్నా, ఏ పనిచేస్తున్నా ఈ మంత్రం నాలోలోపల నడుస్తూనే ఉంటుంది. కానీ నాకు దీని అర్ధం తెలియదు. ఇన్నేళ్ళుగా ఎవరినీ అడగలేదు కూడా. మిమ్మల్ని చూస్తే అడగాలనిపించింది. కెన్ యు ప్లీస్ ఎక్స్ప్లెయిన్ మి ఎబౌట్ దిస్ మంత్ర?' అన్నాడు.

చాలా సంతోషం కలిగింది. అమెరికా మారుమూల కంట్రీసైడ్ లో, ఒక అమెరికన్ నుండి ఈ ప్రశ్న రావడం చూచి జగన్మాత లీలకు చాలా ఆశ్చర్యపడ్డాను. దారీతెన్నూ లేకుండా పోతున్న మన ఇండియా యువతకూ, ఇలాంటి అమెరికన్స్ కూ ఎంత తేడా ఉందో కదా అనిపించింది.

అది బాలామహామంత్రమని, శ్రీవిద్యలో చాలా ముఖ్యమైన మంత్రమని అతనికి వివరించి, అక్కడికక్కడే ఆ బీజాక్షరాల అర్ధాలను అతనికి వివరించి చెప్పాను.

బాల అంటే జగన్మాత యొక్క చిన్నపిల్ల రూపమని, ఈ మంత్రంలో సిద్ధి పొందినవారు ఇండియాలో లక్షలాది మంది ఉన్నారని చెప్పాను. ఈ మంత్రసాధన చాలా సులభమని, అదే సమయంలో ఎన్నో అద్భుతమైన వరాలనిస్తుందని వివరించాను.

బీజాక్షరాల వివరణను అతను ఎంతో శ్రద్దగా వినడం చూచి మళ్ళీ నాకు చాలా ఆనందం కలిగింది. ఎన్నో ఏళ్ళక్రితం ఓంకారానంద స్వామి దగ్గర ఇతను తీసుకున్న దీక్ష నేటికి ఈ విధంగా పరిపూర్ణమైంది.

'ఈ మంత్రాన్ని వదలకు. ఇది నీదగ్గరున్నంతసేపూ జగజ్జనని నీ వెంటే ఉంటుంది. నిన్ను రక్షిస్తూ ఉంటుంది' అని చెప్పాను.

'ఆ విషయం నాకు చాలాసార్లు అనుభవమైంది. మొన్నటికి మొన్న, ఒక చెట్టును నరుకుతున్నాను.  చివరకొచ్చేసరికి ఒక పెద్ద గాలి వీచింది. ఆ చెట్టు విరిగి అవతలవైపు పడింది.  లేకపోతే అది నాపైన పడి ఉండేది. డివైన్ మదర్ నన్ను ఎప్పుడూ రక్షిస్తూనే ఉందని నాకు తెలుసు. ఇలాంటి ఎన్నో అనుభవాలు నాకున్నాయి' అన్నాడతను.

ఒక క్రిస్టియన్ నోట ఇలాంటి మాటలు విని ఎంతో ఆనందించాను.

అతనింకా ఇలా అన్నాడు.

'ఇక్కడున్న రోజులలో, భాష్యానంద గారు 'సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే' అనే శ్లోకాలను  ఎంతో రాగయుక్తంగా పాడేవారు. ఆ ట్యూన్ నాకెంతో ఇష్టం. ఆయన పాడిన పాట మీదగ్గర ఆడియో ఫైల్ ఉందా?' అన్నాడు.

'లేదు. మేమాయనను చూడలేదు. వినలేదు' అని చెప్పాము.

అతను కొంచం నిరాశగా ముఖం పెట్టాడు. 1980 నుండి 1996 వరకూ అక్కడ జరిగిన స్వర్ణయుగాన్ని అతను మరచిపోలేకపోతున్నాడని అర్ధమైంది.

'చాలా మంచిది. గుడ్ నైట్. మళ్ళీ రేప్పొద్దున కలుద్దాం' అని సెలవు తీసుకున్నాను.