“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, ఆగస్టు 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 10 (పరాశక్తి ఆలయ సందర్శన)
డెట్రాయిట్ పరాశక్తి ఆలయంతో నాకు ఆరేళ్ళ అనుబంధం ఉంది. 2016 లో మొదటసారి ఇక్కడ 'శ్రీవిద్య - శక్తి ఆరాధన' పైన ఉపన్యాసం ఇచ్చాను. మళ్ళీ 2017 లో వచ్చినపుడు లలితా సహస్రనామాలపైన మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడొచ్చాను.

'మీ ఉపన్యాసం మళ్ళీ ఇవ్వండి. ఏర్పాట్లు చేస్తాం' అని పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ USA ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ అన్నారు.

'వద్దు. ఆ ఆలోచన ప్రస్తుతం లేదు' అని చెప్పాను.

'ఎందుకు?' అన్నట్లుగా ఆయన చూచాడు.

'లోకంతో ఇంటరాక్ట్ కావడానికి, మన భావజాలాన్ని లోకంలో వెదజల్లడానికి, సోషల్ మీడియా ఉంది. మన వెబ్ సైట్లున్నాయి. మన పుస్తకాలున్నాయి. ఉపన్యాసాలకు మన యూట్యూబ్ ఛానల్  ఉంది. కనుక, ప్రస్తుతం ఆ ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం వ్యక్తులతో వ్యక్తిగత స్థాయిలో అనుసంధానం కావడం, వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడం, సాధకుల సందేహాలు, వ్యక్తిగత సమస్యలు తీర్చడమంటే నాకిష్టంగా ఉంది. వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం ప్రస్తుతం మన పనికాదు. దానికి పురాణ పండితులు చాలామందున్నారు. ఆ పని నాకెందుకు?'. అని ఆయనతో చెప్పాను.

ఈ ట్రిప్పులో ఇద్దరు జిజ్ఞాసువులను కలిశాను. వాళ్ళు, విష్ణు ప్రవీణ్, స్టీఫెన్ స్టేసీ.

విష్ణు నా బ్లాగ్ చదివి నాతో కాంటాక్ట్ లోకి వచ్చాడు. తను కేలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాడు. పరాశక్తి అమ్మవారి వీరభక్తుడు. ప్రస్తుతం అమ్మవారి నూతన విగ్రహం ప్రతిష్టాపన, ఆలయ కుంభాభిషేకాలు జరుగుతున్నాయి. వాటిలో వాలంటీర్ గా పనిచేయడానికి లీవు పెట్టుకుని తన కుటుంబంతో కలసి డెట్రాయిట్ వచ్చాడు. నేనూ ఇక్కడే ఉన్నాను గనుక అతన్ని కలవడం జరిగింది. మొన్న శనివారం నాడు పరాశక్తి ఆలయంలో నన్ను చూస్తూనే కదిలిపోయి పట్టుకుని ఏడ్చేశాడు. మా అబ్బాయి వయసుంటుంది. చిన్నవాడే గాని ఆధ్యాత్మికంగా ఉన్నతమైన సంస్కారాలు, ప్రవర్తనలు ఉన్నవాడు. డబ్బు తప్ప ఏమీ పట్టించుకోని నేటి అమెరికా యువతాలోకంలో, వారంరోజులు లీవు పెట్టుకుని, బే ఏరియా నుంచి ఇక్కడికొచ్చి, ఆలయంలో అన్నిపనులూ చేస్తూ వాలంటీర్ గా ఉన్నాడు. సామాన్యమైన విషయం కాదు. చాలా ముచ్చటేసింది.

ఇకపోతే, స్టీఫెన్ స్టేసీ, ఒక అమెరికన్ సాధకుడు. ఫ్లోరిడాలో ఉంటాడు. ఈయనకు 75 ఏళ్ళు. పుట్టుకతో క్రైస్తవుడైనా, పక్కా హిందూమతాభిమాని. 40 ఏళ్ళనుంచీ దేవీ ఉపాసకుడు. నేను వ్రాసిన Secret of Sri Vidya, Hidden meanings of Lalita Sahasra Nama పుస్తకాలను చదివి నన్ను కాంటాక్ట్ చేశాడు. 1975 ప్రాంతాలలోనే బాంబే వచ్చి సిద్ధయోగ గురువు స్వామి ముక్తానందను కలిశాడు. శ్రీరామకృష్ణులంటే ఎంతో భక్తి. అమెరికాలో వివేకానంద స్వామి స్థాపించిన  వేదాంత సొసైటీస్ అన్నీ తిరిగాడు.

2020 లో అమెరికా రావాలని నాకొక ప్లాన్ ఉండేది. అప్పుడు నన్ను కలవాలనుకున్నాడు. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. ఇప్పుడు రాగలిగాను. ఎలాగూ అమ్మవారి ఆలయం కుంభాభిషేకం జరుగుతోంది గనుక, తనూ లీవు పెట్టుకుని వచ్చి, అవన్నీ చూస్తూ ఇక్కడే ఉన్నాడు. శనివారంనాడు గుడికెళ్ళినపుడు వెదుక్కుంటూ వచ్చి నన్ను కలిశాడు. నిన్నా ఈ రోజూ మాతోనే ఉండి, తనను వేధిస్తున్న ఆధ్యాత్మిక సందేహాలను నన్నడిగి తీర్చుకున్నాడు. ఒంగోలు ఆశ్రమానికి వస్తానని, వీలైతే అక్కడే ఉండిపోతానని అన్నాడు. సరేనన్నాను.

ఈ విధంగా పరాశక్తి ఆలయం మా ఆధ్యాత్మిక సంభాషణలకు వేదికగా మారింది. ఎప్పటినుంచో నన్ను చూడాలని, కలుసుకోవాలని ఎదురు చూస్తున్న ఇద్దరు మంచిమనుషులను, జిజ్ఞాసువులను ఆదిపరాశక్తి దయవల్ల అమెరికాలో కలుసుకోగలిగాను. వారి సందేహాలను తీర్చగలిగాను.