“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, ఆగస్టు 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 11 ( అడగకుండానే అమ్మ ఇచ్చిన వరాలు)





'నువ్వు అడిగితే అడిగినదే ఇస్తాను. అడగకపోతే, నీకు అవసరమైనది ఇస్తాను' అన్నది జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కులలో ఒకటి. ఈ సత్యం ఎన్నోసార్లు నా జీవితంలో రుజువౌతూ వచ్చింది. ఎవరి జీవితంలోనైనా ఇంతే. కాకపోతే దానిని గుర్తించే ఓపికా నిలకడా చాలామందిలో ఉండవు అంతే !

అయిదేళ్ల తర్వాత, మొన్న శనివారం నాడు, పరాశక్తి అమ్మవారి ఆలయానికి వచ్చాను. అమ్మవారి నూతన విగ్రహం, కుంభాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయమంతా కోలాహలంగా ఉంది. ఎవరి పనుల్లో, ఏర్పాట్లలో వారున్నారు.

ఈ కార్యక్రమం కోసం ఇండియా నుండి పెద్ద పెద్ద పూజారులు వచ్చి ఉన్నారు. చిదంబరం ఆలయ ప్రధాన పూజారి తంగ భట్టర్ అని 93 ఏళ్ల వృద్ధుడు. ఆయనొచ్చాడు. ఇండియాలో గతంలో జరిగిన ఒకానొక విమాన ప్రమాదంలో దాదాపు 75 మంది చనిపోయారు. 15 మంది మాత్రమే ఏమీ కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఈయనొకరు. అదే విధంగా, మధుర మీనాక్షి ఆలయ ప్రధానపూజారి ఇంకొకరు. ఆయన కూడా ఈ తంతులలో పాల్గొంటున్నారు. అటువంటి ఘనాపాఠీ లందరూ ఇక్కడ ఉన్నారు. 

మేమక్కడ మౌనంగా ఒక మూలకు కూర్చుని ఉన్నాం. దిలీప్ గారని ఒకాయన ఆటుపోతూ మమ్మల్ని చూచి ఆగాడు. ఆయన ఆలయ కమిటీలో ఒకరు. నన్ను గుర్తుపట్టి, 'మీరు అయిదేళ్ల క్రితం ఇక్కడ ఉపన్యాసం ఇచ్చారు. అప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడిగాను. మీరు జవాబులిచ్చారు. గుర్తుందా?' అన్నాడు.

నాకు లీలగా గుర్తుంది. అవునన్నట్లు తలాడించాను.

'ఇటు రండి' అంటూ నన్ను సరాసరి గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసికెళ్ళాడు. ఆదిపరాశక్తి, వారాహి, రాజమాతంగి, భువనేశ్వరీ అమ్మవార్ల విగ్రహాలకు,గణపతి, కుమారస్వాముల విగ్రహాలకు నూనె పట్టించి ఉంచారు. రేపు ఆదివారం నాడు వాటికి యాగశాలలో ఉంచిన కలశాల పవిత్రజలంతో అభిషేకం చేసి వాటిని శుభ్రం చేసి ప్రాణప్రతిష్ట చేస్తారు. నాకు, శ్రీమతికి చేతులలో నూనె పోసి, విగ్రహాలకు వ్రాయమని చెప్పారు. ఆ కార్యక్రమం అయిపోయిందని, ప్రస్తుతం ఎవరినీ విగ్రహాలను తాకనివ్వడం లేదని అక్కడివారన్నారు.  దిలీప్ గారు వినిపించుకోకుండా మా చేతులలో నూనె పోయించి అమ్మవార్ల విగ్రహాలకు పూయించారు

నేను పంచెకట్టుకుని సాంప్రదాయ దుస్తులలో లేను. టీ షర్టు, పాంటు వేసుకుని మామూలు భక్తునిగా వెళ్ళాను.సామాన్యంగా ఆ వేషంలో ఉన్న వ్యక్తిని గర్భగుడిలోని విగ్రహాలను తాకనివ్వరు. కానీ గర్భగుడిలోకి తీసుకెళ్లి మరీ నా చేత  ఈ పనిని చేయించారు.

అమ్మ ఇచ్చిన ఊహించని అనుగ్రహాలలో ఇదొకటి.

అదలా ఉంటే, నిన్న ఆదివారం అసలైన కార్యక్రమం. కుంభాభిషేకం, విగ్రహాలకు ప్రాణప్రతిష్ట. నిన్నకూడా ఆలయానికి వెళ్ళాము. నూట ఎనిమిది కలశాలతో అమ్మవార్ల విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నారు.  ఒక కలశాన్ని నాకూ ఇచ్చి యాగశాలనుండి ఆలయానికి తీసుకెళ్లమని, నా పేరుమీద కూడా ఒక కలశాన్ని ముందే ఏర్పాటు చేశామని ఆనంద్ చెప్పారు. ఆ విధంగా నూట ఎనిమిది కలశాలలో ఒక కలశాన్ని నేనూ మోశాను. అప్పుడు కూడా పంచె కట్టుకుని ఆ పనికోసం సిద్ధపడి నేను అక్కడకు వెళ్ళలేదు. మళ్ళీ టీ షర్టు పాంటులో వెళ్ళాను. కానీ అనుకోకుండా కలశాన్ని మోశాను.

ఇది రెండవ అదృష్టం.

ఎక్కడ ఇండియాలోని హైద్రాబాద్?, ఎక్కడ డెట్రాయిట్ లో పరాశక్తి ఆలయ ఉత్సవాలు?. అనుకోకుండా నేను ఇక్కడకు రావడం ఏమిటి? మూలవిరాట్ విగ్రహాలను తాకి, తైలాన్ని వ్రాయడం, అభిషేకజలాన్ని మోసి తీసుకెళ్లి దానితో విగ్రహాలకు అభిషేకం జరగడం- ఇదంతా ఏమిటి ? వీటికోసం నేనేమీ ముందే ఏర్పాట్లు చేసుకోలేదు. కానీ వాటంతట అవి జరిగాయి.

ఇది అమ్మ అనుగ్రహం కాకపోతే మరేమిటి? సమస్త సృష్టీ అమ్మ చేసినదే అయినప్పుడు దేశాలతో ప్రాంతాలలో పని ఏముంది? ఇలాంటి మిరకిల్స్, పరాశక్తి ఆలయంలో జరగడం చాలా గమనించాను. ఇది గతంలోనూ చూచాను, ఇప్పుడూ చూచాను. దైవశక్తి జాగృతమై ఉన్న ఆలయాలలో ఇలాంటి మిరకిల్స్ జరుగుతాయి. ఇలాంటి అనుకోని మిరకిల్స్, తిరుమలలోను, జిల్లెళ్ళమూడిలోను, దక్షిణేశ్వరం కాళీ ఆలయంలోను, శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూరు లోను జరగడం ఎన్నో సార్లు గమనించాను.

ఈ కార్యక్రమానికి వేలాదిమంది వచ్చి ఉన్నారు. ఎన్నెన్నో దేశాలనుండి వచ్చారు. ఏర్పాట్లు చేసుకుని మరీ వచ్చారు. నేనేమీ ముందుగా ఏర్పాట్లు చేసుకుని రాలేదు. అనుకోకుండా వచ్చాను. కానీ వారిలో ఎంతోమందికి రాని అవకాశం నాకొచ్చింది. 'వచ్చింది' అనడం కంటే, 'అమ్మ ఇచ్చింది' అనడం కరెక్ట్ అవుతుంది.

ఇదేదో నా గొప్పకోసం చెప్పడం లేదు. ఇలాంటి గొప్పలు నాకేమీ అవసరం లేదు. వీటిమీద నా దృష్టి ఉండదు కూడా. కానీ జరిగాయి. జరుగుతున్నాయి.

నువ్వు అహంకారం లేకుండా, వినయంతో ఉంటే, ఏదీ కోరుకోకుండా ఉంటే, నీకేది ఇవ్వాలో అమ్మే ఇస్తుంది. ఇది తిరుగులేని నిజం. ఎన్నోసార్లు నా జీవితంలో రుజువైంది. ఇప్పుడూ అయింది.

 'నువ్వు అడిగితే అడిగినదే ఇస్తాను. అడగకపోతే, నీకు అవసరమైనది ఇస్తాను'

నిజమా కాదా?