“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, అక్టోబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 42 (నాకు పెళ్లి చేసుకోవాలనుంది)


కాసేపు మళ్ళీ గాంజెస్ కు వెళదాం. ఎందుకంటే, అక్కడి కధ ఇంకా పూర్తవలేదు మరి !

గాంజెస్ లో ఉండగా గ్రెగరీ మాతో చాలా క్లోజయ్యాడని చెప్పాను కదా. తన కుటుంబ విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. 35 ఏళ్ల క్రితం తనకు పెళ్లయిందని, అయితే, రెండేళ్లకు విడిపోయామని అన్నాడు. ప్రస్తుతం తనకు 34 ఏళ్ల కొడుకున్నాడని, అతను కెనడాలో ఫైర్ ఫైటరని చెప్పాడు.

నేనేమీ వివరాలు అడగలేదు. ఎందుకంటే, ఇతరుల పర్సనల్ విషయాలను అడగడం నాకెప్పుడూ అలవాటు లేదు. అలా అడిగేవాళ్ళంటే నాకు అసహ్యం కూడా.

ఒకరోజున మాటల సందర్భంలో,' ప్రస్తుతం నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుంది' అన్నాడు గ్రెగరీ సీరియస్ గా.

కొరబోయింది నాకు.

వెంటనే NTR గుర్తొచ్చాడు. రెండోపెళ్లి తర్వాత ఆయన జీవితం ఏమైందో అంతా చూశాం గనుక, 'ఈ వయసులో ఇదేం పొయ్యేకాలం?' అన్నమాట నా నోటిదాకా వచ్చి ఆగిపోయింది.

'నీ వయసు 63 అని అన్నావు కదూ' అన్నాను.

'ఎస్' అన్నాడు, 'సో వాట్?' అన్నట్టు.

నేనేమీ మాట్లాడకపోవడం చూసి, 'అయితే నేను కోరుకునే అమ్మాయి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పర్ఫెక్ట్ గా ఉండాలి' అన్నాడు.

'అలా అయితే, నీకీ జన్మకి పెళ్లి కాదు' అందామని మళ్ళీ నోటిదాకా వచ్చింది. మన తెలుగు అతనికి  అర్ధం కాదుకదా. మళ్ళీ మింగేశాను. ఇంగ్లీషులో అదే మాటను చెబుదామన్న కోరికను కూడా  బలవంతాన అణిచేసి, నవ్వుతూ, 'ఓరి పిచ్చోడా?' అన్నట్టు అతన్ని చూస్తున్నాను.

'డివైన్ మదర్ కి నా  కోరికను చెబుతూ ప్రేయర్ చేశాను' అన్నాడు గ్రెగరీ.

'ఎనీ రిప్లై ఫ్రమ్ హర్?' అన్నాను సీరియస్ గా.

'చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ నాకు నచ్చడం లేదు. నేను ముఖ్యంగా నసని, ఎమోషనల్ గోలని భరించలేను. అవి చెయ్యని అమ్మాయి నాకు కావాలి' అన్నాడు.

'ఈ రెండూ చెయ్యని అమ్మాయంటూ ఈ భూమ్మీద అసలుంటుందా?' అని ఆలోచనలో పడ్డాను.

'ఏంటి ఆలోచిస్తున్నారు?' అన్నాడు కనిపెట్టి.

'అబ్బే ఏంలేదు. 'నీ కోరిక సఫలమగుగాక' అని డివైన్ మదర్ని నేనూ ప్రార్ధిస్తాను' అన్నాను నవ్వుతూ.

నా ప్రక్కనే ఉన్న ఆనంద్ వైపు చూస్తే, 'వెరీ బ్యాడ్ ఐడియా' అన్నాడు నాకొక్కడికే వినపడేటట్టు చిన్నగా.

'ఏంటి నాదా? వాడిదా?' అన్నాను.

'వాడిదే. 63 వచ్చినా వీడికి బుద్ధి రాలేదని అర్థమౌతోంది. జీవితంలో వీడేమీ నేర్చుకోలేదు. అందుకే మళ్ళీ పెళ్లంటున్నాడు' అన్నాడు ఆనంద్.

మా మాటలని ఖండిస్తూ, 'నేను AA సభ్యుడిని, ఆల్కహాలిక్స్ ఎనానిమస్' లో గత పదిహేనేళ్ల నుంచీ సభ్యుడిగా ఉన్నాను' అన్నాడు గ్రెగరీ.

'నేను ఐక్యరాజ్యసమితిలో మెంబర్ని' అన్నంత గర్వంగా చెప్పాడామాట.

'మంచిదే. మేము DA సభ్యులం. అంటే, డ్రగ్గహాలిక్స్ ఎనానిమస్' అన్నమాట' అన్నాను మళ్ళీ సీరియస్ గా.

'అదేంటి?' అడిగాడు అనుమానంగా.

'అవును. మేము ధ్యానంలో కూచునేముందు కొంచం ఇండియన్ మారిజువానా తీసుకుంటాం.  మేమే కాదు, హిమాలయాలలో సాధువులు చాలామంది తీసుకుంటారు' అన్నాను సాధ్యమైనంత నార్మల్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ.

నా మాటను పట్టించుకోకుండా, 'నేనే కాదు. మా నాన్న కూడా ఇందులో మెంబరే' అన్నాడు నవ్వుతూ.

'అబ్బో గొప్ప వంశమే' అని మనసులో అనుకుంటూ, 'ఎందుకు దానికి బానిసవయ్యావు?'అడిగాను.

'భాష్యానంద గారు చనిపోయాక, మేమందరం ఈ ప్రదేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాము. దీనిని వదలడం మాకు చాలా నరకమైపోయింది. అందుకే త్రాగుడుకు బానిసనయ్యాను. కానీ ప్రస్తుతం వదిలేశాను' అన్నాడు. 

'మళ్ళీ పెళ్లి కంటే తాగుడే మేలేమో?' అనిపించింది నాకు. మళ్ళీ మింగేశాను. మనమాట ఎవరు వింటారు గనుక?

ఉన్నట్టుండి, 'మీకు పెళ్లయిందా?' అనడిగాడు నన్ను.

ఒక్కక్షణం కొరబోయింది నాకు. 'ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నానా?' అని ఒకవైపు ఆనందం వేసినా, ప్రక్కనే శ్రీమతి ఉందని గుర్తొచ్చి తనవైపు భయంగా చూశాను. ఆమె కోపంగా చూస్తోంది, ఏం చెబుతానా? అని.

'లేదు కాలేదు. కావాలంటే ఆమెనడగండి' అందామనుకున్నా.

తరువాతేమౌతుందో ఆలోచించుకుంటే భయమేసి, 'అయింది. నాకూ 32 ఏళ్ల క్రితమే అయింది. అప్పటినుంచీ ఈమొక్కతే  నా భార్య' అన్నాను.

'ఎందుకు నీ బతుకు?' అన్నట్టు ఒక చూపు చూశాడు గ్రెగరీ నా వైపు.

'మేము ఇండియన్స్ మి. మాలో ఇలాగే ఉంటుంది' అని భారతీయ వివాహవ్యవస్థ మీద ఒక లెక్చరిద్దామని బలంగా అనిపించింది గాని, ప్రస్తుతం ఇండియా ఎలా ఉందో వాళ్లకూ తెలుసు గనుక, మళ్ళీ అతను ఏవైనా ప్రశ్నలేస్తే, నేనెక్కడ దూకాలో అర్ధంకాక, ఆ గోలంతా ఎందుకని మళ్ళీ మాటల్ని మింగేశా.

'మరొక్క సాయం నాకు చెయ్యగలరా?' అడిగాడు.

'పెళ్లిసంబంధాలు వెదకమని అంటాడేమోరా భగవంతుడా? ఈ అమెరికాలో నేనెక్కడ వెదకాలి?' అని తెగ భయమేసింది. భయాన్ని కనిపించనివ్వకుండా నొక్కేసి, 'ఆబ్బె దాందేముంది? చెప్పండి. నేను పుట్టిందే లోకాన్ని ఉద్ధరించడానికి కదా' అన్నా నవ్వుతూ.

'ఏం లేదు. 'శ్రీ మండల' గురించి నాకు చెప్పగలరా?' అడిగాడు.

జీరో డిగ్రీల వాతావరణంల్లో కూడా వడదెబ్బ కొట్టినట్లయింది నాకు.

'యూ మీన్ శ్రీయంత్ర ఆర్ శ్రీచక్ర?' అన్నాను.

'యా' అన్నాడు.

'ఎందుకడుగుతున్నారో నేను తెలుసుకోవచ్చా?' అడిగాను.

'మా గురువుగారైన ఓంకారానందస్వామి నాతో ఇలా అన్నారు, 'శ్రీమండల అనేది అనేక త్రికోణాల సంక్లిష్టమైన స్వరూపం. ఇందులో ప్రతి త్రికోణానికి ఒక మంత్రము, ఒక దేవత ఉంటాయి.  ఆ త్రికోణాలన్నీ శక్తులు' అన్నారు, ఇది నిజమేనా?' అడిగాడు.

'నిజమే. అంతేకాదు. అది విశ్వానికి, మానవదేహానికి ఒక చిన్న నమూనా లాంటిది. అందులోని ప్రతి త్రిభుజానికి ఒక అర్ధం ఉంది. ఆ త్రిభుజాలన్నీ ఒకదానినొకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి.  శ్రీమండలాన్ని అవి పరిపుష్టం చేస్తాయి. తంత్రశాస్త్రంలో అది అత్యుత్తమమైన సాధన' అన్నాను.

'శ్రీ మండలాన్ని గీయాలని నేనెంతో ప్రయత్నించాను. కానీ కొలతలు కుదరడం లేదు. మీరు చెప్పగలరా?' అడిగాడు.

'చెప్పగలను. కరెక్ట్ కొలతలతో గీయకపోతే అది రాదు. అయినా మీకెందుకా కొలతలు?' అడిగాను.

'శ్రీ మండలాన్ని ఒక 3-D హోలోగ్రాం గా చెయ్యాలని నా జీవితాశయం. అది నెరవేరిన రోజున నేను ఆనందంతో డాన్స్ చేస్తాను. నేనేమీ పెద్దగా చదువుకోలేదు. కానీ ఇదుగో చూడండి ఎన్నో డిజైన్స్ గీశాను' అంటూ ఒక ఫైల్లోంచి కాగితాలను చూపించాడతను.

పదేళ్ళక్రితమే 250 డాలర్స్ పెట్టి, లండన్ నుంచి ఒక 2-D హోలోగ్రాం మిషన్ని కొన్నాను. చూడండి అంటూ, సూట్ కేసులోనుంచి ఒక చిన్న పరికరాన్ని బయటకు తీశాడతను. అది చిన్న  భూచక్రం లాగా ఉంది. దానికి నాలుగు తాళ్లలాంటి రెక్కలున్నాయి. కరెంట్ కి ప్లగ్ చేస్తే, అది గిర్రున తిరుగుతూ ఒక గుండ్రటి తెరను సృష్టించింది. దానిపైన ఒక వీడియో కనిపించడం మొదలైంది. దానిని గోడపైకి ప్రాజెక్ట్ చేసి ఒక సినిమాలాగా చూడవచ్చని అన్నాడు.

'ఇప్పుడు టెక్నాలజీ ఇంకా పెరిగింది. 3-D హోలోగ్రాం సృష్టించడం ఇప్పుడు పిల్లలాట' అన్నాను.

'అవును. శ్రీమండల తో ఒక 3-D హోలోగ్రాం చెయ్యడమే నా జీవితాశయం, నాకు చదువు లేకపోవచ్చు. కానీ  నేను దీనిని చేసిన రోజున, పెద్ద పెద్ద సయింటిస్ట్ లు కూడా 'ఓహో' అంటూ తలలు ఆడిస్తారు. అలా చేస్తాను' అన్నాడు.

'మంచిదే. ఆ కొలతలు మా ఆనంద్ ఇస్తారు మీకు' అన్నాను.

వింటర్లో ఇక్కడి చలి భరించడం కష్టమని, అందుకని హవాయ్  ఐలాండ్స్ కి వెళ్లి, అక్కడుండి, తర్వాత మళ్లీ గ్రాండ్ రాపిడ్స్ కి వస్తానని గ్రెగరీ అన్నాడు. అలా అతని ఎపిసోడ్ ముగిసింది.

బయలుదరబోయే ముందు, మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అతను వేరే ఇంట్లో ఉన్నాడని అక్కడివాళ్లు చెప్పారు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. తిరుగు ప్రయాణం సగంలో ఉండగా తను ఫోన్ చేశాడు.  మేము వెనక్కు వెళ్ళిపోతున్నామని చెబితే నొచ్చుకున్నాడు. 'నా ఫామ్ చూపించేవాడిని కదా?' అని బాధపడ్డాడు.

'బాధపడకు, ఇండియా వెళ్ళేలోపు మళ్ళీ వస్తాం. అప్పుడు నీ ఫామ్ చూస్తాం' అని అతనికి చెప్పాను.

అలా మూడురోజులపాటు సరదాగా కాలక్షేపం చేసి గాంజెస్ నుండి తిరుగుప్రయాణమయ్యాం. సరదాతో బాటు, ఆద్యాత్మికం కూడా కలసి మెలసి ఉంటూనే వచ్చింది.  ఆ సంగతి ముందే చెప్పాను కదా !

ఆ విధంగా గాంజెస్ రిట్రీట్ ముగిసింది.

ఈసారి మళ్ళీ ఇక్కడకంటూ వస్తే గిస్తే, గ్రెగరీ పెళ్ళికి రావాలనుంది. ఏమౌతుందో మరి? అతని కోరికా నా కోరికా తీరుతాయో లేవో చూడాలి !